అసాంఘిక శక్తులను ఉపేక్షించొద్దు | CM YS Jagan Comments In Police Martyrs Memorial Hall | Sakshi
Sakshi News home page

అసాంఘిక శక్తులను ఉపేక్షించొద్దు

Published Sun, Oct 22 2023 4:31 AM | Last Updated on Sun, Oct 22 2023 4:31 AM

CM YS Jagan Comments In Police Martyrs Memorial Hall - Sakshi

సిటిజెన్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ మన విధానం. శాంతిభద్రతల పరిరక్షణే ఈ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. అసాంఘిక శక్తులను ఏమాత్రం ఉపేక్షించవద్దు.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ‘ప్రశాంతంగా సాగిపోతున్న ప్రజా జీవితాన్ని తమ స్వార్థం కోసం దెబ్బతీసే శక్తులన్నీ కూడా అసాంఘిక శక్తులే. ప్రభుత్వం, సమాజం మీద దాడిచేసి మనుగడ సాగించే శక్తులన్నీ అడవుల్లోనో అజ్ఞాతంలోనో కాకుండా ఇప్పుడు ప్రజా జీవితంలో ఉండటాన్ని మనం చూస్తున్నాం. ప్రజల మధ్యే ఉంటూ ప్రజల మీదే దాడిచేస్తున్నాయి. అటువంటి అసాంఘిక శక్తులను ఏమా­త్రం ఉపేక్షించవద్దు. అసాంఘిక శక్తులు అనే పదా­న్ని పునర్నిర్వచించాల్సిన అవసరం ఏర్పడింది’.. అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్బోధించారు.

ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛ వంటి పదాలకు అర్థం.. ఒక ముఠా, ఒక వర్గం పోలీసుల నుంచి, న్యాయస్థానాల నుంచి చట్టాన్ని  లాక్కోవడం కాదని ఆయన తేల్చి చెప్పా­రు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

1959 అక్టోబరు 21న చైనా సైనికులను ఎదిరించి పోరాడిన ఎస్సై కరణ్‌సింగ్‌ ఆయన సహచరుల ధైర్యాన్ని, త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఆ రోజును అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా దేశం గత 64 ఏళ్లు గా జరుపుకుంటూ వారిని గుర్తు చేసుకుంటోంద న్నారు. రాష్ట్రంలో విధినిర్వహణలో ప్రా­ణాలు త్యాగం చేసిన పోలీసు కుటుంబాలకు మనందరి ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా, తోడుగా ఉంటుందని పునరుద్ఘాటిస్తూ గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా అమరులైన 188 పోలీసులకు శ్రద్ధాంజలి అర్పించారు. సీఎం ఏమన్నారంటే..  
పోలీసు అమరవీరులకు నివాళిగా ప్రచురించిన ‘అమరులు’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం జగన్‌ 

 ఖాకీ డ్రెస్‌ అంటేనే త్యాగనిరతి.. 
సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీసు. ఖాకీ డ్రెస్‌ అంటే త్యాగనిరతి. ఆ డ్రెస్‌ మీద కనిపించే మూడు సింహాలు మన దేశ సార్వ¿ౌమాధికారానికి చిహ్నం. పోలీస్‌ అంటే అధికారం మాత్రమే కాదు.. అంతకుమించి. పోలీస్‌ అంటే ఒక బాధ్యత కూడా. ఈ ఉద్యోగం ఒక సవాల్‌. మరీ ముఖ్యంగా నేరం వేగంగా తన రూపాన్ని మా­ర్చుకుంటున్న ఈ యుగంలో అంతకుమించిన వే­గా­న్ని అందుకుంటేనే పోలీసింగ్‌కు విలువ ఉంటుంది.  

కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి.. 
కొత్త టెక్నాలజీవల్ల సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా నేర పరిశోధనలో పోలీసులు అప్‌డేట్‌ కావాలి. సైబర్‌ సెక్యూరిటీ నుంచి డేటా థెఫ్ట్‌ వరకు, డేటా థెఫ్ట్‌ నుంచి సైబర్‌ హెరాస్‌మెంట్‌ వరకు నేరాలను  నిరోధించడానికి, వాటి మీద దర్యాప్తు చేసి దోషులను శిక్షించేందుకు పోలీసులు ఎంతగానో అప్‌డేట్‌ కావాల్సిన యుగంలో మనమంతా ఉన్నాం. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్‌నెట్‌ వాడకంవల్ల సైబర్‌ ప్రపంచంలో మరో చీకటి ప్రపంచం సృష్టించుకుని నేరాలు చేస్తున్న వాళ్లను ఎదుర్కొవాల్సిన బృహత్తర బాధ్యత పోలీసుల భుజస్కంధాల మీద ఉంది.

