నేడు సీఎం కేసీఆర్‌తో డీజీపీ అనురాగ్‌శర్మ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. కొన్ని ముఖ్యమైన స్థానాల మార్పుతో పాటు, ఖాళీగా ఉన్న పోస్టింగ్‌లను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా రెండేళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారికి స్థాన చలనం కల్పించనున్నారు. అధికారుల మార్పులకు సంబంధించి ఇది వరకే సీఎం కేసీఆర్, డీజీపీ అనురాగ్‌శర్మ ఇతర సీనియర్ అధికారులతో చర్చించారు. ఇటీవలి కాలంలో ట్రిబ్యునల్ తీర్పు కూడా రావడంతో అధికారుల పంపకాలపై స్పష్టత వచ్చింది. దీంతో తాజాగా నేడు(బుధవారం) సీఎం కేసీఆర్‌ను డీజీపీ అనురాగ్‌శర్మ మరోసారి భేటీ అవుతున్నారు.
అనంతరం ఒకట్రెండు రోజుల్లో అధికారుల బదిలీల ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్రంలో అతి ముఖ్యమైన పోస్టింగ్‌లు ఇంచార్జీ అధికారులతో నెట్టుకొస్తున్నారు. వీటిని వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ రేంజ్ ఐజీ, డీఐజీతో పాటు, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ, ఫోరెన్సిక్ సైన్స్ డెరైక్టర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడం పైనే సీఎం కేసీఆర్ ప్రధాన దృష్టి కేంద్రీకరించారు.