సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో ఫ్రెండ్లీ పోలీసింగ్, వుమెన్ సేఫ్టీ వింగ్, పెట్రో కార్స్, బ్లూకోల్ట్స్ కోర్టు డ్యూటీ ఆఫీసర్ వంటి అనేక వైవిధ్య కార్యక్రమాలను అమలు చేస్తోన్న డీజీపీ మహేందర్‌రెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి పనితీరు మదింపును మొదలుపెట్టారు. ఏ రోజు ఎవరు ఏం పనిచేశారు? దాన్ని ఎప్పటిలోగా పూర్తి చేశారు? అందుకోసం ఎలాంటి పద్ధతులు అవలంబించారు? తదితర విషయాలన్నీ ఇకపై డీజీపీ కార్యాలయంలో నమోదవుతాయి. ఆ వివరాలన్నీ పరిశీలించి ప్రతి ఒక్కరికీ పాయింట్లు ఇస్తారు.
అంటే పోలీసు ఉద్యోగి పనితీరుకు ఈ పాయింట్లే ప్రామాణికంగా నిలుస్తాయన్నమాట. పదోన్నతులు, పురస్కారాలు, అలాగే బదిలీలు, పనిష్మెంట్లకు ఈ పాయింట్లే ఆధారం కానున్నాయి. సిబ్బందిలో జవాబుదారీతనాన్ని, పోటీ తత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా, పదోన్నతులు, బదిలీల్లో రాజకీయ జోక్యాన్ని నివారించే దిశగా డీజీపీ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని ఫ్రెండ్లీ పోలీసింగ్, వుమెన్‌సేఫ్టీ వింగ్, వర్టికల్స్ (నిర్దిష్టంగా పని విభజన)ను పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్న సమయంలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం.
వర్టికల్స్‌లో గణాంకాలు
గతంలో ఒక పోలీసుస్టేషన్ పరిధిలో నేరం జరిగితే దాని దర్యాప్తు నుంచి శిక్ష పడేంత వరకూ అన్నిటికి స్టేషన్ హౌస్ ఆఫీసర్లే (ఎస్‌హెచ్‌ఓ) బాధ్యత వహించాల్సి వచ్చేది. కిందిస్థాయి సిబ్బంది సరైన సహకారం అందించకున్నా.. దాని ఫలితాలు, పర్యవసానాలు ఎస్‌హెచ్‌ఓనే అనుభవించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల కిందట వర్టికల్స్ అమల్లోకి తెచ్చారు. అంటే రిసెప్షన్ మొదలుకుని వారెంట్లు, సమన్లు, దర్యాప్తు, ఎస్‌హెచ్‌ఓ, కమ్యూనిటీ పోలీసింగ్, డయల్ 100, ట్రాఫిక్.. ఇలా ప్రతి ఒక్కరికి, ప్రతి విభాగానికి నిర్దిష్ట బాధ్యతలు (పని), నిర్దిష్ట సిబ్బందిని కేటాయించారు. అంటే ఎవరి పనికి, ఎవరి విభాగానికి వారే బాధ్యులన్నమాట. ఈ విధంగా ఎస్‌హెచ్‌ఓలకు ఊరట లభించింది. ప్రస్తుతం ఆయా వర్టికల్స్‌లోనే సిబ్బంది రోజువారీ పనికి సంబంధించిన గణాంకాలు నమోదవుతుంటాయి. ఈ గణాంకాలను డీజీపీ కార్యాలయం నిరంతరం సమీక్షిస్తూ ఉంటుంది.
గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్‌లు
వచ్చిన ఫిర్యాదులు, చేసిన పని, దాని పరిష్కారం, ఎంత సమయంలో పూర్తి చేశారు.. తదితర విషయాలపై నిరంతర సమీక్ష ఉంటుంది. ప్రతి పని నమోదవుతుంది. దాని ఆధారంగా పాయింట్లు నమోదు చేస్తున్నారు. వీటి ఆధారంగా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్‌లుగా విభజించారు. ప్రతిరోజూ సిబ్బంది వీటిని ఠాణాలో తనిఖీ చేసుకోవచ్చు. మిగతా ఠాణాల్లోని సిబ్బంది సాధించిన పాయింట్లు, తమ పాయింట్లు చూసుకుని తాము ఏ స్థానంలో ఉన్నామో తెలుసుకోవచ్చు. ఇందులో చివరి స్థానమైన రెడ్‌జోన్‌లో ఉన్న వారిని అప్రమత్తం చేయడం, వారందరినీ ఆరెంజ్ జోన్‌కు తీసుకురావడం, ఆరెంజ్‌లో ఉన్న వారిని గ్రీన్ జోన్‌కు వచ్చేలా చేసేందుకు ఎస్‌హెచ్‌ఓ, జిల్లా అధికారులు కృషి చేస్తారు. హెచ్‌ఆర్‌ఎంఎస్‌తో అనుసంధానం ఈ వివరాలను త్వరలో పోలీసు విభాగంలో ప్రారంభించనున్న హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టం (హెచ్‌ఆర్‌ఎంఎస్)కు అనుసంధానం చేయనున్నారు. తద్వారా ప్రతి సిబ్బంది తన పనిని మదింపు చేసుకుని, తప్పులు సరిదిద్దుకుని ముందుకుసాగే అవకాశం కలుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment