copyright
-
అందుబాటులోకి టిన్టిన్, పొపాయ్
పిల్లలు మొదలు పెద్దలదాకా ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలరించే దిగ్గజ ‘టామ్ అండ్ జెర్రీ’ కార్టూన్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనువిందుచేయడం తెల్సిందే. దశాబ్దాలు గడిచిపోవడంతో ఈ వీడియోలపై ఇప్పుడు ఎలాంటి కాపీరైట్ వంటి మేథోహక్కులు ఎవరికీ లేవు. ఇప్పుడు వీటిని అందరూ ఉపయోగించుకోవచ్చు. రచయితకు ఎలాంటి రాయితీ చెల్లించకుండానే వాడుకోవచ్చు. అచ్చం ఇలాగే అమెరికాలో జనవరి ఒకటో తేదీ నుంచి ఇంకొన్ని కార్టూన్ పాత్రలు, అలనాటి అపురూప రచనలకు కాపీరైట్ గడువు ముగిసింది. దీంతో ఇప్పుడు ప్రజలంతా వాటిని తమకు నచ్చినట్లు ఉచితంగా వినియోగించుకునే అవకాశం లభించింది. ఒకప్పటి క్లాసిక్స్ అయిన టిన్టిన్, పొపాయ్ కార్టూన్ పాత్రలతోపాటు మరికొన్ని ప్రసిద్ధ రచనలపై కాపీరైట్ గడువు జనవరి ఒకటో తేదీతో ముగిసింది. వర్జీనియా వూల్ఫ్ రాసిన ‘ఎ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్’, ఎర్నెస్ట్ హెమ్మింగ్వే రాసిన ‘ఎ ఫేర్వెల్ టు ఆర్మ్స్’, మార్క్స్ బ్రదర్స్ మొదటి చలన చిత్రం ‘ది కోకోనట్స్’ వంటి క్లాసిక్స్ ఈ జాబితాలో ఉన్నాయి. 1924లోని సౌండ్ ట్రాక్స్ కూడా కాపీరైట్ రహితం అయ్యాయి.జాబితాలో ఏమేమున్నాయి? కొత్త సంవత్సరంలో కాపీరైట్ కోల్పోనున్న సాంస్కృతిక రచనల జాబితాను ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ది పబ్లిక్ డొమైన్’ ప్రతి డిసెంబర్లో ప్రచురిస్తుంది. ఆగ్నేయ అమెరికా రాష్ట్రమైన నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో భాగమైన ఈ కేంద్రం ఈ జాబితాను తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జనవరి ఒకటో తేదీ నుంచి అమెరికా పబ్లిక్ డొమైన్‌లోకి ప్రవేశించిన సాహిత్యంలో వర్జీనియా వూల్ఫ్ రాసిన ‘ఎ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్’, ఎర్నెస్ట్ హెమ్మింగ్వే రాసిన ‘ఎ ఫేర్వెల్ టు ఆర్మ్స్’, విలియం ఫాల్కనర్ రాసిన ‘ది సౌండ్ అండ్ ది ఫ్యూరీ’, జర్మన్ రచయిత ఎరిక్ మారియా రెమార్క్ రాసిన ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ ఆంగ్ల అనువాదం ఉన్నాయి. ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ దర్శకత్వం వహించిన ‘బ్లాక్ మెయిల్’, ఆస్కార్ అవార్డు గ్రహీత జాన్ ఫోర్డ్ రూపొందించిన మొదటి సౌండ్ ఫిల్మ్ ‘ది బ్లాక్ వాచ్’ కూడా పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాయి. ఫ్రెంచ్ స్వరకర్త మారిస్ రావెల్ ‘బొలెరో’, జార్జ్ గెర్‡్షవిన్ ‘యాన్ అమెరికన్ ఇన్ పారిస్’ వంటి ట్రాక్స్ సైతం అందుబాటులోకి వచ్చాయి. ఈ సంవత్సరం కాపీ రైట్ రహితమైన కార్టూన్ పాత్రల్లో టిన్టిన్, పొపాయ్ ది సెయిలర్ ఉన్నాయి. కామిక్ పాత్ర టిన్టిన్.. 1929లో బెల్జియం వార్తాపత్రికలో అరంగేట్రం చేసింది. కార్టూనిస్ట్ ఎల్జీ క్రిస్లర్ సెగర్ సృష్టించిన పొపాయ్ ది సెయిలర్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. 95 ఏళ్ల తరువాత... అమెరికా కాపీరైట్ చట్టం ప్రకారం పుస్తకాలు, చలనచిత్రాలు, ఇతర కళాకృతులకు 95 సంవత్సరాల తర్వాతే కాపీరైట్స్ ముగుస్తాయి. అలా 1929కి చెందిన వేలాది రచనలు, 1924లో రికార్డ్ అయిన అనేక సౌండ్స్ అమెరికాలో ఇప్పుడు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. వేలాది సినిమాలు, పాటలు, పుస్తకాలు జనవరి 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 2024 కాపీరైట్స్ పూర్తయిన మిక్కీమౌస్, 2023లో పబ్లిక్ డొమైన్‌లోకి ప్రవేశించిన విన్నీ ది పూహ్ ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కాదు.. కేంద్రం క్లారిటీ..
