ఐడీ పార్టీల రద్దు యోచనలో డీజీపీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోలీసుస్టేషన్‌లలో ఇన్‌స్పెక్టర్లు ఏర్పాటు చేసుకున్న ఐడీ పార్టీలను రద్దు చేయాలనే యోచనలో డీజీపీ అనురాగ్‌శర్మ ఉన్నట్టు తెలిసింది. ఈ పార్టీలతో కొందరు ఇన్‌స్పెక్టర్లు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు పెరగడంతో డీజీపీ వాటిని రద్దు చేయాలనుకుంటున్నట్టు సమాచారం. పోలీసుస్టేషన్‌లో చురుకైన ఇద్దరు లేక ముగ్గురు కానిస్టేబుళ్లు లేదా హెడ్‌కానిస్టేబుళ్లను ఐడీ (ఇన్‌స్పెక్టర్ డిపార్ట్‌మెంట్)పార్టీగా ఆయా పోలీసుస్టేషన్ హౌజ్ అధికారి(ఇన్‌స్పెక్టర్) నియమించుకుంటారు. ముఖ్యంగా ఇన్‌స్పెక్టర్ ఏదైనా ప్రత్యేక కేసు పరిశోధన చేపట్టినప్పుడు ఆయనకు ఈ పార్టీ పూర్తిగా సహకరిస్తుంది. అలాగే పోలీసుస్టేషన్ పరిధిలో నేరాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, వాటి వెనుక ఎవరున్నారనే వివరాలను కూడా ఈ పార్టీ సేకరిస్తూ పూర్తిగా సీఐడీ నియంత్రణలో పనిచేస్తుంది. ఈ విధానం నగర పోలీసు కమిషనరేట్‌లు మొదలుకుని అన్ని స్టేషన్‌లలో ఉంది. అయతే, కొన్ని స్టేషన్‌లలో ఐడీ పార్టీలు తమ ధర్మాన్ని వదలి పూర్తిగా సీఐల సొంతపార్టీలుగా మారిపోయిన ట్టు ఆరోపణలున్నాయి. చట్టవ్యతిరేకపనులకు పాల్పడేవారు, అక్రమ దందాలు కలిగినవారు, సట్టా,మట్కా, జూదగృహాలు నిర్వహించే వారి నుంచి నెలవారీ మామూళ్లను వసూలు చేసిపెట్టే చర్యలకు ఐడీ పార్టీలు పాల్పడుతున్నాయని , ఇందుకు ఆయా సీఐల ప్రేరణ ఉందనే బలమైన ఆరోపణలున్నాయి.
ఫక్తు ఇదేపనిలో మునిగితేలుతున్న కొన్ని ఐడీ పార్టీల గురించి డీజీపీకి ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. కొందరు ఇన్‌స్పెక్టర్లు నెలవారి మామూళ్లను లక్షల్లో దండుకుంటున్నారని డీజీపీ దృష్టికి వచ్చినట్టు తెలిసింది. కొందరు కానిస్టేబుళ్లు ఏళ్లతరబడి ఐడీ పార్టీ విధుల్లోనే కొనసాగుతున్నట్టు కూడా ఆరోపణలున్నాయి. దీంతో ఈ వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ భావిస్తున్నట్టు తెలిసింది. నేర పరిశోధన కోసం అన్ని స్టేషన్‌లలో క్రైమ్ విభాగాలు, సీసీఎస్‌లు ఉండడంతో ఇక సీఐలకు ప్రత్యేకంగా ఐడీ పార్టీలు ఎందుకని ఆయన అధికారులతో చర్చిస్తున్నట్టు తెలిసింది.