Prakasam District SP Malika Garg Successful Life Story In Telugu - Sakshi
Sakshi News home page

SP Malika Garg Story: అవినీతి పోలీస్‌ అధికారుల వెన్నులో వణుకు  

Published Sat, Apr 16 2022 11:32 AM | Last Updated on Sat, Apr 16 2022 2:47 PM

Prakasam SP Malika Garg Success Story - Sakshi

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేస్తా.. మహిళా రక్షణకు ప్రాధాన్యతనిస్తా.. కేసులు సత్వరం పరిష్కారం అయ్యేలా చూస్తా.. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతా.. ఇల్లీగల్‌ లిక్కర్‌..గుట్కా..గాంబ్లింగ్‌ తదితరాలపై ప్రత్యేక దృష్టిసారిస్తా.. ఇక డిపార్ట్‌మెంట్‌లో అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదంటూ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాడే తన బాటను స్పష్టం చేశారు మలికా గర్గ్‌. తొమ్మిది నెలల కిందట బాధ్యతలు స్వీకరించిన ఆమె ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రక్షాళన ప్రారంభించారు. నిర్లక్ష్యం, అక్రమార్కులపై వేటు వేశారు. డీఎస్పీ, సీఐ, నలుగురు ఎస్‌ఐలు, పలువురు కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని దూకుడు పెంచారు. తమ మార్క్‌ పాలనతో ముందుకు సాగుతున్నారు.  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో అవినీతి పోలీస్‌ అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. కింది స్థాయి సిబ్బంది మొదలు డీఎస్పీ స్థాయి అధికారి వరకు ఎస్పీ దెబ్బకు అలర్ట్‌ అయ్యారు. ఇప్పటి వరకు చేసిన అవినీతి కార్యకలాపాలను నిలిపివేయాల్సిన అనివార్య పరిస్థితులు పోలీస్‌ సిబ్బందికి, అధికారులకు ఏర్పడ్డాయి. జిల్లా సరిహద్దుల్లోనూ అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు కొంతమేర తెరపడింది. కేసుల దర్యాప్తులో సైతం వేగం పెరిగింది. తప్పు చేస్తే వేటు తప్పదనే సంకేతాలు ఇస్తూనే సమర్ధవంతంగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఎస్పీ మలికా గర్గ్‌. 2021 జూలై 15న ప్రకాశం జిల్లా ఎస్పీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు.

రెండు, మూడు నెలల పాటు జిల్లాపై అవగాహన పెంచుకున్నారు. హోంగార్డు మొదలుకొని డీఎస్పీ, ఏఎస్పీ స్థాయి అధికారి వరకు విధుల్లో వారి పనితీరును పరిశీలించారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టే వరకు జిల్లాలో పరిస్థితులు వేరేగా ఉండేవి. సలాములతో కాలం గడుపుతూ ఇష్టారీతిన విధులు నిర్వహిస్తూ వచ్చిన పోలీసు సిబ్బందికి, అధికారులకు తనదైన శైలిలో కౌన్సెలింగ్‌ ఇస్తూ వచ్చారు. దీంతో చాలా వరకు వారి పంథాను మార్చుకున్నారు. తమ వైఖరిలో మార్పురాని వారిపై ఆమె చర్యలకు ఉపక్రమించారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తూనే, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ తనదైన మార్క్‌ చూపిస్తున్నారు. 

తప్పుచేస్తే అంతే..  
విధుల్లో తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ మలిక గర్గ్‌ కొన్ని సంఘటనల్లో నిరూపించారు. జిల్లాలో పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో జరిగిన కొన్ని సంఘటనల్లో కఠినమైన చర్యలు చేపట్టారు. ఇటీవల యర్రగొండపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సంచలనం రేపిన రియల్టర్‌ హత్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైని సస్పెండ్‌ చేశారు. అదేవిధంగా యర్రగొండపాలెం సీఐని వీఆర్‌కు పిలిపించారు. మార్కాపురం డీఎస్పీకి చార్జ్‌ మెమో జారీ చేశారు. లింగసముద్రం ఎస్సై ఇసుక రవాణా విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో అతనిని సస్పెండ్‌ చేశారు. కొత్తపట్నం ఎస్సై విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సస్పెండ్‌ చేశారు. గ్రానైట్‌ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని బల్లికురవ ఏఎస్సైతో పాటు కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసి హోంగార్డును విధుల నుంచి తప్పించారు. బేస్తవారిపేటలో ఏఎస్సై, హెడ్‌ కానిస్టేబుళ్లు మద్యం తాగి న్యూసెన్స్‌ సృష్టించడంతో వారిరువురినీ సస్పెండ్‌ చేశారు.  

విధుల్లో నిర్లక్ష్యంపై వేటు
విధుల్లో ఉంటూ ప్రజల పట్ల, ఫిర్యాదుల పట్ల, ఫిర్యాదుదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను సహించేది లేదంటూ కొందరిపై చర్యలు చేపట్టారు. జరుగుమల్లి ఎస్సై ఇసుక అక్రమార్కుల విషయలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదులు రావటంతో ఆమెను వీఆర్‌కు పిలిపించారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరికొందరు పోలీస్‌ సిబ్బంది, అధికారులను కూడా దాదాపు 10 మందికి పైగా వీఆర్‌కు పిలిపించారు. జిల్లాలోని మారుమూల పోలీస్‌ స్టేషన్‌ను సైతం తనిఖీ చేసిన ఎస్పీ మలిక గర్గ్‌ కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది, పోలీస్‌ అధికారులకు మెమోలు, చార్జ్‌ మెమోలు జారీ చేశారు. రికార్డులు సక్రమంగా నిర్వహించకపోయినా అలాంటి వారిపై చర్యలు తీసుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement