పోలీస్‌ నంబర్‌1 | YS Jagan directions to police department officials | Sakshi
Sakshi News home page

పోలీస్‌ నంబర్‌1

Published Wed, Jun 26 2019 4:12 AM | Last Updated on Wed, Jun 26 2019 8:13 AM

YS Jagan directions to police department officials - Sakshi

మంగళవారం గుంటూరు జిల్లా ఉండవల్లిలో కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఇలాంటివి ఇక చాలు
విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ మహిళల్ని వేధించింది. అప్పుడు ఏం జరిగింది? ఎన్ని కేసులు పెట్టారు? ఎందరు అరెస్టు అయ్యారు? బిగ్‌ జీరో. అప్పటి సీఎం ఇంటి పక్కనుంచే ఇసుక దోపిడీ సాగింది. ఇసుక మాఫియాను అడ్డుకున్న ఓ మహిళా ఎమ్మార్వోను టీడీపీ ఎమ్మెల్యే జుత్తు పట్టుకుని ఈడ్చేశారు. గుంటూరు జిల్లాలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌ చేశారు. ఎమ్మెల్యేలే క్లబ్బులు నడిపారు. జూదం నిర్వహించారు. రాజధానిలో భూమి ఇవ్వని వారిని వేధించారు.  మనం ఏం చేయగలిగాం?   

స్మైల్‌ ప్లీజ్‌
పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదుదారులు వచ్చారంటే వారెంతో బాధతో వచ్చారని గుర్తించాలి. రిసెప్షన్‌ ఏర్పాటు చేయండి. వారిని కూర్చోనివ్వండి. ఓ పోలీసు వారితో నవ్వుతూ మాట్లాడి వారి సమస్యను అర్థం చేసుకుని కేసు ఫైల్‌ చేయాలి. అప్పుడే సకాలంలో పారదర్శక సేవలు అందించడం సాధ్యం. 

మీ పని మీరు చేయండి
అవినీతి, అక్రమాలు, దోపిడీలను అరికట్టడానికి కఠినంగా ఉండండి. ఎవరు వద్దని చెప్పినా పట్టించుకోవద్దు. నేను మీకు అడ్డురాను. మిగిలిన అంశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను విశ్వాసంలోకి తీసుకోండి. మనం సత్వరం, సమర్థంగా మంచి పాలన అందించాలి. మీపై నాకు నమ్మకం ఉంది. నేను గర్వపడేలా బాగా పని చేయండి. 

ఎదిగే కొద్దీ ఒదగాలి
నాతో సహా మనమంతా ప్రజా సేవకులం. మానవత్వం, సద్గుణమన్నది మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎదిగే కొద్దీ ఒదగాలి. అణగారిన వర్గాల పట్ల ఆదరణతో ఉండండి.

సాక్షి, అమరావతి: ‘ఫ్రెండ్లీ పోలీసింగ్, పారదర్శకతతో మంచి పరిపాలన అందించాలి. ప్రజల భద్రత మన బాధ్యత. అవినీతి, అక్రమాలు, దోపిడీని అరికట్టాలి. అందుకోసం వ్యవస్థను మారుద్దాం. ఈ విషయంలో నేను మీకు పూర్తి అండగా ఉంటాను’అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసు, రెవిన్యూ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీసులు వివక్షతో వ్యవహరిస్తారని అణగారిన వర్గాల్లో ఉన్న అభిప్రాయాన్ని తొలగించాలన్నారు. కలెక్టర్ల సదస్సు రెండవ రోజైన మంగళవారం ఉండవల్లి ప్రజావేదిక హాలులో ఎస్పీలు, కలెక్టర్లతో శాంతిభద్రతలపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వారికి విస్పష్టంగా వివరించారు. ప్రధానంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించి ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అవినీతి, అరాచకం, అక్రమాలు యథేచ్ఛగా సాగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితిని సమూలంగా మార్చివేసి ప్రజలకు పూర్తి భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. సైబర్‌ నేరాలను అడ్డుకోవాలని, మహిళలకు భద్రత కల్పించాలని, బెల్ట్‌ దుకాణాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ సదస్సులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

గత ఐదేళ్లు యథేచ్ఛగా వేధింపులు
గత ఐదేళ్లలో మన కళ్ల ముందే యథేచ్ఛగా అవినీతి, అక్రమాలు జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి నివాసం ఇక్కడ మన పక్కనే ఉంది. మనం కూర్చున్న ఈ భవనం అక్రమ నిర్మాణం. అన్ని చట్టాలను ఉల్లంఘించి మరీ నిర్మించారు. ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ  నీటిపారుదల శాఖ లేఖ రాసింది కూడా. నదీ పరిరక్షణ చట్టం, లోకాయుక్త తీర్పు, గ్రీన్‌ ట్రిబ్యునల్, మాస్టర్‌ ప్లాన్, భవన నిర్మాణ నిబంధనలు.. అలా అన్నింటినీ ఉల్లంఘించారు. ఇక్కడే మన కళ్ల ఎదుటనే మాజీ సీఎంగారే అక్రమ భవనంలో ఉన్నారు. అది సమర్థనీయమా? అప్పటి సీఎం అక్రమ నిర్మాణంలో ఉన్నారు. ఆ పక్కనే ప్రభుత్వం మరో అక్రమ భవనాన్ని నిర్మించింది. దాంతో ఏం జరిగింది? ఈ కరకట్ట రోడ్డు అంతటా అక్రమ భవనాలు నిర్మించారు. ఎవరూ ఆపలేదు. ఇది మంచి పరిపాలనా? మీరే ఆలోచించండి. ఆ పక్కనే ఇసుక దోపిడీ సాగింది. అది అక్రమం అని అందరికీ తెలుసు. కానీ సాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక మాఫియాను అడ్డుకున్న ఓ మహిళా ఎమ్మార్వోను టీడీపీ ఎమ్మెల్యే జుత్తు పట్టుకుని ఈడ్చేశారు. మనం ఏమీ చేయలేకపోయాం. గుంటూరు జిల్లాలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌ చేశారు. న్యాయస్థానం వరకు వెళ్లింది. మనం ఏం చేశాం? ఎమ్మెల్యేలు థియేటర్, కంపెనీల యజమానుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేశారు. బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. ఎమ్మెల్యేలే క్లబ్బులు నడిపారు. జూదం నిర్వహించారు. రాజధానిలో ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో భూమి ఇవ్వని వారిని వేధించారు. అక్రమ కేసులు పెట్టారు. దాంతో 11మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో ఆరుగురు దళితులే. ఏం చేయగలిగాం?

ఉండవల్లిలో ప్రజావేదికలో పోలీస్‌ శాఖ ఉన్నత అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. కార్యక్రమంలో మంత్రులు, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, తదితరులు 

నవ్వుతూ మాట్లాడండి..
దేశంలో మనమే తొలిసారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇచ్చాం. గతంలో బీహార్‌లో ప్రయత్నించారు కానీ కుదరలేదు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు కచ్చితంగా అమలయ్యేలా చూడండి. అందుకోసం మరో 25 శాతం సిబ్బంది అవసరమైతే నియమిస్తాం. వీక్లీ ఆఫ్‌ తీసుకుని వారానికి ఒక రోజు కుటుంబంతో గడిపితే వారు మిగిలిన ఆరు రోజులు మరింత ఉత్సాహంగా పని చేస్తారు. ప్రజలకు మేలు చేయాలంటే ఫ్రెండ్లీ పోలీసింగ్, పారదర్శక పాలన అందించాలి. మీ దగ్గరకు ఎవరు వచ్చినా నవ్వుతూ పలకరించండి. ఇక్కడకు ఎందుకు వచ్చామా అని అవతలి వాళ్లు అనుకోకూడదు. వారి స్నేహితులుగా ఉన్న మనం పారదర్శకంగా ఉండాలి. 

ప్రజల సంతృప్తే కొలబద్ద
పోలీసు సేవల పట్ల ప్రజల సంతృప్త స్థాయి ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు ఎలా పని చేస్తున్నారో థర్డ్‌ పార్టీ ద్వారా విచారించి తెలుసుకోండి. ఉన్నత స్థాయిలో మనం అవినీతికి దూరంగా ఉండాలి. దాంతో 50 శాతం అవినీతి తగ్గిపోతుంది. మిగిలిన 50 శాతం అవినీతిని ఎలా తగ్గించాలన్నది మనం నిర్ణయించాలి. ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి. అధికారుల నిబద్ధత, వ్యవహార శైలి, పని తీరు గురించి విచారించండి. తదనుగుణంగా శాస్త్రీయంగా తగిన చర్యలు తీసుకోండి. 

సైబర్‌ నేరాలను నిరోధించాల్సిందే
సైబర్‌ నేరాలు ఎక్కువయ్యాయి. సోషల్‌ మీడియాలో మహిళలపై వేధింపులు విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సైబర్‌ నేరాలను తగిన రీతిలో విచారించి పూర్తిగా అడ్డుకట్ట వేయడానికి మన పోలీసు వ్యవస్థకు తగిన మౌలిక వసతులు లేవు. దీనిపై మనం దృష్టి సారించాలి. మన పోలీసులకు తగిన శిక్షణ లేదు. కింది స్థాయి అధికారులు, సిబ్బందికి కూడా తగిన శిక్షణ ఇవ్వాలి. సైబర్‌ నేరాలు, మహిళల వేధింపులను ఎట్టి పరిస్థితుల్లో అయినా కట్టడి చేయాల్సిందే. మహిళలకు రక్షణ కల్పించలేకపోతే అది మన వైఫల్యమే. ఇతర రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఎలా చేస్తున్నాయో చూడండి. సైబర్‌ నేరాలు, మహిళల వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌లను పూర్తిగా నిరోధించాల్సిందే. 

ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాలి
మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం.ఆ వ్యవస్థను గౌరవించాలి. అమెరికాలో పోలీసు ఉన్నతాధికారులను కూడా ప్రజలు ఎన్నుకుంటారు. ఎందుకో తెలుసా? ప్రజల పట్ల మానవీయ కోణం, బాధితుల పట్ల సానుభూతితో ఉండాలని. మన వద్ద కూడా పోలీసు అధికారులు అదే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాలి. చాలాసార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎందుకు పట్టించుకోవాలి అనే ఘర్షణ వైఖరి తలెత్తుతుండటం మనం చూస్తునే ఉన్నాం. ప్రత్యేకించి పోలీసు శాఖలో. మనం గౌరవించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోతుంది. రెండు లక్షల మంది ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేను ఎన్నుకుంటారు. వారిని మనం గౌరవించకపోతే ప్రజాస్వామ్యం విఫలమవుతుంది. మనం కలసి మెలసి ప్రభుత్వాన్ని నడపాలి. అలా అని అవినీతి, అక్రమాలు, దోపిడీలను సమర్థించమని నేను చెప్పడం లేదు. ఎవరు చెప్పినా సరే అవినీతి, అక్రమం, దోపిడీలకు నో చెప్పండి. మిగిలిన అన్ని విషయాల్లో మనం కలసి పని చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలను విశ్వాసంలోకి తీసుకోండి. ఏ ఎమ్మెల్యే కూడా తనకు చెడ్డపేరు రావాలని కోరుకోరు. మీరు చేయాల్సిందల్లా వారిని చిరునవ్వుతో పలకరించి విషయం చెప్పి ఒప్పించండి. ఇది చేస్తే చెడ్డపేరు వస్తుంది.. ఇది చేస్తే మంచిపేరు వస్తుందని వివరించండి. చెడ్డపేరు వస్తుందంటే ఎందుకు చేయమంటారు? కానీ వారి ఫోన్లు రిసీవ్‌ చేసుకోకపోతే సమస్య వస్తుంది. ఇగో పక్కన పెట్టండి. ఇది అందరికీ వర్తిస్తుంది. అధికారులు, రాజకీయ నేతలకు కూడా వర్తిస్తుంది.  
సమావేశానికి హాజరైన కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు 

జిల్లాల్లో ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేయాలి. గ్రామాల్లో రాత్రి బస చేయాలి. అదీ అణగారిన వర్గాలు ఉన్న కాలనీల్లో బస చేయండి. పోలీసుల పనితీరు గురించి వాకబు చేయండి. దాంతో వ్యవస్థలో మార్పు వస్తుంది. విశ్వసనీయత, పారదర్శకత, సత్వరం ప్రజల సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుంది.

అక్రమ నిర్మాణాల కూల్చివేత ఈ భవనం నుంచే మొదలు పెడతాం. ఇక్కడ మనం మొదలు పెట్టి ఈ రోడ్డంతా ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగిద్దాం. జిల్లాల్లో కూడా ఇదే విధానాన్ని పాటించాలి. అప్పుడే మనం మంచి పరిపాలన అందించగలం. నంబర్‌ వన్‌ పోలీసింగ్‌ గురించి మాట్లాడగలం.

ఇక్కడ నుంచే వ్యవస్థను మారుద్దాం
మనం అధికారంలో ఉన్నామంటే మనకు బాధ్యతలు ఉన్నాయని అర్థం. మనం ప్రమాణాలను పాటించి అందరికీ ఆదర్శంగా నిలవాలి. అందుకే మీకు చెబుతున్నా.. అవినీతికి, దోపిడీకీ, అక్రమాలకు నో చెప్పండి. వ్యవస్థను ప్రక్షాళన చేయండి. మంచి ప్రమాణాలు నెలకొల్పండి. మీకు ఇది చూపించడానికే ఇక్కడ సమావేశం పెట్టాను. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఇక్కడి నుంచే మొదలు పెడదాం. వ్యవస్థను మారుద్దాం. గ్రామాల్లో మద్యం బెల్ట్‌ దుకాణాలు ఉండటానికి వీల్లేదు. అసలు బెల్ట్‌ దుకాణం అనే పదమే అక్రమం. పాదయాత్రలో ఎన్నో  గ్రామాల్లో ఎన్నో బెల్ట్‌ దుకాణాలు, క్లబ్బులు, జూదంతో ప్రజలు పడుతున్న బాధలు చూశాను. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటన్నింటినీ తొలగించాల్సిందే. 

3 అంశాల ప్రాతిపదికగా అధికారుల ఎంపిక 
నా మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముందే నేను కలెక్టర్లు, ఎస్పీల నియామకాలు పూర్తి చేశాను. నిజాయతీ, సమర్థత, టీడీపీకి అనుకూలంగా లేకపోవడం అనే మూడు ప్రమాణాల ప్రాతిపదికన మిమ్మల్ని ఎంపిక చేశాను. లేకపోతే వ్యవస్థ మరింతగా దిగజారుతుంది. అధికారులు తటస్థంగా ఉండాలన్నదే నా విధానం. మీపై పూర్తి గౌరవంతో అడుగుతున్నాను. మంచి పాలన అందించండి. నేను జోక్యం చేసుకోను.

కాల్‌మనీలో ఎవరినీ వదలొద్దు
విజయవాడలో టీడీపీ హయాంలో వెలుగు చూసిన కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై గట్టి చర్యలు తీసుకోకపోవడం గురించి సీఎం పోలీసు అధికారుల సదస్సులో ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం కోసం అప్పు తీసుకున్న వారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ విషయంలో పోలీసులు సీరియస్‌గానే ఉండాలని ఆదేశించారు. ఈ ఘటనలపై ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంత మందిని అరెస్ట్‌ చేశారు? అంటూ ఆరా తీశారు. ‘కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో ఏ పార్టీవారున్నా విడిచి పెట్టొద్దు. ఈ రాకెట్‌లో వైఎస్సార్‌సీపీ వాళ్లు ఉన్నా సరే ఉపేక్షించొద్దు. ఈ సెక్స్‌ రాకెట్‌ను సమూలంగా నిర్మూలించండి’ అంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక ఘటనలను ప్రస్తావించారు. ఇలాగైతే మీరు నంబర్‌ వన్‌ పోలీస్‌ ఎలా అవుతారని ప్రశ్నించారు. గత సీఎం చంద్రబాబు నివాసానికి పక్కనే అక్రమంగా ఇసుక మాఫియా సాగిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోపై ఓ ప్రజాప్రతినిధి జుట్టు పట్టుకుని దాడి చేసి కొట్టినా పట్టించుకోలేదన్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా మన కళ్ల ఎదుటే జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సరైన విధానమేనా? అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, భూ సమీకరణకు పొలాలు ఇవ్వని రైతులపై అక్రమ కేసులు పెట్టారని సీఎం గుర్తు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలే బహిరంగంగా దందాలకు పాల్పడ్డారని, గ్యాంబ్లింగ్, పేకాట క్లబ్బులకు ఎమ్మెల్యేలు సహకరించారన్నారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోకుంటే నంబర్‌వన్‌ పోలీస్‌ కాలేరన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement