maoists bandh
-
బస్తర్‌లో భయం భయం!
తాండ్ర కృష్ణ గోవింద్, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తలపై రూ.కోటి రివార్డు ఉన్న కీలక నేత హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలో కేంద్ర భద్రతా దళాలు క్యాంప్ నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు– భద్రతా దళాల మధ్య సాగుతున్న పోరును తెలుసుకునేందుకు ‘సాక్షి’ బస్తర్ అడవుల బాటపట్టింది. అన్నలు విధించిన ఆంక్షలు, పారామిలటరీ చెక్ పాయింట్లను దాటుకుంటూ వెళ్లి వివరాలు సేకరించింది. జవాన్లు, అధికారులతోపాటు మావోయిస్టుల ప్రత్యేక పాలన (జనతన సర్కార్)లో నివసిస్తున్న ప్రజలతో ‘సాక్షి’ ప్రతినిధి మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనపై ప్రత్యేక కథనం.. ముందు, వెనక ప్రమాదం మధ్య.. బస్తర్ దండకారణ్యం పరిధిలోకి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా, దంతెవాడ,బస్తర్ జిల్లాలు వస్తాయి. ఇక్కడి ప్రజలు రెండు రకాల పాలనలో ఉన్నారు. వారి జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ మీడియా బృందం ప్రయత్నించింది. ముందుగా భద్రాద్రి జిల్లా చర్ల మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడుకు.. అక్కడి నుంచి సుక్మా జిల్లా పువ్వర్తికి వెళ్లింది. ఈ మార్గంలో ఎవరితో మాట్లాడినా.. వారి కళ్లలో సందేహాలు, భయాందోళన కనిపించాయి. కొండపల్లి వద్ద కొందరు గ్రామస్తులు మీడియా బృందాన్ని అడ్డుకున్నారు. ఎవరి అనుమతితో వచ్చారంటూ గుర్తింపు కార్డులు అడిగి తీసుకున్నారు. సాయంత్రందాకా పలుచోట్లకు తీసుకెళ్లారు. తర్వాత ఓ వ్యక్తి వచ్చి ‘‘మీరంతా మీడియా వ్యక్తులే అని తేలింది. వెళ్లొచ్చు. ప్రభుత్వం తరఫునే కాకుండా ఇక్కడి ప్రజల కష్టాలను కూడా లోకానికి తెలియజేయండి’’ అని కోరాడు. అంతేగాకుండా ‘‘ఈ ప్రాంతంలోకి వచ్చేముందు అనుమతి తీసుకోవాల్సింది. అటవీ మార్గంలో అనేకచోట్ల బూబీ ట్రాప్స్, ప్రెజర్ బాంబులు ఉంటాయి. కొంచెం అటుఇటైనా ప్రాణాలకే ప్రమాదం’’ అని హెచ్చరించాడు. దీంతో మీడియా బృందం రాత్రికి అక్కడే ఉండి, మరునాడు తెల్లవారుజామున పువ్వర్తికి చేరుకుంది. అక్కడ భద్రతా దళాల క్యాంపు, హిడ్మా ఇల్లును పరిశీలించింది. అయితే భద్రతాపరమైన కారణాలు అంటూ.. ఫొటోలు తీసేందుకు, వివరాలు వెల్లడించేందుకు పారామిలటరీ సిబ్బంది అంగీకరించలేదు. ఆ పక్క గ్రామంలో హిడ్మా తల్లి ఉందని తెలిసిన మీడియా బృందం వెళ్లి ఆమెను కలిసి మాట్లాడింది. తిరిగి వస్తుండగా నలుగురు సాయుధ కమాండర్లు అడ్డగించారు. బైక్‌లపై తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్లను చూసిన ఓ తెలుగు జవాన్ కల్పించుకుని.. ‘‘మీరు కొంచెం ముందుకొచ్చి ఉంటే.. మా వాళ్లు కాల్చేసేవారు’’ అని హెచ్చరించాడు. అదే దారిలో నేలకూలిన ఓ పెద్ద చెట్టును కవర్‌గా చేసుకుని బంకర్ నిర్మించారని, అందులో సాయుధ జవాన్లు ఉన్నారని, జాగ్రత్తగా వెళ్లాలని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య మీడియా బృందం సాధ్యమైనన్ని వివరాలు సేకరించి తిరిగి చర్లకు చేరుకుంది. జనతన్ సర్కార్ ఆధీనంలో.. బీజాపూర్ జిల్లా పామేడు నుంచి చింతవాగు, ధర్మారం, జీడిపల్లి, కవరుగట్ట, కొండపల్లి, బట్టిగూడెం మీదుగా పువ్వర్తి వరకు 60 కిలోమీటర్ల ప్రయాణం సాగింది. పామేడు, ధర్మారం గ్రామాల వరకే ఛత్తీస్‌గఢ్‌తోపాటు ప్రభుత్వ పాలన కనిపిస్తుంది. అక్కడివరకే పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి, అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల వంటివి ఉన్నాయి. తర్వాత చింతవాగు దాటి కొద్దిదూరం అడవిలోకి వెళ్లగానే జనతన సర్కార్‌కు స్వాగతం పలుకుతున్నట్టుగా మావోయిస్టులు హిందీలో చెక్కలపై రాసి చెట్లకు తగిలించిన బోర్డులు వరుసగా కనిపించాయి. జనతన సర్కార్ ఆ«దీనంలోని ఈ ప్రాంతాల్లో ఎక్కడా బీటీ రోడ్డు లేదు. ఎటు వెళ్లాలన్నా కాలిబాట, ఎడ్లబండ్ల దారులే ఆధారం. పోడు భూములు.. స్తూపాలు జనతన సర్కార్ ఆ«దీనంలోని గ్రామాల్లో మావోయిస్టులు తవ్వించిన చెరువులు, పోడు వ్యవసాయ భూములు, రేకుల షెడ్లలోని స్కూళ్లు కనిపించాయి. కానీ ఎక్కడా తరగతులు నడుస్తున్న ఆనవాళ్లు లేవు. అక్కడక్కడా కొందరు టీచర్లు కనిపించినా మాట్లాడేందుకు నిరాకరించారు. అక్కడక్కడా సంతల్లో హెల్త్ వర్కర్లు మాత్రం కనిపించారు. పరిమితంగా దొరికే ఆహారం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్త్రీలు, పిల్లల్లో పోషకాహర లోపం కనిపించింది. అయితే గతంలో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వారు చెప్పారు. ఏ గ్రామంలోనూ గుడి, చర్చి, మసీదు వంటివి లేవు. జనతన సర్కార్‌లో మతానికి స్థానం లేదని స్థానికులు చెప్పారు. కొన్నిచోట్ల చనిపోయినవారికి గుర్తుగా నిలువుగా పాతిన బండరాళ్లు, మావోయిస్టుల అమరవీరుల స్తూపాలు మాత్రమే కనిపించాయి. బస్తర్ అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో ఇప్పసారా, లంద, చిగురు వంటి దేశీ మద్యం దొరుకుతుంది. కానీ జనతన సర్కార్ ఆ«దీనంలోని ప్రాంతాల్లో ఎక్కడా మద్యం ఆనవాళ్లు కనిపించలేదు. చాలా మందికి ఆధార్ కార్డుల్లేవు జనతన సర్కార్ పరిధిలోని గ్రామాల్లో సగం మందికిపైగా తమకు ఆధార్‌కార్డు, ఓటర్ గుర్తింపుకార్డులు లేవని చెప్పారు. వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అంతంతగానే దక్కుతున్నాయి. పువ్వర్తి సమీపంలోని మిర్చిపారా గ్రామానికి చెందిన మడకం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘రేషన్ బియ్యం తీసుకుంటున్నాం. అది కూడా మా గ్రామాలకు పది– ఇరవై కిలోమీటర్ల దూరంలో జనతన సర్కార్‌కు ఆవల ఉండే మరో గ్రామానికి వెళ్లి రెండు, మూడు నెలలకు ఓసారి తెచ్చుకుంటాం..’’ అని చెప్పాడు. ఇక ఎన్నికల ప్రక్రియపై పటేల్‌పారా గ్రామానికి చెందిన నందా మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ చాలా గ్రామాలకు నామ్ కే వాస్తే అన్నట్టుగా సర్పంచ్‌లు ఉన్నారు. ఎక్కువ మంది ఎన్నికలను బహిష్కరిస్తారు. అయినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుండటంతో.. సమీప పట్టణాల్లో నివాసం ఉండేవారు నామినేషన్ దాఖలు చేస్తారు. వారిలో ఒకరు సర్పంచ్ అవుతారు. కానీ చాలా గ్రామాల్లో వారి పెత్తనమేమీ ఉండదు. పరిపాలనలో గ్రామ కమిటీలదే ఆధిపత్యం..’’ అని వివరించాడు. సమష్టి వ్యవసాయం చాలా ఊర్లలో ట్రాక్టర్లు కనిపించాయి. వాటికి రిజిస్ట్రేషన్ నంబర్లు లేవు. ఆ ట్రాక్టర్లను ఊరంతా ఉపయోగించుకుంటారని తెలిసింది. ఇక్కడి ప్రజలకు ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేదు. అంతా దట్టమైన అడవి అయినా ఎక్కడా అటవీ సిబ్బంది ఛాయల్లేవు. ఇటీవలికాలంలో చేతిపంపులు, సోలార్ లైట్లు వంటివి కనిపిస్తున్నాయి. వినోదం విషయానికొస్తే.. సంప్రదాయ ఆటపాటలతో పాటు కోడిపందేలను ఆదివాసీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నాం ఇక్కడి ప్రజలకు రక్షణ కల్పించేందుకు, ప్రభుత్వం తరఫున సేవలు అందించేందుకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని పువ్వర్తి వద్ద విధులు నిర్వర్తిస్తున్న సుక్మా జిల్లా ఏఎస్పీ గౌరవ్ మొండల్ చెప్పారు. ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో సర్వే చేపట్టి తాగునీరు, విద్యుత్, స్కూల్, ఆస్పత్రి వంటి సౌకర్యాలు, ఇతర ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. అయితే క్యాంపుల ఏర్పాటులో ఉన్న వేగం ప్రభుత్వ పథకాల అమల్లో కనిపించడం లేదేమని ప్రశి్నస్తే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులే అందుకు కారణమన్నారు. ఇక క్యాంపుల ఏర్పాటు సమయంలో ఆదివాసీలు భయాందోళన చెందినా, తర్వాత శత్రుభావం వీడుతున్నారని మరో అధికారి తెలిపారు. ఈక్రమంలోనే జనతన సర్కారులోకి చొచ్చుకుపోగలుతున్నామన్నారు. ఇప్పటికీ మావోయిస్టులదే పైచేయి.. ప్రభుత్వ బలగాలు ఎంతగా మోహరిస్తున్నా ఇప్పటికీ అడవుల్లో మావోయిస్టులదే ఆధిపత్యం. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడి ప్రజలకు ఆటపాటలే ప్రధాన వినోద సాధనాలు. మావోయిస్టులు చేతన నాట్యమండలి వంటివాటి ద్వారా ఇక్కడి ప్రజల్లో విప్లవ భావాలను రేకెత్తిస్తారు. పిల్లలకు ఏడేళ్లు దాటగానే గ్రామ కమిటీల్లో చోటు కల్పించి, భావజాలాన్ని నేర్పుతారు. మావోయిస్టుల పట్ల ఎవరైనా వ్యతిరేకత చూపితే ప్రమాదం తప్పదనే భయాన్ని నెలకొల్పారు’’ అని ఆరోపించారు. హిడ్మా అడ్డాలో క్యాంపు వేసి.. పువ్వర్తి జనాభా 400కు అటుఇటుగా ఉంటుంది. అందులో దాదాపు వంద మంది మావోయిస్టు దళాల్లో ఉన్నారు. వీరిలో హిడ్మా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకోగా.. ఆయన సోదరుడు దేవా బెటాలియన్ కమాండర్‌గా ఉన్నారు. పువ్వర్తిలో హిడ్మా కోసం ప్రత్యేక సమావేశ మందిరం, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేవి. అక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే హిడ్మా సొంతిల్లు ఉంది. ప్రస్తుతం ఇవన్నీ భద్రతా దళాల ఆధీనంలో ఉన్నాయి. ఆధునిక పరికరాల సాయంతో వందల మంది కార్మికులు క్యాంపు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. ఇటీవలి వరకు రోడ్డుకూడా లేని ఈ గ్రామంలోకి ఇప్పుడు పదుల సంఖ్యలో లారీల్లో వస్తుసామగ్రి, రేషన్ తరలించారు. బుల్డోజర్లు, పొక్లెయినర్లు నిర్విరామంగా తిరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్‌్కఫోర్స్, డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్ ఇలా వివిధ దళాలకు చెందిన సుమారు ఐదు వేల మంది సిబ్బంది మోహరించారు. గ్రామం నలువైపులా గుడారాలు, బంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు.. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్యాంపులు తమకు ఇబ్బందిగా మారుతున్నాయని చాలా మంది ఆదివాసీలు అంటున్నారు. కొండపల్లికి చెందిన మడావి మాట్లాడుతూ.. ‘‘క్యాంపులు ఏర్పాటైన తర్వాత మా గ్రామాల్లోకి వచ్చే భద్రతాదళాలు విచారణ పేరుతో జబర్దస్తీ చేస్తున్నాయి. రాత్రీపగలు తేడా లేకుండా కాల్పుల శబ్దాలు వినవస్తున్నాయి. విచారణ పేరిట ఎవరైనా గ్రామస్తుడిని తీసుకెళ్తే.. తిరిగి వచ్చే వరకు ప్రాణాలపై ఆశలేనట్టే. అందుకే భద్రతా దళాలు వస్తున్నట్టు తెలియగానే పెద్దవాళ్లందరం అడవుల్లోకి పారిపోతున్నాం’’ అని చెప్పాడు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘‘స్థానికులమైన మాకు భద్రతాదళాల నుంచి కనీస మర్యాద లేదు. అభివృద్ధి పేరిట అడవుల్లోకి వస్తున్నవారు గ్రామపెద్దల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు..’’ అని పేర్కొన్నాడు. -
సరిహద్దుల్లో భయం భయం
చర్ల: ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలోని ఆదివాసీ పల్లెల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోనూ పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. అయితే పోలీసులకు కొరియర్లుగా వ్యవహరిస్తున్నారని, తమ సమాచారం పోలీసులకు చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో పలు గ్రామాలకు చెందిన ఆదివాసీలను మావోయిస్టులు కిడ్నాప్ చేసి, ప్రజాకోర్టులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలువురిని హతమారుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బీజాపూర్ జిల్లాలోని పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో గల పలు గ్రామాలకు చెందిన ఆదివాసీలను వారం వ్యవధిలో 16 మందిని హతమార్చినట్లు సమాచారం. మావోయిస్టుల చేతిలో మృతి చెందిన వారిలో బట్టిగూడెం, కౌరగట్ట, కోడేపాల్, బీమారంపాడు, పూసుబాక గ్రామాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిసింది. కాగా ఇన్ఫార్మర్ల హత్యల విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తెలియనీయవద్దని, ఎవరైనా చెబితే వారిని కూడా శిక్షిస్తామని మావోయిస్టులు హెచ్చరించినట్లు సమాచారం. ఆయా గ్రామాల నుంచి పామేడుకు వచ్చి పోలీసులకు సమాచారం ఇస్తారనే అనుమానంతో పామేడు – ధర్మారం మధ్యలో ఉన్న వాగులపై నడిచే పడవలను సైతం మావోయిస్టులు నిలిపివేసినట్లు తెలిసింది. అలాగే ఆదివాసీల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆయా గ్రామాలకు చెందిన ఆదివాసీలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎంత మందిని హతమారుస్తారోనని భయపడుతున్నారు. 28న బంద్‌కు మావోయిస్టుల పిలుపు వివిధ ప్రాంతాల్లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈనెల 28న రాష్ట్రవ్యాప్త బంద్ పాటించాలని జయశంకర్ భూపాలపల్లి – ములుగు – మహదేవపూర్ – వరంగల్ – పెద్దపల్లి డివిజన్ల సీపీఐ (మావోయిస్టు) కార్యదర్శి వెంకటేశ్ పేరిట శనివారం ఓ ప్రకటన విడుదలైంది. చెన్నాపురం, కదంబ పూసుగుప్ప, దేవార్లగూడెంలలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లను ఖండించాలని పేర్కొన్నారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లలో శంకర్, శ్రీను, ఐతు, చుక్కాలు, బాజీరావు, జోగయ్య, రాజే, లలితను ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడి హత్య చేశారని ఆరోపించారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లపై హక్కుల సంఘాలు నిజనిర్ధారణ కొనసాగించి బాధ్యులైన వాళ్లకు శిక్షలు పడేలా చూడాలని ఆయన కోరారు. -
సై అంటే సై
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టులు తిరిగి పుంజుకోకుండా చూడాలని పోలీసులు.. ఎలాగైనా తిరిగి తెలంగాణలో విస్తరించా లన్న పట్టుదలతో మావోయిస్టులు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తుండటం ఏజెన్సీ ప్రాం తాల ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కొత్త రిక్రూట్మెంట్ కోసం మావోలు ప్రయత్నిస్తుండటం, ఆ ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవాలని పోలీసులు అడవులను జల్లెడ పడుతుండటం మరింత వేడి రాజేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు బాస్ ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో పర్యటించి శాఖాపరంగా కీలక మార్పుచేర్పులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. లాక్డౌన్ కాలంలోనే మొదలు... 2005 తరువాత రాష్ట్రంలో దాదాపుగా ఉనికి కోల్పోయిన మావోయిస్టులు... లాక్డౌన్ కాలంలో అనూహ్యంగా పుంజుకున్నారు. జనవరి, ఫిబ్రవరిలలో మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఛత్తీస్‌గఢ్ నుంచి మావోల యాక్షన్ టీమ్‌లు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ ప్రహార్ కారణంగా వారంతా తాత్కాలికంగా తెలంగాణలోకి వచ్చారని పోలీసులు తొలుత భావించారు. అయితే వారు చాపకింద నీరులా మావోయిస్టు పార్టీ విస్తరణకు వచ్చారన్న విషయం తెలియడం పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. అదే సమయంలో కరోనా విజృంభణతో లాక్డౌన్ విధించడం మావోలకు కలసి వచ్చింది. ఈ సమయంలో వారు పార్టీకి కావాల్సిన చందాలు, సామగ్రి సమకూర్చుకున్నారు. పలువురు ప్రజాసంఘాల నాయకులు కూడా పార్టీ రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నించారని పోలీసులు కేసులు నమోదు చేశారు. కొందరు మావో సానుభూతిపరులు చందాలు వసూలు చేస్తూ సిరిసిల్లలో పోలీసులకు దొరికారు. జూలై 15న ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఆటవీ ప్రాంతంలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరేపు అడేళ్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని దళం స్పెషల్ పార్టీ పోలీసులకు తారసపడటం.. పరస్పరం కాల్పులు జరుపుకోవడం కలకలం రేపింది. ఆ సమయంలో స్థానిక అటవీ ప్రాంతంలోకి 15 మంది యువత అదృశ్యమయ్యారన్న వార్త కూడా పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ఆ మర్నాడే డీజీపీ మహేందర్‌రెడ్డి హుటాహుటిన ఆసిఫాబాద్ వెళ్లారు. అదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలోనూ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఆ రోజు నుంచి గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులంతా అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. రెండుసార్లు ఆసిఫాబాద్‌కు.. మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారంటూ ఈ నెల 1న జరిగిన ప్రచారంతో పోలీసులు, మావోయిస్టులు ఉలిక్కిపడ్డారు. ఆ మర్నాడే డీజీపీ మహేందర్‌రెడ్డి ఆకస్మికంగా ఆసిఫాబాద్ చేరుకున్నారు. 45 రోజుల్లో డీజీపీ రెండుసార్లు ఆసిఫాబాద్‌లో పర్యటించడంతో ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆసిఫాబాద్‌లో మావోల కదలికలు పెరగడం, అదే సమయంలో గణపతి, మరికొందరు మావో అగ్రనేతలు లొంగిపోతారన్న వార్తలు తోడవడంతో రాష్ట్రంలో ఏదో జరుగుతోందన్న చర్చ తీవ్రమైంది. అయితే గణపతి లొంగుబాటు ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ ఖండించింది. అవన్నీ కట్టుకథలని, పోలీసుల మైండ్‌గేమ్ అని లేఖ విడుదల చేసింది. తమకు ప్రజల్లో పూర్వ ఆదరణ లభిస్తోందని, తప్పకుండా రాష్ట్రంలో పునర్వైభవం సాధిస్తామని మావోలు ప్రతినబూనారు. అయితే ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ గన్‌మన్, యాక్షన్ కమిటీ సభ్యుడు శంకర్ గుండాలలో పోలీసుల ఎన్కౌంటర్లో మృతిచెందడంతో యాక్షన్ కమిటీ సభ్యుల సంచారం నిజమేనని తేలింది. దీంతో డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మావోలు బలపడేందుకు అవకాశమున్న అటవీ, గోదావరి పరీవాహక జిల్లాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని పలు ఠాణాల్లో సీఐలు, ఎస్సైలను ఆకస్మికంగా బదిలీ చేశారు. గతంలో మావోలను సమర్థంగా ఎదుర్కొన్న సీనియర్ పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే రెండు దశాబ్దాలనాటి ఇన్ఫార్మర్ వ్యవస్థను తిరిగి బలోపేతం చేసుకోవాలని, అటవీ ప్రాంతాల్లో కొరియర్లు, సానుభూతిపరుల కదలికలపై నిఘా పెట్టాలంటూ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తిరిగి కార్యాకలాపాలు ప్రారంభించిన మావోయిస్టులను సరిహద్దులోనే అడ్డుకోవాలని డీజీపీ వ్యూహాలు రచిస్తుండగా.. ప్రజామద్దతుతో తిరిగి బలపడతామని మావోలు చెబుతున్నారు. -
హై టెన్షన్.. 26 మంది కిడ్నాప్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో తిరిగి పుంజుకునేందుకు మావోయిస్టుల ప్రయత్నాలు.. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ముమ్మరంగా కూంబింగ్.. వెరసి మన్యం అట్టుడికిపోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దేవళ్లగూడెంలో ఇటీవలి ఎన్కౌంటర్, సరిహద్దున ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో నలుగురు జవాన్లను శనివారం మావోలు హతమార్చిన తాజా ఘటనలతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మావోయిస్టులు ఈ నెల 6వ తేదీన ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం నెలకొంది. మావోలు తమ ప్రాబల్యం పెంచుకునేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. యాక్షన్ టీమ్‌లను ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి పంపారు. జూలై 20న మావోయిస్టు పార్టీ కొత్తగా రాష్ట్ర కమిటీని, మరో 12 డివిజన్, ఏరియా కమిటీలను, రాష్ట్రస్థాయి యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసు యంత్రాంగం మావోలను నిరోధించేందుకు నిరంతరం సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ నెల 3న గుండాల ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత హరిభూషణ్ గన్‌మన్, యాక్షన్ టీం కమిటీ సభ్యుడు దూది దేవాల్ అలియాస్ శంకర్ హతమయ్యాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ లేఖలను విడుదల చేసిన మావోయిస్టు ఏరియా, డివిజన్ కమిటీ కార్యదర్శులు ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుండటంతో అవాంఛనీయ, విధ్వంసక ఘటనలు జరగకుండా నిరోధించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. యాక్షన్ టీమ్‌లు సంచరిస్తున్న గోదావరి పరీవాహక జిల్లాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కీలకమైన ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. డీజీపీ పర్యవేక్షణ డీజీపీ మహేందర్‌రెడ్డి నాలుగు రోజులుగా ఆసిఫాబాద్ జిల్లాలోనే మకాం వేసి సెర్చ్ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి పరీవాహక జిల్లాల్లో కూంబింగ్ ఆపరేషన్లు జిల్లా ఎస్పీలు చూసుకుంటున్నారు. సబ్ డివిజినల్ పోలీసు అధికారులు ఏకంగా స్పెషల్ పార్టీ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. కొన్ని నెలల కిందట ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని సబ్ డివిజన్లలో ఎస్డీపీఓలుగా ప్రభుత్వం ఐపీఎస్ అధికారులనే నియమించింది. భద్రాచలంతోపాటు మణుగూరు, ఏటూరునాగారం సబ్ డివిజన్లకు ఐపీఎస్‌లను కేటాయించారు. మరోవైపు మూడు రోజుల కిందట భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జిల్లాల్లో ప్రజాప్రతినిధుల సిఫారసులతో సంబంధం లేకుండా పోలీస్‌బాస్ మార్క్‌తో ఓఎస్డీ, సీఐల బదిలీలు చేశారు. మావోయిస్టు ఆపరేషన్లు చేయడంలో అనుభవం ఉన్న వారిని కీలకమైన ఠాణాలకు కేటాయించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో హైఅలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్), సీతారామ ఎత్తిపోతల పథకాలకు పోలీసులు భద్రత మరింత పెంచారు. ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తుండటంతో మావోలు వారిలో కలసిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నాయకులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 26 మంది కిడ్నాప్ నలుగురి హత్య మావోయిస్టులు భద్రాద్రి ఏజెన్సీకి సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని మోటాపోల్, పునాసార్ అనే రెండు గ్రామాలకు చెందిన నలుగురు గిరిజనులను శనివారం పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో హతమార్చారు. ముందుగా ఈ రెండు గ్రామాలకు చెందిన 26 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ప్రజాకోర్టు ఏర్పాటు చేసి ఈ నలుగురిని గొంతుకోసి దారుణంగా చంపారు. ఆరుగురిని విడిచిపెట్టి, మరో 16 మందిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. బలగాలు కూంబింగ్ ఆపరేషన్లను నిలిపేయకపోతే తమ అధీనంలో ఉన్న 16 మందిని హతమారుస్తామని మావోయిస్టులు హెచ్చరించారు. -
తెలంగాణ బంద్..అడవుల్లో హై అలర్ట్!
-
తెలంగాణ బంద్: అడవుల్లో హై అలర్ట్
సాక్షి, ఆదిలాబాద్ : ప్రజాకవి, విరసం నేత వరవరరావును విడుదల చేయాలని కోరుతు శనివారం తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ పటిష్టం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ ఏరియాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన బలగాలు.. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఆ ప్రాంతాలను వారి గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టి ఉంచారు. మంచిర్యాల-మహారాష్ట్ర ప్రాంతాలపై కోటపల్లి, వెమనపల్లి, నీల్వయి ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాల్లో 3 రోజులుగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు, సాయుధ దళాల సంచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు అధికార పార్టీ ప్రతినిధి జగన్ రాష్ట్ర కార్యదర్శి పేరిట ఈ నెల 25 న బంద్ పిలుపునిచ్చారు. ఈ నెల 28 నుంచి అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించాలని ప్రకటనలు వెలువడ్డ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ అధ్వర్యంలో జిల్లా డీసీపీ, ఏసీపీలతో పాటు మొత్తం 500 మంది స్పెషల్ పార్టీ, క్యాట్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు ప్రాణహిత పరివాహక గ్రామాల్లోని అడవులను జల్లెడ పడుతున్నారు. అలాగే సీఐ, ఎస్పై, సీఆర్పీఎఫ్ బలగాలు, సివిల్ పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. కొత్త వ్యక్తులను గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆయా గ్రామస్తులను కోరారు. సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంటుందన్నారు. ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాలలో నిరంతరం నిఘా కోసం సీసీ కెమెరాలను అలాగే డోన్ కెమెరాలను వాడుతున్నట్టు అధికారులు తెలిపారు.మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి మావోలు నది దాటి వచ్చే అవకాశం ఉన్నందున అపరిచిత వ్యక్తులపై దృష్టి సారించామన్నారు. సరిహద్దు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేశారు. -
25న రాష్ట్ర బంద్‌కు మావోల పిలుపు
సాక్షి, హైదరాబాద్ : ప్రజాకవి, విరసం నేత వరవరరావు అక్రమ నిర్బంధానికి నిరసనగా ఈ నెల 25వ తేదీన రాష్ట్ర ప్రజలు బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేసింది. అర్బన్ నక్సల్స్ పేరుతో అరెస్టు చేసిన వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాతో సహా 12 మందిని, 60 ఏళ్లు పైబడిన రాజకీయ ఖైదీలను ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఉపా, ఎన్ఐఏ కేసులను ఎత్తేయడంతోపాటు అడవుల నుంచి గ్రేహౌండ్స్ దళాలను వెంటనే వెనక్కి పిలవాలని లేఖలో డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణలో కార్యకలా పాలు ఉధృతం చేసేందుకు రాష్ట్ర కమిటీతోపాటు 12 ఏరియా కమిటీలను మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఆసిఫాబాద్‌లో దాదాపు 15 మంది యువతను దళంలో చేర్చుకున్నారని, ఆదివాసీలు ఉన్న అన్నిప్రాంతాల్లోనూ రిక్రూట్మెంట్ జరిగి నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు మావోయిస్టు పార్టీ వేసిన కమిటీలు, వారి వివరాలు.. రాష్ట్ర కమిటీ సభ్యులు మొత్తం ఏడుగురు సభ్యులతో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ యాప నారాయణను ఎన్నుకున్నట్లు సమాచారం. పుల్లూరి ప్రసాద్, బండి ప్రకాశ్, దామోదర్, భాస్కర్, సాంబయ్య, కంకణాల రాజిరెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు పర్యవేక్షణలో రాష్ట్ర కమిటీ పనిచేస్తుందని, దీని ఆధీనంలో 12 ఏరియా కమిటీలు పనిచేస్తాయని తెలిసింది. ఏరియా కమిటీలు 1. కంకణాల రాజిరెడ్డి నేతృత్వంలో జయశంకర్ జిల్లా మహబూబాబాద్ జిల్లా, వరంగల్– పెద్దపల్లి ఏరియా కమిటీ. 2. రీనా అలియాస్ సమే– ఏటూరునాగారం– మహదేవ్పూర్ ఏరియా కమిటీ. 3. ఉంగి– వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ. 4. మంగు నేతృత్వంలో ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ. 5. అడెల్లు భాస్కర్ సారథ్యంలో మంచిర్యాల కొమ్రంభీం జిల్లా కమిటీ. 6. లింగమ్మ– మంగీ ఏరియా కమిటీ. 7.వర్గేష్ – ఇంద్రవెల్లి ఏరియా కమిటీ, 8. నరసింహారావు– చెన్నూరు–సిర్పూర్ ఏరియా కమిటీ. 9. సమ్మక్క అలియాస్ శారద– చర్ల శబరి ఏరియా కమిటీ. 10. రమాల్– మణుగూరు ఏరియా కమిటీ. 11.సాంబయ్య – భద్రాద్రి కొత్తగూడెం– ఈస్ట్ గోదావరి డివిజనల్ కమిటీ. 12. బడే చొక్కారావు అలియాస్ దామోదర్– తెలంగాణ యాక్షన్ కమిటీ. -
రెండు బూత్‌ల్లో జరగని పోలింగ్
ముంచంగిపుట్టు(పెదబయలు): బూటకపు ఎన్నికలు బహిష్కరించాలని కోరుతూ గురువారం బుంగాపుట్టు, రంగిలిగుడ గ్రామాల మధ్యలో రోడ్డుకు అడ్డంగా మావోయిస్టులు చెట్లు నరికారు. దీంతో బుంగాపుట్టు పంచాయతీ బుంగాపుట్టు, కోసంపుట్టు కేంద్రాలలో పోలింగ్ జరగలేదు. బుంగాపుట్టు పంచాయతీకి చెందిన బుంగాపుట్టు, కోసంపుట్టు పోలింగ్ బూత్‌లను ఏడు కిలో మీటర్ల దూరంలో ఉన్న మచ్చేపురానికి తరలించిన విషయం విధితమే. ఆ రెండు గ్రామాలకు చెందిన 1060 మంది ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తరలించడానికి అధికారులు 16 వాహనాలు ఏర్పాటు చేశారు. ఆ వాహనాలు గ్రామాల నుంచి ఓటర్లు పోలింగ్‌బూత్‌లకు తరలిస్తుండగా మావోయిస్టులు చెట్లు నరికారు. బూట కపు ఎన్నికలు బహిష్కరించాలని కోరుతూ బ్యా నర్లు కట్టారు. దీంతో ఆయా గ్రామస్తులు ఆందోళనకు గురై పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా తిరిగి తమ గ్రామాలకు చేరుకున్నారు. దీంతో ఆ రెండు బూత్‌లలో పోలింగ్ జరగలేదు. స్థానికులతో చెట్లను తొలగించారు. మూ డు గంటల తరువాత జీపులు పెదబయలు చేరుకున్నాయి. -
‘ఆపరేషన్ సమాధాన్’పై మావ్చోల పోరు
సాక్షి, కొత్తగూడెం: మావోయిస్టులకు, బలగాలకు మధ్య సుదీర్ఘకాలంగా పోరు జరుగుతోంది. కొన్ని నెలలుగా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సమాధాన్’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. ఆంగ్ల అక్షరమాలలోని ‘ఎస్ ఏ ఎం ఏ డీ హెచ్ ఏ ఎన్’ (ఎస్–స్మార్ట్ లీడర్షిప్), (ఏ–అగ్రెసివ్ స్ట్రాటజీ), (ఎం–మోటివేషన్ అండ్ ట్రైనింగ్), (ఏ–యాక్షనబుల్ ఇంటెలిజెన్సీ), (డి–డాష్‌బోర్డ్ బేస్డ్ కీ), (హెచ్–హార్నెసింగ్ టెక్నాలజీ), (ఏ–యాక్షన్ ప్లాన్), (ఎన్–నో యాక్సెస్ టు ఫైనాన్సింగ్) లక్ష్యంతో ఈ ఆపరేషన్‌ను చేపడుతోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలీసులను సమన్వయపర్చుకుంటూ కేంద్ర బలగాలను దండకారణ్యంలోకి కేంద్ర ప్రభుత్వం ముందుకు నడిపిస్తోంది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, సుక్మా, బీజాపూర్, బస్తర్, కాంకేర్, నారాయణపూర్ జిల్లాల్లో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా, మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. మొన్నటి శాసనసభ ఎన్నికలకు ముందు నుంచే ‘ఆపరేషన్ సమాధాన్’కు కేంద్రం పదును పెట్టింది. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలున్నాయి. వీటి నిర్వహణకు మావోయిస్టుల నుంచి ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండా చూసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలను పోలీసులు గట్టిగానే నియంత్రించగలిగారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలోకి ప్రవేశించేందుకు మావోయిస్టులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. సభలు–సమావేశాలు, బంద్... పై పరిణామాలన్నింటి నేపథ్యంలో, ‘ఆపరేషన్ సమాధాన్’కు వ్యతిరేకంగా మావోయిస్టులు ఈ నెల 25 నుంచి 30 వరకు సభలు–సమావేశాలకు, 31న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. వీటి ప్రచా రంలో భాగంగా శుక్రవారం భద్రాచలం బస్టాండులో కరపత్రాలు, అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు–నెల్లిపాక బంజర గ్రామాల మధ్యలో బ్యానర్లు, చర్ల మండలంలోని ఆర్.కొత్తగూడెం–కుదునూరు మధ్య ప్రధాన రహదారిపై కనిపించాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలంలోని సూరవీడు వద్ద బ్యానర్లు, ఆంధ్రప్రదేశ్‌లోని చింతపల్లి మండలం అంతర్లా గ్రామ వద్ద కరపత్రాలు, భద్రాచలం నుంచి అశ్వారావుపేట వెళ్లే ప్రధాన రహదారి పక్కన పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం మారేడుబాక, ఉప్పేరు, వెంకటాపురం గ్రామాల వద్ద బ్యానర్లు, పోస్టర్లు కనిపించాయి. జయశంకర్ జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు వద్ద కామినిచెరువు పనులు చేస్తున్న జేసీబీని ఈ నెల 24న మావోయిస్టులు తగులబెట్టారు. ‘సమాధాన్’కు వ్యతిరేకంగా బ్యానర్లు, కరపత్రా లు వదిలారు. పాక్షిక మైదాన ప్రాంతంగా పేరుపడిన అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు–నెల్లిపాక బంజర ప్రాంతంలోనూ మావోయిస్టుల బ్యానర్లు కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. రెచ్చిపోతున్న మావోయిస్టులు... మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. బాంబులు పెడుతున్నారు, పేలుస్తున్నారు. ఈ నెల 22న చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో ప్రెషర్ బాంబు పేలడంతో నలుగురు ఆర్ అండ్ బీ ఉద్యోగులు గాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఎల్‌డబ్ల్యూఈ నిధులతో పెదమిడిసీలేరు నుంచి చెన్నాపురం వరకు గతంలో రోడ్డు నిర్మాణం పూర్తియింది. దీని పక్కన కిలోమీటర్ రాళ్లను పాతేందుకు ఆర్ అండ్ బీ ఉద్యోగులు మార్కింగ్ చేస్తుండగా ప్రెషర్ బాంబు పేలింది. 2018 డిసెంబర్ 31న చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ సమీపంలోని తిప్పాపురం రోడ్డులో మావోయిస్టులు అమర్చిన రెండు మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. 2018 డిసెంబర్ 11న చర్ల మండలంలోని బోదనెల్లి సమీపంలో ప్రధాన రహదారిపై మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పోలీసులు గుర్తించారు. బయటకు తీస్తుండగా అది పేలింది. ఒక జావానుకు తీవ్ర గాయాలయ్యాయి. 2018 డిసెంబర్ 7న చర్ల మండలం పెదమిడిసిలేరు సమీపంలోని తిప్పాపురం మార్గంలోగల పగిడివాగు చప్టాను మందుపాతరతో మావోయిస్టులు పేల్చివేశారు. 2017 జూలైలో చర్ల మండలంలోని లెనిన్ కాలనీకి వెళ్లే మార్గంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. 2018 మే 5న చర్ల మండలంలోని సత్యనారాయణపురం ప్రధాన రహదారిలోగల ప్రధాన కల్వర్టును మావోయిస్టులు మందుపాతరలతో పేల్చివేశారు. 