Traffic constables
-
నడిరోడ్డుపై నరికేస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: గత బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలు... ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ ప్రాంతం... ఇష్టంలేని పెళ్లి చేసుకున్న కుమార్తె మాధవి, అల్లుడు సందీప్‌ను విచక్షణా రహితంగా కొబ్బరిబొండాల కత్తితో నరికిన మనోహరాచారి. ఈ బుధవారం ఉదయం 11.30 గంటలు... అత్తాపూర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నం.140... తన కుమారుడిని చంపిన రమేశ్‌ను వెంటాడి గొడ్డలి, కత్తితో నరికి చంపిన కిషన్‌గౌడ్, సహకరించిన లక్ష్మణ్‌గౌడ్. ఈ రెండు ఉదంతాలు వారం వ్యవధిలో పట్టపగలు నడిరోడ్డుపై చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు ఫ్రెండ్లీ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్‌పై నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నాయి. ఘటన జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల వారు చేష్టలుడిగి చూడటమే గాక సెల్ఫోన్లలో చిత్రీకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రమేశ్ హత్య జరిగిన ప్రాంతంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్, ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు ఉన్నా ఆపలేకపోయారు. ప్లాస్టిక్ లాఠీలతో ఉన్న క్రైమ్ కానిస్టేబుళ్లు, కనీసం అదీ లేని ట్రాఫిక్ కానిస్టేబుల్ మారణాయుధాలతో ఉన్న హంతకుల వద్దకు వెళ్లడానికి ధైర్యం చేయలేకపోయారు. అంతా అయిన తర్వాత క్రైమ్ కానిస్టేబుళ్లు నిందితుల్ని వాహనంలో ఎక్కించుకుని ఠాణాకు తీసుకు వెళ్లగలిగారు. వెంటే వెళుతూ చిత్రీకరించారు... రమేశ్ హత్య జరిగిన హైదర్‌గూడ ప్రాంతం నిత్యం రద్దీ గా ఉంటుంది. రమేశ్‌ను పిల్లర్ నం.134 వద్ద అడ్డగించిన నిందితులు దాడి చేయడం ప్రారంభించారు. కిషన్ గొడ్డలితో, లక్ష్మణ్ కత్తితో విచక్షణారహితంగా నరకడం, పొడవటం ప్రారంభించారు. ప్రాణభయంతో రమేశ్ పరుగు తీస్తున్నా ఎవరూ ముందుకు రాకపోగా ఇదంతా సెల్‌ఫోన్‌తో చిత్రీకరిస్తూ ఉండిపోయారు. ఈ వీడియో లు బుధవారం వైరల్‌గా మారాయి. ఓ షోరూమ్ మేనేజర్ హంతకులను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. నడిరోడ్డుపై జరుగుతున్నా అడ్డుకునే వారు లేకపోవడంతో కిషన్, లక్ష్మణ్‌లు విచక్షణారహితంగా రమేశ్ ను నరికి చంపేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి లక్ష్మణ్‌ను ఎగిరి తన్నినా ఫలితం దక్కలేదు. మాధవి ఉదంతంలోనూ ఓ వ్యక్తి మనోహరాచారిని వెనుక నుంచి తన్నిన విషయం తెలిసిందే. ఆయుధం లేక చేష్టలుడిగిన పోలీసులు... హత్య జరుగుతున్నప్పుడు హైదర్‌గూడలో ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగమూర్తి విధుల్లో ఉన్నారు. ఆయన ఓ దశ లో హంతకుల్ని అడ్డుకోవడానికి తన చేతిలో ఉన్న హెల్మెట్ విసిరారు. విజిల్ తప్ప ఏ ఆయుధంలేని ట్రాఫిక్ కానిస్టేబుల్ అంతకుమించి ధైర్యం చేయలేకపోయారు. హత్య పూర్తయిన తర్వాత.. హంతకులు అక్కడే ఉండి అరుస్తున్న సమయంలో ఓ దొంగను పట్టుకోవడానికి పెట్రోలింగ్ వాహనంలో ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు అటుగా వచ్చారు. వారి వద్దా ప్లాస్టిక్ లాఠీలే ఉండటం... హంతకుల వద్ద మారణాయుధాలు ఉండటంతో పట్టుకునేందుకు ధైర్యం చేయలేదు. గతంలో పెట్రోలింగ్ వాహనంలో ఒకటైనా తుపాకీ ఉండేది. ఫ్రెండ్లీ పోలీ సింగ్ పుణ్యమాని ఆయుధాలన్నీ బెల్ ఆఫ్ ఆరమ్స్గా పిలిచే ఆయుధాగారాలకే పరిమితమయ్యాయి. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులూ వాటిని పట్టుకుని తిరగకూడదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ హత్యనే కాదు.. ఎవరైనా తమను హత్య చేయడానికి వచ్చినా పారిపోవడం మినహా ఎదిరించలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఎవరైనా స్పందించినా ఇబ్బందులే... ఈ ఉదంతం ఇలాఉంటే.. ఎవరైనా కింది స్థాయి పోలీసు సిబ్బంది చాకచక్యంగా స్పందించి, తమకు తోచిన సాయం చేసినా అధికారుల నుంచి మద్దతు లభించట్లేదు. కొన్ని రోజుల క్రితం ఫలక్‌నుమా పరిధిలో జరిగిన వ్యవహారమే దీనికి ఉదాహరణ. అక్కడి ప్రధాన రహదారి పక్కన ఓ వ్యక్తి మరో వ్యక్తిని బండరాయితో మోది చంపడానికి యత్నించాడు. అక్కడే 200 మంది ఉన్నా ఆపలేదు. పెట్రోలింగ్ వాహనం కానిస్టేబుల్ ధైర్యంతో బండరాయి ఎత్తిన వ్యక్తిని అడ్డుకుని, బాధితుడి ప్రాణం కాపాడాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ చేతిలోని ట్యాబ్ కిందపడి డిస్ప్లే పోయింది. విషయాన్ని తన అధికారికి చెప్తే... అభినందించాల్సిందిపోయి దూషించారని తెలిసింది. దీంతో సదరు కానిస్టేబుల్ తన సొంత డబ్బుతో ట్యాబ్ బాగు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ సందేశం కొందరు కానిస్టేబుళ్లకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడంతో తొందరెందుకు అనే దోరణిలో కొందరు ఉన్నారు. -
వెయిట్ అండ్ ‘సీ..సీ’!
♦ ట్రాఫిక్ ఉల్లంఘనులపై ‘టెక్నాలజీ’ కొరడా ♦ జంక్షన్ల వద్ద జాగ్రత్త పడుతున్న వాహన చోదకులు సాక్షి, సిటీబ్యూరో : ట్రాఫిక్ జంక్షన్ల వద్ద రెడ్‌లైట్ ఉన్నా రయ్యుమని దూసుకెళ్లే వాహన చోదకులు...ఇప్పుడు అలా వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు లేరు కదా...ఎమర్జెన్సీ పని ఉందని రెడ్‌సిగ్నల్ క్రాస్ చేయాలనుకునే వాహనచోదకులను ‘సీసీటీవీ’ కెమెరాలు హడలెత్తిస్తున్నాయి. ఇదే కాదు ఆటోమేటిక్ రెడ్‌లైట్ కెమెరా, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఆపరేట్ చేసే స్పీడ్ లేజర్ గన్లు, డిజిటల్ కెమెరా, ట్యాబ్‌లు కూడా ట్రాఫిక్ ఉల్లంఘనుల విషయంలో తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఫలితంగా ఈ చలాన్లు ఇంటికి వచ్చి చేరుతున్నాయి. 15 రోజుల్లో కట్టకపోతే లీగల్ నోటీసులు వస్తున్నాయి. అయినా స్పందించకుంటే చార్జిషీట్ దాఖలు చేస్తున్నారు. ఏకంగా జైలుకే వెళ్లే సందర్భాలు వస్తున్నాయి. ఫలితంగా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించేవారి సంఖ్య తగ్గింది. రెడ్‌సిగ్నల్ ఉండగానే జంక్షన్ దాటిన వారి సంఖ్య జవనరిలో 10,129 ఉంటే జూలైకి ఆ సంఖ్య 2,338కి తగ్గింది. జనవరిలో 6,416 మంది అతి వేగంతో దూసుకెళుతూ లేజర్ గన్ కెమెరాకు చిక్కగా.. జూలైలో 6,023 మందికి ఈ చలాన్లు జారీ చేశారు. అంటే పరిస్థితిలో కొంత మార్పు వచ్చినట్టు కనబడుతోంది. కాగా, తొలినాళ్లలో దాదాపు 40 శాతం వరకు ఈ-చలాన్లు చెల్లించే నగరవాసుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 75 శాతానికి చేరుకోవడం విశేషం. స్పీడ్ పెరిగితే ఫైనే.. మెహదీపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే అవుటర్ రింగ్ రోడ్డులో ఒక్కో దగ్గర ఒక్కో వేగంతో వాహనం నడపాలనే సూచన బోర్డులు కనిపిస్తాయి. 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన ప్రాంతంలో 60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళితే ఈ స్పీడ్ లేజర్ గన్లు ఇట్టే పసిగడతాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 42,951 మందికి ఈ చలాన్లు జారీ అయ్యాయి. త్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్...ఇలా తదితర నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తున్నారనే దృశ్యాలను సర్వ్లెన్స్ కెమెరా మానిటరింగ్ సెల్(ఎస్సీఎంసీ) పర్యవేక్షిస్తుంది. సీసీ కెమెరాలు, కానిస్టేబుళ్ల కెమెరాకు చిక్కకున్నా ఈ సెల్ పసిగడుతుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 1,62,498 మందికి ఎస్సీఎంసీ ద్వారా ఈ చలాన్లు జారీ అయ్యాయి. జంపింగ్ ఈ ప్రాంతాల్లోనే... మాసబ్‌ట్యాంక్ చిల్డ్రన్ పార్కు జంక్షన్, ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జంక్షన్, మదీనా, తెలుగు తల్లి ఫ్లైఓవర్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, శ్రీనగర్ టీ జంక్షన్లలో ఎక్కువగా రెడ్‌లైట్ జంపింగ్ కేసులు చోటుచేసుకుంటున్నాయి. మెహదీపట్నంలోని సరోజినిదేవీ కంటి ఆస్పత్రి వద్ద రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. జంక్షన్లతో పాటు రోడ్డుపై నో పార్కింగ్ జోన్లో నిలిపిన వాహనాలను కానిస్టేబుళ్లు కెమెరాలో బంధించి...ఆ ఫొటోలను ఆయా పోలీసు స్టేషన్ల నుంచి అప్లోడ్ చేసి ఈ చలాన్‌కు పంపుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 11,06,093 మందికి ఈ చలాన్లు జారీ అయ్యాయి. జనవరిలో 13,940 మందికి జరిమానా వేస్తే...జూలైలో ఆ సంఖ్య 26,032కి ఎగబాకింది. వీటిలో ఎక్కువగా రాంగ్‌సైడ్ డ్రైవింగ్, నో పార్కింగ్ జోన్లో ఉన్న వాహన కేసులే ఉన్నాయి. ఒకప్పుడు 80 శాతం వరకు ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తే, 20 శాతం టెక్నాలజీని ఉపయోగించుకునేవారు. ఇప్పుడు 80 శాతం టెక్నాలజీతోనే పనులన్నీ చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు.