బస్తర్‌లో భయం భయం!  | representative of Sakshi visited Dandakaranyam in Chhattisgarh | Sakshi
Sakshi News home page

బస్తర్‌లో భయం భయం! 

Published Fri, Mar 1 2024 3:32 AM | Last Updated on Fri, Mar 1 2024 3:32 AM

representative of Sakshi visited Dandakaranyam in Chhattisgarh

అటు మావోయిస్టులు.. ఇటు బలగాల మధ్య ఆదివాసీలు 

క్యాంపుల ఏర్పాటుతో పోలీసు బలగాల దూకుడు 

అభివృద్ధి, సంక్షేమ పథకాలు అంటూ ముందుకు.. 

వారిని అడ్డుకోవడానికి మావోయిస్టుల ప్రయత్నాలు 

పలుచోట్ల జనతన సర్కార్‌దే ఆధిపత్యం.. ఎవరికి వారే ఆంక్షలు.. తనిఖీలతో సమస్యలు 

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో పర్యటించిన ‘సాక్షి’ ప్రతినిధి 

అక్కడి పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలన 

తాండ్ర కృష్ణ గోవింద్, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తలపై రూ.కోటి రివార్డు ఉన్న కీలక నేత హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలో కేంద్ర భద్రతా దళాలు క్యాంప్‌ నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు– భద్రతా దళాల మధ్య సాగుతున్న పోరును తెలుసుకునేందుకు ‘సాక్షి’ బస్తర్‌ అడవుల బాటపట్టింది. అన్నలు విధించిన ఆంక్షలు, పారామిలటరీ చెక్‌ పాయింట్లను దాటుకుంటూ వెళ్లి వివరాలు సేకరించింది. జవాన్లు, అధికారులతోపాటు మావోయిస్టుల ప్రత్యేక పాలన (జనతన సర్కార్‌)లో నివసిస్తున్న ప్రజలతో ‘సాక్షి’ ప్రతినిధి మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనపై ప్రత్యేక కథనం.. 

ముందు, వెనక ప్రమాదం మధ్య.. 
బస్తర్‌ దండకారణ్యం పరిధిలోకి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా, దంతెవాడ,బస్తర్‌ జిల్లాలు వస్తాయి. ఇక్కడి ప్రజలు రెండు రకాల పాలనలో ఉన్నారు. వారి జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ మీడియా బృందం ప్రయత్నించింది. ముందుగా భద్రాద్రి జిల్లా చర్ల మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా పామేడుకు.. అక్కడి నుంచి సుక్మా జిల్లా పువ్వర్తికి వెళ్లింది. ఈ మార్గంలో ఎవరితో మాట్లాడినా.. వారి కళ్లలో సందేహాలు, భయాందోళన కనిపించాయి. కొండపల్లి వద్ద కొందరు గ్రామస్తులు మీడియా బృందాన్ని అడ్డుకున్నారు.

ఎవరి అనుమతితో వచ్చారంటూ గుర్తింపు కార్డులు అడిగి తీసుకున్నారు. సాయంత్రందాకా పలుచోట్లకు తీసుకెళ్లారు. తర్వాత ఓ వ్యక్తి వచ్చి ‘‘మీరంతా మీడియా వ్యక్తులే అని తేలింది. వెళ్లొచ్చు. ప్రభుత్వం తరఫునే కాకుండా ఇక్కడి ప్రజల కష్టాలను కూడా లోకానికి తెలియజేయండి’’ అని కోరాడు. అంతేగాకుండా ‘‘ఈ ప్రాంతంలోకి వచ్చేముందు అనుమతి తీసుకోవాల్సింది. అటవీ మార్గంలో అనేకచోట్ల బూబీ ట్రాప్స్, ప్రెజర్‌ బాంబులు ఉంటాయి. కొంచెం అటుఇటైనా ప్రాణాలకే ప్రమాదం’’ అని హెచ్చరించాడు. దీంతో మీడియా బృందం రాత్రికి అక్కడే ఉండి, మరునాడు తెల్లవారుజామున పువ్వర్తికి చేరుకుంది.

అక్కడ భద్రతా దళాల క్యాంపు, హిడ్మా ఇల్లును పరిశీలించింది. అయితే భద్రతాపరమైన కారణాలు అంటూ.. ఫొటోలు తీసేందుకు, వివరాలు వెల్లడించేందుకు పారామిలటరీ సిబ్బంది అంగీకరించలేదు. ఆ పక్క గ్రామంలో హిడ్మా తల్లి ఉందని తెలిసిన మీడియా బృందం వెళ్లి ఆమెను కలిసి మాట్లాడింది. తిరిగి వస్తుండగా నలుగురు సాయుధ కమాండర్లు అడ్డగించారు. బైక్‌లపై తెలంగాణ రిజిస్ట్రేషన్‌ నంబర్లను చూసిన ఓ తెలుగు జవాన్‌ కల్పించుకుని.. ‘‘మీరు కొంచెం ముందుకొచ్చి ఉంటే.. మా వాళ్లు కాల్చేసేవారు’’ అని హెచ్చరించాడు. అదే దారిలో నేలకూలిన ఓ పెద్ద చెట్టును కవర్‌గా చేసుకుని బంకర్‌ నిర్మించారని, అందులో సాయుధ జవాన్లు ఉన్నారని, జాగ్రత్తగా వెళ్లాలని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య మీడియా బృందం సాధ్యమైనన్ని వివరాలు సేకరించి తిరిగి చర్లకు చేరుకుంది. 

 జనతన్‌ సర్కార్‌ ఆధీనంలో.. 
బీజాపూర్‌ జిల్లా పామేడు నుంచి చింతవాగు, ధర్మారం, జీడిపల్లి, కవరుగట్ట, కొండపల్లి, బట్టిగూడెం మీదుగా పువ్వర్తి వరకు 60 కిలోమీటర్ల ప్రయాణం సాగింది. పామేడు, ధర్మారం గ్రామాల వరకే ఛత్తీస్‌గఢ్‌తోపాటు ప్రభుత్వ పాలన కనిపిస్తుంది. అక్కడివరకే పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి, అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాల వంటివి ఉన్నాయి. తర్వాత చింతవాగు దాటి కొద్దిదూరం అడవిలోకి వెళ్లగానే జనతన సర్కార్‌కు స్వాగతం పలుకుతున్నట్టుగా మావోయిస్టులు హిందీలో చెక్కలపై రాసి చెట్లకు తగిలించిన బోర్డులు వరుసగా కనిపించాయి. జనతన సర్కార్‌ ఆ«దీనంలోని ఈ ప్రాంతాల్లో ఎక్కడా బీటీ రోడ్డు లేదు. ఎటు వెళ్లాలన్నా కాలిబాట, ఎడ్లబండ్ల దారులే ఆధారం. 

పోడు భూములు.. స్తూపాలు 
జనతన సర్కార్‌ ఆ«దీనంలోని గ్రామాల్లో మావోయిస్టులు తవ్వించిన చెరువులు, పోడు వ్యవసాయ భూములు, రేకుల షెడ్లలోని స్కూళ్లు కనిపించాయి. కానీ ఎక్కడా తరగతులు నడుస్తున్న ఆనవాళ్లు లేవు. అక్కడక్కడా కొందరు టీచర్లు కనిపించినా మాట్లాడేందుకు నిరాకరించారు. అక్కడక్కడా సంతల్లో హెల్త్‌ వర్కర్లు మాత్రం కనిపించారు. పరిమితంగా దొరికే ఆహారం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్త్రీలు, పిల్లల్లో పోషకాహర లోపం కనిపించింది. అయితే గతంలో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వారు చెప్పారు. ఏ గ్రామంలోనూ గుడి, చర్చి, మసీదు వంటివి లేవు. జనతన సర్కార్‌లో మతానికి స్థానం లేదని స్థానికులు చెప్పారు. కొన్నిచోట్ల చనిపోయినవారికి గుర్తుగా నిలువుగా పాతిన బండరాళ్లు, మావోయిస్టుల అమరవీరుల స్తూపాలు మాత్రమే కనిపించాయి. బస్తర్‌ అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో ఇప్పసారా, లంద, చిగురు వంటి దేశీ మద్యం దొరుకుతుంది. కానీ జనతన సర్కార్‌ ఆ«దీనంలోని ప్రాంతాల్లో ఎక్కడా మద్యం ఆనవాళ్లు కనిపించలేదు. 
 