2018 మే నెలలో చర్ల బస్టాండ్ అవుట్ గేట్ వద్ద మావోయిస్టులు బ్యాగులో ఉంచిన ప్రెషర్ బాంబును పోలీసులు గుర్తించారు. దానిని స్వాధీనపర్చుకుని, సమీపంలోని చెరువు వద్ద నిర్వీర్యం చేశారు. ‘సమాధాన్‘మిస్తున్న బలగాలు దాడులు, బాంబులతో రెచ్చిపోతున్న మావోయిస్టులకు ‘ఆపరేషన్ సమాధాన్’ పేరుతో బలగాలు గట్టిగానే సమాధానమిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దండకారణ్యం నుంచి తెలంగాణలోని సరిహద్దు జిల్లాల్లోకి చొచ్చుకొచ్చేందుకు మావోయిస్టులు సాగించిన ప్రయత్నాలను మన పోలీసులు గట్టిగానే తిప్పికొట్టారు. దీనికి ప్రతీకారంగా, మావోయిస్టులు దాడులకు, విధ్వంసానికి దిగుతున్నారు. పోలీసు బలగాలే లక్ష్యంగా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దాటి వస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం మండలాల్లో అనేకచోట్ల మందుపాతరలు, ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేశారు. వీటి నుంచి బలగాలు చాకచక్యంగా తప్పించుకుని దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాడులకు మావోయిస్టు పార్టీ యాక్షన్ టీములు రంగంలోకి దిగినట్టు పోలీసులు గుర్తించారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాక్షన్ టీం ఏర్పాటైనట్టు, ఇన్చార్జిగా దామోదర్ నియమితులైనట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు, పకడ్బందీగా వ్యవహరించారు. గత నవంబర్ 28న మావోయిస్టు పార్టీ మణుగూరు–పాల్వంచ ఏరియా కార్యదర్శి సుజాతక్కను అరెస్ట్ చేశారు. మావోయిస్టు పార్టీ ఈమె తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం–తూర్పుగోదావరి జిల్లాల కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ భార్యనే ఈ సుజాతక్క. యాక్షన్ టీం వివరాలను ఈమె నుంచి పోలీసులు సేకరించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత ఒకవైపు, మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. మరోవైపు, బలగాలు–పోలీసులు గట్టిగానే ‘సమాధాన్’మిస్తున్నారు. ఇంకోవైపు, మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో... ‘ఆపరేషన్ సమాధాన్’ను ఓడించాలంటూ మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ పేరుతో వారు తీవ్ర హింసకు దిగే ప్రమాదముంది. ‘సమాధాన్’ పేరుతో బలగాలు–పోలీసులు కూడా అప్రమత్తంగా, సర్వసన్నద్ధంగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే... సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం, తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
మావోయిస్టుల నిరసన వారోత్సవాలు తొలిరోజు ప్రశాంతం
విశాఖపట్నం , అరకులోయ : కేంద్ర ప్రభుత్వం ఆమలుజేస్తున్న సమాధాన్‌కు నిరసనగా మావోయిస్టులు చేపట్టిన నిరసన వారోత్సవాల తొలిరోజు శుక్రవారం ప్రశాంతంగానే ఉంది. ఈ వారోత్సవాలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఏవోబీ వ్యాప్తంగా పోలీసులు తనిఖీలను విస్తృతం చేశారు. ప్రధాన రోడ్లలో వాహనాల తనిఖీలను చేపడుతూ ప్రయాణికుల లగేజీ బ్యాగులను సోదాలు చేస్తున్నారు. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వాహనాలపై పోలీసులు మరింత నిఘా ఉంచారు. పాడేరు నుంచి అరకులోయ పోయే వాహనాలతో పాటు, సరిహద్దులో ఉన్న ఒడిశా గ్రామాల నుంచి కామయ్యపేట మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాహనాలను హుకుంపేట వద్ద ఎస్ఐ నాగకార్తీక్ తనిఖీలు చేశారు. అనుమానిత వ్యక్తుల సమాచారం సేకరించారు. అరకు సంతలోనూ తనిఖీలు చేపట్టారు. ఏజెన్సీలోని రూడకోట, నుర్మతి అవుట్ పోస్టుల పరిధిలోని ప్రత్యేక పోలీసు పార్టీలు డేగకన్నుతో వ్యవహరిస్తున్నాయి. పాడేరులో తనిఖీలు పాడేరు : సమాధాన్ కార్యక్రమానికి వ్యతిరేకంగా సీపీఐ మావోయిస్టులు ఈ నెల 25 నుంచి 31 వరకు నిరసన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పాడేరు పట్టణం నలుమూలల పోలీసులు శుక్రవారం ముమ్మరంగా నిఘా చర్యలు చేపట్టారు. పట్టణం వెలుపల జి.మాడుగుల వైపు, పెదబయలు వైపు వెళ్లే ప్రధాన రహదారుల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని బక్కలపనుకు ఏరియాలో పోలీసులు గృహ తనిఖీలు నిర్వహించారు. కూడలి ప్రాంతాలు, ఆర్టీసీ కాంప్లెక్సు తదితర చోట్ల తనిఖీలు చేపట్టారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, ఎస్ఐ రామారావు పర్యవేక్షణలో పోలీసు బృందాలు నిఘా చేపట్టాయి. కూంబింగ్ ఉధృతం కొయ్యూరు : కొన్ని వారాలుగా మావోయిస్టుల పలకజీడి వారపు సంతల్లో కరపత్రాలు వేస్తున్నారు. దీంతో పోలీసులు ఆటువైపుగా కూంబింగ్‌ను ఉధృతం చేశారు. టీడీపీ, బీజేపీ నేతలను లక్ష్యంగా చేస్తూ మావోయిస్టులు కరపత్రాలు, పత్రికాప్రకటనలు చేయడంతో ఆ పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. కరపత్రాలు వెదజల్లిన మావోయిస్టులు చింతపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ఆపరేషన్ సమాధాన్ దాడిని ఓడించాలని సీపీఐ మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈమేరకు పలుగ్రామాల్లో కరపత్రాలు వెదజల్లారు. సమాధాన్ పేరుతో కొనసాగిస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా 30 వరకు నిరసనలు తెలియజేయాలని, 31న భారత్ బంద్ పాటించాలని కరపత్రాల్లో పేర్కొన్నారు. -
వేడెక్కిన ఏజెన్సీ
విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాధాన్ పేరుతో పీడీత ప్రజలను టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తూ మావోయిస్టులు ఈనెల 25వతేదీ నుంచి నిరసన వారోత్సవాలకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఏవోబీలో భయానిక వాతావరణం నెలకొంది. కొయ్యూరు(పాడేరు), అరకులోయ: సాధారణంగా మావోయిస్టులు ఏడాదిలో రెండుసార్లు మాత్రమే వారోత్సవాలను నిర్వహిస్తారు. మొదటిది జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమర వీరుల వారోత్సవాలను నిర్వహిస్తారు. డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు ప్రజాగెరిల్లా విముక్తి దళం(పీఎల్జీఏ) వారోత్సవాలను నిర్వహిస్తారు. మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్రం చేపట్టినఆపరేషన్ సమాధాన్‌కు వ్యతిరేకంగా ఈ సారి నిరనస వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నెల 31 భారత్‌బంద్ చేయాలని పిలుపునిచ్చిందిమిలటరీ వ్యూహ రచనలో దిట్టయిన నాంబళ్ల కేశవరావు అలియాస్ గంగన సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బా«ధ్యతలు స్వీకరించిన తరువాత నిర్వహిస్తున్న రెండో వారోత్సవాలివి. ఈ నిరసన వారోత్సవాల్లో మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడే వీలుందని పోలీసులు భావిస్తున్నారు. ఏవోబీఎస్‌జెడ్‌సీ అధికార ప్రతినిధి జగబ ంధు పేరిట కొద్ది రోజుల కిందట నిరసన వారోత్సవంపై ప్రకటన వెలువడింది. కేంద్రంలో ఉన్న బీజేపీ,రాష్ట్రంలో టీడీపీలు మావోయిస్టు ఉద్యమాన్ని అణిచివేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాయని ఆరోపించారు.సెల్‌టవర్లు పేల్చేస్తారని లేదా ఇతర సౌకర్యాలను నాశనంచేస్తారని ఆరోపిస్తూ పోలీసులు గిరిజనులతో ర్యాలీలు చేయిస్తున్నారని ఆరోపించారు. సంతలు ,బ్యాంకులకు వెళ్తున్న గిరిజనులను బలవంతంగా తీసుకుపోయి లొంగుబాట్లు చూపిస్తున్నారని విమర్శించారు. నిరసన వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు విధ్వంసాలకు పాల్ప డే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల మావోయిస్టులు పలకజీడి వారపు సంతలో కరపత్రాలను ఎక్కువగా వేస్తున్నారు. ఈ రెండు నెలల్లో మూడుసార్లు కరపత్రాలను వేశారు.ఒకసారి సంతలో వ్యాపారులపై వేస్తే ఇటీవల పోలీసులకు వ్యతి రేకంగా పోస్టర్లు వేశారు.దీంతో పోలీసులు అటువైపు కూంబింగ్ ఉధృతం చేశారు. నేతలకు హెచ్చరికలు నిరసన వారోత్సవాలు ముగిసేంత వరకు బీజేపీ,టీడీపీ నేతలు,ఇతర ప్రజాప్రతినిధులు మారుమూల గ్రామాల్లో పర్యటనలు మానుకోవాలని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.ముంచంగిపుట్టు,పెదబయలు,హుకుంపేట,జైపూర్ జంక్షన్ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. పోలీసులు అప్రమత్తం ఏవోబీ వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్నతాధికారులు రెడ్ ఆలర్ట్‌ను అమలుచేస్తున్నారు.ఏపీ,ఒడిశా సీఎంలు చంద్రబాబు,నవీన్పట్నాయిక్లు కూడా సరిహద్దులోని గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని జగబంధు ఆరోపించడంతో ఈ రెండు రాష్ట్రాల పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. మల్క న్గిరి,కోరాపుట్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతాలతో పాటు,అవుట్ పోస్టులు ఉన్న కటాఫ్ ఏరియాలో పోలీసు పార్టీలు కూంబింగ్ చర్యలను విస్తృతం చేశాయి. విశాఖ ఏజెన్సీ మారుమూల ప్రాంతాలపై నిఘా పెంచారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు పార్టీలు వాహనాల తనిఖీలు మమ్మురం చేశాయి. మద్దిగరువులో మావోయిస్టు వాల్‌పోస్టర్లు జి.మాడుగుల(పాడేరు): మండలంలో బొయితిలి పంచాయతీ మద్దిగరువు, సూరిమెట్ట పులుసుమామిడి గ్రామాల్లో బుధవారం రాత్రి మావోయిస్టుల వాల్‌పోస్టర్లు వెలిశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... హిందూ ఎజెండాతో మైనార్టీలు, మహిళలు, పీడిత సామాజిక వర్గాలపై చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని వాటిలో పేర్కాన్నారు. ఉద్యమ ప్రాంతాల్లో ప్రజలపై జరుగుతున్న దాడులు, అక్రమ అరెస్టులకు, బూటకపు లొంగుబాట్లకు అధికార పార్టీ నాయకులు బాధ్యతవహించాలని హెచ్చరించారు. సమాధాన్ పేరుతో ప్రజలపై కొనసాగుతున్న యుద్ధానికి వ్యతిరేకిస్తూ జనవరి 25 నుంచి 30 వరకు సభలు, సమావేశాలు, ర్యాలీల ద్వారా నిరసనలు తెలిపాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. జనవరి 31న భారత్‌బంద్‌లో భాగంగా ఏవోబీలో బంద్ విజయవంతం చేయాలని కోరింది. -
మావోయిస్టుల ఆచూకీ తెలిపితే రూ.5 లక్షల నజరానా
విశాఖపట్నం, సీలేరు(పాడేరు): ఆంధ్ర, ఒడిశా సరి హద్దు మావోయిస్టు పార్టీలో యాక్షన్‌టీం సభ్యులుగా తిరుగుతూ గిరిజన ద్రోహులైన మావోయిస్టులను ఆచూకీ తెలిపితే రూ.5 లక్షలు నజరానా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. జీకే వీధి మండలం సీలేరు పోలీస్‌స్టేషన్ పరిధిలో యాక్షన్‌టీం సభ్యుల ఫొటోలతో వాల్‌పోస్టర్లు అతికించి, కరపత్రాలు పంపిణీ చేశారు. ఇందులో ఎనిమిది మంది మావోయిస్టుల ఫొటోలు ముద్రించారు. వారిని పట్టిచ్చిన వారికి రూ.5లక్షలు ఇస్తూ, వారి వివారాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. వంతాల రామకృష్ణ, జనుమూరి శ్రీనుబాబు, రాకేష్ ఈ ముగ్గురు డీసీఎంలు, సత్తిబాబు, కిషోర్ వీరిద్దరు ఏసీఎంలు, ఆండాలు, శ్రీను,మూర్తి వీరు దళాసభ్యులుగా ఉన్నారని, మన్యంలో ఎక్కడ కనిపించినా తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ, పాడేరు ఏఎస్పీ, చింతపల్లి డీఎస్పీతో పాటు, విజయనగరం, పశ్చిమగోదావరి, రంపచోడవరం తదితర పోలీసు అధికారుల ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఏవోబీలో మావోయిస్టుల బంద్ ప్రశాంతం
విశాఖపట్నం, అరకులోయ: ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాల్లో బూటకపు ఎన్కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఏవోబీ ప్రతినిధి జగబందు పిలుపు మేరకు మంగళవారం జరిగిన ఏవోబీ బంద్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకోక పోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మావోయిస్టుల బంద్ పిలుపుతో మూడు రోజుల నుంచి పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. పాడేరు,చింతపల్లి పోలీసు సబ్డివిజన్ల పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లలో రెడ్ అలర్ట్ ప్రకటించి, అదనపు బలగాలను అందుబాటులో ఉంచారు. అలాగే అవుట్ పోస్టుల్లో భద్రత చర్యలను రెట్టింపు చేశా రు. మండల కేంద్రాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బీజేపీ, టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులను కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. దీంతో గిరిజన సంక్షేమ,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, సోమవారం రాత్రికి విశాఖ చేరుకున్నారు. పాడే రు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా ఏజెన్సీలో పర్యటనలు మానుకున్నారు. పోలీసుల హెచ్చరికలతో అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు మండల కేంద్రాలకే పరిమితమయ్యారు. మారుమూల గ్రామాలకు నిలిచిన రవాణా మావోయిస్టుల బంద్ పిలుపుతో మన్యంలోని మా రుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం నిలిచి పోయింది. విశాఖపట్నం నుంచి అరకులోయ మీ దుగా ఒడిశాకు నడిచే ఒనకఢిల్లీ, జైపూర్ బస్సులు మంగళవారం రద్దయ్యాయి. అరకులోయ–పాడువా రోడ్డు మీదుగా పలు ప్రైవేట్ వాహనాలు కూ డా నడవలేదు. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల సరిహద్దులోని కటాఫ్ ఏరియా ప్రాం తాలకు జీపులు, వ్యాన్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముంచంగిపుట్టు మండల కేంద్రం నుంచి ఒడిశా ప్రాంతానికి రవాణా స్తంభించింది. పాడేరు నుంచి నడిచే డుడుమ బస్‌ను ముంచంగిపుట్టు వరకే పరిమితం చేశారు. హుకుంపేట మండలం కామయ్యపేట రోడ్డు మీదుగా ఒడిశాలోని పాడువా ప్రాంతానికి ప్రైవేట్ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పాడేరు నియోజకవర్గం జి.మాడుగుల మండలంలో పాడేరు–జి.మాడుగుల, చింతపల్లి రోడ్డులో కొన్ని బస్సులు మాత్రమే తిరగాయి. నుర్మతి, మద్దిగరువు రోడ్డులో టికెట్ సర్వీసింగ్ జీపులు నిలిపివేశారు. మారుమూల గ్రామాలకు ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు నడపలేదు. ముంచంగిపుట్టు మండలంలోని ఒడిశా సరి హద్దుకు అనుకుని ఉన్న బుసిపుట్టు వారపుసంత కూడా జరగలేదు. అరకులోయ,డుంబ్రిగుడ,అనంతగిరి,హుకుంపేట మండలాల్లో దుకాణాలు తెరుచుకోగా, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో వ్యాపారులు దుకాణాలను ఉదయం 11 గంటల వరకు మూసివేసినప్పటికీ పోలీసులు రంగప్రవేశం చేసి, దుకాణాలను తెరిపించారు. మారుమూల ప్రాంతాల్లో కరపత్రాలు ముంచంగిపుట్టు మండలంలోని కుమడ జంక్షన్ నుంచి ఒడిశాలోని బెజ్జంగి పోయే రోడ్డుతోపాటు, లక్ష్మీపురం రోడ్డులో, నిత్యం నిఘా నిడాలో ఉండే చింతపల్లి మండల కేంద్రంలో మెట్టబంగ్లాకు సమీ పంలోని సాయిబాబా ఆలయం దగ్గర మావోయిస్టుల కరపత్రాలు అతికించారు. బంద్‌ను విజయవతం చేయాలని, బూటకపు ఎన్కౌంటర్లను నిరసించాలనే నినాదాలు ఈ కరపత్రాలలో ఉన్నట్టు ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. -
నేడు మావోల బంద్
శ్రీకాకుళం,భామిని: ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలో జరిగి న ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ, ఆ ఎన్కౌంటర్లో మృతి చెందిన సుశీల, సన్నాయి, మీనా తదితరులకు నివాళులు అర్పిస్తూ ఏఓబీ మావోయిస్టులు మంగళవారం మన్యం బంద్‌నకు పిలుపునిచ్చారు. దీనిపై స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. మన్యం బంద్‌కు ఏఓబీ కార్యదర్శి జగబంద్ పిలుపు మేరకు పోలీసులు ముందస్తు చర్యల్లోతలమునకలయ్యారు. సోమవారం సరిహద్దులో ము మ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఒడిశా నుంచి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిం చారు. మంగళవారం జరగనున్న ఏజెన్సీ బంద్ నేపథ్యంలో ముందస్తుగా సోమవారం రాత్రి ఏజెన్సీ వైపు వచ్చే ఆర్టీసీలు నిలిపివేశారు. ప్రధానంగా కొత్తూరు నుంచి భామిని, బత్తిలి వైపు వచ్చే బస్సులను కొత్తూరులోనే ఆపివేశారు. మంగళవారం కూడా రాత్రి పూట బస్సులు నిలిపివేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. తివ్వాకొండలపై నిఘా.. ఏఓబీలో కీలకమైన తివ్వాకొండలపై పోలీస్ వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. మావోల బంద్ నేపథ్యంలో గత వారం రోజులుగా తివ్వాకొండల్లోని గిరిజన గూడలను సాయుధ పోలీసులు జల్లెడ పట్టారు. ప్రతి గిరిజన గ్రామాన్ని సందర్శించి ఆది వాసీలతో స్నేహ సంబంధాలు పెంచుకొంటూ కొత్త వ్యక్తుల సమాచారం సేకరిస్తున్నారు. దీనికి తోడు ప్రత్యేక సాయుధ దళాలు కూడా సరిహద్దులో ముమ్మర కూంబింగ్‌లు చేపట్టాయి. బంద్ నే పథ్యంలో అధికార పార్టీ నాయకులందరికీ హెచ్చరికలు జారీ చేశారు. బత్తిలి ఎస్సై ఎం.ముకుందరావు ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో పర్యటనలు చేస్తూ సమాచారం సేకరిస్తున్నారు. అనుమానితులను స్టేషన్‌కు రప్పించి వాకబు చేస్తున్నారు. ‘ఇల్లు దాటి వెళ్లకండి’ కొత్తూరు: మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంగా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక సీఐ జె.శ్రీనివాసరావు ఏజెన్సీ పోలీస్ స్టేషన్లయిన సీతంపేట, దోనుబాయి, బత్తిలి, కొత్తూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. నాలుగు స్పెషల్ పార్టీ(ఎస్టీఎఫ్) దళాలు స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. సీతంపేట నుంచి కొత్తూరు, బత్తిలి నుంచి కొత్తూరు, దోనుబాయి నుంచి సీతంపేటతో పాటు పలు గిరిజన రహదార్లలో సోమవారం స్పెషల్ పార్టీలు ఆర్ఓపీ నిర్వహించారు. ప్రతి కల్వర్టు వద్దా తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా సీఐ నేతృత్వంలో వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు అనుమానం ఉన్న వ్యక్తుల నుంచి పూర్తి వివరాలు నమోదు చేసుకున్నారు. పోలీసులు గుర్తించిన ప్రజాప్రతినిధులకు ముం దుగానే హెచ్చరికలు పంపించారు. సమాచారం ఇవ్వకుండా ఇల్లు దాటి బయటకు వెళ్లవద్దంటూ ఆదేశాలు జారీ చేసినట్లు సీఐ జె.శ్రీనివాసరావు ‘సాక్షి’కి సోమవారం తెలిపారు. -
ఏవోబీలో హెలికాప్టర్లతో కూంబింగ్
విశాఖ: మావోయిస్టులు గురువారం 5 రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ఏరియాతో పాటు ఏవోబీ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. మన్యంలో భారీగా మొహరించిన పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అదే విధంగా హెలికాప్టర్లతో ఏవోబీలో కూంబింగ్ ను నిర్వహిస్తున్నారు. కాగా బంద్ ను విజయవంతం చేయాలని మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వెలిశాయి. బంద్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు భద్రత ను పెంచారు. -
విశాఖలో పోలీసుల విస్తృత తనిఖీలు
విశాఖ: మావోయిస్టు నేతలు నవంబర్ 3వ తేదీన బంద్ కు పిలుపునిచ్చిన ఈ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో పోలీసులు కూంబింగ్ కొనసాగుతోంది. పాడేరులో అదనపు బలగాలను మోహరించారు. బంద్ నేపథ్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లే ప్రజా ప్రతినిధులు సమాచారం ఇవ్వాలని పోలీసులు నేతలకు సూచించారు. ఏఓబీ ఎన్ కౌంటర్ కు సంబంధించి ఇప్పటివరకూ 16 మృతదేహాలను అప్పగించగా, బంధువులు రాని 12 మృతదేహాలను పోలీసులు ఖననం చేశారు. పాడేరులో మరో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో నవండర్ 3న బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించింది. ఏఓబీ ఎన్ కౌంటర్ పూర్తిగా కోవర్టు ఆపరేషన్ అని మావోయిస్టు పార్టీ నేతలు తాము విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఏఓబీలో ఈ నెల 24న జరిగిన ఎన్కౌంటర్, ఆయా ఘటనలలో దాదాపు 30 మంది మావోయిస్టులు మరణించారు. -
5 రాష్ట్రాల్లో మావోయిస్టుల బంద్!
హైదరాబాద్: ఏఓబీలో ఈ నెల 24న జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టు నేతలు నవంబర్ 3వ తేదీన బంద్ కు పిలుపునిచ్చారు. ఐదు రాష్ట్రాల్లో ఆ రోజు బంద్ కు పిలుపునిస్తూ ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ లేఖ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించింది. 40 ఏళ్ల తమ పార్టీ చరిత్రలో ఆ ఎన్ కౌంటర్ వల్ల మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లిందని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఏఓబీ ఎన్ కౌంటర్ పూర్తిగా కోవర్టు ఆపరేషన్ అని మావోయిస్టు పార్టీ నేతలు తాము విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఏఓబీలో ఈ నెల 24న జరిగిన ఎన్కౌంటర్, ఆయా ఘటనలలో దాదాపు 30 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.