కొత్త టెక్నాలజీని వాడుకుంటూ విజృంభించే అసాంఘిక శక్తుల సవాళ్లకు ఎప్పటికప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మారుతున్న ఈ సమాజం విసురుతున్న కొత్త సవాళ్లకు సమాధానం చెప్పడానికి హోంగార్డులు, కానిస్టేబుళ్ల నుంచి ఎస్పీలు, డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ సిద్ధంకావాలి. నేర నిరోధం, నేర దర్యాప్తు ఈ రెండింటిలోనూ మన పోలీసులు అత్యాధునిక సైబర్‌ టెక్నాలజీ ఉపయోగిస్తూ దేశంలోనే అగ్రగామిగా ఉన్నారు. ఈ డివిజన్‌లో 130 మంది సాంకేతిక పోలీసింగ్‌ నిపుణులు పనిచేస్తుండటం ప్రజలకు ఎంతో ధైర్యానిస్తోంది. 

అసాంఘిక శక్తులతో ప్రజాస్వామ్యానికి ముప్పు 
నిజానికి ఇప్పుడు అసాంఘిక శక్తుల పదాన్ని పునర్ని­ర్వచించాల్సిన అవసరమేర్పడింది. నూజివీడు­లో విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీసు కానిస్టే­బుల్‌­ను చంపారు.. అంగళ్లలో సాక్షాత్తూ ప్రతిపక్ష నాయకుడు తన పార్టీ వాళ్లను రెచ్చగొట్టి పోలీసుల మీద దాడి చేయించారు.. అలాగే, పుంగనూరులో 40 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.. చివరకి ఒక పోలీసు సోదరుడి కన్ను పోయేలా శాంతిభ­ద్ర­తలకు విఘాతం కలిగించారు.

వారి అవినీతి, నేరాలు, వాటి ఆధారాలను బట్టి న్యాయస్థానాల్లో తీ­ర్పులు వీరికి అనుకూలంగా రాకపోయేసరికి.. చివరకి ఆ న్యాయమూర్తుల మీద ట్రోలింగ్‌ చేస్తు­న్నారు. వారికి సంబంధించిన టీవీ ఛానెళ్లలో చర్చ­లు నిర్వహిస్తున్నారు. తమను ఎవరూ కూడా ఏం చేయలేరన్న అహంకారంతో ఇవన్నీ చేస్తుంటారు. ఇటువంటివన్నీ అసాంఘిక శక్తుల పనులే. ప్రజాస్వామ్యం, రూల్‌ ఆఫ్‌ లా మీద నమ్మకం ఉన్నవారు చేసే పనులు కావివి. 

దుర్మార్గుల పని పట్టండి.. 
తమ స్వార్థం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటూ అలజడులు సృష్టించే ఇలాంటి దుర్మార్గులను ఉపేక్షించవద్దు. ఎలాంటి మొహమాటం లేకుండా చట్టానికి పనిపెట్టండి. ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో అస్సలు రాజీపడొద్దు. ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళలు, మరీ ముఖ్యంగా పిల్లలు, అణగారిన సామాజికవర్గాలకు భద్రత కల్పించే విషయంలో ఏమాత్రం రాజీపడొద్దు. పోలీసుల మీద దాడిచేసే దుష్టశక్తులకు గుణపాఠం నేర్పాలి. లేకపోతే సమాజంలో ఎవరికీ  రక్షణ ఉండదు.  

దిశ యాప్‌తో అక్కచెల్లెమ్మలకు భద్రత 
రాష్ట్రంలో 16వేల మంది మహిళా పోలీసులను గ్రా­మ, వార్డు సచివాలయ స్థాయిలో నియమించాం. దేశంలో ఎక్కడాలేని విధంగా దిశ యాప్‌ తీసుకొచ్చాం. దిశ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటుచేయడంతోపాటు ప్రతి జిల్లాలో దిశ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాం. అక్కచెల్లెమ్మల భద్రత మీద ఇంత­గా శ్రద్ధ పెట్టాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా మన రాష్ట్రంలో పోలీసులు మహిళలకు భద్రత కల్పిస్తున్నారు. ఒక్క దిశ యాప్‌ రాష్ట్రంలో 1.25 కోట్ల మంది అక్కచెల్లెమ్మల ఫోన్‌లలో రిజిస్టర్‌ అ­యింది. ఆపదలో ఉన్న దాదాపు 31,200 మంది అక్క­చెల్లెమ్మలు ఈ యాప్‌లో ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కడంవల్లో, ఫోన్‌ గట్టిగా షేక్‌ చేయడంవల్లో పోలీసులు అక్కడికి చేరుకుని భద్రత కల్పించారు. 

‘అమరులు’ పుస్తకావిష్కరణ
ఇక పోలీసు అమరవీరులకు నివాళిగా ప్రచురించిన ‘అమరులు’ పుస్తకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. గత ఏడా­ది కాలంలో దేశంలో అమరులైన 188 మంది పోలీసుల వివరాలతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అలాగే, ఇటీవల ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో గణేశ్‌ నిమజ్జనం రోజున అల్లరిమూకల దాడిలో గాయపడి మరణించిన కానిస్టేబుల్‌ జి. నరేందర్‌ భార్యకు సీఎం రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియాను అందించారు. 

రూ.30లక్షల నుంచి రూ.75లక్షలు బీమా రక్షణ.. 
గతంలో పోలీసులు ఎవరైనా చనిపోతే బీమా వచ్చేది కాదు. పోలీసులకు జీతాలిచ్చే కార్యక్రమం ఎస్‌బీఐ ద్వారా చేస్తు­న్నాం. స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా యా­జమాన్యాన్ని పిలిచి పోలీసుల బీమా సౌకర్యం గురించి చర్చించాం. ఆ చర్చలు పూర్తయ్యా­యని చెప్పడానికి ఈ రోజు సంతోíÙస్తున్నాను. ప్రతి పోలీసు సోద­రుడికి బీమా కింద రూ.30 లక్షల నుంచి రూ.75 లక్ష­లు బీమా కవరేజ్‌ ఇచ్చేందుకు ఎస్‌బీఐ ముందుకొచ్చింది. ఇవేకాక.. పోలీసులకు చేయగలిగిన ప్రతి మేలూ కచ్చితంగా చేస్తాం. 

పోలీసు సంక్షేమానికి పెద్దపీట.. 
మనందరి ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. పోలీసులకు ఇంకా మంచి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా వీక్లీఆఫ్‌ విధానాన్ని తీసుకొచ్చాం. పోలీసుల మీద ఒత్తిడి తగ్గించేందుకు అదనంగా పోలీసులను నియమించాల్సిన అవసరం ఉందని గుర్తించాం. గ్రామస్థాయిలో 16వేల మహిళా పోలీసులను నియమించాం. దాదాపు మరో   6,550 పోస్టులను భర్తీచేసేందుకు (6,100 కానిస్టేబుల్‌ పోస్టులు, 450 ఎస్సై పోస్టులు) వేగంగా చర్యలు చేపట్టాం. కొందరు కోర్టుల వరకు వెళ్లడంతో కాస్త జాప్యం జరుగుతోంది.

కోర్టుల్లో త్వరగా ఒక పరిష్కారం వచ్చేలా చేసి పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియను ఎంత త్వరగా వీలైతే అంత వేగంగా పూర్తిచేయాలని డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ఐఆర్‌ బెటాలియన్లను తీసుకొచ్చాం. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన 201 మంది పోలీసుల కుటుంబాలను ఆదుకున్నాం. ఎస్‌ బీఐ వంటి సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ కూడా ఏకంచేసి ఒక్కో కుటుంబానికి రూ.17 లక్షల ఆర్థిక సాయం అందించి తోడుగా నిలబడ్డాం.

మనందరి ప్రభుత్వం రాకముందు వరకు హోంగార్డులకు నెలకు రూ.12వేలు మాత్రమే జీతం ఇచ్చేవారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి జీతం రూ.21,300కు పెంచాం. ప్రతి కానిస్టేబుల్, హోంగార్డుకు మంచి చేయా లన్న తపనతో అడుగులు వేస్తున్నాం. కానిస్టేబుళ్ల నియామకాలలో హోంగార్డులకు గతంలో ఉన్న రిజర్వేషన్లు 8 శాతం ఉంటే వాటిని 15 శాతానికి పెంచాం. ఏపీఎస్పీలో గతంలో 10శాతం రిజర్వేషన్లు ఉంటే.. మన ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను 25 శాతానికి పెంచింది. 

పోలీసుల త్యాగనిరతి నిరుపమానం: తానేటి వనిత 
సమాజానికి పోలీసులు అందిస్తున్న సేవలు ని­రుపమానమని హోంమంత్రి తానేటి వనిత కొ­ని­యాడారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పోలీసుల త్యాగనిరతి, ధైర్య సాహసాలు సమాజానికి సదా స్ఫూర్తిదాయకమన్నారు. పో­లీ­సుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి­తో కృషిచేస్తోందన్నారు.

డీజీపీ రాజేంద్రనాథ్‌­రెడ్డి మాట్లాడుతూ.. సోషల్‌ మీడియా వేధింపు­లను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. అందు­కోసం 130 మందితో ప్రత్యేక సాంకేతిక బృం­దాన్ని ఏర్పాటుచేసి మరో ఐదుగురితో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇ­ప్ప­టికే 30 మందిపై కేసులు నమోదు చేశామన్నా­రు. మరోవైపు.. రాష్ట్రంలో గంజాయి సాగు­ను నిర్మూలించడంతోపాటు అక్రమ సారా త­యా­రీకి అడ్డుకట్ట వేశామన్నారు. ఈ కార్యక్రమం­లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్‌రెడ్డితోపాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement