పోలీస్‌స్టేషన్లకు నూతన భవనాలు
హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి
ముగిసిన తొలి రాష్ట్రస్థాయి పోలీసు క్రీడలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అవసరమున్న చోట్ల పోలీస్‌స్టేషన్లకు కొత్త భవనాలను నిర్మిస్తామన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం నిర్వహించిన తొలి రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడలు శనివారం ముగిశాయి. గురువారం ప్రారంభమైన ఈ క్రీడల్లో 25 విభాగాల్లో 18 రేంజ్‌లకు చెందిన సుమారు రెండు వేల మంది పోలీసు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమంలో నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను ఆధునీకరించే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకంలో పోలీసులకు పది శాతం కేటాయిస్తామని సీఎం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
కృషితోనే గెలుపు సాధ్యం: అనురాగ్‌శర్మ
ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని డీజీపీ అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. క్రీడల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన పోలీసు క్రీడాకారులకు లక్షల్లో నగదుతోపాటు ఇంక్రిమెంట్లు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ గొడాం నగేష్, అదనపు డీజీపీ సుదీప్ లక్టాకియా, ఐజీ వి.నవీన్‌చంద్, స్పోర్ట్స్ ఐజీ శ్రీనివాస్, డీఐజీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు రాథో డ్ బాపూరావు, దుర్గం చిన్నయ్య, జిల్లా కలెక్టర్ జగన్మోహన్, ఎస్పీ తరుణ్‌జోషి పాల్గొన్నారు.