సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టులు తిరిగి పుంజుకోకుండా చూడాలని పోలీసులు.. ఎలాగైనా తిరిగి తెలంగాణలో విస్తరించా లన్న పట్టుదలతో మావోయిస్టులు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తుండటం ఏజెన్సీ ప్రాం తాల ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కొత్త రిక్రూట్‌మెంట్ కోసం మావోలు ప్రయత్నిస్తుండటం, ఆ ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవాలని పోలీసులు అడవులను జల్లెడ పడుతుండటం మరింత వేడి రాజేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు బాస్ ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో పర్యటించి శాఖాపరంగా కీలక మార్పుచేర్పులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
లాక్‌డౌన్ కాలంలోనే మొదలు...
2005 తరువాత రాష్ట్రంలో దాదాపుగా ఉనికి కోల్పోయిన మావోయిస్టులు... లాక్‌డౌన్ కాలంలో అనూహ్యంగా పుంజుకున్నారు. జనవరి, ఫిబ్రవరిలలో మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఛత్తీస్‌గఢ్ నుంచి మావోల యాక్షన్ టీమ్‌లు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ ప్రహార్ కారణంగా వారంతా తాత్కాలికంగా తెలంగాణలోకి వచ్చారని పోలీసులు తొలుత భావించారు. అయితే వారు చాపకింద నీరులా మావోయిస్టు పార్టీ విస్తరణకు వచ్చారన్న విషయం తెలియడం పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. అదే సమయంలో కరోనా విజృంభణతో లాక్‌డౌన్ విధించడం మావోలకు కలసి వచ్చింది. ఈ సమయంలో వారు పార్టీకి కావాల్సిన చందాలు, సామగ్రి సమకూర్చుకున్నారు. పలువురు ప్రజాసంఘాల నాయకులు కూడా పార్టీ రిక్రూట్‌మెంట్ కోసం ప్రయత్నించారని పోలీసులు కేసులు నమోదు చేశారు.
కొందరు మావో సానుభూతిపరులు చందాలు వసూలు చేస్తూ సిరిసిల్లలో పోలీసులకు దొరికారు. జూలై 15న ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఆటవీ ప్రాంతంలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరేపు అడేళ్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని దళం స్పెషల్ పార్టీ పోలీసులకు తారసపడటం.. పరస్పరం కాల్పులు జరుపుకోవడం కలకలం రేపింది. ఆ సమయంలో స్థానిక అటవీ ప్రాంతంలోకి 15 మంది యువత అదృశ్యమయ్యారన్న వార్త కూడా పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ఆ మర్నాడే డీజీపీ మహేందర్‌రెడ్డి హుటాహుటిన ఆసిఫాబాద్ వెళ్లారు. అదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలోనూ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఆ రోజు నుంచి గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్, స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులంతా అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.
రెండుసార్లు ఆసిఫాబాద్‌కు..
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారంటూ ఈ నెల 1న జరిగిన ప్రచారంతో పోలీసులు, మావోయిస్టులు ఉలిక్కిపడ్డారు. ఆ మర్నాడే డీజీపీ మహేందర్‌రెడ్డి ఆకస్మికంగా ఆసిఫాబాద్ చేరుకున్నారు. 45 రోజుల్లో డీజీపీ రెండుసార్లు ఆసిఫాబాద్‌లో పర్యటించడంతో ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆసిఫాబాద్‌లో మావోల కదలికలు పెరగడం, అదే సమయంలో గణపతి, మరికొందరు మావో అగ్రనేతలు లొంగిపోతారన్న వార్తలు తోడవడంతో రాష్ట్రంలో ఏదో జరుగుతోందన్న చర్చ తీవ్రమైంది. అయితే గణపతి లొంగుబాటు ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ ఖండించింది. అవన్నీ కట్టుకథలని, పోలీసుల మైండ్‌గేమ్ అని లేఖ విడుదల చేసింది. తమకు ప్రజల్లో పూర్వ ఆదరణ లభిస్తోందని, తప్పకుండా రాష్ట్రంలో పునర్వైభవం సాధిస్తామని మావోలు ప్రతినబూనారు.
అయితే ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ గన్‌మన్, యాక్షన్ కమిటీ సభ్యుడు శంకర్ గుండాలలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడంతో యాక్షన్ కమిటీ సభ్యుల సంచారం నిజమేనని తేలింది. దీంతో డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మావోలు బలపడేందుకు అవకాశమున్న అటవీ, గోదావరి పరీవాహక జిల్లాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని పలు ఠాణాల్లో సీఐలు, ఎస్సైలను ఆకస్మికంగా బదిలీ చేశారు. గతంలో మావోలను సమర్థంగా ఎదుర్కొన్న సీనియర్ పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే రెండు దశాబ్దాలనాటి ఇన్‌ఫార్మర్ వ్యవస్థను తిరిగి బలోపేతం చేసుకోవాలని, అటవీ ప్రాంతాల్లో కొరియర్లు, సానుభూతిపరుల కదలికలపై నిఘా పెట్టాలంటూ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తిరిగి కార్యాకలాపాలు ప్రారంభించిన మావోయిస్టులను సరిహద్దులోనే అడ్డుకోవాలని డీజీపీ వ్యూహాలు రచిస్తుండగా.. ప్రజామద్దతుతో తిరిగి బలపడతామని మావోలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment