పథకం ప్రకారమే రమేష్ హత్య
Published Fri, Aug 9 2013 3:08 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
సాక్షి, చెన్నై: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ హత్య ముందు గా వేసుకున్న పథకం ప్రకారమే జరిగిందని ఆ పార్టీ కమిటీ విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఆ పార్టీ నాయకులు గురువారం ఢిల్లీలో అధిష్టానానికి సమర్పించారు. రమేష్ హత్య మరువక ముందే మరో నేతను హతమార్చేందుకు కుట్ర జరిగింది. కోయంబత్తూరు జిల్లా తొండాముత్తూరులో అక్కడి పార్టీ అధ్యక్షుడు త్యాగరాజన్ ఇంటిపై పెట్రో బాంబులతో దాడి జరగడం బీజేపీ వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. వేలూరులో హిందూ మున్నని ప్రధాన కార్యదర్శి వెల్లయప్పన్, సేలం లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ హత్యలు వారం వ్యవధిలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ హత్య కేసుల విచారణ పోలీసులకు పెను సవాల్‌గా మారింది. ఈ హత్యల వెనుక మిస్టరీని ఛేదించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో రమేష్, వెల్లయప్పన్ హత్యల వెనుక మిస్టరీని పసిగట్టేందుకు బీజేపీ జాతీయ కమిటీ రంగంలోకి దిగింది. బీజేపీ జాతీయ నాయకులు ప్రకాష్ జయదేకర్, ఆనందకుమార్ హెగ్డే, నిర్మల సీతారామన్ నేతృత్వంలోని ఈ కమిటీ చెన్నై, సేలం, వేలూరులో విచారణ జరిపింది. హిందూ మున్నని, బీజేపీ నేతల హత్యకు గల కారణాలను అన్వేషించింది. పార్టీ వర్గాలు, కుటుంబ సభ్యులు, ఆప్తుల్ని విచారించింది. పోలీసులు ఏ కోణంలో విచారణ జరుపుతున్నారోనన్న అంశాలను పరిశీలించింది. అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టిన ఈ కమిటీ నివేదికను సిద్ధం చేసి గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు అందజేశారు. ముందస్తు పథకం ప్రకారమే ఈ రెండు హత్యలు జరిగినట్టు కమిటీ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. పూర్తి వివరాల్ని వెల్లడించ లేదు. అధిష్టానం పరిశీలన అనంతరం ఈ నివేదికలోని అంశాల్ని మీడియాకు ప్రకటించనున్నారు.
పెట్రో బాంబు దాడి
నేతల హత్యల వెనుక మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు తలలు పట్టుకుంటున్న సమయంలో సేలంలో మరో బీజేపీ నాయకుడు రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యారు. ఈ ఘటనలు మరవక ముందే బుధవారం అర్ధరాత్రి కోయంబత్తూరులో బీజేపీ నాయకుడి హత్యకు కుట్ర వెలుగు చూసింది. కోయంబత్తూరు జిల్లా తొండముత్తూరు యూనియన్ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న త్యాగరాజన్ ఇంటి ముందు పెట్రోల్ నింపిన బాటిళ్లు పడడం, అందులో ఒకటి పేలడం ఆయన కుటుంబాన్ని ఆందోళనలో పడేసింది. ఓ బాంబు పేలి పక్కనే ఉన్న పందిరి మీద పడడంతో అది దగ్ధమైంది. ఆయన ఇంటిని టార్గెట్ చేసి ఈ దాడులు జరగడం బీజే పీ వర్గాల్ని ఆందోళనలో పడేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ నేత ఇంటికి భద్రత కల్పించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Advertisement