
పోలీసు కానిస్టేబుల్ ఎంపికల్లో కూటమి నిర్దయ
రెండేళ్ల క్రితం నోటిఫికేషన్.. అప్పటికి అందరూ అర్హులే
ప్రిలిమ్స్‌లోనూ విజయం సాధించిన అభ్యర్థులు
కోర్టులో కేసు, ఎన్నికల కారణంగా దేహదారుఢ్య పరీక్షలు నిలిపివేత
రెండు నెలల క్రితం దేహదారుఢ్య పరీక్షలకు ప్రకటన జారీ
వయసు మీరిందంటూ పలువురిని ఈవెంట్స్‌కు అనుమతించని అధికారులు
ఇదేమి న్యాయమంటున్న అభ్యర్థులు
అవకాశం కల్పించకుంటే న్యాయ పోరాటం చేస్తామని వెల్లడి
చిత్తూరు అర్బన్: పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల పట్ల కూటమి సర్కారు నిర్దయతో వ్యవహరిస్తోంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన పలువురిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించకుండా తీరని అన్యాయం చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్‌నాటికి వారు వయసు రీత్యా కూడా అర్హులే. కానీ, కోర్టులో కేసు, ఎన్నికల కారణంగా దేహదారుఢ్య పరీక్షలు ఆగిపోయాయి.
ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వెంటనే ఈవెంట్స్ పెట్టి, నియామకాలు చేపట్టకుండా ఆరు నెలలు సాగదీసి, ఇప్పుడు వయసు పెరిగిందంటూ అనేక మందిని ఇళ్లకు పంపేస్తోంది. వారి తప్పేమీ లేకపోయినా నిర్దయగా తిరస్కరిస్తోంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఇదేమిటని అభ్యర్థులు అడిగితే తామేమీ చేయలేమని, ఏదైనా ఉంటే రిక్రూట్‌మెంట్ బోర్డుతో తేల్చుకోండని జిల్లా ఎస్పీలు చెబుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 2022లో రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్‌ఐ పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్‌ఐ పోస్టులకు ప్రిలిమ్స్, దేహదారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. కానిస్టేబుల్ పోస్టులకు 5,03,487 మంది దరఖాస్తు చేసుకోగా 4,58,219 మంది ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యారు. 2023 జనవరి 22న జరిగిన ప్రిలిమ్స్‌లో 91,507 మంది అర్హత సాధించారు. తమ సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలంటూ హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈవెంట్స్ నిలిచిపోయాయి.
తరువాత రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలలు ఈ పోస్టులను పట్టించుకోలేదు. ప్రిలిమ్స్‌లో అర్హత పొందిన అభ్యర్థులంతా మళ్లీ ఆన్‌లైన్‌లో ఈవెంట్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని రెండు నెలల క్రితం ప్రకటించింది. రెండేళ్లుగా రన్నింగ్, హైజంప్‌పై దృష్టి సారించిన అభ్యర్థులు తుది ఈవెంట్స్‌కు సిద్ధమయ్యారు. అందరికీ కాల్ లెటర్లు వచ్చాయి. వారంతా చిత్తూరులో దేహదారుఢ్య పరీక్షలకు హాజరవుతున్నారు.
నోటిఫికేషన్ నాటికి, ఇప్పటికి రెండేళ్లు గ్యాప్ వచ్చింది. దీంతో వయస్సు పైబడిందంటూ కొందరిని ఈవెంట్స్‌కు అనుమతించడంలేదు. వీరిని గ్రౌండ్‌లో ఓ పక్కన కూర్చోబెట్టి, ఈవెంట్స్ ముగిసిన తర్వాత వయసు పెరిగినందున మీరు అర్హులు కారంటూ ఓ కాగితం చేతిలో పెడుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది ఉద్యోగార్హత కోల్పోయారు. రెండేళ్ల కిందట ఇచ్చిన నోటిఫికేషన్ సమయంలో తాము అర్హులమేనని, ఇప్పుడు కాదనడం అన్యాయమని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్లుగా కష్టపడి దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమైన తమను అనుమతించకపోవడం ఏమి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇది దారుణం..
నోటిఫికేషన్ ఇచ్చేనాటికి నాకు ఏజ్ సరిపోయింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి రెండేళ్లుగా ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు వయస్సు పైబడి 33 రోజులైపోయింది, ఈవెంట్స్‌లో అనుమతించడం కుదరదని అంటున్నారు. ఇది దారుణం. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే హైకోర్టును ఆశ్రయిస్తాం. – వి.రాజేష్, పుత్తూరు, తిరుపతి జిల్లా
తప్పు మాదికాదు..
ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యాక ఫిజికల్ ఈవెంట్స్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోమన్నారు. అప్పుడే ఏజ్ లేదని చెబితే సైలెంట్ అయిపోదుము. కానీ కాల్ లెటర్ కూడా పంపించి, ఇప్పుడు ఫిజికల్స్కు పంపబోమంటున్నారు. అసలు టైమ్‌లో ఈవెంట్స్ పెట్టకపోవడం మా తప్పా? బోర్డు తప్పా? – కె.కన్యాకుమారి, అనంతపురం
ఏడాది ముందే పెట్టుంటే..
నాకు ఇప్పుడు 32 ఏళ్లు. ఫిజికల్ ఈవెంట్స్‌కు అనుమతించలేదు. అడిగితే ఏజ్ పైబడి ఏడాది అయ్యిందన్నారు. ఏడాది ముందే ఈవెంట్స్ పెట్టొచ్చు కదా? కాల్ లెటర్లు పంపిన ప్రతి ఒక్కరినీ ఈవెంట్స్‌కు అనుమతించాలి. – కె.దిలీప్‌కుమార్, శ్రీకాకుళం జిల్లా