
పీపుల్ ఫ్రెండ్లీ’గా పోలీసు స్టేషన్లు
కార్పొరేట్ కళ
సైబరాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లు కొత్త రూపును సంతరించుకోబోతున్నాయి. కార్పొరేట్ సంస్థల కార్యాలయాలను తలపించే రీతిలో వీటిని తీర్చిదిద్దబోతున్నారు.
- సైబరాబాద్ కమిషనరేట్‌లో అదనపు అంతస్తులు
- వీడియో వాల్ నుంచే సీసీటీవీ, సిగ్నల్స్, వాహనాల జీపీఎస్ మ్యాప్స్ పర్యవేక్షణ
- ఫిర్యాదుదారుడికి భరోసా కలిగించేలా స్టేషన్ డిజైన్ల మార్పు
- సందర్శకుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు
- బందోబస్తు కోసం వచ్చే బలగాలకు బ్యారక్‌లు
సాక్షి, సిటీబ్యూరో: ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రజలతో మమేకమవుతున్న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసు భవనాలు, స్టేషన్లు పీపుల్ ఫ్రెండ్లీగా మారబోతున్నాయి. ఠాణాకు వచ్చిన ప్రతి ఫిర్యాదుదారుడికి అక్కడి వాతావరణం చూడగానే తమకు న్యాయం జరుగుతుందనే భరోసా కలిగించేలా ఆధునికతను సంతరించుకోనున్నాయి. సైబరాబాద్‌లోని వనరులు, స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి..స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఇతర అధికారులతో పూర్తి సంప్రదింపులు జరిపాకే పీపుల్ ఫ్రెండ్లీ యూనిట్లుగా ఈ భవనాలను వెస్టర్న్ స్టండర్స్‌తో నిర్మించేందుకు రూపొందించిన డిజైన్స్‌ను పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఒకే చెప్పారు.
ప్రత్యేక బ్యారక్‌లు...
ఒక్కో స్టేషన్ పైనా 1500 చదరపు అడుగుల్లో బ్యారక్ (విశ్రాంతి గదులు) నిర్మించేందుకు ప్రభుత్వం రూ. 10 కోట్లు కేటాయించింది. తెలంగాణ పోలీసులతో పాటు బందోబస్తు కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బలగాలు వీటిని వినియోగించుకోవచ్చు. ఒక్కో బ్యారక్‌లో 25 మంది సిబ్బందికి బెడ్‌లు, షవర్‌లు, బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్లతో పాటు ఒక వంటగది, డైనింగ్ హాల్, ఆయుధాగారం ఉంటాయి. కొత్తగా మంజూరైన గచ్చిబౌలి ఐటీ కారిడార్ పోలీసు స్టేషన్ కాంప్లెక్స్‌కు రూ. 3 కోట్లు కేటాయించారు. మాదాపూర్ డీసీపీ. అడిషనల్ డీసీపీ, ఏసీపీతో పాటు ఐటీ కారిడార్ మహిళా పోలీసు స్టేషన్, కమిషనరేట్ కౌన్సెలింగ్ సెంటర్‌లు ఈ కాంప్లెక్స్‌లో ఉంటాయి. సెల్లార్ పార్కింగ్ సదుపాయం కూడా ఉండేలా నిర్మిస్తారు. కొత్త పోలీసు స్టేషన్లు ఆదిభట్ల, జవహర్‌నగర్‌లకు రూ. 2 కోట్ల చొప్పున కేటాయించారు.
నేడు శంకుస్థాపన...
కమిషనరేట్ కార్యాలయంలోని అదనపు అంతస్తులకు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నర్సింహ్మ రెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ శంకుస్థాపన చేయనున్నారు. రాజ్యసభ ఎంపీ దేవేందర్ గౌడ్, చేవేళ్ల ఎంపీ కే.విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీలు నరేందర్ రెడ్డి, రాంచందర్‌రావు, టీఎస్‌పీహెచ్‌సీ లిమిటెడ్ జాయింట్ ఎండీ, అడిషనల్ డీజీపీ సత్యనరైన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు కూడా హజరుకానున్నారు. కొత్తగా క్రియేట్ చేసిన జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌ను కూడా ప్రారంభిస్తారు.
సందర్శకులకు ప్రాధాన్యం...
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 44 లా అండ్ అర్డర్ పోలీసుస్టేషన్ల రూపురేఖలు మారనున్నాయి. ఠాణాల్లో సిటీజనుల కోసం రిసెప్షన్, ఫిర్యాదులు స్వీకరించేందుకు, కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రత్యేక గదులు ఉంటాయి. ఒత్తిడిలో ఉన్న మహిళల కోసం ఉమెన్ హెల్స్ డెస్క్‌లు, సెక్టార్ ఎస్‌ఐల కోసం వర్క్ స్టేషన్లు, రెస్ట్ రూమ్‌లు, సందర్శకుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పురుష, మహిళా సిబ్బంది కోసం వేర్వేరుగా టాయ్‌లెట్లు ఉంటాయి. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్, డిటెక్టివ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ల కోసం కూడా గదులు కేటాయిస్తారు. ఇందుకోసం రూ.20 కోట్లు కేటాయించారు.
వీడియో వాల్ నుంచే పర్యవేక్షణ...
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో డీసీపీ, అదనపు డీసీపీలు, ఇతర అధికారులు, షీ టీమ్స్, ఐటీ సెల్, సీఐ సెల్, మినీస్టిరియల్, అకౌంట్ స్టాఫ్ కోసం మూడంతస్తులను నిర్మించనున్నారు. సైబరాబాద్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను మూడు అంతస్తులతో నిర్మిస్తారు. ఇక్కడ అతిపెద్ద వీడియో వాల్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ వీడియో వాల్‌ను మూడు భాగాలుగా విభజిస్తారు. ఒక విభాగంలో సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షిస్తారు. మరో విభాగంలో హెచ్‌టీఆర్‌ఐఎంఎస్ సిగ్నల్స్, ఇంకో విభాగంలో 200 పెట్రోల్ కారులు, ఇతర వాహనాల జీపీఎస్ మ్యాప్స్‌ను పర్యవేక్షిస్తారు. సైబరాబాద్ పరిధిలో పదివేల సీసీటీవీ కెమెరాలు అమర్చాలనుకుంటున్న అధికారులు తొలి ఏడాదిలో 3 వేల సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నారు. వార్ రూమ్‌ను సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తారు.
ఫిర్యాదుదారులు మా అతిథులే..
‘‘న్యాయం, సహాయం కోరుతూ పోలీసుస్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడూ మాకు అతిథులే. వీరికి అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు పోలీసు సిబ్బందికి వసతి, పోలీసుస్టేషన్‌లో పారదర్శకతలకు పెద్దపీట వేస్తూ నిర్మాణాలు చేపడుతున్నాం. ఠాణాలో అడుగుపెట్టే బాధితుడు, ఫిర్యాదుదారుడికి అక్కడి వాతావరణమే న్యాయం జరుగుతుందనే భరోసా కలిగించేలా ఉండాలని నిర్ణయించాం. పారదర్శకంగా విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది, వారి వ్యవహారశైలి, ఇతర వసతులు ఆ భరోసాని ఇస్తాయి. సర్వకాలసర్వాస్థల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, అహర్నిశలు శ్రమిస్తున్న సైబరాబాద్ పోలీసులకు, ప్రత్యేక సందర్భాల్లో బందోబస్తు విధుల కోసం వచ్చే సాయుధ బలగాలకు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా డిజైన్ చేశాం. గరిష్టంగా ఏడాది కాలంలో ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి.’’
- సీవీ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్