కపటం లేని మందహాసానికి కాపీరైట్ | No one can occupy our Ys Raja shekar reddy's place | Sakshi
Sakshi News home page

కపటం లేని మందహాసానికి కాపీరైట్

Published Tue, Sep 2 2014 8:13 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

కపటం లేని మందహాసానికి కాపీరైట్ - Sakshi

కపటం లేని మందహాసానికి కాపీరైట్

బిగుసుకుపోయినట్టు ఉండటం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం వైఎస్సార్ స్వభావానికి విరుద్ధం. ఆ నవ్వులో స్వచ్ఛత, ఆ పిలుపులో ఆత్మీయత ఉట్టిపడేవి.

దేశవ్యాప్తంగా, మీడియాలో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ పదం వైఎస్సార్. ఆ పేరు వినబడుతూనే ఉంటుందిగానీ ఆ రూపం ఇక కనబడే అవకాశమే లేదు. ఒక వ్యక్తి గుణగణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖరరెడ్డిగారి విషయంలో నూటికి నూరుపాళ్లూ నిజమైంది. ‘రాజశేఖరా! నీపై మోజు తీరలేదురా!’ అని తెలుగు ప్రజానీకం రెండో పర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీనిండకుండానే, రాజశేఖరుడికి నూరేళ్లు నిండిపోవడం అత్యంత విషాదకరం. ‘రాజసాన ఏలరా!’ అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం.
 
అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి. మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్ - అరవై ఏళ్లకు రిటైరైపోతానన్న మాట నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది - ఆయన పథకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం. 1978 నుంచి ఆయన మరణించేవరకూ ఒక జర్నలిస్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. విలేకరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా ఉండేది. ఆ సమావేశాల్లో బిగుసుకుపోయినట్టు ఉండటం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికి విరుద్ధం.
 
ఆ నవ్వులో స్వచ్ఛత, ఆ పిలుపులో ఆత్మీయత ఉట్టిపడేవి. నమ్మినవాళ్లను నట్టేటముంచకపోవడం, నమ్ముకున్న వాళ్లకోసం ఎంతకైనా తెగించడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల మేలుకన్నా కీడే ఎక్కువ జరిగిన సందర్భాలున్నా లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణమే వైఎస్సార్‌కు రాష్ట్రవ్యాపితంగా అభిమానులను తయారుచేసి పెట్టింది. వివిధ ప్రాంతాల్లోని ప్రజానీకానికి దగ్గరచేసింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ తరఫున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది.
 
1975లో నేను రేడియో విలేకరిగా హైదరాబాద్‌లో అడుగుపెట్టిన మూడేళ్ల తర్వాత వైఎస్సార్ తొలిసారి శాసనసభకు ఎన్నిక కావడం, మంత్రి పదవి చేపట్టారు. వయసు మళ్లినవారే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువ  రక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలైంది. కొంచెం అటుఇటుగా రాష్ట్ర రాజకీయాల్లో అడుగిడిన వైఎస్సార్, చంద్రబాబు ప్రాణ స్నేహితులుగా మసలిన రోజులకు నేను కూడా సాక్షిని కావడం యాదృచ్ఛికం. మంత్రి పదవి తనను ముందు వరించినప్పటికీ-చంద్రబాబు సైతం మంత్రయ్యేంత వరకూ ఆయన పడ్డ ఆరాటం ఆనాటి జర్నలిస్టులందరికీ తెలుసు. ఆయనను నేను మొదటిసారి చూసింది, ఆ రోజుల్లో సెక్రటేరియట్‌కు కూతవేటు దూరంలో ఉన్న సరోవర్ హోటల్(ఇప్పటి మెడిసిటీ హాస్పిటల్) టైమీద. సచివాలయంలో జరిగిన సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భం అది. అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించేవారు. కానీ, కపటం లేని మందహాసానికి అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీరైట్.
 
ఇటు హైదరాబాద్‌లోనూ, అటు ఢిల్లీలోనూ వైఎస్సార్ నివాసాలు ఎప్పుడూ జర్నలిస్టులతో కళకళలాడుతుండేవి. వేళా పాళాతో నిమిత్తం లేకుండా ఆ ఇళ్లకు వెళ్లి వచ్చే చనువు అందరికీ ఉండేది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగడంవల్ల, పేరుతో పిలిచి పలకరించగల జర్నలిస్టు స్నేహితులు ఆయనకు రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల్లో ఉండటం సహజమే. 2004లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కాగానే, ఆయనతో ఉన్న సాన్నిహిత్యా న్ని ఉపయోగించుకుని, కేవీపీ గారి ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను. ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రజలకు ఆయన సందేశం ఇవ్వాలన్నది దాని సారాంశం. అప్ప టికే కొన్ని ప్రైవేటు టీవీ చానళ్లు రంగప్రవేశం చేసినందువల్ల, రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం ఇవ్వడం వైఎస్సార్‌కు కొద్దిగా ఇబ్బందే. అయితే, ఆయన నా మాటను మన్నించి నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు. అలాగే, హైదరాబాదు దూరదర్శన్‌లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టూడియోకి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్లకే నా విలేకరిత్వానికి తెరపడింది. అయినా ఆ తర్వాత కూడా వార్షిక విందు సమావేశాలకు నాకు ఆహ్వానం అందుతూనే ఉండేది. రిటైరైన తర్వాత చాలా రోజులకు జరిగిన నా రెండో కుమారుడి వివాహానికి ముఖ్యమంత్రిగా ఎన్నో పని ఒత్తిళ్లు ఉన్నా హాజరై ఆశీర్వదించి వెళ్లడం, నా పట్ల వారికున్న వాత్సల్యానికి మచ్చుతునకగా భావిస్తాను. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో ఎప్పుడైనా కాలక్షేపంగా కలుసుకున్న సందర్భాల్లో రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పటికీ ఆయన నాతో సరదా కబుర్లనే ఇష్టపడేవారు. రేడియో విలేకరిగా నాకున్న పరిమితులను ఆకళింపు చేసుకోవడమే కాకుండా ‘శ్రీనివాసరావును ఇబ్బంది పెట్టకండయ్యా’ అని తోటి జర్నలిస్టులకు సర్దిచెప్పేవారు. ఒక విలేకరికి, ఒక రాజకీయ నాయకుడికి నడుమ సహజంగా ఉండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్దచేసిన పెద్ద మనసు ఆయనది. వైఎస్ వర్ధంతి సందర్భంగా వారికి నా కైమోడ్పులు.

(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement