పోలీసు సంస్కరణలపై ప్రజాభిప్రాయం
ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరిన డీజీపీ అనురాగ్ శర్మ
సాక్షి,హైదరాబాద్: కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్‌ఐ వరకు జరిగే రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, రిక్రూట్‌మెంట్‌లో మొదట అభ్యర్థులకు రాత పరీక్ష , ప్రతి పోలీసు స్టేషన్‌లో మహిళా హెల్ప్‌డెస్క్ తదితర సంస్కరణలను ఉన్నతాధికారులతో కూడిన పోలీసు టాస్క్‌ఫోర్సు ప్రతిపాదించింది. వీటన్నింటిపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి సంస్కరణలకు మరిన్ని మెరుగులు దిద్ది ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు. ఈ వివరాలను రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ సోమవారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పోలీసు శాఖలో తీసుకురావాల్సిన సంస్కరణలపై తన నాయకత్వంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్సు పలు ప్రతిపాదనలు చేసిందని ఆయన తెలిపారు.
ఆర్మ్‌డ్‌రిజర్వ్ విభాగంలో మహిళలకు 10 శాతం రిజర్వేషన్లు ఉండాలని సూచించామన్నారు. ప్రతి పోలీసుస్టేషన్‌లో ఒక మహిళా సహాయక డెస్క్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు. స్టేషన్‌కు వచ్చే మహిళా బాధితుల సమస్యపై ఈ డెస్క్ మొదట పరిశీలన జరిపి వారిస్థాయిలో పరిష్కారం కాకపోతే వాటిపై పైఅధికారులు చర్యలు తీసుకుంటారని వివరించారు. ప్రతి పోలీసుస్టేషన్‌లో మహిళా రిసెప్షనిస్ట్, మహిళా కౌన్సిలర్ ఉండేలా ప్రతిపాదించామన్నారు. వీరిద్దరితో పాటు ముగ్గురు మహిళా పోలీసులను కలిపి లేడీస్ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు యోచన ఉందన్నారు. కేసుల విచారణ, కోర్టులో ఛార్జిషీటు దాఖలుకు సంబంధించి దర్యాప్తు అధికారులకు సూచనలు, సల హాలు ఇవ్వడానికి ప్రతి పోలీసుస్టేషన్‌కు ఒక లీగల్ అడ్వయిజర్‌ను నియమిస్తామన్నా రు. నేరస్తులకు కోర్టులలో శిక్షలు సరిగా పడకపోవడానికి పోలీసుస్టేషన్‌లలో విచారణ సక్రమంగా సాగకపోవడం కూడా కారణమని, దీనిని అధిగమించడానికి రాజధానిలోని ఒక్కో పీఎస్‌కు రూ.75 వేలు, అర్బన్ పీఎస్‌కు రూ.50 వేలు, గ్రామీణ స్టేషన్‌కు రూ.25 వేలు విచారణ ఖర్చుల కోసం కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.
ట్రాఫిక్ అధికారులకు వీడియో కెమెరాలు: నగరంలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులపై వచ్చే ఆరోపణలకు చెక్‌పెట్టడానికి ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలకు వీడియో కెమెరాలు ఇస్తామని,దీంతో అక్కడ జరిగే ప్రతి అంశం రికార్డు కావడం వల్ల తప్పు ఎవరిదనే విషయం బయటపడుతుందని వివరించారు. ఈ విధానాన్ని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రయోగాత్మకంగా నగరంలో ప్రారంభించారని చెప్పారు. పోలీసు రిక్రూట్ మెంట్‌లోనూ అనేకమార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. ఏక పోలీసింగ్ విధానంపై ఇంకా అధ్యయనం సాగుతున్నదని ఆయన వివరించారు. కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐ నుంచి వరకు జరిగే రిక్రూట్‌మెంట్‌లో మొదట రాత పరీక్ష నిర్వహించిన అందులో ఉత్తీర్ణులైన వారికి ఆప్టిట్యూడ్‌టెస్ట్ నిర్వహిస్తారు. చివరగానే 5 కి.మీ పరుగు పరీక్ష పెట్టడం జరుగుతుందని అన్నారు. ప్రజలు తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. తమ అభిప్రాయాలను పోలీసు ఫేస్‌బుక్ తోపాటు ఈ మెయిల్‌లకు పంపించవచ్చని ఆయన సూచించారు. అలాగే తన మెయిల్ ఐడీ ‘డీజీపీ తెలంగాణ ఎట్‌ది రేట్ ఎన్‌ఐపీ.ఇన్’కు కూడా పంపించాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, సీఐడీ ఐజీ చారు సిన్హా , ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి,ట్రైనింగ్ ఐజీ స్వాతి లక్రా పాల్గొన్నారు.