ఢిల్లీ: వివాహాది శుభకార్యాలలో సినిమా పాటలను వినియోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి ఘటనల్లో కాపీరైట్ సొసైటీలు రాయల్టీని వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. శుభకార్యాలలో మూవీ సాంగ్స్ ప్లే చేయడంపై రాయాల్టీ వసూలు చేస్తున్నారని పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్, ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐటీ) ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వివాహాది శుభకార్యాల్లో సినిమా పాటల ప్రదర్శనకు రాయల్టీ వసూలు చేస్తున్నాయంటూ అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపిన డీపీఐటీ .. ఇది కాపీరైట్ యాక్ట్ 1957లోని సెక్షన్ 52(1)కు విరుద్ధమని పేర్కొంది. మతపరమైన కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో ప్రదర్శించే నాటక, ఏదైనా సౌండ్ రికార్డింగ్‌లు కాపీరైట్ ఉల్లంఘన కిందకు రావని సెక్షన్ 52 (1) (za) చెబుతోందని అధికారులు స్పష్టం చేశారు. వివాహ ఊరేగింపుతోపాటు పెళ్లికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా మతపరమైన వేడుకల కిందకే వస్తాయని డీపీఐటీ తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకొని కాపీరైట్ సంస్థలు వీటికి దూరంగా ఉండాలని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. ఏదైనా సంస్థల నుంచి రియాల్టీకి సంబంధించిన డిమాండ్లు వస్తే వాటిని అంగీకరించవద్దని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: వాహనదారుల భరతం పడుతున్న ట్రాఫిక్ పోలీసులు... -
విజయపథం: క్రియేటివ్ క్వీన్
ఏమీ తెలియని రంగంలోకి ప్రవేశించి, ఉన్నత శిఖరాలకు చేరడానికి అద్భుత దీపాలతో పనిలేదు. ఆసక్తి ఉంటే, అనుభవపాఠాలు తోడుంటే చాలు! అంతంతమాత్రం అవగాహనతో అడ్వర్టైజింగ్ రంగంలోకి అడుగుపెట్టిన కైనజ్ కర్మాకర్ ఆ రంగంలో ఉన్నతస్థాయికి చేరుకుంది. ఆదర్శ ఉద్యోగిగా నిలిచింది. సైకాలజీలో పట్టా పుచ్చుకున్న కైనజ్ కర్మాకర్ (ముంబై) అడ్వర్టైజింగ్ రంగంలోకి అడుగు పెట్టే నాటికి ఆ రంగం గురించి పెద్దగా తెలియదు. విదేశాలలో ఉన్నత చదువులు చదవాలనే కోరిక సాకారం కాక΄ోవడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది కైనజ్. అడ్వర్టైజింగ్ రంగంలో కనిపిస్తున్న ఆర్ట్ డైరెక్షన్, కాపీ రైటింగ్ అనే రెండు దారుల్లో రెండో దారిని ఎంచుకుంది. దీనికి కారణం తనకు రచనలు చేయడం అంటే ఇష్టం. అయితే అడ్వర్టైజింగ్ కాపీ రైటింగ్ గురించి మాత్రం ఏమీ తెలియదు. ముంబైలోని ఒక యాడ్ ఏజెన్సీలో చేరినప్పుడు, ఉద్యోగంలో చేరినట్లు కాకుండా మొదటిసారిగా బడికి వచ్చిన విద్యార్థిలా అనిపించింది. ‘అదృష్టాన్ని నమ్ముకున్నవారు దాని కోసమే నిరీక్షిస్తూ తమకు తెలియకుండానే దురదృష్టంలోకి జారుకుంటారు’ అనే మాట ఉంది.అయితే కైనజ్ అదృష్టం కంటే కష్టాన్నే నమ్ముకుంది. 2000 సంవత్సరంలో ‘లియో బర్నెట్ ఇండియా’లో చేరినప్పుడు అక్కడ అగ్నెలో డయాస్ పరిచయం అయ్యాడు. తాను ఒక గురువై అడ్వర్టైజింగ్కు సంబంధించిన సూక్ష్మనైపుణ్యాలను బోధించాడు. విలువైనపాఠాలు అవి. ‘ఓగిల్వీ ఇండియా’ కంపెనీలో అడుగు పెట్టడానికి ముందు రకరకాల కామెంట్స్ వినిపించాయి... ‘కొత్తవాళ్లు అక్కడ పనిచేయడం కష్టం’ ‘అక్కడ ఎప్పటికప్పుడు నిలదొక్కుకోవడం తప్ప ఉన్నత స్థాయికి చేరడం అనేది కలలో మాట’ అయితే ఇలాంటి కామెంట్స్‌ను పట్టించుకోకుండా తన పనిపైనే పూర్తిగా దృష్టి పెట్టింది కైనజ్. కంపెనీ నేర్పినపాఠాలు, కాలం నేర్పినపాఠాలతో తనలోని సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకుంది. ‘ఒగిల్వీ ఇండియా’ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ స్థాయికి ఎదిగింది. ‘చెప్పే విధానం ఎంత ఆకర్షణీయంగా ఉంటే, మార్పు అనేది అంత త్వరగా మొదలవుతుంది’ అంటున్న 46 ఏళ్ల కైనజ్ తన సృజనాత్మక కృషికి దేశ, విదేశాల్లో 40కి పైగా ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్లు అందుకుంది. ‘క్లయింట్ సమస్యను తన వ్యక్తిగత సమస్యగా భావించి వెంటనే రంగంలోకి దిగుతుంది. అది పరిష్కారం అయ్యే వరకు కష్టపడుతుంది. తన పనేదో తాను నిశ్శబ్దంగా చేసుకుంటూ ΄ోతుంది తప్ప హడావిడి, ఆర్భాటం కనిపించవు. కైనజ్ ్రపాధాన్యతలలో పని మొదటిస్థానంలో ఉంటుంది. ఔత్సాహికులకు స్ఫూర్తిని ఇచ్చే వ్యక్తి’ అంటున్నాడు కైనజ్తో ఎన్నో సంవత్సరాలు కలిసి పనిచేసిన హర్షద్ రాజాధ్యక్ష. ‘ఒగిల్వీలో ఎందరో దిగ్గజాల దగ్గర ఎన్నో విలువైనపాఠాలు నేర్చుకున్నాను. అడ్వర్టైజింగ్కు సంబంధించి నా ఆలోచనలు మార్చుకోవడానికి, కొత్తగా ఆలోచించడానికి అవి ఉపకరించాయి’ అంటున్న కైనజ్ ఐటీసి, బ్రూక్ బాండ్, ఫియట్, బజాజ్... మొదలైన ప్రసిద్ధ బ్రాండ్లకు పనిచేసింది. కెరీర్ కొత్తలో చేదు అనుభవాలు ఎదురైనా, వాటిని ఎప్పటికప్పుడూ డిలీట్ చేస్తూ వస్తోంది కైనజ్. ‘చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం కంటే కొత్త ఐడియాల గురించి ఆలోచించడానికి ఇష్టపడతాను. కొత్తగా ఆలోచించడం అనేది నా వృత్తిలో భాగం. నేను ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలనే ఆలోచన తప్ప వేరే రంగాన్ని ఎంచుకొని ఉంటే బాగుండేది అని ఎప్పుడూ ఆలోచించలేదు. వృత్తిజీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోగలిగే రంగమే నా దృష్టింలో గొప్ప రంగం’ అంటుంది కైనజ్ కర్మాకర్. -
కోర్టుమెట్లెక్కిన ఫోన్‌పే..! ఎందుకంటే..?
