Ramesh murder
-
నడిరోడ్డుపై నరికేస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: గత బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలు... ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ ప్రాంతం... ఇష్టంలేని పెళ్లి చేసుకున్న కుమార్తె మాధవి, అల్లుడు సందీప్‌ను విచక్షణా రహితంగా కొబ్బరిబొండాల కత్తితో నరికిన మనోహరాచారి. ఈ బుధవారం ఉదయం 11.30 గంటలు... అత్తాపూర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నం.140... తన కుమారుడిని చంపిన రమేశ్‌ను వెంటాడి గొడ్డలి, కత్తితో నరికి చంపిన కిషన్‌గౌడ్, సహకరించిన లక్ష్మణ్‌గౌడ్. ఈ రెండు ఉదంతాలు వారం వ్యవధిలో పట్టపగలు నడిరోడ్డుపై చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు ఫ్రెండ్లీ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్‌పై నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నాయి. ఘటన జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల వారు చేష్టలుడిగి చూడటమే గాక సెల్ఫోన్లలో చిత్రీకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రమేశ్ హత్య జరిగిన ప్రాంతంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్, ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు ఉన్నా ఆపలేకపోయారు. ప్లాస్టిక్ లాఠీలతో ఉన్న క్రైమ్ కానిస్టేబుళ్లు, కనీసం అదీ లేని ట్రాఫిక్ కానిస్టేబుల్ మారణాయుధాలతో ఉన్న హంతకుల వద్దకు వెళ్లడానికి ధైర్యం చేయలేకపోయారు. అంతా అయిన తర్వాత క్రైమ్ కానిస్టేబుళ్లు నిందితుల్ని వాహనంలో ఎక్కించుకుని ఠాణాకు తీసుకు వెళ్లగలిగారు. వెంటే వెళుతూ చిత్రీకరించారు... రమేశ్ హత్య జరిగిన హైదర్‌గూడ ప్రాంతం నిత్యం రద్దీ గా ఉంటుంది. రమేశ్‌ను పిల్లర్ నం.134 వద్ద అడ్డగించిన నిందితులు దాడి చేయడం ప్రారంభించారు. కిషన్ గొడ్డలితో, లక్ష్మణ్ కత్తితో విచక్షణారహితంగా నరకడం, పొడవటం ప్రారంభించారు. ప్రాణభయంతో రమేశ్ పరుగు తీస్తున్నా ఎవరూ ముందుకు రాకపోగా ఇదంతా సెల్‌ఫోన్‌తో చిత్రీకరిస్తూ ఉండిపోయారు. ఈ వీడియో లు బుధవారం వైరల్‌గా మారాయి. ఓ షోరూమ్ మేనేజర్ హంతకులను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. నడిరోడ్డుపై జరుగుతున్నా అడ్డుకునే వారు లేకపోవడంతో కిషన్, లక్ష్మణ్‌లు విచక్షణారహితంగా రమేశ్ ను నరికి చంపేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి లక్ష్మణ్‌ను ఎగిరి తన్నినా ఫలితం దక్కలేదు. మాధవి ఉదంతంలోనూ ఓ వ్యక్తి మనోహరాచారిని వెనుక నుంచి తన్నిన విషయం తెలిసిందే. ఆయుధం లేక చేష్టలుడిగిన పోలీసులు... హత్య జరుగుతున్నప్పుడు హైదర్‌గూడలో ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగమూర్తి విధుల్లో ఉన్నారు. ఆయన ఓ దశ లో హంతకుల్ని అడ్డుకోవడానికి తన చేతిలో ఉన్న హెల్మెట్ విసిరారు. విజిల్ తప్ప ఏ ఆయుధంలేని ట్రాఫిక్ కానిస్టేబుల్ అంతకుమించి ధైర్యం చేయలేకపోయారు. హత్య పూర్తయిన తర్వాత.. హంతకులు అక్కడే ఉండి అరుస్తున్న సమయంలో ఓ దొంగను పట్టుకోవడానికి పెట్రోలింగ్ వాహనంలో ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు అటుగా వచ్చారు. వారి వద్దా ప్లాస్టిక్ లాఠీలే ఉండటం... హంతకుల వద్ద మారణాయుధాలు ఉండటంతో పట్టుకునేందుకు ధైర్యం చేయలేదు. గతంలో పెట్రోలింగ్ వాహనంలో ఒకటైనా తుపాకీ ఉండేది. ఫ్రెండ్లీ పోలీ సింగ్ పుణ్యమాని ఆయుధాలన్నీ బెల్ ఆఫ్ ఆరమ్స్గా పిలిచే ఆయుధాగారాలకే పరిమితమయ్యాయి. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులూ వాటిని పట్టుకుని తిరగకూడదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ హత్యనే కాదు.. ఎవరైనా తమను హత్య చేయడానికి వచ్చినా పారిపోవడం మినహా ఎదిరించలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఎవరైనా స్పందించినా ఇబ్బందులే... ఈ ఉదంతం ఇలాఉంటే.. ఎవరైనా కింది స్థాయి పోలీసు సిబ్బంది చాకచక్యంగా స్పందించి, తమకు తోచిన సాయం చేసినా అధికారుల నుంచి మద్దతు లభించట్లేదు. కొన్ని రోజుల క్రితం ఫలక్‌నుమా పరిధిలో జరిగిన వ్యవహారమే దీనికి ఉదాహరణ. అక్కడి ప్రధాన రహదారి పక్కన ఓ వ్యక్తి మరో వ్యక్తిని బండరాయితో మోది చంపడానికి యత్నించాడు. అక్కడే 200 మంది ఉన్నా ఆపలేదు. పెట్రోలింగ్ వాహనం కానిస్టేబుల్ ధైర్యంతో బండరాయి ఎత్తిన వ్యక్తిని అడ్డుకుని, బాధితుడి ప్రాణం కాపాడాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ చేతిలోని ట్యాబ్ కిందపడి డిస్ప్లే పోయింది. విషయాన్ని తన అధికారికి చెప్తే... అభినందించాల్సిందిపోయి దూషించారని తెలిసింది. దీంతో సదరు కానిస్టేబుల్ తన సొంత డబ్బుతో ట్యాబ్ బాగు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ సందేశం కొందరు కానిస్టేబుళ్లకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడంతో తొందరెందుకు అనే దోరణిలో కొందరు ఉన్నారు. -
ఎన్ఐఏ విచారణ.. సంచలన నిజాలు
సాక్షి : మావోయిస్ట్ కొమాండర్ కుందన్ పహన్ ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులో ఉన్న విషయం తెలిసిందే. జనతా దళ్ యునైటెడ్ నేత, జార్ఖండ్ మాజీ మంత్రి రమేష్ సింగ్ ముండా హత్య కేసులో కుందన్ అరెస్టై జైల్లో ఉన్నాడు. ఈ మేరకు ఎన్ఐఏ చేపట్టిన విచారణలో సంచలన వాస్తవాలను వెల్లడించాడు. రమేష్ సింగ్ హత్య కోసం మాజీ మంత్రి రాజా పీటర్ వద్ద నుంచి రూ.5 కోట్లకు సుపారీ తీసుకున్నట్లు కుందన్ వెల్లడించాడు. ఈ హత్యకు గాను పీటర్ తొలుత రూ.3 కోట్లు కుందన్‌కు అడ్వాన్స్‌గా చెల్లించాడు. మిగతా రూ. రెండు కోట్లను హత్య అనంతరం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఆ డబ్బు మావోయిస్ట్ పొలిట్‌బ్యూరోకు చేరకముందే.. మావోయిస్ట్ కమాండర్ బలరామ్ సాహు వాటిని తీసుకుని పరారయ్యాడు. చివరకు బలరామ్ పోలీసులకు చిక్కటంతో వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. మరో మాజీ అయిన గోపాల కృష్ణ పటార్ అలియాస్ రాజా పీటర్‌ను నాలుగు రోజుల క్రితం ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. రాజా పీటర్‌కు అంత పెద్దమొత్తంలో డబ్బులు ఎలా వచ్చాయి? వాటిని ఎవరు సమకూర్చారు? అన్న విషయంపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు జైల్లో ఉన్న మాజీ మావోయిస్టులను కూడా విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2008 జూలై లో రాంచిలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతుండగా.. మావోయిస్ట్ గెరిల్లా దళం దాడి చేసి రమేష్ ను కాల్చి చంపింది. బాడీ గార్డు శేష్‌నాథ్ సింగే మావోలకు సమాచారం ఇచ్చాడన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు కూడా. ఇక ప్రస్తుతం ఎన్ఐఏ రిమాండ్ లో ఉన్న రాజా పీటర్ అలియాస్ గోపాల కృష్ణ పటార్ 2009 తమర్ నియోజవర్గ ఉప ఎన్నికలో సంచలనం సృష్టించారు. అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం చీఫ్ శిబు సోరెన్‌ను రాజా పీటర్ ఓడించి చరిత్ర సృష్టించాడు. సీఎం ఓడిపోవటంతోనే అప్పుడు జార్ఖండ్‌లో రాష్టపతి పాలన విధించాల్సి వచ్చింది కూడా. -
పథకం ప్రకారమే రమేష్ హత్య
సాక్షి, చెన్నై: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ హత్య ముందు గా వేసుకున్న పథకం ప్రకారమే జరిగిందని ఆ పార్టీ కమిటీ విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఆ పార్టీ నాయకులు గురువారం ఢిల్లీలో అధిష్టానానికి సమర్పించారు. రమేష్ హత్య మరువక ముందే మరో నేతను హతమార్చేందుకు కుట్ర జరిగింది. కోయంబత్తూరు జిల్లా తొండాముత్తూరులో అక్కడి పార్టీ అధ్యక్షుడు త్యాగరాజన్ ఇంటిపై పెట్రో బాంబులతో దాడి జరగడం బీజేపీ వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. వేలూరులో హిందూ మున్నని ప్రధాన కార్యదర్శి వెల్లయప్పన్, సేలం లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ హత్యలు వారం వ్యవధిలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ హత్య కేసుల విచారణ పోలీసులకు పెను సవాల్‌గా మారింది. ఈ హత్యల వెనుక మిస్టరీని ఛేదించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రమేష్, వెల్లయప్పన్ హత్యల వెనుక మిస్టరీని పసిగట్టేందుకు బీజేపీ జాతీయ కమిటీ రంగంలోకి దిగింది. బీజేపీ జాతీయ నాయకులు ప్రకాష్ జయదేకర్, ఆనందకుమార్ హెగ్డే, నిర్మల సీతారామన్ నేతృత్వంలోని ఈ కమిటీ చెన్నై, సేలం, వేలూరులో విచారణ జరిపింది. హిందూ మున్నని, బీజేపీ నేతల హత్యకు గల కారణాలను అన్వేషించింది. పార్టీ వర్గాలు, కుటుంబ సభ్యులు, ఆప్తుల్ని విచారించింది. పోలీసులు ఏ కోణంలో విచారణ జరుపుతున్నారోనన్న అంశాలను పరిశీలించింది. అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టిన ఈ కమిటీ నివేదికను సిద్ధం చేసి గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు అందజేశారు. ముందస్తు పథకం ప్రకారమే ఈ రెండు హత్యలు జరిగినట్టు కమిటీ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. పూర్తి వివరాల్ని వెల్లడించ లేదు. అధిష్టానం పరిశీలన అనంతరం ఈ నివేదికలోని అంశాల్ని మీడియాకు ప్రకటించనున్నారు. పెట్రో బాంబు దాడి నేతల హత్యల వెనుక మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు తలలు పట్టుకుంటున్న సమయంలో సేలంలో మరో బీజేపీ నాయకుడు రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యారు. ఈ ఘటనలు మరవక ముందే బుధవారం అర్ధరాత్రి కోయంబత్తూరులో బీజేపీ నాయకుడి హత్యకు కుట్ర వెలుగు చూసింది. కోయంబత్తూరు జిల్లా తొండముత్తూరు యూనియన్ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న త్యాగరాజన్ ఇంటి ముందు పెట్రోల్ నింపిన బాటిళ్లు పడడం, అందులో ఒకటి పేలడం ఆయన కుటుంబాన్ని ఆందోళనలో పడేసింది. ఓ బాంబు పేలి పక్కనే ఉన్న పందిరి మీద పడడంతో అది దగ్ధమైంది. ఆయన ఇంటిని టార్గెట్ చేసి ఈ దాడులు జరగడం బీజే పీ వర్గాల్ని ఆందోళనలో పడేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ నేత ఇంటికి భద్రత కల్పించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.