చాలా మందికి ఆధార్‌ కార్డుల్లేవు 
జనతన సర్కార్‌ పరిధిలోని గ్రామాల్లో సగం మందికిపైగా తమకు ఆధార్‌కార్డు, ఓటర్‌ గుర్తింపుకార్డులు లేవని చెప్పారు. వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అంతంతగానే దక్కుతున్నాయి. పువ్వర్తి సమీపంలోని మిర్చిపారా గ్రామానికి చెందిన మడకం సంజయ్‌ మాట్లాడుతూ.. ‘‘రేషన్‌ బియ్యం తీసుకుంటున్నాం. అది కూడా మా గ్రామాలకు పది– ఇరవై కిలోమీటర్ల దూరంలో జనతన సర్కార్‌కు ఆవల ఉండే మరో గ్రామానికి వెళ్లి రెండు, మూడు నెలలకు ఓసారి తెచ్చుకుంటాం..’’ అని చెప్పాడు. 

ఇక ఎన్నికల ప్రక్రియపై పటేల్‌పారా గ్రామానికి చెందిన నందా మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ చాలా గ్రామాలకు నామ్‌ కే వాస్తే అన్నట్టుగా సర్పంచ్‌లు ఉన్నారు. ఎక్కువ మంది ఎన్నికలను బహిష్కరిస్తారు. అయినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుండటంతో.. సమీప పట్టణాల్లో నివాసం ఉండేవారు నామినేషన్‌ దాఖలు చేస్తారు. వారిలో ఒకరు సర్పంచ్‌ అవుతారు. కానీ చాలా గ్రామాల్లో వారి పెత్తనమేమీ ఉండదు. పరిపాలనలో గ్రామ కమిటీలదే ఆధిపత్యం..’’ అని వివరించాడు. 

సమష్టి వ్యవసాయం 
చాలా ఊర్లలో ట్రాక్టర్లు కనిపించాయి. వాటికి రిజిస్ట్రేషన్‌ నంబర్లు లేవు. ఆ ట్రాక్టర్లను ఊరంతా ఉపయోగించుకుంటారని తెలిసింది. ఇక్కడి ప్రజలకు ఎలాంటి విద్యుత్‌ సౌకర్యం లేదు. అంతా దట్టమైన అడవి అయినా ఎక్కడా అటవీ సిబ్బంది ఛాయల్లేవు. ఇటీవలికాలంలో చేతిపంపులు, సోలార్‌ లైట్లు వంటివి కనిపిస్తున్నాయి. వినోదం విషయానికొస్తే.. సంప్రదాయ ఆటపాటలతో పాటు కోడిపందేలను ఆదివాసీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 
 
అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నాం 
ఇక్కడి ప్రజలకు రక్షణ కల్పించేందుకు, ప్రభుత్వం తరఫున సేవలు అందించేందుకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని పువ్వర్తి వద్ద విధులు నిర్వర్తిస్తున్న సుక్మా జిల్లా ఏఎస్పీ గౌరవ్‌ మొండల్‌ చెప్పారు. ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో సర్వే చేపట్టి తాగునీరు, విద్యుత్, స్కూల్, ఆస్పత్రి వంటి సౌకర్యాలు, ఇతర ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. అయితే క్యాంపుల ఏర్పాటులో ఉన్న వేగం ప్రభుత్వ పథకాల అమల్లో కనిపించడం లేదేమని ప్రశి్నస్తే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులే అందుకు కారణమన్నారు. ఇక క్యాంపుల ఏర్పాటు సమయంలో ఆదివాసీలు భయాందోళన చెందినా, తర్వాత శత్రుభావం వీడుతున్నారని మరో అధికారి తెలిపారు. ఈక్రమంలోనే జనతన సర్కారులోకి చొచ్చుకుపోగలుతున్నామన్నారు. 
 
ఇప్పటికీ మావోయిస్టులదే పైచేయి.. 
ప్రభుత్వ బలగాలు ఎంతగా మోహరిస్తున్నా ఇప్పటికీ అడవుల్లో మావోయిస్టులదే ఆధిపత్యం. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడి ప్రజలకు ఆటపాటలే ప్రధాన వినోద సాధనాలు. మావోయిస్టులు చేతన నాట్యమండలి వంటివాటి ద్వారా ఇక్కడి ప్రజల్లో విప్లవ భావాలను రేకెత్తిస్తారు. పిల్లలకు ఏడేళ్లు దాటగానే గ్రామ కమిటీల్లో చోటు కల్పించి, భావజాలాన్ని నేర్పుతారు. మావోయిస్టుల పట్ల ఎవరైనా వ్యతిరేకత చూపితే ప్రమాదం తప్పదనే భయాన్ని నెలకొల్పారు’’ అని ఆరోపించారు. 
 
హిడ్మా అడ్డాలో క్యాంపు వేసి.. 
పువ్వర్తి జనాభా 400కు అటుఇటుగా ఉంటుంది. అందులో దాదాపు వంద మంది మావోయిస్టు దళాల్లో ఉన్నారు. వీరిలో హిడ్మా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకోగా.. ఆయన సోదరుడు దేవా బెటాలియన్‌ కమాండర్‌గా ఉన్నారు. పువ్వర్తిలో హిడ్మా కోసం ప్రత్యేక సమావేశ మందిరం, కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఉండేవి. అక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే హిడ్మా సొంతిల్లు ఉంది. ప్రస్తుతం ఇవన్నీ భద్రతా దళాల ఆధీనంలో ఉన్నాయి. 

ఆధునిక పరికరాల సాయంతో వందల మంది కార్మికులు క్యాంపు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. ఇటీవలి వరకు రోడ్డుకూడా లేని ఈ గ్రామంలోకి ఇప్పుడు పదుల సంఖ్యలో లారీల్లో వస్తుసామగ్రి, రేషన్‌ తరలించారు. బుల్డోజర్లు, పొక్లెయినర్లు నిర్విరామంగా తిరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్, స్పెషల్‌ టాస్‌్కఫోర్స్, డి్రస్టిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్, బస్తర్‌ ఫైటర్స్‌ ఇలా వివిధ దళాలకు చెందిన సుమారు ఐదు వేల మంది సిబ్బంది మోహరించారు. గ్రామం నలువైపులా గుడారాలు, బంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. 
 
మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు.. 
అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్యాంపులు తమకు ఇబ్బందిగా మారుతున్నాయని చాలా మంది ఆదివాసీలు అంటున్నారు. కొండపల్లికి చెందిన మడావి మాట్లాడుతూ.. ‘‘క్యాంపులు ఏర్పాటైన తర్వాత మా గ్రామాల్లోకి వచ్చే భద్రతాదళాలు విచారణ పేరుతో జబర్దస్తీ చేస్తున్నాయి. రాత్రీపగలు తేడా లేకుండా కాల్పుల శబ్దాలు వినవస్తున్నాయి. విచారణ పేరిట ఎవరైనా గ్రామస్తుడిని తీసుకెళ్తే.. తిరిగి వచ్చే వరకు ప్రాణాలపై ఆశలేనట్టే. అందుకే భద్రతా దళాలు వస్తున్నట్టు తెలియగానే పెద్దవాళ్లందరం అడవుల్లోకి పారిపోతున్నాం’’ అని చెప్పాడు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘‘స్థానికులమైన మాకు భద్రతాదళాల నుంచి కనీస మర్యాద లేదు. అభివృద్ధి పేరిట అడవుల్లోకి వస్తున్నవారు గ్రామపెద్దల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు..’’ అని పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement