యూఏఈలో ఉపాధికి సర్కార్ బాటలు
రాయికల్: గల్ఫ్, ఆఫ్రికా దేశాల్లో తెలంగాణ యువత ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఇప్పటికే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు చెందిన 3 లక్షల మంది కార్మికులు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఉపాధి పొందుతున్నారు. ఇందులో వేలాది మంది కార్మికులు నకిలీ ఏజెంట్ల మాటలు నమ్మి అక్కడకు వెళ్లి నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక ముందు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా.. ఏజెంట్ల ప్రమేయం లేకుండా, యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఇందులో భాగంగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టామ్‌కామ్) పేరిట కేంద్ర ప్రభుత్వం నుంచి లెసైన్స్ పొందిన రాష్ట్ర ప్రభుత్వం... రాష్ట్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19న తెలంగాణ డిప్యూటీ సీఎం మహబూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితలు దుబాయ్ వెళ్తున్నారు. ఈ నెల 20న దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌లో పలు యూఏఈ కంపెనీల అధికారులతో నియామకాలకు సంబంధించి పలు ఒప్పందాలు కుదురుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విజన్-2022లో భాగంగా 500 మిలియన్ల యువతకు స్కిల్ ట్రెయినింగ్, డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇవ్వనుంది. ఇలా శిక్షణ తీసుకున్న యువతకు తెలంగాణ ప్రభుత్వం టామ్‌కామ్ యూఏఈలోని పలు కంపెనీలకు సిఫార్సు చేయనున్నారు. ఇందులో తమ నైపుణ్యాలకు అనుగుణంగా ఉన్న వారిని ఆయా కంపెనీలు ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఏజెంట్ల బెదడ కూడా తప్పుతుంది.