
సిటీ పోలీసులకు ‘ఈ-లీవ్’
అమలు చేస్తున్న ఉన్నతాధికారులు
సెలవు దరఖాస్తు, మంజూరు ఆన్‌లైన్‌లోనే
తిరస్కరిస్తే కారణం చెప్పాల్సిందే
సిటీబ్యూరో:ఫ్రెండ్లీ పోలీసింగ్ నినాదంతో పోలీసు సిబ్బంది పని తీరులో నిత్యం పాదర్శకతకు పెద్దపీట వేస్తున్న నగర కమిషనరేట్ అధికారులు... వారికి ఉన్న ‘హక్కుల్ని’ వినియోగించుకోవడంలోనూ ఇదే విధానం అవలంభిస్తున్నారు. ఇందులో భాగంగానే కమిషనరేట్ పరిధిలో ‘ఈ-లీవ్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని ప్రకారం సిబ్బంది సెలవు కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించారు. అధికారుల సైతం ఆన్‌లైన్‌లోనే దీని మంజూరు, తిరస్కరణ చేస్తారు. సెలవు ఇవ్వకుండా తిరస్కరించే పక్షంలో అందుకు గల కారణాన్నీ అధికారులు స్పష్టం చేయాల్సి ఉంటుంది. పోలీసు విభాగంలో కింది స్థాయి సిబ్బందికి పైకి కనిపించకుండా ఉండే ఇబ్బందులు కొన్ని ఉంటున్నాయి. వీటిలో సెలవు పొందడం కూడా ఒకటి. ఎంతటి అత్యవసరమైనా ఉన్నతాధికారి దయదలిస్తే మాత్రమే సెలవు లభించే పరిస్థితులు ఉండేవి. ఈ లీవ్స్ ఇవ్వడంలోనూ కొందరు అధికారులు సిబ్బందిని వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ‘ఈ-లీవ్’ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పోలీసులకూ సాధారణ సెలవుల నుంచి ఆర్జిత సెలవుల వరకు అన్ని అవకాశాలు ఉంటాయి. అయితే ఇది కీలకమై, అత్యవసర సేవలు అందించే విభాగం కావడంతో సిబ్బందికి ఎప్పుడంటే అప్పుడు సెలవు దొరికే పరిస్థితి ఉండదు. నగరంలోని పరిస్థితులు, బందోబస్తు నిర్వహించాల్సిన సందర్భాలు తదితరాలను పరిగణలోకి తీసుకుని సెలవు పొందాల్సి ఉంటుంది.
సవాలక్ష అనుమతులు తప్పనిసరి...
గతంలో పోలీసు విభాగంలో సిబ్బంది, అధికారులు సెలవు పొందాంటే దానికి సవాలక్ష అనుమతులు ఉండేవి. ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారికి సెలవు కావాల్సి వస్తే... ఆయన లిఖిత పూర్వకంగా సంబంధిత జోనల్ డీసీపీకి దరఖాస్తు చేసుకునేవారు. దీన్ని పరిశీలించే డీసీపీ... సదరు ఇన్‌స్పెక్టర్ పని చేసే ఠాణా ఏ డివిజన్‌లోకి వస్తే ఆ ఏసీపీ అభిప్రాయం తీసుకునేవారు. అలాగే.. కానిస్టేబుల్‌కు సెలవు కావాలంటే ఇన్‌స్పెక్టర్‌కు, ఎస్సైకి సెలవు కావాలంటే ఏసీపీకి దరఖాస్తు చేసుకునేవారు. అక్కడా ఇలాంటి ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాతే నిర్ణయం ఉండేది. కొన్ని సందర్భాల్లో ఇందులో తీవ్రజాప్యం జరిగేది. దీంతో సెలవు కావాల్సిన సిబ్బందికి ఆ సమయం మించిపోవడమో, అత్యవసరమై అనుమతి లభించకుండానే సెలవుపై వెళ్లడంపై శాఖాపరమైన చర్యలకు గురికావడమో జరిగేది. దీన్ని కొందరు అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుని కింది స్థాయి సిబ్బందిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడేవారు. ఇలాంటి అంశాలను ఆస్కారం లేకుండా చేయడానికే కమిషనరేట్ అధికారులు ఐటీ సెల్ నేతృత్వంలో ప్రత్యేక సిస్టం ఏర్పాటు చేశారు.
నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకోవాల్సిందే...
సాధారణ సమయాల్లో సిబ్బంది సెలవు కోరుతూ దరఖాస్తు కోసం అధికారిక, అంతర్గతమైన జిడఛ్ఛీట్చ ఛ్చఛీఞౌజీఛ్ఛి.ఛిజజ. జౌఠి. జీ వెబ్‌సైట్‌లో ‘పోలీస్ వర్క్ ఫోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టం’ ఏర్పాటు చేశారు. ఈ విధానంలో సెలవు కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఆ సమాచారం తక్షణం సంక్షిప్త సందేశం రూపంలో దాన్ని మంజూరు చేయాల్సిన, పర్యవేక్షించాల్సిన అధికారులకు చేరుతుంది. ఈ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవడానికీ కాలపరిమితి విధించారు. ఈ లోపు సెలవు విషయం తేల్చడంతో పాటు తిరస్కరిస్తే.. అందుకు గల కారణాన్నీ ఆన్‌లైన్‌లోనే వివరించాల్సి ఉంటుంది. ఓ దరఖాస్తుపై సంబంధిత అధికారి నిర్ణయం తీసుకునే వరకు సంక్షిప్త సందేశాల (ఎస్సెమ్మెస్) రూపంలో ఆయనకు రిమైండర్స్ వస్తూనే ఉంటాయి. సెలవు మంజూరైతే తక్షణం ఆ విషయం దరఖాస్తు చేసుకున్న సిబ్బందికీ సంక్షిప్త సందేశం రూపంలో తెలుస్తుంది. ఓ అధికారి సెలవు తిరస్కరిస్తే ఆయన పై అధికారికి దరఖాస్తు చేసుకునే సౌలభ్యం కల్పించారు. లీవు పూర్తయ్యే ముందు రోజు సెలవు తీసుకున్న సిబ్బందికీ సంక్షిప్త సందేశం రూపంలో సమాచారం వస్తుంది. పాదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ ఉన్నతాధికారులు ప్రవేశపెట్టిన ‘ఈ-లీవ్’ విధానంపై సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.