
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం
- వెస్ట్‌జోన్ కొత్త డీసీపీ వెంకటేశ్వరరావు
అబిడ్స్: నగరంలోని వెస్ట్ జోన్ డీసీపీగా ఎ.వెంకటేశ్వరరావు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏడాది కాలంగా వెస్ట్‌జోన్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న వి.సత్యనారాయణ సౌత్‌జోన్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో వరంగల్ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న వెంకటేశ్వరరావును ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఈయన గతంలో వరంగల్ సీఐడీ ఎస్పీగా, రెండేళ్లు వరంగల్ ఎస్పీ, మెదక్, మంచిర్యాల్ డీఎస్పీ, కాచిగూడ ఏసీపీ, నల్లగొండ జిల్లా ఓఎస్డీ, హైదరాబాద్ జిల్లా విజిలెన్స్ ఎస్పీ, హైదరాబాద్ రూరల్ విజిలెన్స్ ఎస్పీగా పనిచేశారు.
ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వడంతో పాటు వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు. బాధితులకు వారి కేసుల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామన్నారు.
అన్ని ఠాణాల పరిసరాల్లో పచ్చదనం- పరిశుభ్రత పాటించేలా కృషి చేస్తానన్నారు. అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. తమ జోన్ పరిధిలోని రౌడీషీటర్లందరికీ ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరికలు జారీ చేస్తామన్నారు. వారి కదలికల్లో మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పేరుమోసిన రౌడీషీటర్లపై పీడీ యాక్టు ప్రయోగిస్తామన్నారు.
మహిళలకు రక్షణగా...
ఇటీవల నగరంలో ప్రవేశపెట్టిన ‘షీ’ టీంకు తమ పోలీస్ స్టేషన్ల సిబ్బంది కూడా వెంట ఉండి మహిళలకు రక్షణగా పనిచేస్తారని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. బస్టాప్‌లు, కళాశాల పరిసరాలలో మఫ్టీలో ఉన్న షిటీంలు ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారితో కఠినంగా వ్యవహరిస్తారన్నారు.
సీసీ కెమెరాల ద్వారా నిఘా...
జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధుల్లో సీసీ కెమెరాల ద్వారా నిఘా ముమ్మరం చేస్తామన్నారు. ఇప్పటికే పలు చౌరస్తాలు, కీలక ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీలు, బస్తీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా దొంగలు, స్నాచర్లు, ఇతర వివరాలను ఆ కెమెరాల్లో బంధించడం ద్వారా ప్రజారక్షణ సులభమవుతుందన్నారు. వ్యాపారస్తులు, వాణిజ్య సంస్థలు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ వెంకటేశ్వరరావు సూచించారు.