వెయిట్ అండ్ ‘సీ..సీ’! | Wait and cc | Sakshi
Sakshi News home page

వెయిట్ అండ్ ‘సీ..సీ’!

Published Sun, Aug 9 2015 4:13 AM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

వెయిట్ అండ్ ‘సీ..సీ’!

వెయిట్ అండ్ ‘సీ..సీ’!

♦ ట్రాఫిక్ ఉల్లంఘనులపై ‘టెక్నాలజీ’ కొరడా
♦ జంక్షన్ల వద్ద జాగ్రత్త పడుతున్న వాహన చోదకులు
 
 సాక్షి, సిటీబ్యూరో : ట్రాఫిక్ జంక్షన్ల వద్ద రెడ్‌లైట్ ఉన్నా రయ్యుమని దూసుకెళ్లే వాహన చోదకులు...ఇప్పుడు అలా వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు లేరు కదా...ఎమర్జెన్సీ పని ఉందని  రెడ్‌సిగ్నల్ క్రాస్ చేయాలనుకునే వాహనచోదకులను ‘సీసీటీవీ’ కెమెరాలు హడలెత్తిస్తున్నాయి. ఇదే కాదు ఆటోమేటిక్ రెడ్‌లైట్ కెమెరా, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఆపరేట్ చేసే స్పీడ్ లేజర్ గన్‌లు, డిజిటల్ కెమెరా, ట్యాబ్‌లు కూడా ట్రాఫిక్ ఉల్లంఘనుల విషయంలో తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఫలితంగా ఈ చలాన్‌లు ఇంటికి వచ్చి చేరుతున్నాయి. 15 రోజుల్లో కట్టకపోతే లీగల్ నోటీసులు వస్తున్నాయి.

అయినా స్పందించకుంటే చార్జిషీట్ దాఖలు చేస్తున్నారు. ఏకంగా జైలుకే వెళ్లే సందర్భాలు వస్తున్నాయి. ఫలితంగా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించేవారి సంఖ్య తగ్గింది. రెడ్‌సిగ్నల్ ఉండగానే జంక్షన్ దాటిన వారి సంఖ్య జవనరిలో 10,129 ఉంటే జూలైకి ఆ సంఖ్య 2,338కి తగ్గింది. జనవరిలో 6,416 మంది అతి వేగంతో దూసుకెళుతూ లేజర్ గన్ కెమెరాకు చిక్కగా.. జూలైలో 6,023 మందికి ఈ చలాన్‌లు జారీ చేశారు. అంటే పరిస్థితిలో కొంత మార్పు వచ్చినట్టు కనబడుతోంది. కాగా, తొలినాళ్లలో దాదాపు 40 శాతం వరకు ఈ-చలాన్‌లు చెల్లించే నగరవాసుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 75 శాతానికి చేరుకోవడం విశేషం.

 స్పీడ్ పెరిగితే ఫైనే..
 మెహదీపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే అవుటర్ రింగ్ రోడ్డులో ఒక్కో దగ్గర ఒక్కో వేగంతో వాహనం నడపాలనే సూచన బోర్డులు కనిపిస్తాయి.  40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన ప్రాంతంలో 60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళితే ఈ స్పీడ్ లేజర్ గన్‌లు ఇట్టే పసిగడతాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 42,951 మందికి ఈ చలాన్‌లు జారీ అయ్యాయి. త్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్...ఇలా తదితర నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తున్నారనే దృశ్యాలను సర్వ్‌లెన్స్ కెమెరా మానిటరింగ్ సెల్(ఎస్‌సీఎంసీ) పర్యవేక్షిస్తుంది. సీసీ కెమెరాలు, కానిస్టేబుళ్ల కెమెరాకు చిక్కకున్నా ఈ సెల్ పసిగడుతుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 1,62,498 మందికి ఎస్‌సీఎంసీ ద్వారా ఈ చలాన్‌లు జారీ అయ్యాయి.

 జంపింగ్ ఈ ప్రాంతాల్లోనే...
 మాసబ్‌ట్యాంక్ చిల్డ్రన్ పార్కు జంక్షన్, ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జంక్షన్, మదీనా, తెలుగు తల్లి ఫ్లైఓవర్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, శ్రీనగర్ టీ జంక్షన్‌లలో ఎక్కువగా రెడ్‌లైట్ జంపింగ్ కేసులు చోటుచేసుకుంటున్నాయి. మెహదీపట్నంలోని సరోజినిదేవీ కంటి ఆస్పత్రి వద్ద రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. జంక్షన్‌లతో పాటు రోడ్డుపై నో పార్కింగ్ జోన్‌లో నిలిపిన వాహనాలను కానిస్టేబుళ్లు కెమెరాలో బంధించి...ఆ ఫొటోలను ఆయా పోలీసు స్టేషన్‌ల నుంచి అప్‌లోడ్ చేసి ఈ చలాన్‌కు పంపుతున్నారు.

ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 11,06,093 మందికి ఈ చలాన్‌లు జారీ అయ్యాయి. జనవరిలో 13,940 మందికి జరిమానా వేస్తే...జూలైలో ఆ సంఖ్య 26,032కి ఎగబాకింది. వీటిలో ఎక్కువగా రాంగ్‌సైడ్ డ్రైవింగ్, నో పార్కింగ్ జోన్‌లో ఉన్న వాహన కేసులే ఉన్నాయి. ఒకప్పుడు 80 శాతం వరకు ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తే, 20 శాతం టెక్నాలజీని ఉపయోగించుకునేవారు. ఇప్పుడు 80 శాతం టెక్నాలజీతోనే పనులన్నీ చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement