DGP anuragsarma
-
వ్యభిచారంలోకి దించితే కఠిన చర్యలు
డీజీపీ అనురాగ్‌శర్మ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: మహిళలు, మైనర్ బాలికలను వ్యభి చార కూపంలోకి దింపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్, కర్నూతోపాటు మెదక్ జిల్లాలో వ్యభిచార కేంద్రాలపై సీఐడీ దాడులు చేసి పెద్ద సంఖ్యలో బాధితులను రక్షించిందన్నారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ‘మానవ అక్రమ రవాణా’ అంశంపై జరిగిన సదస్సుకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించి వారు కోలుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలతో కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. విద్య వల్ల మానవ అక్రమ రవాణా అరికట్టొచ్చని యునిసెఫ్ స్టేట్హెడ్ జేరూ మాస్టర్ అభిప్రాయపడ్డారు. మానవ అక్రమ రవాణాలో దేశంలో రాష్ట్రం 4వ స్థానంలో ఉండటం ఆందోళనకరమని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ అన్నారు. కార్యక్రమంలో కార్మిక ఉపాధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, రిటైర్డ్ ఐపీఎస్ నాయర్, సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా పాల్గొన్నారు. -
నయీమ్‌తో శ్రీధర్‌బాబుకు లింకు: పుట్ట
మంథని: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు సంబంధాలు ఉన్నాయని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. మంథనిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దీనిపై విచారణ కోసం సీఎం కేసీఆర్, డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మాజీ నక్సలైట్ జడల నాగరాజు ఆచూకీ లేకుండా పోయూడనిడన్నారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్యకేసులో సంబంధాలు ఉన్న వ్యక్తులను హతమార్చేందుకు శ్రీధర్‌బాబు నయీమ్‌తో దోస్తీ చేసినట్లు ఆరోపణలున్నాయని అన్నారు. తాను ఎమ్మెల్యే కాక ముందు హత్యకు కుట్ర జరిగిందని చెప్పారు. ఆరోపణలు సరికాదు : శ్రీధర్‌బాబు గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో తనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేయడం సరికాదని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తన తప్పులను కప్పి పుచ్చకోవడానికి ఎమ్మెల్యే పుట్ట మధు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
ఒకట్రెండు రోజుల్లో ఐపీఎస్ ల బదిలీలు
నేడు సీఎం కేసీఆర్‌తో డీజీపీ అనురాగ్‌శర్మ భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. కొన్ని ముఖ్యమైన స్థానాల మార్పుతో పాటు, ఖాళీగా ఉన్న పోస్టింగ్‌లను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా రెండేళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారికి స్థాన చలనం కల్పించనున్నారు. అధికారుల మార్పులకు సంబంధించి ఇది వరకే సీఎం కేసీఆర్, డీజీపీ అనురాగ్‌శర్మ ఇతర సీనియర్ అధికారులతో చర్చించారు. ఇటీవలి కాలంలో ట్రిబ్యునల్ తీర్పు కూడా రావడంతో అధికారుల పంపకాలపై స్పష్టత వచ్చింది. దీంతో తాజాగా నేడు(బుధవారం) సీఎం కేసీఆర్‌ను డీజీపీ అనురాగ్‌శర్మ మరోసారి భేటీ అవుతున్నారు. అనంతరం ఒకట్రెండు రోజుల్లో అధికారుల బదిలీల ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్రంలో అతి ముఖ్యమైన పోస్టింగ్‌లు ఇంచార్జీ అధికారులతో నెట్టుకొస్తున్నారు. వీటిని వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ రేంజ్ ఐజీ, డీఐజీతో పాటు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, ఫోరెన్సిక్ సైన్స్ డెరైక్టర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడం పైనే సీఎం కేసీఆర్ ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. -
చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించేది లేదని డీజీపీ అనురాగ్‌శర్మ స్పష్టం చేశారు. మావోయిస్టులైనా, ఉగ్రవాదులైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమన్నారు. బుధవారం డీజీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వార్షిక విలేకరుల సమావేశంలో అనురాగ్‌శర్మ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఈ సంవత్సరం 92,685 కేసులు నమోదు చేశామని చెప్పారు. గతంతో పోల్చితే నేరాలు స్వల్పంగా తగ్గడంతో పాటు పోలీసుల పనితీరు చాలా మెరుగుపడిందన్నారు.సొత్తు కోసం హత్యలు, కిడ్నాప్‌లు, ఘర్షణలు, సైబర్ నేరాలు కాస్త తగ్గాయన్నారు. చైన్ స్నాచింగ్‌కు సంబంధించిన కేసులు పెరిగాయన్నారు. గతేడాది 678 సైబర్ నేర కేసులు నమోదవగా.. ఈ ఏడాది 634కు తగ్గాయన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద గతేడాది 1171 కేసులు నమోదవగా ఈ ఏడాది 1288కు పెరిగాయన్నారు. అలాగే వివిధ రకాల నేరాలపై అనురాగ్‌శర్మ వెల్లడించిన విషయాలను ఆయన మాటల్లోనే... మహిళలపై పెరిగిన నేరాలు.. ఈ ఏడాది మహిళలపై నేరాలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది 1020 అత్యాచార కేసులు నమోదయ్యాయి. సీఐడీ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని చంద్రపూర్, కర్నూలు, హైదరాబాద్‌లో దాడులు నిర్వహించి మొత్తం 808 మంది మహిళలను వ్యభిచార కూపాల నుంచి రక్షించాం. వీరిలో 308 మంది బాలికలున్నట్లు గుర్తించి వారిని రెస్క్యూ హోమ్‌లకు తరలించాం. మహిళల అక్రమ రవాణాకు సంబంధించి మొత్తం 554కేసులు నమోదవగా 381 మంది ట్రాఫికర్స్‌ను అరెస్టు చేశాం. మహిలపై వేధింపులను అరికట్టడంలో ‘షీ’టీమ్స్ సమర్థవంతంగా పనిచేశాయి. మొత్తం 660 కేసులలో 825 మంది పోకిరీల(ఈవ్‌టీజర్లు)ను అరెస్టు చేశాం. అలాగే ఆపరేషన్ స్మైల్ ద్వారా 2,552 తప్పిపోయిన చిన్నారులను గుర్తించామని, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 2,729 మంది గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 1108 మందిని తల్లిదండ్రుల చెంతకు చేరవేశామని, మిగతా వారు రెస్క్యూహోంలలో ఉంచాం. రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యం... రోడ్డు ప్రమాదాల బారినపడి ఏటా పెరుగుతున్న మరణాల దృష్ట్యా జాతీయ, రాష్ట్ర రహదారుల భద్రతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాం. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18,534 కేసులు నమోదవగా, 6,495 మంది మృత్యువాతపడ్డారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించిన వారి నుంచి ఈఏడాది రూ.35.53 కోట్లు వసూలు చేశాం. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఉన్న ఈ చలాన్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నాం. మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది... రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలను సమర్థవంతంగా నిలువరించగలిగాం. ఈ ఏడాది 11 మందిని అరెస్టు చేయగా, 12 మంది లొంగిపోయారు. ఎదురు కాల్పుల్లో ఆరుగురు మరణించగా... వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. నిఘా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడం వల్ల మావోయిస్టులతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలను నిలువరించగలిగాం. ముగ్గురు యువకులు ఐఎస్ఐఎస్లో చేరడానికి ఇంట్లో నుంచి పారిపోయిన 24 గంటల్లోనే గుర్తించగలిగాం. సంస్కరణలకు ప్రాధాన్యం... పోలీసుశాఖలో సంస్కరణలో భాగంగా స్టేషన్ల ఆధునీకరణకు పెద్ద పీట వేస్తున్నాం. హైదరాబాద్, సైబరాబాద్ మాదిరిగా అన్ని జిల్లాల పోలీస్ స్టేషన్లను ఆధునీకరించేందుకు మొదటి విడుతలో రూ.26 కోట్లు మంజూరు చేశాం. అలాగే... జిల్లాలోని ఎస్పీలతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ కోసం ఏర్పాట్లను పూర్తిచేశాం. పోలీసు శాఖలో త్వరలో పది వేలకు పైగా రిక్రూట్‌మెంటులు నిర్వహించబోతున్నాం. -
పోలీస్స్టేషన్లకు నూతన భవనాలు
హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముగిసిన తొలి రాష్ట్రస్థాయి పోలీసు క్రీడలు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అవసరమున్న చోట్ల పోలీస్స్టేషన్లకు కొత్త భవనాలను నిర్మిస్తామన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం నిర్వహించిన తొలి రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడలు శనివారం ముగిశాయి. గురువారం ప్రారంభమైన ఈ క్రీడల్లో 25 విభాగాల్లో 18 రేంజ్‌లకు చెందిన సుమారు రెండు వేల మంది పోలీసు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమంలో నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను ఆధునీకరించే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో పోలీసులకు పది శాతం కేటాయిస్తామని సీఎం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కృషితోనే గెలుపు సాధ్యం: అనురాగ్‌శర్మ ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని డీజీపీ అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. క్రీడల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన పోలీసు క్రీడాకారులకు లక్షల్లో నగదుతోపాటు ఇంక్రిమెంట్లు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ గొడాం నగేష్, అదనపు డీజీపీ సుదీప్ లక్టాకియా, ఐజీ వి.నవీన్‌చంద్, స్పోర్ట్స్ ఐజీ శ్రీనివాస్, డీఐజీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు రాథో డ్ బాపూరావు, దుర్గం చిన్నయ్య, జిల్లా కలెక్టర్ జగన్మోహన్, ఎస్పీ తరుణ్‌జోషి పాల్గొన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా పోలీసుస్టేషన్ల ఆధునీకరణ
అబిడ్స్ స్టేషన్‌ను ప్రారంభించిన డీజీపీ అనురాగ్‌శర్మ హైదరాబాద్: ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్స్టేషన్లను ఆధునీకరిస్తామని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయిలో సకల హంగులతో ఆధునీకరించిన అబిడ్స్ పోలీసు స్టేషన్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ధైర్యంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసుకొనే చక్కటి వాతావరణంతో పాటు పోలీసు అధికారులు విధుల్లో అలసత్వం ప్రదర్శించకుండా ఉండేందుకు టెక్నాలజీని కూడా అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ‘పోలీస్‌స్టేషన్‌కు రాగానే రిసెప్షనిస్టు మర్యాదపూర్వకంగా ఫిర్యాదుదారుడిని ఆహ్వానిస్తారు. సమస్యను అడిగి తెలుసుకుని ఫిర్యాదును స్వీకరిస్తారు. ఆ ఫిర్యాదును జీడీలో రిజిస్టర్ చేసి విచారణ చేపడతారు. బహిరంగంగా కేసు గురించి చెప్పేందుకు ఇష్టపడనివారి కోసం ఇంటర్వ్యూ గదులు ఉంటాయ’ని డీజీపీ వివరించారు. తొలి దశలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని పోలీస్స్టేషన్లను ఆధునీకరిస్తున్నామన్న ఆయన...హైదరాబాద్‌లో ఠాణా భవనాల ఆధునీకరణ కోసం రూ.20 కోట్లు, రంగారెడ్డి జిల్లా సైబరాబాద్‌లో ఉన్న పోలీస్స్టేషన్ల ఆధునీకరణ కోసం రూ.45 కోట్లు, సీసీ కెమెరాల ఏర్పాటు కోసం హైదరాబాద్‌కు 58.5 కోట్లు, సైబరాబాద్‌కు రూ.25 కోట్లు కేటాయించామన్నారు. అబిడ్స్ పోలీసు స్టేషన్ మాదిరిగానే ఇతర ఠాణాలను నయా హంగులతో తీర్చిదిద్దుతామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో సీఐడీ డీజీ సత్యనారాయణ, సిట్, క్రైం ఏసీపీ స్వాతిలక్రా, ట్రాఫిక్ ఏసీపీ జితేంద్ర, ఐదు జోన్ల డీసీపీలతో పాటు స్థానిక పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఐడీ పార్టీల రద్దు యోచనలో డీజీపీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోలీసుస్టేషన్లలో ఇన్స్పెక్టర్లు ఏర్పాటు చేసుకున్న ఐడీ పార్టీలను రద్దు చేయాలనే యోచనలో డీజీపీ అనురాగ్‌శర్మ ఉన్నట్టు తెలిసింది. ఈ పార్టీలతో కొందరు ఇన్స్పెక్టర్లు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు పెరగడంతో డీజీపీ వాటిని రద్దు చేయాలనుకుంటున్నట్టు సమాచారం. పోలీసుస్టేషన్లో చురుకైన ఇద్దరు లేక ముగ్గురు కానిస్టేబుళ్లు లేదా హెడ్‌కానిస్టేబుళ్లను ఐడీ (ఇన్స్పెక్టర్ డిపార్ట్మెంట్)పార్టీగా ఆయా పోలీసుస్టేషన్ హౌజ్ అధికారి(ఇన్స్పెక్టర్) నియమించుకుంటారు. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ ఏదైనా ప్రత్యేక కేసు పరిశోధన చేపట్టినప్పుడు ఆయనకు ఈ పార్టీ పూర్తిగా సహకరిస్తుంది. అలాగే పోలీసుస్టేషన్ పరిధిలో నేరాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, వాటి వెనుక ఎవరున్నారనే వివరాలను కూడా ఈ పార్టీ సేకరిస్తూ పూర్తిగా సీఐడీ నియంత్రణలో పనిచేస్తుంది. ఈ విధానం నగర పోలీసు కమిషనరేట్లు మొదలుకుని అన్ని స్టేషన్లలో ఉంది. అయతే, కొన్ని స్టేషన్లలో ఐడీ పార్టీలు తమ ధర్మాన్ని వదలి పూర్తిగా సీఐల సొంతపార్టీలుగా మారిపోయిన ట్టు ఆరోపణలున్నాయి. చట్టవ్యతిరేకపనులకు పాల్పడేవారు, అక్రమ దందాలు కలిగినవారు, సట్టా,మట్కా, జూదగృహాలు నిర్వహించే వారి నుంచి నెలవారీ మామూళ్లను వసూలు చేసిపెట్టే చర్యలకు ఐడీ పార్టీలు పాల్పడుతున్నాయని , ఇందుకు ఆయా సీఐల ప్రేరణ ఉందనే బలమైన ఆరోపణలున్నాయి. ఫక్తు ఇదేపనిలో మునిగితేలుతున్న కొన్ని ఐడీ పార్టీల గురించి డీజీపీకి ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. కొందరు ఇన్స్పెక్టర్లు నెలవారి మామూళ్లను లక్షల్లో దండుకుంటున్నారని డీజీపీ దృష్టికి వచ్చినట్టు తెలిసింది. కొందరు కానిస్టేబుళ్లు ఏళ్లతరబడి ఐడీ పార్టీ విధుల్లోనే కొనసాగుతున్నట్టు కూడా ఆరోపణలున్నాయి. దీంతో ఈ వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ భావిస్తున్నట్టు తెలిసింది. నేర పరిశోధన కోసం అన్ని స్టేషన్లలో క్రైమ్ విభాగాలు, సీసీఎస్‌లు ఉండడంతో ఇక సీఐలకు ప్రత్యేకంగా ఐడీ పార్టీలు ఎందుకని ఆయన అధికారులతో చర్చిస్తున్నట్టు తెలిసింది. -
పోలీసు సంస్కరణలపై ప్రజాభిప్రాయం
ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరిన డీజీపీ అనురాగ్ శర్మ సాక్షి,హైదరాబాద్: కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్ఐ వరకు జరిగే రిక్రూట్మెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, రిక్రూట్మెంట్లో మొదట అభ్యర్థులకు రాత పరీక్ష , ప్రతి పోలీసు స్టేషన్లో మహిళా హెల్ప్‌డెస్క్ తదితర సంస్కరణలను ఉన్నతాధికారులతో కూడిన పోలీసు టాస్క్ఫోర్సు ప్రతిపాదించింది. వీటన్నింటిపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి సంస్కరణలకు మరిన్ని మెరుగులు దిద్ది ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు. ఈ వివరాలను రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ సోమవారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పోలీసు శాఖలో తీసుకురావాల్సిన సంస్కరణలపై తన నాయకత్వంలో ఏర్పాటైన టాస్క్ఫోర్సు పలు ప్రతిపాదనలు చేసిందని ఆయన తెలిపారు. ఆర్మ్డ్రిజర్వ్ విభాగంలో మహిళలకు 10 శాతం రిజర్వేషన్లు ఉండాలని సూచించామన్నారు. ప్రతి పోలీసుస్టేషన్లో ఒక మహిళా సహాయక డెస్క్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు. స్టేషన్‌కు వచ్చే మహిళా బాధితుల సమస్యపై ఈ డెస్క్ మొదట పరిశీలన జరిపి వారిస్థాయిలో పరిష్కారం కాకపోతే వాటిపై పైఅధికారులు చర్యలు తీసుకుంటారని వివరించారు. ప్రతి పోలీసుస్టేషన్లో మహిళా రిసెప్షనిస్ట్, మహిళా కౌన్సిలర్ ఉండేలా ప్రతిపాదించామన్నారు. వీరిద్దరితో పాటు ముగ్గురు మహిళా పోలీసులను కలిపి లేడీస్ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు యోచన ఉందన్నారు. కేసుల విచారణ, కోర్టులో ఛార్జిషీటు దాఖలుకు సంబంధించి దర్యాప్తు అధికారులకు సూచనలు, సల హాలు ఇవ్వడానికి ప్రతి పోలీసుస్టేషన్‌కు ఒక లీగల్ అడ్వయిజర్‌ను నియమిస్తామన్నా రు. నేరస్తులకు కోర్టులలో శిక్షలు సరిగా పడకపోవడానికి పోలీసుస్టేషన్లలో విచారణ సక్రమంగా సాగకపోవడం కూడా కారణమని, దీనిని అధిగమించడానికి రాజధానిలోని ఒక్కో పీఎస్‌కు రూ.75 వేలు, అర్బన్ పీఎస్‌కు రూ.50 వేలు, గ్రామీణ స్టేషన్‌కు రూ.25 వేలు విచారణ ఖర్చుల కోసం కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ట్రాఫిక్ అధికారులకు వీడియో కెమెరాలు: నగరంలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులపై వచ్చే ఆరోపణలకు చెక్‌పెట్టడానికి ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలకు వీడియో కెమెరాలు ఇస్తామని,దీంతో అక్కడ జరిగే ప్రతి అంశం రికార్డు కావడం వల్ల తప్పు ఎవరిదనే విషయం బయటపడుతుందని వివరించారు. ఈ విధానాన్ని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రయోగాత్మకంగా నగరంలో ప్రారంభించారని చెప్పారు. పోలీసు రిక్రూట్ మెంట్లోనూ అనేకమార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. ఏక పోలీసింగ్ విధానంపై ఇంకా అధ్యయనం సాగుతున్నదని ఆయన వివరించారు. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ నుంచి వరకు జరిగే రిక్రూట్మెంట్లో మొదట రాత పరీక్ష నిర్వహించిన అందులో ఉత్తీర్ణులైన వారికి ఆప్టిట్యూడ్టెస్ట్ నిర్వహిస్తారు. చివరగానే 5 కి.మీ పరుగు పరీక్ష పెట్టడం జరుగుతుందని అన్నారు. ప్రజలు తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. తమ అభిప్రాయాలను పోలీసు ఫేస్బుక్ తోపాటు ఈ మెయిల్‌లకు పంపించవచ్చని ఆయన సూచించారు. అలాగే తన మెయిల్ ఐడీ ‘డీజీపీ తెలంగాణ ఎట్‌ది రేట్ ఎన్ఐపీ.ఇన్’కు కూడా పంపించాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, సీఐడీ ఐజీ చారు సిన్హా , ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి,ట్రైనింగ్ ఐజీ స్వాతి లక్రా పాల్గొన్నారు.