అందుబాటులోకి  టిన్‌టిన్,  పొపాయ్‌  | Popeye, Tintin Enter The Public Domain In 2025 | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి  టిన్‌టిన్,  పొపాయ్‌ 

Published Fri, Jan 3 2025 4:39 AM | Last Updated on Fri, Jan 3 2025 4:39 AM

Popeye, Tintin Enter The Public Domain In 2025

అమెరికాలో పలు అలనాటి అపురూప రచనలు, కామిక్‌ పాత్రలకు ముగిసిన కాపీరైట్స్‌ గడువు 

ఇప్పుడు ఉచితంగా ప్రజలకు వినియోగించుకునే సదవకాశం

పిల్లలు మొదలు పెద్దలదాకా ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలరించే దిగ్గజ ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ కార్టూన్‌ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనువిందుచేయడం తెల్సిందే. దశాబ్దాలు గడిచిపోవడంతో ఈ వీడియోలపై ఇప్పుడు ఎలాంటి కాపీరైట్‌ వంటి మేథోహక్కులు ఎవరికీ లేవు. ఇప్పుడు వీటిని అందరూ ఉపయోగించుకోవచ్చు. రచయితకు ఎలాంటి రాయితీ చెల్లించకుండానే వాడుకోవచ్చు. అచ్చం ఇలాగే అమెరికాలో జనవరి ఒకటో తేదీ నుంచి ఇంకొన్ని కార్టూన్‌ పాత్రలు, అలనాటి అపురూప రచనలకు కాపీరైట్‌ గడువు ముగిసింది. 

దీంతో ఇప్పుడు ప్రజలంతా వాటిని తమకు నచ్చినట్లు ఉచితంగా వినియోగించుకునే అవకాశం లభించింది. ఒకప్పటి క్లాసిక్స్‌ అయిన టిన్‌టిన్, పొపాయ్‌ కార్టూన్‌ పాత్రలతోపాటు మరికొన్ని ప్రసిద్ధ రచనలపై కాపీరైట్‌ గడువు జనవరి ఒకటో తేదీతో ముగిసింది. వర్జీనియా వూల్ఫ్‌ రాసిన ‘ఎ రూమ్‌ ఆఫ్‌ వన్స్‌ ఓన్‌’, ఎర్నెస్ట్‌ హెమ్మింగ్‌వే రాసిన ‘ఎ ఫేర్వెల్‌ టు ఆర్మ్స్‌’, మార్క్స్‌ బ్రదర్స్‌ మొదటి చలన చిత్రం ‘ది కోకోనట్స్‌’ వంటి క్లాసిక్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి. 1924లోని సౌండ్‌ ట్రాక్స్‌ కూడా కాపీరైట్‌ రహితం అయ్యాయి.

జాబితాలో ఏమేమున్నాయి? 
కొత్త సంవత్సరంలో కాపీరైట్‌ కోల్పోనున్న సాంస్కృతిక రచనల జాబితాను ‘సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ ది పబ్లిక్‌ డొమైన్‌’ ప్రతి డిసెంబర్‌లో ప్రచురిస్తుంది. ఆగ్నేయ అమెరికా రాష్ట్రమైన నార్త్‌ కరోలినాలోని డ్యూక్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లాలో భాగమైన ఈ కేంద్రం ఈ జాబితాను తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

జనవరి ఒకటో తేదీ నుంచి అమెరికా పబ్లిక్‌ డొమైన్‌లోకి ప్రవేశించిన సాహిత్యంలో వర్జీనియా వూల్ఫ్‌ రాసిన ‘ఎ రూమ్‌ ఆఫ్‌ వన్స్‌ ఓన్‌’, ఎర్నెస్ట్‌ హెమ్మింగ్‌వే రాసిన ‘ఎ ఫేర్వెల్‌ టు ఆర్మ్స్‌’, విలియం ఫాల్కనర్‌ రాసిన ‘ది సౌండ్‌ అండ్‌ ది ఫ్యూరీ’, జర్మన్‌ రచయిత ఎరిక్‌ మారియా రెమార్క్‌ రాసిన ‘ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్టర్న్‌ ఫ్రంట్‌’ ఆంగ్ల అనువాదం ఉన్నాయి.

 ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ దర్శకత్వం వహించిన ‘బ్లాక్‌ మెయిల్‌’, ఆస్కార్‌ అవార్డు గ్రహీత జాన్‌ ఫోర్డ్‌ రూపొందించిన మొదటి సౌండ్‌ ఫిల్మ్‌ ‘ది బ్లాక్‌ వాచ్‌’ కూడా పబ్లిక్‌ డొమైన్‌లోకి వచ్చాయి. ఫ్రెంచ్‌ స్వరకర్త మారిస్‌ రావెల్‌ ‘బొలెరో’, జార్జ్‌ గెర్‌‡్షవిన్‌ ‘యాన్‌ అమెరికన్‌ ఇన్‌ పారిస్‌’ వంటి ట్రాక్స్‌ సైతం అందుబాటులోకి వచ్చాయి. ఈ సంవత్సరం కాపీ రైట్‌ రహితమైన కార్టూన్‌ పాత్రల్లో టిన్‌టిన్, పొపాయ్‌ ది సెయిలర్‌ ఉన్నాయి. కామిక్‌ పాత్ర టిన్‌టిన్‌.. 1929లో బెల్జియం వార్తాపత్రికలో అరంగేట్రం చేసింది. కార్టూనిస్ట్‌ ఎల్జీ క్రిస్లర్‌ సెగర్‌ సృష్టించిన పొపాయ్‌ ది సెయిలర్‌ అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి.  

95 ఏళ్ల తరువాత...  
అమెరికా కాపీరైట్‌ చట్టం ప్రకారం పుస్తకాలు, చలనచిత్రాలు, ఇతర కళాకృతులకు 95 సంవత్సరాల తర్వాతే కాపీరైట్స్‌ ముగుస్తాయి. అలా 1929కి చెందిన వేలాది రచనలు, 1924లో రికార్డ్‌ అయిన అనేక సౌండ్స్‌ అమెరికాలో ఇప్పుడు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. వేలాది సినిమాలు, పాటలు, పుస్తకాలు జనవరి 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 2024 కాపీరైట్స్‌ పూర్తయిన మిక్కీమౌస్, 2023లో పబ్లిక్‌ డొమైన్‌లోకి ప్రవేశించిన విన్నీ ది పూహ్‌ ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.   

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement