రాష్ట్రవ్యాప్తంగా పోలీసుస్టేషన్ల ఆధునీకరణ
అబిడ్స్ స్టేషన్‌ను ప్రారంభించిన డీజీపీ అనురాగ్‌శర్మ
హైదరాబాద్: ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్‌స్టేషన్లను ఆధునీకరిస్తామని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయిలో సకల హంగులతో ఆధునీకరించిన అబిడ్స్ పోలీసు స్టేషన్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ధైర్యంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసుకొనే చక్కటి వాతావరణంతో పాటు పోలీసు అధికారులు విధుల్లో అలసత్వం ప్రదర్శించకుండా ఉండేందుకు టెక్నాలజీని కూడా అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ‘పోలీస్‌స్టేషన్‌కు రాగానే రిసెప్షనిస్టు మర్యాదపూర్వకంగా ఫిర్యాదుదారుడిని ఆహ్వానిస్తారు. సమస్యను అడిగి తెలుసుకుని ఫిర్యాదును స్వీకరిస్తారు. ఆ ఫిర్యాదును జీడీలో రిజిస్టర్ చేసి విచారణ చేపడతారు. బహిరంగంగా కేసు గురించి చెప్పేందుకు ఇష్టపడనివారి కోసం ఇంటర్వ్యూ గదులు ఉంటాయ’ని డీజీపీ వివరించారు.
తొలి దశలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని పోలీస్‌స్టేషన్లను ఆధునీకరిస్తున్నామన్న ఆయన...హైదరాబాద్‌లో ఠాణా భవనాల ఆధునీకరణ కోసం రూ.20 కోట్లు, రంగారెడ్డి జిల్లా సైబరాబాద్‌లో ఉన్న పోలీస్‌స్టేషన్ల ఆధునీకరణ కోసం రూ.45 కోట్లు, సీసీ కెమెరాల ఏర్పాటు కోసం హైదరాబాద్‌కు 58.5 కోట్లు, సైబరాబాద్‌కు రూ.25 కోట్లు కేటాయించామన్నారు. అబిడ్స్ పోలీసు స్టేషన్ మాదిరిగానే ఇతర ఠాణాలను నయా హంగులతో తీర్చిదిద్దుతామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో సీఐడీ డీజీ సత్యనారాయణ, సిట్, క్రైం ఏసీపీ స్వాతిలక్రా, ట్రాఫిక్ ఏసీపీ జితేంద్ర, ఐదు జోన్‌ల డీసీపీలతో పాటు స్థానిక పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.