సాక్షి, అమరావతి: కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగార్థులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూల నిర్ణయం తీసుకున్నారు. వారి విజ్ఞప్తి మేరకు వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచాలని అధికారులను ఆదేశించారు. పలు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు వీటి భర్తీ కోసం పోలీస్ శాఖ అక్టోబర్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇందులో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, 411 ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి. వయో పరిమితి పెంచి తమకు కూడా అర్హత కల్పించాలంటూ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగార్థులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులపై సీఎం అధికారులతో సమావేశమయ్యారు. వారికి అవకాశం కల్పించేలా రెండేళ్లపాటు వయో పరిమితి పెంచుతూ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కానిస్టేబుల్ జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 24 ఏళ్లు ఉండేది.
ఇప్పుడు రెండేళ్ల సడలింపుతో 26 ఏళ్లు వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 24 ఏళ్ల వయోపరిమితిలో ఐదేళ్లు ఇదివరకే సడలింపు ఇచ్చారు. ఆ ప్రకారం 29 ఏళ్లు వయస్సు వారు కానిస్టేబుల్ పోస్టులకు అర్హులు. దీనికి తాజా మినహాయింపుతో 31 ఏళ్ల వయస్సు వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్‌ఐ పోస్టులకు జనరల్‌లో 27 ఏళ్ల వరకు అవకాశం ఉండేది. ప్రస్తుతం రెండేళ్ల పెంపుతో 29 ఏళ్ల వయసు ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 32 ఏళ్ల నుంచి 34 ఏళ్ల వరకు వయో పరిమితి పెరిగింది. సీఎం నిర్ణయం వల్ల లక్షలాది మంది అభ్యర్థులకు ప్రయోజనం కలుగుతుందని అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: పోస్టుల భర్తీ ప్రక్రియ ఇలా..
Comments
Please login to add a commentAdd a comment