చాంద్రాయణగుట్ట: ఒకవైపు రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో పోలీసులను ప్రజలకు చేరువ చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుండగా మరోవైపు కొందరు అధికారులు తమ వైఖరితో పోలీస్ వ్యవస్థకే అప్రదిష్ట తీసుకువస్తున్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు అభయం కల్పిస్తూ వారితో హుందాగా నడుచుకోవాల్సిన అధికారులు ఒక్కోసారి సంయమనం కోల్పోయి వారితో అసభ్యపదజాలంతో విరుచుకుపడుతున్నారు. తాజాగా పాతబస్తీలోని ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ మనోజ్ కుమార్ ఫిర్యాదుదారుడితో మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా...? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే....గురువారం రాత్రి గౌలిపురా పటేల్‌నగర్‌కు చెందిన వార్డు కమిటీ సభ్యుడు సర్వేశ్వర్ సమీపంలో ఉన్న బూడిదగడ్డ నుంచి రాళ్లు పడుతున్నట్లు ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ మనోజ్ కుమార్‌కు ఫోన్ చేసి ఆయన దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఇన్‌స్పెక్టర్ ఒక్కసారిగా సర్వేశ్వర్‌ను బూతులు తిట్టాడు. అనంతరం బాధితుడు ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌కు చేరుకోగా అక్కడ ఇన్‌స్పెక్టర్ లేకపోవడంతో వెనుదిరిగారు.
విచారణ చేపడతాం: కమిషనర్.
ఫిర్యాదుదారుడి పట్ల ఇన్‌స్పెక్టర్ మాట్లాడిన తీరుపై విచారణ చేపడుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చార్జ్ మెమో జారీ: డీసీపీ సత్యనారాయణ.
వార్డు సభ్యుడి పట్ల అమర్యాదగా మాట్లాడిన ఛత్రినాక ఇన్‌స్పెక్టర్‌కు క్రమశిక్షణ ఉల్లంఘన కింద చార్జ్ మెమో జారీ చేసినట్లు దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. అతను ఫ్రెండ్లీ పోలీసింగ్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడన్నారు. పటేల్‌నగర్‌లో రాళ్ల దాడికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదన్నారు. వార్డు సభ్యుడు సర్వేస్ కుమార్ మధ్య జరిగిన సంభాషణను ఎడిట్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇది నిజమని తేలితే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment