ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల అదుపు | Public partnership with Crime Custody | Sakshi
Sakshi News home page

ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల అదుపు

Published Thu, Feb 12 2015 3:28 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల అదుపు - Sakshi

ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల అదుపు

నేరాలను అదుపు చేయడంలో ప్రజల భాగస్వామ్యం కీలకం. శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’కు ప్రాధాన్యం. మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి పెడతా. మూఢనమ్మకాల నిర్మూలనకు
 అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.


 - గుంటి చందన దీప్తి, ఏఎస్పీ

 
తాండూరు: తాండూరు ఏఎస్పీగా గుంటి చందన దీప్తి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 5న తాండూరు ఏఎస్పీగా ఆమెను నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన చందనదీప్తికి ఇదే తొలి పోస్టింగ్. కాగా తాండూరుకు ఏఎస్పీని కేటాయించడం కూడా ఇదే ప్రథమం. బుధవారం ఉదయం తాండూరు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న చందన దీప్తి 11.04 గంటలకు సంతకం చేసి ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్ ఆమెకు పుష్పగుచ్చం అందజేసి కార్యాలయంలోకి ఆహ్వానించారు. అనంతరం డీఎస్పీ ఆమెకు బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ ఐఐటీలో బీటెక్ పూర్తి చేసిన తాను నల్లగొండ జిల్లాలో శిక్షణ పూర్తి చేసి అక్కడే కొంత కాలం పని చేసినట్లు వివరించారు. హైదరాబాద్ స్వస్థలమని తెలియజేశారు. తన తండ్రి గనుల శాఖలో సంయుక్త సంచాలకులుగా పని చేసి పదవీ విరమణ పొందారన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని ఏఎస్పీ చందన దీప్తి స్పష్టం చేశారు. నేరాల నివారణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

ప్రజలకు, పోలీసులకు మధ్య స్నేహపూర్వక వాతావరణ ఉండేలా ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వివరించారు. అన్నివర్గాల ప్రజలతో పోలీసులు మమేకమైనప్పుడే శాంతిభద్రతలకు విఘాతం కలగదన్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న తాండూరు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యతోపాటు చోరీలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టిసారిస్తానన్నారు. మహిళల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పారు.  కేసుల నమోదు, నేరాల సంఖ్య తదితర అంశాలపై స్థానిక పోలీసు అధికారులతో సమీక్షించి చర్యలు తీసుకుంటానని తెలిపారు. విలేకరులతో పాటు స్వచ్ఛంద సంస్థలు పోలీసులకు సహకారం అందించినప్పుడే నేరాలను తగ్గించేందుకు ఆస్కారం కలుగుతుందని చెప్పారు.

మూఢ నమ్మకాల నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పించేం దుకు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఏఎస్పీ చందన దీప్తి వివరించారు. మద్యంపానం వల్ల కుటుంబాల్లో తలెత్తే గొడవలు, సమస్యలపై కూడా దృష్టిసారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ తాండూరులో ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని చందన దీప్తి పేర్కొన్నారు. అనంతరం సబ్ డివిజన్ పోలీసు అధికారులతో ఏఎస్పీ సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement