రమేశ్‌ను హత్య చేసిన అనంతరం అల్లుడూ.. నీతానికి పంపించేసినా అంటూ అరుస్తున్న లక్ష్మణ్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: గత బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలు... ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ ప్రాంతం... ఇష్టంలేని పెళ్లి చేసుకున్న కుమార్తె మాధవి, అల్లుడు సందీప్‌ను విచక్షణా రహితంగా కొబ్బరిబొండాల కత్తితో నరికిన మనోహరాచారి.
ఈ బుధవారం ఉదయం 11.30 గంటలు... అత్తాపూర్ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నం.140... తన కుమారుడిని చంపిన రమేశ్‌ను వెంటాడి గొడ్డలి, కత్తితో నరికి చంపిన కిషన్‌గౌడ్, సహకరించిన లక్ష్మణ్‌గౌడ్.
ఈ రెండు ఉదంతాలు వారం వ్యవధిలో పట్టపగలు నడిరోడ్డుపై చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు ఫ్రెండ్లీ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్‌పై నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నాయి. ఘటన జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల వారు చేష్టలుడిగి చూడటమే గాక సెల్‌ఫోన్లలో చిత్రీకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రమేశ్ హత్య జరిగిన ప్రాంతంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్, ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు ఉన్నా ఆపలేకపోయారు. ప్లాస్టిక్ లాఠీలతో ఉన్న క్రైమ్ కానిస్టేబుళ్లు, కనీసం అదీ లేని ట్రాఫిక్ కానిస్టేబుల్ మారణాయుధాలతో ఉన్న హంతకుల వద్దకు వెళ్లడానికి ధైర్యం చేయలేకపోయారు. అంతా అయిన తర్వాత క్రైమ్ కానిస్టేబుళ్లు నిందితుల్ని వాహనంలో ఎక్కించుకుని ఠాణాకు తీసుకు వెళ్లగలిగారు.
వెంటే వెళుతూ చిత్రీకరించారు...
రమేశ్ హత్య జరిగిన హైదర్‌గూడ ప్రాంతం నిత్యం రద్దీ గా ఉంటుంది. రమేశ్‌ను పిల్లర్ నం.134 వద్ద అడ్డగించిన నిందితులు దాడి చేయడం ప్రారంభించారు. కిషన్ గొడ్డలితో, లక్ష్మణ్ కత్తితో విచక్షణారహితంగా నరకడం, పొడవటం ప్రారంభించారు. ప్రాణభయంతో రమేశ్ పరుగు తీస్తున్నా ఎవరూ ముందుకు రాకపోగా ఇదంతా సెల్‌ఫోన్‌తో చిత్రీకరిస్తూ ఉండిపోయారు. ఈ వీడియో లు బుధవారం వైరల్‌గా మారాయి. ఓ షోరూమ్ మేనేజర్ హంతకులను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. నడిరోడ్డుపై జరుగుతున్నా అడ్డుకునే వారు లేకపోవడంతో కిషన్, లక్ష్మణ్‌లు విచక్షణారహితంగా రమేశ్ ను నరికి చంపేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి లక్ష్మణ్‌ను ఎగిరి తన్నినా ఫలితం దక్కలేదు. మాధవి ఉదంతంలోనూ ఓ వ్యక్తి మనోహరాచారిని వెనుక నుంచి తన్నిన విషయం తెలిసిందే.
ఆయుధం లేక చేష్టలుడిగిన పోలీసులు...
హత్య జరుగుతున్నప్పుడు హైదర్‌గూడలో ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగమూర్తి విధుల్లో ఉన్నారు. ఆయన ఓ దశ లో హంతకుల్ని అడ్డుకోవడానికి తన చేతిలో ఉన్న హెల్మెట్ విసిరారు. విజిల్ తప్ప ఏ ఆయుధంలేని ట్రాఫిక్ కానిస్టేబుల్ అంతకుమించి ధైర్యం చేయలేకపోయారు. హత్య పూర్తయిన తర్వాత.. హంతకులు అక్కడే ఉండి అరుస్తున్న సమయంలో ఓ దొంగను పట్టుకోవడానికి పెట్రోలింగ్ వాహనంలో ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు అటుగా వచ్చారు. వారి వద్దా ప్లాస్టిక్ లాఠీలే ఉండటం... హంతకుల వద్ద మారణాయుధాలు ఉండటంతో పట్టుకునేందుకు ధైర్యం చేయలేదు. గతంలో పెట్రోలింగ్ వాహనంలో ఒకటైనా తుపాకీ ఉండేది. ఫ్రెండ్లీ పోలీ సింగ్ పుణ్యమాని ఆయుధాలన్నీ బెల్ ఆఫ్ ఆరమ్స్‌గా పిలిచే ఆయుధాగారాలకే పరిమితమయ్యాయి. ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులూ వాటిని పట్టుకుని తిరగకూడదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ హత్యనే కాదు.. ఎవరైనా తమను హత్య చేయడానికి వచ్చినా పారిపోవడం మినహా ఎదిరించలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు.
ఎవరైనా స్పందించినా ఇబ్బందులే...
ఈ ఉదంతం ఇలాఉంటే.. ఎవరైనా కింది స్థాయి పోలీసు సిబ్బంది చాకచక్యంగా స్పందించి, తమకు తోచిన సాయం చేసినా అధికారుల నుంచి మద్దతు లభించట్లేదు. కొన్ని రోజుల క్రితం ఫలక్‌నుమా పరిధిలో జరిగిన వ్యవహారమే దీనికి ఉదాహరణ. అక్కడి ప్రధాన రహదారి పక్కన ఓ వ్యక్తి మరో వ్యక్తిని బండరాయితో మోది చంపడానికి యత్నించాడు. అక్కడే 200 మంది ఉన్నా ఆపలేదు. పెట్రోలింగ్ వాహనం కానిస్టేబుల్ ధైర్యంతో బండరాయి ఎత్తిన వ్యక్తిని అడ్డుకుని, బాధితుడి ప్రాణం కాపాడాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ చేతిలోని ట్యాబ్ కిందపడి డిస్‌ప్లే పోయింది. విషయాన్ని తన అధికారికి చెప్తే... అభినందించాల్సిందిపోయి దూషించారని తెలిసింది. దీంతో సదరు కానిస్టేబుల్ తన సొంత డబ్బుతో ట్యాబ్ బాగు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ సందేశం కొందరు కానిస్టేబుళ్లకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేయడంతో తొందరెందుకు అనే దోరణిలో కొందరు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment