కానిస్టేబుల్ ఉద్యోగాల దేహదారుఢ్య పరీక్షల్లో యువకుడి మృతి
ఒక పరుగు పందెంలో నెగ్గిన శ్రావణ్‌కుమార్
ఆరిలోవ: ఉద్యోగ సాధనలో విజయం సాధించి సాయంత్రం పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్న ఆ యువకుడి జీవనయానం హఠాత్తుగా ముగిసింది. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం జరిగిన పరుగు పోటీలో పాల్గొన్న ఆ యవకుడు అనూహ్యంగా తనువు చాలించాడు. ఓ దశ పరుగు పందెం నెగ్గి, రెండో దశ కోసం వేచి ఉన్న సమయంలో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
విశాఖ నగరంలోని కైలాసగిరి ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. గురువారమే అతని పుట్టిన రోజు కూడా. కానిస్టేబుల్ నియామక పరీక్షలకు వెళ్లి వచ్చి సాయంత్రం స్నేహితులు, కుటుంబ సభ్యులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనుకున్న యువకుడి ఆశల్ని మృత్యువు చిదిమేసింది.
పోలీసులు, బంధువు కథనం ప్రకారం.. విశాఖ నగరం పదో వార్డు రవీంద్రనగర్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి కె.ఎ.శ్రావణ్‌కుమార్ (24) పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. కైలాసగిరి ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ పోలీస్ మైదానంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పర్యవేక్షణలో జరుగుతన్న దేహదారుఢ్య పరీక్షలకు శ్రావణ్‌కుమార్ గురువారం హాజరయ్యాడు.
మొదట జరిగిన 1,600 మీటర్ల పరుగులో పాల్గొన్నాడు. 8 నిమిషాలలో పూర్తి చేయాల్సిన పరుగును 7.1 నిముషాల్లోనే పూర్తి చేసి తదుపరి పరీక్షలకు అర్హత సాధించాడు. మరికొద్ది సమయంలో తదుపరి పరీక్షల్లో పాల్గొనాల్సి ఉంది. ఇంతలో కూర్చున్న చోటే అస్వస్థతకు గురై కుప్పకూలిపోయి, అపస్మారకస్థితికి చేరాడు. దీన్ని గమనించిన పోలీసులు అంబులెన్స్‌లో విమ్స్‌కు తరలించారు.
అప్పటికే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అపోలో అస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న శ్రావణ్‌కుమార్ తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు అస్పత్రి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. శ్రావణ్‌కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.
8 నెలల క్రితం తండ్రి మృతి
శ్రావణ్‌కుమార్ తండ్రి కె.అర్జునరావు ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. ఆయన 8 నెలల క్రితం అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆ కుటుంబానికి ఇంజినీరింగ్ చదువుతున్న శ్రవణ్‌కుమారే పెద్దదిక్కుగా నిలుస్తాడని తల్లి కనకమహాలక్ష్మి ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు అతను కూడా మరణించడంతో తల్లి, చెల్లికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది.
Comments
Please login to add a commentAdd a comment