ప్రముఖ యూపీఐ పేమెంట్స్ కంపెనీ భారత్‌పే ‘బై నౌ పే ల్యాటర్’ అంటూ పోస్ట్‌పే యాప్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా పోస్ట్‌పే బ్రాండ్ నేమ్ కాపీరైట్ వ్యవహరంలో ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ప్రముఖ యూపీఐ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే బాంబే హైకోర్టు మెట్లను ఎక్కింది. చదవండి: మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్...! ఎందుకంటే..? రెసిలియంట్ ఇన్నోవేషన్స్‌కు చెందిన పోస్ట్‌పే యాప్‌లో 'Pe' ప్రత్యయం వినియోగంపై రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌లను దుర్వినియోగం చేయకుండా నిరోధించాలని కోరుతూ ఫోన్‌పే బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల ఆరో తారీఖున పోస్ట్‌పే సేవలను భారత్‌పే ప్రారంభించింది. ఈ విషయంపై బాంబే హైకోర్టులో ఫోన్‌పే అభ్యర్థనపై, కోర్టు అక్టోబర్ 22న విచారణకు స్వీకరించింది. అంతేకాకుండా పోస్ట్‌పే ఫోన్‌పే ప్రత్యయాన్ని పోలి ఉందనే విషయాన్ని హైకోర్టు గమనించింది. అయితే కోర్టు చేసిన కొన్ని పరిశీలనలను పరిష్కరించడం కోసం పిటిషన్‌ను ఫోన్‌పే ఉపసంహరించుకుంది. కాగా భారత్‌పే పై మరో దావాను వేసేందుకు సిద్దమైనట్లు కంపెనీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే మొదటిసారి కాదు..! ఫోన్‌పే ‘పే’ ప్రత్యయం వినియోగంపై భారత్‌పేని కోర్టుకు లాగడం ఇదే మొదటిసారి కాదు. 2019 సెప్టెంబరులో ఫోన్‌పే ఇదే విధమైన నిషేధాన్ని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా...అప్పుడు కోర్టు భారత్‌పే ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించడం లేదని ఢిల్లీ హైకోర్టు ఫోన్‌పే పిటిషన్‌ను తోసిపుచ్చింది. చదవండి: ఫేస్బుక్ నెత్తిన మరో పిడుగు..! -
వీటిపై 71 వేల ఫిర్యాదులు అందాయి: గూగుల్
న్యూఢిల్లీ: మే, జూన్ నెలల్లో భారతీయ వినియోగదారుల నుంచి 71,148 ఫిర్యాదులు అందినట్లు గూగుల్ శుక్రవారం వెల్లడించింది. ఆయా ఫిర్యాదుల ఆధారంగా సమాచారంలోని 1.54 లక్షల భాగాలను తొలగించినట్లు తెలిపింది. అందులోనూ జూన్ నెలలోనే 36,265 ఫిర్యాదులు అందాయని, వాటి కారణంగా 83,613 తొలగింపు చర్యలను చేపట్టినట్లు పేర్కొంది. వీటితో పాటు తమ ప్లాట్‌ఫామ్‌లోని ఆటోమేటెడ్ డిటెక్షన్ పద్ధతి ద్వారా 11.6 లక్షల సమాచార భాగాలను తొలగించినట్లు తెలిపింది. తొలగింపునకు గురైన సమాచారంలో కాపీరైట్ (70,365), ట్రేడ్ మార్క్ (753), కౌంటర్ఫీట్ (5), లీగల్ (4) వ్యవహారాలు ఉన్నాయని గూగుల్ చెప్పింది. -
‘కాపీరైట్ పాటలపై రాయల్టీ చెల్లించాల్సిందే’
న్యూఢిల్లీ: ఈవెంట్ ఆర్గనైజర్లు కాపీరైట్ అయిన పాటలను వేడుకల్లో వాడుకున్నప్పుడు.. సంబంధిత సంస్థలకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి పాటలను వాడుకునే ముందు ఆ సంస్థలకు విషయాన్ని తెలియజేసి.. అనుమతి పొందాలంది. ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్ సొసైటీ (ఐపీఆర్‌ఎస్), ఫోనోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ లిమిటెడ్ (పీపీఎల్), నోవెక్స్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ మూడు సంస్థలు ప్రస్తుతం కాపీరైట్స్‌ను పర్యవేక్షిస్తున్నాయి. కనుక ఈవెంట్ ఆర్గనైజర్లు ఈ సంస్థలకు తప్పక సమాచారం ఇవ్వాలని పేర్కొంది -
గూగుల్ కి భారీ ఊరట..
శాన్ ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం గూగుల్ కు పెద్ద ఊరట లభించింది. మల్టీ బిలియన్ డాలర్ల దావా కేసులో కోర్టు గూగుల్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీgతో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాపీ రైట్ వివాదంలో రెండు టెక్నాలజీ దిగ్గజాల మధ్య సాగిన హోరా హోరీ యుద్ధానికి ప్రస్తుతానికి తెరపడింది. ఈ తీర్పును పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఒరాకిల్ మళ్లీ పోరుకు రడీ అవుతోంది. ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్ విజయానికి ఈ తీర్పు నిదర్శనమని గూగుల్ వ్యాఖ్యానించింది. జావా ప్రోగ్రామింగ్ క్యమూనిటీ కాపీ రేట్స్ విషయంలో, సాప్ట్ వేర్ అభివృధ్దిలో నూతన ఆవిష్కరణలకు నాంది అవుతుందని ఒక ప్రకటనలో తెలిపింది. సాఫ్ట్ వేర్ డెవలపర్లకు ఇదిముఖ్యమైన విజయమని, సృజనాత్మకతకు ప్రోత్సాహాన్నందిస్తుందని కంప్యూటర్ కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్ బ్లాక్ చెప్పారు. ఇది ఇలా ఉంటే ఈతీర్పును వ్యతిరేకించిన ఒరాకిల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ను గూగుల్ చట్టవిరుద్ధంగా వాడుతోందని గట్టిగా నమ్మువుతున్నామని వాదించింది. మరోసారి అప్పీలు కు వెళ్లనున్నట్టు స్పష్టం చేసింది. కాగా జావా ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ లో గూగుల్ ఆండ్రాయిడ్ కాపీ రైట్ ను ఉల్లంఘించిందని ఒరాకిల్ ఆరోపించింది. దీనికి గాను తమకు గూగుల్ ఆ కంపెనీకి 8.8 బిలియన్ డాలర్లు(880 కోట్ల డాలర్లు) చెల్లించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కాపీ రైట్ చట్టం ప్రకారం న్యాయంగానే జావా లాంగ్వేజ్ ను వాడుకుంటున్నామని, దానికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదంటూ ఒరాకిల్ ఆరోపణలను గూగుల్ ఖండించింది. ఈ రెండు కంపెనీల మధ్య వాదనలు 2012లో మొదలైన సంగతి తెలిసిందే.. -
శంకర్‌కు ఇళయరాజా నోటీస్
ప్రసిద్ధ సంగీత దర్శకులు ఇళయరాజా, అగ్రదర్శకుడు శంకర్ల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోందని చెప్పాలి. ‘కప్పల్’ చిత్రంలో అనుమతి లేకుండా తన పాటను వాడుకున్నారంటూ శంకర్‌కు ఇళయరాజా తన న్యాయవాది ద్వారా నోటీసు పంపించారు. వివరాల్లో కెళితే శంకర్ శిష్యుడు కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కప్పల్’. ఐ స్టూడియో ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో వైభవ్, సోనమ్ నాయకా నాయికలుగా నటించారు. దర్శకుడు శంకర్ తన ఎస్. పిక్చర్స్ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కాగా ఈ చిత్రంలో ఇళయరాజా బాణీ కట్టిన ‘ఊరు విట్టు ఊరు వందు, కాదల్ గీదల్ పణ్ణాదింగా...’ అనే పాటను వాడుకున్నారు. ఈ పాటను ఇళయరాజా చాలా ఏళ్ళ క్రితం ‘కరగాటక్కారన్’ చిత్రం కోసం రూపొందించారు. ఈ పాటను తన అనుమతి లేకుండా ‘కప్పల్’ చిత్రంలో ఎలా వాడుకుంటారని శంకర్, దర్శకుడు కార్తీక్ జి.క్రిష్, చిత్ర ఒరిజినల్ నిర్మాత జయరాంలకు ఆయన తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు. తాను సంగీతం అందించిన చిత్రాల పాటలను తన అనుమతి లేకుండా ఎవరూ ఉపయోగించరాదని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిందని అందులో ఆయన అన్నారు. కాబట్టి, ‘ఊరువిట్టు ఊరు వందు...’ పాటను ‘కప్పల్’ చిత్రంలో వాడటం కోర్టు ధిక్కార చర్య అవుతుందన్నారు. ఇలా తన పాటను అనుమతి లేకుండా ఉపయోగించినందుకు పరిహారం చెల్లించాలని, వెంటనే ఆ పాటను ‘కప్పల్’ చిత్రం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. లేదంటే కోర్టులో క్రిమినల్, సివిల్ కేసులు పెట్టనున్నట్లు హెచ్చరించారు. -
కపటం లేని మందహాసానికి కాపీరైట్
బిగుసుకుపోయినట్టు ఉండటం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం వైఎస్సార్ స్వభావానికి విరుద్ధం. ఆ నవ్వులో స్వచ్ఛత, ఆ పిలుపులో ఆత్మీయత ఉట్టిపడేవి. దేశవ్యాప్తంగా, మీడియాలో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ పదం వైఎస్సార్. ఆ పేరు వినబడుతూనే ఉంటుందిగానీ ఆ రూపం ఇక కనబడే అవకాశమే లేదు. ఒక వ్యక్తి గుణగణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖరరెడ్డిగారి విషయంలో నూటికి నూరుపాళ్లూ నిజమైంది. ‘రాజశేఖరా! నీపై మోజు తీరలేదురా!’ అని తెలుగు ప్రజానీకం రెండో పర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీనిండకుండానే, రాజశేఖరుడికి నూరేళ్లు నిండిపోవడం అత్యంత విషాదకరం. ‘రాజసాన ఏలరా!’ అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం. అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి. మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్ - అరవై ఏళ్లకు రిటైరైపోతానన్న మాట నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది - ఆయన పథకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం. 1978 నుంచి ఆయన మరణించేవరకూ ఒక జర్నలిస్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. విలేకరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా ఉండేది. ఆ సమావేశాల్లో బిగుసుకుపోయినట్టు ఉండటం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికి విరుద్ధం. ఆ నవ్వులో స్వచ్ఛత, ఆ పిలుపులో ఆత్మీయత ఉట్టిపడేవి. నమ్మినవాళ్లను నట్టేటముంచకపోవడం, నమ్ముకున్న వాళ్లకోసం ఎంతకైనా తెగించడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల మేలుకన్నా కీడే ఎక్కువ జరిగిన సందర్భాలున్నా లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణమే వైఎస్సార్‌కు రాష్ట్రవ్యాపితంగా అభిమానులను తయారుచేసి పెట్టింది. వివిధ ప్రాంతాల్లోని ప్రజానీకానికి దగ్గరచేసింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ తరఫున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది. 1975లో నేను రేడియో విలేకరిగా హైదరాబాద్‌లో అడుగుపెట్టిన మూడేళ్ల తర్వాత వైఎస్సార్ తొలిసారి శాసనసభకు ఎన్నిక కావడం, మంత్రి పదవి చేపట్టారు. వయసు మళ్లినవారే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువ రక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలైంది. కొంచెం అటుఇటుగా రాష్ట్ర రాజకీయాల్లో అడుగిడిన వైఎస్సార్, చంద్రబాబు ప్రాణ స్నేహితులుగా మసలిన రోజులకు నేను కూడా సాక్షిని కావడం యాదృచ్ఛికం. మంత్రి పదవి తనను ముందు వరించినప్పటికీ-చంద్రబాబు సైతం మంత్రయ్యేంత వరకూ ఆయన పడ్డ ఆరాటం ఆనాటి జర్నలిస్టులందరికీ తెలుసు. ఆయనను నేను మొదటిసారి చూసింది, ఆ రోజుల్లో సెక్రటేరియట్‌కు కూతవేటు దూరంలో ఉన్న సరోవర్ హోటల్(ఇప్పటి మెడిసిటీ హాస్పిటల్) టైమీద. సచివాలయంలో జరిగిన సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భం అది. అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించేవారు. కానీ, కపటం లేని మందహాసానికి అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీరైట్. ఇటు హైదరాబాద్‌లోనూ, అటు ఢిల్లీలోనూ వైఎస్సార్ నివాసాలు ఎప్పుడూ జర్నలిస్టులతో కళకళలాడుతుండేవి. వేళా పాళాతో నిమిత్తం లేకుండా ఆ ఇళ్లకు వెళ్లి వచ్చే చనువు అందరికీ ఉండేది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగడంవల్ల, పేరుతో పిలిచి పలకరించగల జర్నలిస్టు స్నేహితులు ఆయనకు రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల్లో ఉండటం సహజమే. 2004లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కాగానే, ఆయనతో ఉన్న సాన్నిహిత్యా న్ని ఉపయోగించుకుని, కేవీపీ గారి ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను. ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రజలకు ఆయన సందేశం ఇవ్వాలన్నది దాని సారాంశం. అప్ప టికే కొన్ని ప్రైవేటు టీవీ చానళ్లు రంగప్రవేశం చేసినందువల్ల, రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం ఇవ్వడం వైఎస్సార్‌కు కొద్దిగా ఇబ్బందే. అయితే, ఆయన నా మాటను మన్నించి నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు. అలాగే, హైదరాబాదు దూరదర్శన్‌లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టూడియోకి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్లకే నా విలేకరిత్వానికి తెరపడింది. అయినా ఆ తర్వాత కూడా వార్షిక విందు సమావేశాలకు నాకు ఆహ్వానం అందుతూనే ఉండేది. రిటైరైన తర్వాత చాలా రోజులకు జరిగిన నా రెండో కుమారుడి వివాహానికి ముఖ్యమంత్రిగా ఎన్నో పని ఒత్తిళ్లు ఉన్నా హాజరై ఆశీర్వదించి వెళ్లడం, నా పట్ల వారికున్న వాత్సల్యానికి మచ్చుతునకగా భావిస్తాను. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో ఎప్పుడైనా కాలక్షేపంగా కలుసుకున్న సందర్భాల్లో రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పటికీ ఆయన నాతో సరదా కబుర్లనే ఇష్టపడేవారు. రేడియో విలేకరిగా నాకున్న పరిమితులను ఆకళింపు చేసుకోవడమే కాకుండా ‘శ్రీనివాసరావును ఇబ్బంది పెట్టకండయ్యా’ అని తోటి జర్నలిస్టులకు సర్దిచెప్పేవారు. ఒక విలేకరికి, ఒక రాజకీయ నాయకుడికి నడుమ సహజంగా ఉండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్దచేసిన పెద్ద మనసు ఆయనది. వైఎస్ వర్ధంతి సందర్భంగా వారికి నా కైమోడ్పులు. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) -
ఈ కోతికి కాపీరైట్ లేదట!
పళ్లికిలిస్తూ.. ఇలా తనను తానే అందంగా ఫొటో తీసుకున్న ఈ మకాక్ కోతికి తాను తీసుకున్న ఈ సెల్ఫీపై కాపీరైట్ హక్కు లేదట! అమెరికాలోని కాపీరైట్ కార్యాలయం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ కోతి సెల్ఫీ వల్ల వికీపీడియా వెబ్సైట్, బ్రిటన్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ జే స్లాటర్ల మధ్య కాపీరైట్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం.. ఇండోనేసియాలోని సులావెసీ దీవిలో కోతుల గుంపును ఫొటోలు తీస్తుండగా ఈ కోతి డేవిడ్ కెమెరా లాక్కుపోయి వందలాది ఫొటోలు క్లిక్‌మనిపించింది. తర్వాత చూస్తే.. అందమైన ఈ సెల్ఫీతోపాటు మరికొన్ని ఫొటోలు వచ్చాయి. దీంతో ఈ కోతి వార్తల్లో సందడి చేసింది. దీనిని తొలి ‘మంకీ ఫొటోగ్రాఫర్’గా గుర్తిస్తూ వికీపీడియా తమ వెబ్సైట్లో పెట్టారు. ఈ ఫొటోపై తనకే హక్కులు ఉన్నాయని, ఈ ఫొటోను నా అనుమతి లేకుండా అందరికీ ఉచితంగా ఎలా అందుబాటులో ఉంచుతారంటూ డేవిడ్ మండిపడుతున్నాడు. ఈ వెబ్‌సైట్‌పై కేసువేస్తానని ప్రకటించాడు. కానీ.. ‘కెమెరా నీదే అయినా.. ఫొటో తీసింది కోతే కాబట్టి.. ఫొటోపై కాపీరైట్ కోతికే ఉంటుంద’ని వికీపీడియా వాదించింది. అమెరికా చట్టాల తాజా నిబంధనల ప్రకారం.. కోతి, ఏనుగు లేదా మరే ఇతర జంతువైనా సరే తీసిన ఫొటోలు, వేసిన పెయింటింగులపై వాటికి ఎలాంటి హక్కులూ ఉండవని అమెరికా కాపీరైట్ కార్యాలయం ధ్రువీకరించింది. -
నకిలీ పుస్తకాలు ముద్రిస్తున్న ముఠా గుట్టురట్టు
ఇద్దరి అరెస్టు: రూ.30 లక్షల విలువైన సొత్తు స్వాధీనం కీలక నిందితుల కోసం ముంబైకి ప్రత్యేక బృందం సాక్షి, సిటీబ్యూరో: కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి అంత ర్జాతీయ పుస్తకాలను ముద్రించి నగరం కేంద్రంగా దేశంలోని అన్ని పట్టణాలకు సరఫరా చేస్తున్న ఓ ముఠా గుట్టును నగర సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రూ.30 లక్షల విలువైన 6,500 పుస్తకాలతో పాటు ప్రింటింగ్ ప్రెస్‌ను సీజ్ చేశారు. సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం... యూసుఫ్‌గూడకు చెందిన పుస్తకాల వ్యాపారి సయ్యద్ జకీర్ అలీ (42) అంతర్జాతీయ స్థాయిలో ఆయా పబ్లిషర్స్ ముద్రించిన పుస్తకాలను ఒకటి మాత్రమే ఖరీదు చేసేవాడు. ఈ బుక్‌ను కాపీ చేసి నల్లకుంటలోని సంపత్‌రెడ్డి ప్రింటింగ్ ప్రెస్‌లో వేలాది నకిలీ బుక్స్ ముద్రిస్తున్నాడు. అలా ముద్రించిన బుక్స్‌ను ముంబై తరలిస్తున్నాడు. అక్కడి నుంచి దేశంలోని వివిధ పట్టణాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ విషయం పసిగట్టిన కొన్ని పబ్లిషర్స్ సీసీఎస్ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. విచారణ చేపట్టిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఆర్. సత్యనారాయణరాజు జకీర్‌ను అదుపులోకి తీసుకుని వి చారించగా అధిక మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించానని నిందితుడు అంగీకరించాడు. దీంతో జకీర్‌తో పాటు ప్రింటింగ్‌ప్రెస్ యజమాని సంపత్‌రెడ్డిని అరెస్టు చేశారు. వారి నుంచి 6.500 బుక్స్‌ను స్వాధీనం చేసుకోవడమే కాకుండా ప్రింటింగ్‌ప్రెస్‌ను సీజ్ చేశారు. ముంబైలోని గౌడాన్‌లో మరిన్ని బుక్స్ ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపించారు. ఈ కేసులో మరికొంత మంది కీలక వ్యక్తులను అరెస్టు చేసే అవకాశాలున్నాయి. విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఏసీపీ జి.సుప్రజ, ఇన్స్పెక్టర్ చక్రపాణి పాల్గొన్నారు.