రూ.1,61,500 జరిమానా
బెంగళూరు: అరవీర భయంకరంగా బ్యాటింగ్ చేసే బ్యాటర్ క్రికెట్ మైదానంలో 300 పరుగులు చేస్తే అద్భుతం అంటాం. అయితే ఒక గేర్‌లెస్ స్కూటర్ యజమాని క్రికెట్ గ్రౌండ్‌లో కాకుండా నడిరోడ్డుపై ట్రిపుల్ సెంచరీచేశాడు. అయితే అది పరుగుల రూపంలో కాకుండా ట్రాఫిక్ చలాన్ల రూపంలో. ఒకే స్కూటర్‌పై ఏకంగా 311 ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు ఉండటం చూసి కర్ణాటకలోని వాహన వినియోగదారులు ఔరా అని అచ్చెరువొందారు. ఈ ఘటనకు బెంగళూరు మహానగరం వేదికైంది. సోమవారం బెంగళూరు సిటీ మార్కెట్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఈ స్కూటర్ యజమాని ఈ 311 చలాన్లకు జరిమానా కింద రూ.1,61,500 కట్టేసి జప్తులో ఉన్న వాహనాన్ని తీసుకెళ్లడంతో ఈ కథ సుఖాంతంగా ముగిసింది.
ఇన్ని చలాన్లు ఎలా ?
కలాసిపాళ్య ప్రాంతానికి చెందిన పెరియస్వామికి ఒక గేర్‌లెస్ స్కూటర్ ఉంది. ఇతను ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారం చేస్తాడు. ఇతనికి సమీప బంధువు సుదీప్ వ్యాపార భాగస్వామిగా ఉన్నాడు. సుదీప్‌కు తరచూ స్కూటర్‌పై వెళ్తూనే ఫోన్ మాట్లాడే అలవాటు ఉంది. హెల్మెట్ అస్సలు ధరించడు. ట్రావెల్ ఏజెన్సీ వ్యవహారాలన్నీ బండితోపాటే ఫోన్‌లోనే నడిపిస్తాడు.
అత్యధికంగా ఇతను నడిపేటప్పుడు ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు నమోదయ్యాయి. రెడ్ సిగ్నల్ దాటి వెళ్లడం, రాంగ్ రూట్, హెల్మెట్ ధరించకపోవడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ ఇలా పలు రకాల చలాన్లు అలా పడుతూనే ఉన్నాయి. సుదీప్‌గానీ, స్కూటర్ యజమాని పెరియస్వామిగానీ ఏనాడూ ఈ చలాన్లు కట్టలేదు. దీంతో చలాన్లు చాంతాడంత పెరిగిపోయాయి. పెరియస్వామి, సుదీప్, మరో వ్యక్తి ఈ స్కూటర్‌ను వాడినట్లు తెలుస్తోంది.
ఓ వ్యక్తి ఫిర్యాదుతో
శిభమ్ అనే వ్యక్తి సరదాగా చలాన్లను ఆన్‌లైన్‌లో చెక్ చేస్తున్న సమయంలో ఈ స్కూటర్ నంబర్‌ప్లేట్ మీద వేల రూపాయల చలాన్లు నమోదైన విషయం గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో శిభమ్ ఇటీవల ఒక భారీ పోస్ట్ పెట్టారు. ‘‘ఈ స్కూటర్‌పై నమోదైన చలాన్ల సంఖ్యను గత ఏడాది కాలంగా గమనిస్తూ ఉన్నా. ఎప్పటికప్పుడు కొత్త చలాన్లు వస్తూనే ఉన్నాయి. కట్టాల్సిన జరిమానా పెరుగుతూనే ఉంది. ఇప్పుడది రూ.1లక్ష నుంచి రూ.1,60,000 దాటింది.
ఇప్పటికైనా పోలీసులు మేలుకొని దానిని సీజ్ చేస్తారా? లేదంటే కొత్త రికార్డ్ సృష్టించేదాకా అలాగే రోడ్లపై తిరగనిస్తారా?’’అంటూ అతను చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. విషయం చివరకు పోలీసులకు తెలియడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఓనర్‌ను పిలిపించి స్కూటర్‌ను స్వాదీనం చేసుకున్నారు. అప్పటికిగానీ ఓనర్‌కు ఈ విషయం తెలియలేదు. పోలీస్‌స్టేషన్‌కు బంధువు సుదీప్‌ను రప్పించి వాళ్ల ముందే చీవాట్లు పెట్టినట్లు వార్తలొచ్చాయి. 311 చలాన్లను ఒకేసారి ప్రింట్ తీస్తే 20 అడుగుల పొడువు పేపర్ బయటికొచి్చంది.
ఎట్టకేలకు హెల్మెట్
వందల చలాన్ల గేర్‌లెస్ స్కూటర్ అంశం నగరంలో హాట్‌టాపిక్‌గా మారడంతో పోలీసులు వెంటనే యజమానితో జరిమానా మొత్తాన్ని కట్టేలా ఒప్పించినట్లు వార్తలొచ్చాయి. సోమవారం సుదీప్ ఈ మొత్తాన్ని కట్టేసి వాహనాన్ని వెంటతీసుకెళ్లారు. ఈ సందర్భంగా సుదీప్ ఒక కొత్త హెల్మెట్‌ను ధరించారు. ‘‘ఇకనైనా చలాన్ల సెంచరీలు కొట్టడం ఆపండి’’అని పోలీసులు అతనికి హితబోధ చేసి పంపించారు. జరిమానా కట్టించుకుని ఊరకే వదిలేయకుండా ఇలాంటి వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కొందరు నెటిజన్లు డిమాండ్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment