సత్యం రాజేశ్, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొలిమేర. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో గతేడాది సీక్వెల్‌ను కూడా రిలీజ్ చేశారు. పొలిమేర-2 సైతం థియేటర్లలో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రెండు సినిమాలు హిట్ కావడంతో పొలిమేర-3 కూడా ఉంటుందని ప్రకటించారు.
అయితే తాజాగా పొలిమేర 2 చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందంటూ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజుకు లేఖ రాశారు. డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, అతడి టీమ్ నుంచి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తక్షణమే స్పందించి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
నిర్మాత గౌరీ కృష్ణ తన లేఖలో రాస్తూ..'ఈ విషయం మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు. నాకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రసన్న కుమార్ తన అధికారన్ని దుర్వినియోగం చేసి.. నన్ను బెదిరించి ఒత్తిడితో సంతకాలు చేయించడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా వంశీ నందిపాటి నుంచి నాకు బెదిరింపులు వచ్చాయి. నేను పొలిమేర 2 సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఒప్పందం మేరకు వంశీ నందిపాటికి ఇచ్చా. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. కానీ వంశీ నందిపాటి ఇప్పటివరకు లాభాల్లో ఎలాంటి వాటా ఇవ్వలేదు. ఆయన నా వద్ద నుంచి ఖాళీ చెక్కులు, సంతకాలు చేసిన లేఖలు, ఖాళీ బాండ్ పేపర్లు తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారు. అంతే కాకుండా నన్ను సంప్రదించకుండానే పొలిమేర -3 సినిమాను ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి మరో నిర్మాతకు రాకూడదు. ఫిల్మ్ ఛాంబర్‌పై న్యాయం చేస్తుందనే నమ్మకం నాకుంది' అని ప్రస్తావించారు. కాగా.. కొద్ది రోజుల క్రితమే తనను బెదిరిస్తున్నారంటూ గౌరీ కృష్ణ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment