dandakaranyam
-
బస్తర్‌లో భయం భయం!
తాండ్ర కృష్ణ గోవింద్, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తలపై రూ.కోటి రివార్డు ఉన్న కీలక నేత హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలో కేంద్ర భద్రతా దళాలు క్యాంప్ నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు– భద్రతా దళాల మధ్య సాగుతున్న పోరును తెలుసుకునేందుకు ‘సాక్షి’ బస్తర్ అడవుల బాటపట్టింది. అన్నలు విధించిన ఆంక్షలు, పారామిలటరీ చెక్ పాయింట్లను దాటుకుంటూ వెళ్లి వివరాలు సేకరించింది. జవాన్లు, అధికారులతోపాటు మావోయిస్టుల ప్రత్యేక పాలన (జనతన సర్కార్)లో నివసిస్తున్న ప్రజలతో ‘సాక్షి’ ప్రతినిధి మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనపై ప్రత్యేక కథనం.. ముందు, వెనక ప్రమాదం మధ్య.. బస్తర్ దండకారణ్యం పరిధిలోకి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా, దంతెవాడ,బస్తర్ జిల్లాలు వస్తాయి. ఇక్కడి ప్రజలు రెండు రకాల పాలనలో ఉన్నారు. వారి జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ మీడియా బృందం ప్రయత్నించింది. ముందుగా భద్రాద్రి జిల్లా చర్ల మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడుకు.. అక్కడి నుంచి సుక్మా జిల్లా పువ్వర్తికి వెళ్లింది. ఈ మార్గంలో ఎవరితో మాట్లాడినా.. వారి కళ్లలో సందేహాలు, భయాందోళన కనిపించాయి. కొండపల్లి వద్ద కొందరు గ్రామస్తులు మీడియా బృందాన్ని అడ్డుకున్నారు. ఎవరి అనుమతితో వచ్చారంటూ గుర్తింపు కార్డులు అడిగి తీసుకున్నారు. సాయంత్రందాకా పలుచోట్లకు తీసుకెళ్లారు. తర్వాత ఓ వ్యక్తి వచ్చి ‘‘మీరంతా మీడియా వ్యక్తులే అని తేలింది. వెళ్లొచ్చు. ప్రభుత్వం తరఫునే కాకుండా ఇక్కడి ప్రజల కష్టాలను కూడా లోకానికి తెలియజేయండి’’ అని కోరాడు. అంతేగాకుండా ‘‘ఈ ప్రాంతంలోకి వచ్చేముందు అనుమతి తీసుకోవాల్సింది. అటవీ మార్గంలో అనేకచోట్ల బూబీ ట్రాప్స్, ప్రెజర్ బాంబులు ఉంటాయి. కొంచెం అటుఇటైనా ప్రాణాలకే ప్రమాదం’’ అని హెచ్చరించాడు. దీంతో మీడియా బృందం రాత్రికి అక్కడే ఉండి, మరునాడు తెల్లవారుజామున పువ్వర్తికి చేరుకుంది. అక్కడ భద్రతా దళాల క్యాంపు, హిడ్మా ఇల్లును పరిశీలించింది. అయితే భద్రతాపరమైన కారణాలు అంటూ.. ఫొటోలు తీసేందుకు, వివరాలు వెల్లడించేందుకు పారామిలటరీ సిబ్బంది అంగీకరించలేదు. ఆ పక్క గ్రామంలో హిడ్మా తల్లి ఉందని తెలిసిన మీడియా బృందం వెళ్లి ఆమెను కలిసి మాట్లాడింది. తిరిగి వస్తుండగా నలుగురు సాయుధ కమాండర్లు అడ్డగించారు. బైక్‌లపై తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్లను చూసిన ఓ తెలుగు జవాన్ కల్పించుకుని.. ‘‘మీరు కొంచెం ముందుకొచ్చి ఉంటే.. మా వాళ్లు కాల్చేసేవారు’’ అని హెచ్చరించాడు. అదే దారిలో నేలకూలిన ఓ పెద్ద చెట్టును కవర్‌గా చేసుకుని బంకర్ నిర్మించారని, అందులో సాయుధ జవాన్లు ఉన్నారని, జాగ్రత్తగా వెళ్లాలని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య మీడియా బృందం సాధ్యమైనన్ని వివరాలు సేకరించి తిరిగి చర్లకు చేరుకుంది. జనతన్ సర్కార్ ఆధీనంలో.. బీజాపూర్ జిల్లా పామేడు నుంచి చింతవాగు, ధర్మారం, జీడిపల్లి, కవరుగట్ట, కొండపల్లి, బట్టిగూడెం మీదుగా పువ్వర్తి వరకు 60 కిలోమీటర్ల ప్రయాణం సాగింది. పామేడు, ధర్మారం గ్రామాల వరకే ఛత్తీస్‌గఢ్‌తోపాటు ప్రభుత్వ పాలన కనిపిస్తుంది. అక్కడివరకే పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి, అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల వంటివి ఉన్నాయి. తర్వాత చింతవాగు దాటి కొద్దిదూరం అడవిలోకి వెళ్లగానే జనతన సర్కార్‌కు స్వాగతం పలుకుతున్నట్టుగా మావోయిస్టులు హిందీలో చెక్కలపై రాసి చెట్లకు తగిలించిన బోర్డులు వరుసగా కనిపించాయి. జనతన సర్కార్ ఆ«దీనంలోని ఈ ప్రాంతాల్లో ఎక్కడా బీటీ రోడ్డు లేదు. ఎటు వెళ్లాలన్నా కాలిబాట, ఎడ్లబండ్ల దారులే ఆధారం. పోడు భూములు.. స్తూపాలు జనతన సర్కార్ ఆ«దీనంలోని గ్రామాల్లో మావోయిస్టులు తవ్వించిన చెరువులు, పోడు వ్యవసాయ భూములు, రేకుల షెడ్లలోని స్కూళ్లు కనిపించాయి. కానీ ఎక్కడా తరగతులు నడుస్తున్న ఆనవాళ్లు లేవు. అక్కడక్కడా కొందరు టీచర్లు కనిపించినా మాట్లాడేందుకు నిరాకరించారు. అక్కడక్కడా సంతల్లో హెల్త్ వర్కర్లు మాత్రం కనిపించారు. పరిమితంగా దొరికే ఆహారం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్త్రీలు, పిల్లల్లో పోషకాహర లోపం కనిపించింది. అయితే గతంలో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వారు చెప్పారు. ఏ గ్రామంలోనూ గుడి, చర్చి, మసీదు వంటివి లేవు. జనతన సర్కార్‌లో మతానికి స్థానం లేదని స్థానికులు చెప్పారు. కొన్నిచోట్ల చనిపోయినవారికి గుర్తుగా నిలువుగా పాతిన బండరాళ్లు, మావోయిస్టుల అమరవీరుల స్తూపాలు మాత్రమే కనిపించాయి. బస్తర్ అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో ఇప్పసారా, లంద, చిగురు వంటి దేశీ మద్యం దొరుకుతుంది. కానీ జనతన సర్కార్ ఆ«దీనంలోని ప్రాంతాల్లో ఎక్కడా మద్యం ఆనవాళ్లు కనిపించలేదు. చాలా మందికి ఆధార్ కార్డుల్లేవు జనతన సర్కార్ పరిధిలోని గ్రామాల్లో సగం మందికిపైగా తమకు ఆధార్‌కార్డు, ఓటర్ గుర్తింపుకార్డులు లేవని చెప్పారు. వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అంతంతగానే దక్కుతున్నాయి. పువ్వర్తి సమీపంలోని మిర్చిపారా గ్రామానికి చెందిన మడకం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘రేషన్ బియ్యం తీసుకుంటున్నాం. అది కూడా మా గ్రామాలకు పది– ఇరవై కిలోమీటర్ల దూరంలో జనతన సర్కార్‌కు ఆవల ఉండే మరో గ్రామానికి వెళ్లి రెండు, మూడు నెలలకు ఓసారి తెచ్చుకుంటాం..’’ అని చెప్పాడు. ఇక ఎన్నికల ప్రక్రియపై పటేల్‌పారా గ్రామానికి చెందిన నందా మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ చాలా గ్రామాలకు నామ్ కే వాస్తే అన్నట్టుగా సర్పంచ్‌లు ఉన్నారు. ఎక్కువ మంది ఎన్నికలను బహిష్కరిస్తారు. అయినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుండటంతో.. సమీప పట్టణాల్లో నివాసం ఉండేవారు నామినేషన్ దాఖలు చేస్తారు. వారిలో ఒకరు సర్పంచ్ అవుతారు. కానీ చాలా గ్రామాల్లో వారి పెత్తనమేమీ ఉండదు. పరిపాలనలో గ్రామ కమిటీలదే ఆధిపత్యం..’’ అని వివరించాడు. సమష్టి వ్యవసాయం చాలా ఊర్లలో ట్రాక్టర్లు కనిపించాయి. వాటికి రిజిస్ట్రేషన్ నంబర్లు లేవు. ఆ ట్రాక్టర్లను ఊరంతా ఉపయోగించుకుంటారని తెలిసింది. ఇక్కడి ప్రజలకు ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేదు. అంతా దట్టమైన అడవి అయినా ఎక్కడా అటవీ సిబ్బంది ఛాయల్లేవు. ఇటీవలికాలంలో చేతిపంపులు, సోలార్ లైట్లు వంటివి కనిపిస్తున్నాయి. వినోదం విషయానికొస్తే.. సంప్రదాయ ఆటపాటలతో పాటు కోడిపందేలను ఆదివాసీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నాం ఇక్కడి ప్రజలకు రక్షణ కల్పించేందుకు, ప్రభుత్వం తరఫున సేవలు అందించేందుకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని పువ్వర్తి వద్ద విధులు నిర్వర్తిస్తున్న సుక్మా జిల్లా ఏఎస్పీ గౌరవ్ మొండల్ చెప్పారు. ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో సర్వే చేపట్టి తాగునీరు, విద్యుత్, స్కూల్, ఆస్పత్రి వంటి సౌకర్యాలు, ఇతర ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. అయితే క్యాంపుల ఏర్పాటులో ఉన్న వేగం ప్రభుత్వ పథకాల అమల్లో కనిపించడం లేదేమని ప్రశి్నస్తే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులే అందుకు కారణమన్నారు. ఇక క్యాంపుల ఏర్పాటు సమయంలో ఆదివాసీలు భయాందోళన చెందినా, తర్వాత శత్రుభావం వీడుతున్నారని మరో అధికారి తెలిపారు. ఈక్రమంలోనే జనతన సర్కారులోకి చొచ్చుకుపోగలుతున్నామన్నారు. ఇప్పటికీ మావోయిస్టులదే పైచేయి.. ప్రభుత్వ బలగాలు ఎంతగా మోహరిస్తున్నా ఇప్పటికీ అడవుల్లో మావోయిస్టులదే ఆధిపత్యం. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడి ప్రజలకు ఆటపాటలే ప్రధాన వినోద సాధనాలు. మావోయిస్టులు చేతన నాట్యమండలి వంటివాటి ద్వారా ఇక్కడి ప్రజల్లో విప్లవ భావాలను రేకెత్తిస్తారు. పిల్లలకు ఏడేళ్లు దాటగానే గ్రామ కమిటీల్లో చోటు కల్పించి, భావజాలాన్ని నేర్పుతారు. మావోయిస్టుల పట్ల ఎవరైనా వ్యతిరేకత చూపితే ప్రమాదం తప్పదనే భయాన్ని నెలకొల్పారు’’ అని ఆరోపించారు. హిడ్మా అడ్డాలో క్యాంపు వేసి.. పువ్వర్తి జనాభా 400కు అటుఇటుగా ఉంటుంది. అందులో దాదాపు వంద మంది మావోయిస్టు దళాల్లో ఉన్నారు. వీరిలో హిడ్మా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకోగా.. ఆయన సోదరుడు దేవా బెటాలియన్ కమాండర్‌గా ఉన్నారు. పువ్వర్తిలో హిడ్మా కోసం ప్రత్యేక సమావేశ మందిరం, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేవి. అక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే హిడ్మా సొంతిల్లు ఉంది. ప్రస్తుతం ఇవన్నీ భద్రతా దళాల ఆధీనంలో ఉన్నాయి. ఆధునిక పరికరాల సాయంతో వందల మంది కార్మికులు క్యాంపు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. ఇటీవలి వరకు రోడ్డుకూడా లేని ఈ గ్రామంలోకి ఇప్పుడు పదుల సంఖ్యలో లారీల్లో వస్తుసామగ్రి, రేషన్ తరలించారు. బుల్డోజర్లు, పొక్లెయినర్లు నిర్విరామంగా తిరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్‌్కఫోర్స్, డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్ ఇలా వివిధ దళాలకు చెందిన సుమారు ఐదు వేల మంది సిబ్బంది మోహరించారు. గ్రామం నలువైపులా గుడారాలు, బంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు.. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్యాంపులు తమకు ఇబ్బందిగా మారుతున్నాయని చాలా మంది ఆదివాసీలు అంటున్నారు. కొండపల్లికి చెందిన మడావి మాట్లాడుతూ.. ‘‘క్యాంపులు ఏర్పాటైన తర్వాత మా గ్రామాల్లోకి వచ్చే భద్రతాదళాలు విచారణ పేరుతో జబర్దస్తీ చేస్తున్నాయి. రాత్రీపగలు తేడా లేకుండా కాల్పుల శబ్దాలు వినవస్తున్నాయి. విచారణ పేరిట ఎవరైనా గ్రామస్తుడిని తీసుకెళ్తే.. తిరిగి వచ్చే వరకు ప్రాణాలపై ఆశలేనట్టే. అందుకే భద్రతా దళాలు వస్తున్నట్టు తెలియగానే పెద్దవాళ్లందరం అడవుల్లోకి పారిపోతున్నాం’’ అని చెప్పాడు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘‘స్థానికులమైన మాకు భద్రతాదళాల నుంచి కనీస మర్యాద లేదు. అభివృద్ధి పేరిట అడవుల్లోకి వస్తున్నవారు గ్రామపెద్దల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు..’’ అని పేర్కొన్నాడు. -
ఎన్కౌంటర్ : నలుగురు మావోయిస్టుల మృతి..!
భద్రాద్రి కొత్తగూడెం : దండకారణ్యంలో మరోసారి తుపాకులు గర్జించాయి. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో నలుగురు మవోయిస్టులు మృతిచెందారు. వారివద్ద నుంచి పోలీసులు రెండు రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. ఘటనకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
నువ్వు పుణ్యాత్ముడివి గనుక!
ఒకనాడు తన పొలంలోపడి మేస్తున్న ఓ గోవుని గడ్డిపరకతోఅదిలించాడు గౌతముడు. ఆ మాత్రానికే అది కిందపడి ప్రాణంకోల్పోయింది. గౌతముడికి గోహత్యా పాతకం చుట్టుకోవడంతో వరుణుడికి స్వేచ్ఛ కలిగింది. పుష్కరిణి ఎండిపోయింది. గౌతమ మహర్షి దండకారణ్యంలో తన ఆశ్రమాన్ని నిర్మించుకొన్నాడు. దగ్గరలోనే ఒక పుష్కరిణి తవ్వించుకొన్నాడు. అందులో ఎప్పుడూ సమృద్ధిగా నీళ్లు ఉండేవి. పాడి పంటలతో మునివాటిక సస్యశ్యామలంగా ఉండేది. ఇలా ఉండగా ఆ ప్రాంతంలో తీవ్రమైన అనావృష్టి ఏర్పడింది. వాగులూ వంకలూ ఎండిపోయాయి. గుక్కెడు నీళ్లు కూడా కరువై జనం అలమటించసాగారు. వర్షాలకోసం వరుణ యాగం చేసినా లాభం లేకపోవడంతో గౌతముడు సూక్ష్మ శరీరంతో వరుణలోకానికి వెళ్లి, వానలు కురిపించమని ప్రార్థించాడు. వరుణుడు ఆలకించకపోవడంతో గౌతముడు వరుణుడిని తన తపోశక్తితో నీరుగా మార్చి తన ఆశ్రమంలోని పుష్కరిణిలోకి ప్రవహింపజేశాడు. ‘నువ్వు పుణ్యాత్ముడివి గనుక, నీకు కట్టుబడి ఉన్నాను. నిన్ను పాపం అంటిన మరుక్షణం నేనిక్కడ ఉండను’ అని చెప్పి వరుణుడు అక్కడే ఉండిపోయాడు. దాంతో లోకమంతా కరువు తాండవిస్తున్నా గౌతముని ఆశ్రమ ప్రాంతం మాత్రం సుభిక్షంగా ఉంటోంది. ఒకనాడు తన పొలంలో పడి మేస్తున్న ఓ గోవుని గడ్డిపరకతో అదిలించాడు గౌతముడు. ఆ మాత్రానికే అది కిందపడి ప్రాణం కోల్పోయింది. గౌతముడికి గోహత్యా పాతకం చుట్టుకోవడంతో వరుణుడికి స్వేచ్ఛ కలిగింది. పుష్కరిణి ఎండిపోయింది. గౌతముడు శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గంగను విడువమన్నాడు గౌతముడు. నేలమీదికి దూకిన గంగాజలాల స్పర్శతో గోవు ప్రాణంతో లేచి నిలబడింది. గౌతముడి పాపం తొలగిపోయింది. గంగా ప్రవాహం దక్షిణాపథాన్ని సస్యశ్యామలంగా మార్చింది. గౌతముడి వల్ల ఏర్పడింది కనుక గౌతమి అని, గోవును బతికించింది కనుక గోదావరి అని ఆ నదికి పేర్లు వచ్చాయి. గౌతముడి పేరు చిరస్థాయిగా నిలబడిపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా భరించినప్పుడేగా లోకకల్యాణం! -
దండకారణ్యం సినిమా రివ్యూ
చిత్రం: ‘దండకారణ్యం’, తారాగణం: ఆర్.నారాయణమూర్తి, త్రినాథ్, ప్రసాద్‌రెడ్డి, విక్రమ్, కెమేరా: శివకుమార్, మాటలు- ఫొటోగ్రఫీ- సంగీతం-నిర్మాత-దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి దేశంలో అభివృద్ధి ఎక్కడ జరిగినా చివరికి సమిధలుగా మారేది ఆది వాసీలు, అమాయక గిరిజనులు. అభివృద్ధి పేరుతో బహుళజాతి కంపెనీలతో కలిసి ప్రభుత్వం చేపడుతున్న బాక్సైట్, ఇనుము లాంటి సహజ వనరుల తవ్వకాలను అక్కడున్న ఆదివాసీలు, గిరిజనులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తూ పోరాడుతున్నారు. ఈ పోరాటంలో ఎంతోమంది బలయ్యారు. అడవులు తుపాకుల మోతతో రక్తచరిత్రను లిఖిస్తున్నాయి. ఆ పరిస్థితి ఉండకూడదనే కథాంశంతో స్వీయ దర్శకత్వంలో ఆర్.నారాయణమూర్తి నిర్మించిన చిత్రం ‘దండకారణ్యం’. ప్రముఖ మావోయిస్ట్ నేత అయిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ జీవితం ఆధారంగా ఈ చిత్రకథను ఆయన అల్లుకున్నారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆర్.నారాయణమూర్తి స్నేహా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై రూపొందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. మావోయిస్టు నాయకుడు కోటన్న (ఆర్.నారాయణమూర్తి) ఓ పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందడంతో అతని స్వస్థలమైన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి గ్రామస్థులు శోక సముద్రంలో మునిగిపోతారు. జగిత్యాల జైత్ర యాత్రతో మొదలుపెట్టి పశ్చిమ బెంగాల్‌లోని జంగల్‌మహల్ దాకా ప్రజల కోసం అలుపెరుగని పోరాటం సాగించిన కోటన్న గతంలోకి కథ వెళుతుంది. కట్ చేస్తే... యుక్తవయసు నుంచి అన్యాయాలను ఎదిరించే మనస్తత్వం ఉన్న కోటన్న కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తాడు. సొంత ఊరిలో జరుగు తున్న అన్యాయాలను ఎదిరించడంతో ప్రభుత్వం అతనిమీద నక్సలైట్ ముద్ర వేస్తుంది. కనిపిస్తే కాల్చివేయమని ఆదే శాలు జారీ చేస్తుంది. ఉన్న ఊరినీ, కన్నతల్లినీ విడిచి అడవిలో పోరాటానికి సిద్ధమవుతాడు కోటన్న. అక్కడ అతనికి మరో సమస్య... అడవిలో అపారసంపద మీద ప్రభుత్వంతోపాటు కొన్ని ‘కార్పొరేట్ సంస్థలు కన్నేస్తాయి. ఎలాగైనా ఆదివాసీల భూములను కొల్లగొట్టి, ఇళ్లను పడగొట్టి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని వాళ్ల ప్లాన్. దీనివెనుక కోటానుకోట్ల రూపాయల ఒప్పందాలున్నాయి. కానీ దీన్ని పసిగట్టిన కోటన్న ఆ గ్రామాలల్లో జరుగుతున్న అన్యాయం గురించి చైతన్యం తీసుకొస్తాడు. గ్రామస్థులు కూడా అక్కడికి వచ్చిన ప్రభుత్వాధికారులను, అక్కడ ఖనిజాలను తరలించడానికి చేపట్టిన రోడ్డు, రైల్వేపనుల్ని అడ్డుకుంటారు. దీంతో అక్కడి వాతావరణం హింసాత్మకంగా మారుతుంది. గ్రామస్థుల్లో కొంత మంది మావోయిస్ట్ ఉద్యమంలో చేరిపోతారు. ఇదే సమయంలో భూమి పూజ చేయడానికి వచ్చిన సీఎం నానాజీని చంపడానికి మందుపాతర పెడతారు మావోయిస్టులు. సీఎం గాయాలతో బయటపడ తాడు. కోటన్న గ్రూప్‌లోనే పనిచేస్తూ ఇన్ఫార్మర్గా మారిన వ్యక్తి సమా చారంతో పోలీసులు అతని మీద ఎటాక్ చేస్తారు. కానీ కోటన్న వెంట్రుకవాసిలో తప్పించుకుంటాడు. ప్లాన్ బెడిసి కొట్టడంతో మరో వ్యక్తిని పంపిస్తారు పోలీసులు. కోటన్న మంచితనం తెలిసిన అతను తనెందుకు వచ్చాడో కోటన్న ముందు నిజాయతీగా ఒప్పుకుంటాడు. పరిస్థితి విషమించడంతో ప్రభుత్వం అక్కడ పోలీసులు, మిలటరీని రంగంలోకి దించడంతోపాటు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఆయుధాలిస్తుంది. ఈ క్రమంలోనే సీఎం కొడుకును మావోలు కాల్చిచంపడంతో కథ మలుపు తిరుగుతుంది. కానీ ఈ నింద మావోయిస్టు సానుభూతిపరుడైన క ళాకారుడు జితిన్ మరాండీ మీద పడుతుంది. జితిన్‌ను విడిపించడానికి కోటన్న ఏం చేశాడు? చివరికి పోలీసులు మోసంతో కోటన్న ప్రాణాలు ఎలా తీశారన్నది మిగతా కథ. మావోయిస్ట్ నాయకుడు కిషన్‌జీ మరణించినా ప్రభుత్వ సారథ్యంలో ‘ఆపరేషన్ గ్రీన్‌హంట్’ ఆగలేదు. ఇంకా దండకారణ్యం రగులుతూనే ఉంది. ఈ సమయంలోనే ప్రభుత్వం, మావోయిస్ట్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి శాంతి నెలకొనాలనే ఉద్దేశంతో నారాయణమూర్తి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తొలిసారిగా ఓ నిజజీవిత పాత్ర పోషించిన ఆయన కోటన్నకూ, అతని తల్లికీ మధ్య అనుబంధాన్ని ఓ పాట ద్వారా చూపించిన తీరు హృద్యం. ప్రజా గాయకుడు గద్దర్ ఈ సినిమాలో 3 పాటలు రాసి, పాడి, నటించారు. దండకారణ్యంలో సాగుతున్న పోరాటాలకు వెండితెర సాక్ష్యమైన ఈ చిత్రం అక్కడి పరిస్థితుల పట్ల ప్రేక్షకుల్లో ఆలోచన రేపుతుంది. -
ముట్టడిలో దండకారణ్యం
అభిప్రాయం భారీనీటి ప్రాజెక్టుల కింద భూమి కోల్పోవడమే కాకుండా ముంపునకు గురవుతామని, పైగా ఇవన్నీ అత్యంత నైపుణ్యంతో కూడిన సాంకేతికజ్ఞానంతో నిర్మాణమవుతాయి గనుక ఉపాధి అవకాశం కూడా లేదని దండకారణ్యం ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 2014 ఎన్నికల్లో మూడోసారి రమణసింగ్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడటమే కాకుండా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రావడంతో సాల్వా జుడుం వంటి ఫాసిస్టు శక్తులకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. మోదీ నవపూర్ రాయపూర్‌కు, దంతెవాడకు వచ్చి మావోయిస్ట్టులకు ‘తుపాకులు వదిలి నాగళ్లు పట్టుకోండి’ అని హితవు చెప్పిన నోటితోనే బహుళజాతి కంపెనీలను ఛత్తీస్‌గడ్‌కు వచ్చి పరిశ్రమలు నెలకొల్పవలసిందిగా ఆహ్వానం పలికాడు. అడవి, నీరు, ఖనిజాల తవ్వకాలకు సకల సదుపాయాలు, పరిశ్రమల నిర్మాణాలకు సకల రాయితీలు సమకూర్చి పెడతానని హామీపడ్డాడు. జైస్వాల్ అండ్‌కో కంపెనీ, వేదాంత, జిందాల్, ఎస్సార్, టాటా వంటి బహుళజాతి కంపెనీలకు దండకారణ్యాన్ని కట్టబెట్టే ఈ విధ్వంసకరమైన అభివృద్ధి నాగళ్లు పట్టగల చేతులను నరికేస్త్తున్నది. కాళ్లకింద నేలను తొలిచేస్తున్నది. ఉనికిని కాపాడుకోవడానికి కాళ్లకింద నేల కోల్పోకుండా సాముచేస్తున్న ఆదివాసీ ప్రజలను మావోయిస్టులంటూ నిత్యం ఎన్కౌంటర్లు చేస్తున్నది. గత రెండుమూడు నెలల్లోనే కనీసం అరవైమంది ఆదివాసీ యువకులను బూటకపు ఎన్కౌంటర్లలో చంపేశారు. ఇది కేవలం చర్యలు, ప్రతిచర్యల దశ కాదు. 2009లో అంటే మన్మోహన్సింగ్ రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత ప్రారంభమైన గ్రీన్‌హంట్ ఆపరేషన్ పేరిట ప్రజలమీద యుద్ధం ఇపుడు మూడవదశకు చేరుకున్నది. ఆపరేషన్ హాకా, ఆపరేషన్ విజయ్ వంటి పేర్లతో గతంలో సీఆర్పీఎఫ్ డైరైక్టర్ జనరల్ విజయకుమార్ సారధ్యంలో జరిగిన కేంద్ర అర్ధసైనిక బలగాల దాడులు ఇపుడు ఆయన ప్రత్యేక సలహాదారుగా, ఐజీ ఎన్ఆర్ కల్లూరి నాయకత్వంలో తీవ్రతరమయ్యాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో సి.60 కమాండోలు, నారాయణపూర్ నుంచి మాడ్ దాకా సీఆర్పీఎఫ్ క్యాంపులు, ఇటు దంతెవాడ, బీజాపూర్, సుకుమా జిల్లాల్లో అడుగడుగుకు పోలీసు క్యాంపులే కాదు, సైనిక శిక్షణాలయాలు నెలకొల్పుతున్నారు. ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన చోదక రహిత విమానాల నుంచి అడవిలో రసాయనిక బాంబులు విసురుతున్నారు. గ్రామాలు తగులబెడుతున్నారు. మహిళ లను సామూహికంగా లైంగిక అత్యాచారానికి గురిచేస్తున్నారు. ఇపుడు బేలాభాటియా జగదల్పూరునుంచి చేసిన అధ్యయ నాలు, పట్టుదలతో రిజిస్టర్ చేయించిన ఎఫ్ఐఆర్లు చూసినా, జగదల్పూరులో ఉన్న న్యాయవాదులు శాలిని గెరా, ఇషా ఖండేవాల్ బాధిత ఆదివాసులకు న్యాయసహాయం చేయ డానికి చేస్తున్న ప్రయత్నాలు చూసినా, పత్రికారచయిత మాలి నీ సుబ్రహ్మణ్యం ఏటికి ఎదురీది చేసిన కృషి చూసినా దండ కారణ్యంలో ఎంత బీభత్స దృశ్యమున్నదో అర్థమవుతున్నది. మాలినీ సుబ్రహ్మణ్యంకు తాను చూసిన వాస్తవాలు రాయడమే ఒక పోరాటమయింది. అందుకామె ఇంటిపై దాడి చేసి వారం రోజుల్లో ఇల్లువదిలి వెళ్లకపోతే చంపేస్తామన్నారు. వదలక తప్పలేదు. ఎక్కడో తలదాచుకోవాల్సి వచ్చింది. కేవలం ఆదివాసుల కేసులే చేపట్టి న్యాయ సహాయం చేయతలపెట్టిన న్యాయవాదులు స్థానికులు కాదని స్థానిక బార్ అసోసియేషన్ కూడా బహిష్కరించింది. బేలాభాటియా ఛత్తీస్‌గఢ్‌లో, ముఖ్యంగా బస్తర్‌లో పోలీసుస్టేషన్లో ఎఫ్ఐఆర్ వేయడానికి చేసేదే పెద్ద పోరాటమని, వేయగలిగితే అదే విజయమని ఇక్కడ బాసగూడ ఘటన తర్వాత జరిగిన ఒక రౌండ్‌టేబుల్ సమావేశంలో చెప్పింది. మరి సోనీసోరి ఎక్కడికి పోతుంది? విచిత్రమేమంటే వీళ్లెవరూ మావోయిస్టులు కాదు. మావోయిస్టు సానుభూతిపరులు కూడా కాదు. సోనీసోరి ఒక ధనికరైతు కూతురు. తండ్రి ఒకప్పుడు మావోయిస్టుల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నవాడే. ఆమె ఉపాధ్యాయురాలు. అంటే ఆదివాసీ విద్యావంతురాలు. ఆమె ఎస్సార్ కంపెనీకి మావోయిస్ట్టులకు మధ్యన కంపెనీ పైప్‌లైన్ అడ్డుకోకుండా ఉండడానికి దౌత్యం చేసిందని కేసుపెట్టి అరెస్టుచేసి, దారుణమైన లైంగిక చిత్రహింసలకు గురిచేసి దీర్ఘకాలం హింసానిర్బంధాల తర్వాత సుప్రీంకోర్టు జోక్యం వల్ల వదిలేశారు. ఆమె బయటికివచ్చి ద్విగుణీకృతమైన పట్టు దలతో ఆదివాసుల కోసం పనిచేస్తున్నది. నిన్నకాక మొన్న ఆమె జగదల్పూర్నుంచి ఒక మిత్రురాలితో మోటారు సైకిల్‌పై వస్తుంటే ఆమెమీద యాసిడ్దాడి జరిగింది. ఆమెను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. అవి ప్రమాదకరమైన రసాయనిక పదార్థాలని, ఆమెకు చూపు నిలుస్తుందా అన్నది అనుమానమే అని అంటున్నారు. సోనీసోరీ మిగతావాళ్ల వలె ఛత్తీస్‌ఘడ్ వదిలి ఎక్కడికీ వెళ్లలేకపోవచ్చు. కానీ ఆమెకు దేశమంతా వచ్చిన గుర్తింపు వల్ల, ఉపాధ్యాయురాలైనందువల్ల, ఇప్పటికే సుప్రీంకోర్టు, ఎయిమ్స్ వంటి సంస్థల దృష్టినాకర్షించింది కనుక ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆదివాసులపక్షాన పోరాడడానికి ఆమె కూడా బయటికి వెళ్లగలదు. దంతేవాడలో ఆశ్రమం ధ్వంసం చేస్తే హిమాంశు, యూఏపీఏ కింద అరెస్టుచేసి రాజద్రోహనేరం పెట్టి జీవితఖైదు వేస్తే డాక్టర్ వినాయక్‌సేన్ బెయిల్‌పొంది ఛత్తీస్‌గఢ్ బయట ఉండి తమ ప్రజాస్వామిక ఉద్యమాలను నిర్వహించవచ్చు. కాని గడ్చిరోలి, బస్తర్, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, విశాఖ అడవుల్లోని ఆదివాసులు ఎక్కడికి పోగలరు? ఒక డ్యాం వస్తే, ఒక ఉక్కుఫ్యాక్టరీ వస్తే, వేదాంత, పోస్కోలు వస్తే, బాక్సైట్ గనుల తవ్వకాలకు దుబాయ్ కంపెనీలు వస్తే ఆదివాసులు ఎక్కడికి పోగలరు? మనకు బాగా పరిచయమైన దృష్టాంతం చెప్పాలంటే వాకపల్లి, భల్లగూడ ఆదివాసీ మహిళలవలె సీఆర్పీఎఫ్ సామూహిక లైంగిక అత్యాచారాన్ని ప్రతిఘటించి పోరాడి, సాంఘిక బహిష్కరణకు గురై, ప్రభుత్వాల, న్యాయస్థానాల హృదయకవాటాలను తట్టి మళ్లీ వెళ్లి పోరాటమార్గమే ఎంచుకోవడం తప్ప ఏం చేయగలరు? ఇరాన్ విప్లవకాలంలో మహిళలపై జరిగిన లైంగికహింస గురించి ‘చిత్రహింసల కొలిమిలో’ అనే పుస్తకంలో (నవత, యువక అనువాదం) ఆ స్త్రీలు అది కూడా ఒక రాజ్యహింసారూపంగా భావించి ధిక్కరించిన తీరును గగుర్పాటు కలిగేలా చెప్తారు. ఇవ్వాళ బస్తర్‌లో లైంగిక అత్యాచారం (రేప్) సర్వసాధారణమైన హింసోన్మాద విధానమైపోయిందని, పార్వతి, సోమి, కోసి వంటి ఎందరో ఇది దాచుకోవాల్సిన అభిమానం కాదు, ప్రకటించవలసిన అత్యాచారం అని గుర్తించి ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తున్నారంటుంది బేలాభాటియా. తమకోసమే కాకుండా మన కోసం, భవిష్యత్ తరాలకోసం ప్రకృతిసంపదను, మానవశ్రమను గౌరవాన్ని కాపాడడానికి తమ ప్రాణాలొడ్డి గ్రీన్‌హంట్ ఆపరేషన్ మూడవదశలో భాగంగా జరుగుతున్న రాజ్యహింసను, సల్వాజుడుం దాడులను ప్రతిఘటిస్తున్న దండకారణ్య ఆదివాసులకోసం పైన పేర్కొన్న ప్రజాస్వామికవాదుల వలె స్పందించవలసిన బాధ్యతనైనా పొరుగున ఉన్న బుద్ధిజీవులు, ప్రజాస్వామిక వాదులు నిర్వహిస్తారా? ముఖ్యంగా తెలుగుసమాజం మళ్లీ ఒకమారు ఈ మూడోదశ ప్రజలపై యుద్ధాన్ని ఎలుగెత్తి ఖండించాలని విజ్ఞప్తి. - వరవరరావు వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యులు ఇమెయిల్: varavararao@yahoo.com -
అడవి పూలు
చెట్టుకు మాటలు రావు... పుట్టకు పాటలు రావు... కానీ, మాటా, పాటా రెండూ అడవిలోనే పుట్టాయి. అరణ్య రోదనలు మనదాకా చేరాలంటే... మన సహాయం అడవి కాచిన వెన్నెల కాకుండా ఉండాలంటే... అడవినీ, సమాజాన్నీ జతకలపాలంటే.. ఓ జత కావాలి! ఆర్. నారాయణమూర్తి, గద్దర్ - ‘దండకారణ్యాని’కి సూర్యచంద్రుల లాంటివారు! వెలుగు, వెన్నెల లాంటివారు! కళామతల్లి కడుపున పుట్టిన ఈ కవలలు అడవితల్లి పాదం మీద పుట్టుమచ్చలు! వీరి ఆట, పాట... మాట, బాట... ‘సాక్షి’కి ఎక్స్‌క్లూజివ్! నమస్తే గద్దర్ జీ! కొంత గ్యాప్ తర్వాత తెరపైకొచ్చారు... గద్దర్: అవును. రెండేళ్ల నుంచి ఎక్కడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు! ‘దండకారణ్యం’సిన్మాకు మా మూర్తి అన్న డెరైక్టరు, నేను యాక్టరు. కాబట్టి ఆయన నుంచే స్టార్ట్ చేద్దాం. నారాయణమూర్తిగారూ! 30 ఏళ్ళుగా ఉద్యమాలే ఊపిరిగా ఫిల్మ్స్ తీస్తున్నారు. తాజా ‘దండకారణ్యం’ ఏంటి? నారాయణమూర్తి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ - ఇలా అనేక రాష్ట్రాలకు విస్తరించింది - దండకారణ్యం. అపార ప్రకృతి సంపదకు నెలవు. దోపిడీకి వ్యతిరేకంగా ఆదివాసీలు చేస్తున్న పోరు, వెన్నుదన్నుగా నిలిచిన ఉద్యమకారుడు కోటన్న జీవితమే ఈ ‘దండకారణ్యం’ ఫిల్మ్. నేను ఉద్యమకారుడు మల్లోజు కోటేశ్వరరావు అలియాస్ కోటన్న అలియాస్ కిషన్‌జీ వేషం వేస్తున్నా. నేనెన్నో సినిమాలు తీసినా, కిషన్‌జీ లాంటివారి జీవితంతో తీయడం తొలిసారి. గద్దర్‌జీ! ‘జగిత్యాల టూ జంగల్‌మహల్’ సాగిన కిషన్జీతో మీకు సాన్నిహిత్యం ఉందిగా? గద్దర్: అవును. కానీ, ఈ సినిమా కేవలం ఆయన జీవితమే కాదు. గిరిజనులు ఎదుర్కొంటున్న దోపిడీని సిన్మాలో చూపాం. అన్ని రంగాల్లో, చివరకు మీడియాలో వస్తున్న ‘ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల’ వల్ల జరిగే దోపిడీపై జన చైతన్యానికే ఈ ప్రయత్నం! నారాయణమూర్తి: (ఆవేశంగా) ఒకప్పుడు ఈస్టిండియా కంపెనీవాడు దోపిడీ చేస్తే, ఇప్పుడు మనవాళ్ళు చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే, ఈ దేశంలో మరో స్వతంత్రం కోసం మళ్ళీ పోరు చేయాల్సొస్తుంది. కిషన్‌జీ మీద సినిమా తీయాలని ఎందుకనిపించింది? నారాయణమూర్తి: మావోయిస్ట్ టాప్‌లీడర్ కిషన్‌జీది పెద్దపల్లి. హి ఈజ్ లైక్ సుభాష్ చంద్రబోస్. నా దృష్టిలో ఇండియన్ చెగువేరా. నాలుగున్నరేళ్ళ క్రితం కిషన్‌జీని ఎన్కౌంటర్ చేశారు. అంత్యక్రియల్లో గద్దరన్న పాడిన పాట గుర్తుంది. అక్కడ నేను ‘కిషన్‌జీ మీద సినిమా తీస్తా’నన్నా. తీశా. గద్దరన్న 3 పాటలు రాసి, యాక్ట్ చేశారు. గద్దర్: మిలటరీ రాజ్యంలో బలవుతున్న ఆదివాసీలకు అద్దం ‘దండకారణ్యం’. ఆర్మీ బయటివాళ్ళతో కొట్లాడడానికుంది కానీ, ఇంట్లోవాళ్ళపై తుపాకీ పేలిస్తే ఎలా? వాళ్ళ డుగుతున్నవి పెద్దవేం కాదు. కాసింత బువ్వ, గూడు! మరి ‘దండకారణ్యం’ బాగుండాలంటే ఏం చేయాలి? నారాయణమూర్తి: (ఆవేదనగా..) అమాయకులు బలైపోతున్న దండకారణ్యం గురించి పార్లమెంట్లో చర్చ జరగాలి. అడవిలో మళ్ళీ శాంతి నెలకొనాలి. అక్కడ ఆయుధాలు పట్టినవాళ్ళతో బేషరతుగా చర్చలు జరపాలని హోమ్మంత్రికీ, ప్రధానమంత్రికీ నా విన్నపం. అందుకు, ప్రజాప్రతినిధులు, పెద్దలతో పాటు మేమూ వస్తాం. గద్దర్: మూర్తి ప్రతిపాదించినట్లు, శాంతి చర్చల కోసం అవసరమైతే నేను, మూర్తి దండకారణ్యంలోకి అడుగుపెడతాం. ఇవాళ ఎస్.టి. రిజర్వేషన్ కింద ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్లమెంట్లో ఈ విషయమై గొంతు విప్పాలి? తాము ఎవరివైపున్నామో స్పష్టం చేయాలి! అసలు మీ ఇద్దరి స్నేహం ఎక్కడ మొదలైంది? నారాయణమూర్తి: ప్రజల కోసం ఉద్యమాలు చేసే వాళ్లంటే చదువుకొనే రోజుల నుంచీ గౌరవం. కొండపల్లి సీతారామయ్య, చండ్ర రాజేశ్వరరావు, బాలగోపాల్, వరవరరావు, వంగపండు ప్రసాదరావు వంటి మహానుభావుల్ని చూడాలి. గద్దరన్న ప్రోగ్రాం చూడాలనుకునేవాణ్ణి. ఫస్ట్ ‘అర్ధరాత్రి స్వతంత్రం’(1986) సిన్మా తీశా. వంగపండు పాట పెట్టా. సిన్మా బిగ్ హిట్. మద్రాస్ వాణీమహల్లో ‘జననాట్య మండలి’ ప్రోగావ్ుకి వచ్చిన గద్దరన్నకు, సిన్మా చూపిస్తే, మెచ్చుకున్నారు. అలా మా స్నేహం మొదలైంది. నంది అవార్డొచ్చిన ‘నీ పాదం మీద...’ పాట కథేంటి? నారాయణమూర్తి: ‘ఒరేయ్ రిక్షా’ (95) నాతో తీస్తూ గురువు దాసరి గారు నాతో, ‘గద్దరన్నను అడగరా! ‘నా రక్తంతో నడుపుతాను రిక్షాను’ అనే పాట పెట్టుకుంటానని’ అన్నారు. అన్ననడిగితే, ‘నీ కోసం ఇస్తున్నా, తీసుకో’ అన్నారు. అలాగే ‘నీ పాదం మీద’ పాట రాసిచ్చారు. నా దృష్టిలో గద్దరన్న బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్. దేశం గర్వించదగ్గ మనిషి. ఒకరు సిన్మాలతో, మరొకరు పాటలతోకమ్యూనికేషన్..! గద్దర్: ‘ఒరేయ్ రిక్షా’ కన్నా ముందు బి. నరసింగరావు ‘రంగులకల’ (’84)లో ‘మదనా సుందరి’ లాంటి పాటలు రాశా, పాడా. ఇక్కడ మేము చేసేది ఒక జీవితాన్ని ఇంకో జీవితానికి కమ్యూనికేట్ చేయడం! మూర్తేమో తెర మీద కనిపించే ఆర్టిస్ట్ కమ్యూనికేటర్. నేనేమో స్టేజ్‌పైన ప్రత్యక్షంగా కనిపించే కమ్యూనికేటర్. మేము కమ్యూనికేట్ చేసే వస్తువుల్లో తేడా లేదు. తేడా రూపంలోనే! ‘పేదోనికింత బువ్వ దొరకాలి’, ‘ఎవడి కష్టం వాడికే దక్కాలే, లేకుంటే పోరాడాలి’ అని ఆయనా అంటాడు, నేనూ అంటా! ♦ ఇది నిజమైన దేశభక్తుడి కథ. ‘దండకారణ్యం’లో నేనెక్కడా లాల్ సలామ్ అనలేదు. ఇన్నేళ్ళ జీవితంలో తొలిసారిగా సిన్మాలో ‘భారత్‌మాతాకీ జై’ అని పాడా. ♦ నేను దేశమంతా తిరిగా. కోరాపుట్ - గంజాం సరిహద్దులో ఒంటి మీద తువ్వాలుతో గడుపుతున్న ప్రజల దైన్యం చూశా. కడుపులో బిడ్డని వందకి అమ్ముకొంటున్న తల్లుల దీనస్థితిని చూశా. ♦ సామాన్యుడి జీవితాన్ని మార్చడమెట్లా అన్నది ప్రధానం! అందుకే, ‘సున్రే బాబూ పేట్కీ సవాల్ హై... కుచ్ బాత్ కీ నై’ అంటా. అంటే, హైటెక్ సిటీ మీరే ఉంచుకోండి. మాకు బువ్వ, గుడిసె ఉండనివ్వండంటున్నాం. ♦ నేను పాటతో ఎంత ఇన్‌స్పిరేషనో మూర్తి ఆటతో అంతే ఇన్స్పిరేషన్! ఆయనలా నమ్మిన సిద్ధాంతాలతో పనిచేసేవారు దేశంలో తక్కువ. ఆ కమిట్మెంట్ మాకు పెద్ద నైతిక స్థైర్యం. సపోర్ట్ చేసేందుకు మాకూ ఒకడుఉన్నాడనిపిస్తుంది! ♦ ఎన్టీయార్, ఏయన్నార్, సావిత్రమ్మంటే ఆనందపడిపోతాం. వేరే కమ్యూనికేటర్లతో, యాక్టర్లతో మాకేం డిఫరెన్సెస్ లేవు! పరస్పరం గౌరవమే! ♦ రాబోయే కాలం మాదే! ప్రజాకవుల్ని ఒక తాటి మీదకు తెస్తాం. వారి మాట, పాట, ఆటతో ప్రజా వాగ్గేయకారుల యుగం వస్తుంది. పాటలతోనే సినిమాలు తీసే దర్శకులూ వస్తారు! మొదటిసారి మూర్తిని చూసినప్పుడు ఏమనిపించింది? గద్దర్: ‘నన్ను మించినోడు ఒకడు దొరికిండు’ అనుకున్నా. 62 ఏళ్ళ మూర్తికిప్పటికీ నో వైఫ్, నో ప్రాపర్టీ. లాభాపేక్ష లేకుండా 30ఏళ్లలో ఒక్కడే 29 సిన్మాలు తీశాడు. హి లివ్స్ ఫర్ ది పీపుల్. అతని ప్లెయిన్నెస్ నాకిష్టం! మూర్తి గారూ! ఈ 30 ఏళ్ల ప్రయాణం ఎలా సాగింది? నారాయణమూర్తి: 20 ఏళ్ళు నా సిన్మాలు బాగా ఆడాయి. తర్వాత ఇండస్ట్రీలో చాలామంది విప్లవం నేపథ్య సిన్మాలు తీశారు. ఎక్కువగా అవే చిత్రాలు వచ్చేటప్పటికి ప్రజలకు మొహం మొత్తేసింది. ఎవరూ తీయకపోయినా, నేను అవే పట్టుకుని సముద్రం ఈదుతున్నా. సిన్మాలా డినా, నన్ను ‘పీపుల్స్‌స్టార్’ అన్నా అది ఉద్యమం, ఈ ప్రజాకవులు, వాళ్ల బాణీలు, పాటల గొప్పదనం! సిన్మాలకు తగ్గట్లు రాయడం స్వేచ్ఛాకవులకు ఇబ్బందే? గద్దర్: నిజమే. కానీ, చాలాసార్లు అప్పటికే పాపులరైన ప్రజాగీతాలనే సినిమాలో వాడుతుంటారు. ప్రత్యేక సన్నివేశం చెబితే పాట ఆశువుగా కట్టేస్తా. ‘దండకారణ్యం’లోని ‘పొద్దుతిరుగుడు పువ్వా’ పాట బయట పాపులర్. అలా సిన్మాలోకొచ్చింది. చివరి చరణం కోటన్న గురించి ‘వీరయోధుని ముద్దాడే’ అని కొత్తగా రాసి, పాడా! దేశంలోని దోపిడీని ఆపమన్నవాడి కన్నా దేశభక్తుడు ఎవడు? ఉద్యమాన్ని పాటల కన్నా సినిమాతో ఎఫెక్టివ్‌గా చెప్పగలమా? లేక మీ పాటతో సినిమా పదునెక్కుతుందా? గద్దర్: పాట అనేది ఒక తక్షణ రూపం. కానీ, సిన్మా- ఫొటోగ్రఫీ సహా చాలా కలసి సమగ్ర రూపం. డెరైక్టర్ క్రియేటివిటీ. ఎన్నో చోట్ల పాడినా ‘పొడుస్తున్న పొద్దు మీద’, ‘బండెనక బండి కట్టి’ లాంటివి సిన్మా వల్ల ప్రజల్లోకి వేగంగా వెళ్లిపోతాయి. దటీజ్ ద పవర్ ఆఫ్ సినిమా. మీ పాపులార్టీని కూడా ఈ సిన్మాకు వాడుతున్నారా? గద్దర్: నేను తమ సినిమాల్లో నటిస్తే, కనిపిస్తే బాగుంటుందని అమితాబ్, రజనీకాంత్, చిరంజీవి దాకా ఎంతోమంది అనుకున్నారు. అడిగారు. కానీ, ‘గద్దర్ పాపులారిటీని నేను వాడుకున్నట్లు ఎందుకు?’ అని మూర్తి తన సినిమాల్లో చేయమంటూ ఎప్పుడూ అడగలేదు. ఈ సిన్మాలో నటించాలని నేనే అనుకున్నా. ‘కిషన్‌జీ లైఫ్‌పై సిన్మాలో 5 నిమిషాల పాత్ర ఇవ్వు చాలు’ అని అడిగా. చేశా. పాటల రికార్డింగ్‌లో ఎదురైన అనుభవాలేమైనా? గద్దర్: సిన్మాకోసం అప్పటికప్పుడు సీన్ చెప్పి రాయించిన క్రెడిట్ మూర్తిదే. సన్నివేశం చెప్పి వెళ్లిపోతాడు. నేను నాకిష్టం వచ్చినట్లు రాస్తా. రికార్డు చేసేవాడు, మ్యూజిక్ కొట్టేవాడు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చేస్తారు. ఇది చాలా మందికి తెలీదు(నవ్వు). ‘దండకారణ్యం’లో ఒకటే డైలాగ్ నాది. ‘మహా దేశభక్తుడు కోటన్నకు జోహార్’ అనాలి. అది ఎన్నిసార్లు చెప్పినా కలుస్తలేదు. అప్పుడు మూర్తి ‘నీ ఇష్టం వచ్చినట్టు అను అన్నా, నా ఇష్టం వచ్చినట్టు కలుపుకుంటా’ అన్నాడు (నవ్వులు). పాటల రికార్డింగ్ గమ్మత్తుగా చేశాడు మూర్తి! మ్యూజిక్ డెరైక్టర్ లేడు.. లిరిక్ రాసింది లేదు.. స్టూడియో లేదు. డబ్బింగోడు ఆడ కూకున్నాడు. ‘అన్నా అడవి మీద పాడేయ్’ అన్నాడు. అప్పుడు ‘అడవి తల్లీ నీకు వందనం’ అని పాడి వచ్చేశా. ఈయన ఏం కలిపిండో ఏమో... తీరా పాట క్యాసెట్లో వింటే, నేనెప్పుడు రాస్తిరా ఇవన్నీ అనుకున్నా. పాటలు రాయడం, మాకు ప్రొఫెషన్ కాదు. అది మాకు జీవితం. నేనే కాదు ఈ సిన్మాలో తమ్ముడు గోరటి వెంకన్న ‘గిచ్చన్న గిరి మల్లెలో’ అనే వండర్ఫుల్ పొలిటికల్ సాంగ్ రాశాడు. ఉద్యమానిదే విజయమని నా కన్నా గొప్పగా రాశాడు. కానీ, ‘దండకారణ్యం’ అంటే ఇబ్బందులుంటాయిగా! గద్దర్: చాలానే. మిలటరీ వాళ్ళు మూర్తిని పట్టుకొని... నారాయణమూర్తి: (అందుకొని...) ఖమ్మంలో గద్దరన్న పాట అయిపోయింది. బయల్దెల్లా గనుల వద్దకెళ్లి కొన్ని షాట్స్ తీయాలని నేను, కెమేరామన్ బయల్దేరాం. ఛత్తీస్‌గఢ్‌లో కుంట నుంచి సుకుమ 85 కి.మీ. ప్రతి 4 కి.మీకొక మిలటరీ క్యాంప్. కీకారణ్యం. రోడ్డు మీద నుంచే మిలటరీ క్యాంప్ షూట్ తీసుకుంటూ వెళ్లిపోతున్నాం. వెనక ఏదో విజిల్ వచ్చింది. మరో 4 కిలోమీటర్లు వెళ్లగానే మిలటరీ సిబ్బంది రోడ్డుపై ఉండి కారు ఆపారు. నేను నా క్యారెక్టర్ నక్సల్ డ్రెస్ వేసుకుని ఉన్నా. వాళ్లు నేను నక్సలైట్ అనుకున్నారు. ‘నన్ను ఏమైనా చేయండి. కెమేరామన్, డ్రైవర్ని వదిలేయండి’ అన్నా. ఫైనల్‌గా వాళ్ల హెడ్డాఫీ సర్కి ఫోన్ చేశారు. ఆ మిలటరీ హెడ్ ఫోన్లో ‘ఏవండీ నారాయణమూర్తిగారూ.. మీరింకా విప్లవ సిన్మాలు చేస్తున్నారా. నేను మీ ఫ్యాన్‌ని’ అన్నారు. ఆ తెలుగాయన వల్ల బయటపడ్డాం. లేదంటే ఏమైపోయేవాళ్ళమో. (నవ్వు). గద్దర్‌జీ! జీవితాన్నే అర్పించిన మూర్తిని స్థిరపడమనరా? గద్దర్: వాళ్ల అవ్వ, అయ్య చెబితేనే వినలా! నేను చెబితే వింటాడా? (నవ్వులు) మూర్తికి ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. ఆస్తీ లేదు. అంతెందుకు! హైదరాబాద్‌లో సినీకార్మికులకు ఇళ్లిచ్చిన ‘చిత్రపురి’లో అతనికిల్లు లేదు. నా చేత బలవంతాన పైసలు కట్టించి, నాకొచ్చేలా చూశాడు. మీరిద్దరూ కలిస్తే ఏవేం చర్చ చేస్తారు? గద్దర్: సమాజాన్నెట్లా మార్చాలనే! మా లాంటి వాళ్లు లక్ష మంది తయారైతే హ్యాపీ. కానీ 70 ఏళ్లకొచ్చా. ఇన్నేళ్లు జనంతో గడపడం జోక్ కాదు. ♦ దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న వారే నిజమైన దేశభక్తులు. దే శాన్ని ఎవరు దోచుకుంటున్నారో వాడే దేశద్రోహి. ♦ విప్లవం నా సొత్తేమీ కాదండి... అది ప్రజల సొత్తు! ఎవరైనా సినిమాలు తీసుకోవచ్చు. ఇప్పుడు లవ్ సినిమాలు ఎలాగో, అప్పుడు విప్లవం చిత్రాలు అలాగన్నమాట. ఇలాంటి సినిమాలకు నాతో స్టార్ట్ కాలేదు... నాతో ఫినిష్ కావు. ♦ ఈ ‘దండకారణ్యం’ సిన్మాలో క్లైమాక్స్‌లో 8 నిమిషాల ఎమోషనల్ పాట వస్తుంది. నా మీదొచ్చే ఆ పాటను కొద్దిగా శ్రుతి పెంచి పాడమన్నా. అంతే! 70 ఏళ్లకు దగ్గరవుతున్న గద్దరన్న నా కోసం శ్రుతి పెంచి, ఏక్దమ్ పాటంతా, కోరస్‌తో సహా పాడేశాడు. ఒకప్పుడు ఎవరి పాట విని ఆరాధించానో, ఇప్పుడు ఆయన పాడిన పాటకి నేను నటించడం పెద్ద థ్రిల్. ♦ ఏ సిన్మాకైనా కథ, కథనం, దర్శకత్వం ముఖ్యం. అవి బాగుంటేనే ఆడుతుంది. మ్యూజిక్ కూడా బాగుంటే, ఎక్కడికో వెళుతుంది! సిన్మా- దృశ్యం, పాట- శ్రవణం. రెండూ కలిస్తే - దృశ్యశ్రవణ కావ్యం. ♦ నాకూ, గద్దరన్నకూ పోలికే లేదు. ఆయన ఉద్యమంలో నడిచి, దానికోసమే బతికిన మనిషి. నేను ఉద్యమంపై అభిమానంతో, సిన్మాలు తీస్తున్న చిన్న కళాకారుణ్ణి. మరి మీ జీవితంపై మూర్తి సిన్మా తీస్తానంటే...? నారాయణమూర్తి: (అందుకొంటూ) నేనేమో ‘అన్నా! నువ్వు రైటర్‌వి, సింగర్వి, యాక్టర్‌వి. నువ్వే రాయి, డెరైక్ట్ చేయి. బాగుంటుంది’ అని చాలా కాలంగా చెబుతున్నా. గద్దర్: ‘ఊండెడ్ సోల్జర్’గా మూర్తితో చర్చించి, మిగతా జీవితమంతా సామాజిక ఉద్యమాల కోసం పనిచేసేవాళ్ళతో, ఇలాంటి ప్రత్యేక తరహా సిన్మాలు తీసేవారితో కలసి నడుస్తా. వాళ్ళ పనులకు తోడుగా ఉంటా. గద్దర్‌జీ... మీరు సినిమాలు చూస్తుంటారా? గద్దర్: (నవ్వేస్తూ...) తక్కువే! అప్పట్లో ‘టెన్ కమాండ్మెంట్స్’, ‘ఉమర్ ముఖ్తార్’ లాంటి సినిమాలు బాగా చూసేవాణ్ణి. అలాగే, నేనో ప్రేమ పిచ్చోణ్ణి. ‘దేవదాసు’, ‘అనార్కలీ’ లాంటి లవ్‌స్టోరీస్ తెగ చూసేవాణ్ణి. ఈ మధ్య ఎక్కువ చూసింది మన మూర్తి సినిమాలే! అతను మొట్టమొదట తీసిన ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నాకు చాలా ఇష్టం. నారాయణమూర్తి: అన్నకు... ‘కుడి ఎడమైతే...’ లాంటి తాత్త్విక విషాద గీతాలంటే చాలా ఇష్టం బ్రదర్! అలాగా... గద్దర్‌జీ! మీరెలాంటి పాటలు వింటుంటారు? గద్దర్: శోక, వీర రసాలు కలసిన పాటలంటే నాకు ఇష్టం. గమనిస్తే, నా పాటలన్నీ అంతే! క్లాసికల్ సాంగ్స్ వింటా, సూఫీ సాంగ్సూ వింటాను. ఇక, భక్తిపాటలు, అన్నమయ్య పదాలు, తుకారామ్ గీతాలు, వేమన, సుమతీ శతకాలకు చెవి కోసుకుంటా. ఇక జానపద గీతాలంటారా... నా జీవితమే అవి! చాలామంది ‘నీ గొంతే నీ ప్లస్ పాయింట్’ అని చెబుతూ ఉంటారు. అది ఆమె నుంచే నాకొచ్చింది. మా అమ్మ లచ్చుమమ్మ లేకపోతే, నేను లేను. నా మొదటి పాట ‘సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ’ అమ్మ మీద రాసిందే! అమ్మకిది చేయలేదన్న లోటు మీకు ఏదైనా? నారాయణమూర్తి: ఏ తల్లైనా, బిడ్డ క్షేమమే తప్ప ఏమీకోరదు. అమ్మ రెడ్డి చిట్టెమ్మా అంతే! గద్దర్: ‘వానికి వాడేం చేసుకోలేద’నే అమ్మ బాధపడుతుండేది! వ్యవసాయ కూలీ అయినా, మా అమ్మకి సామాజిక చైతన్యం చాలా ఎక్కువ. ఒక్క మాటలో, నా తాత్త్విక గురువు కూడా మా అమ్మే! గద్దర్‌జీ! మీ ప్రస్థానంపై ఆత్మకథ ఏమైనా రాస్తారా? గద్దర్: ఆత్మకథ కాదు కానీ, ‘నిఫ్ట్’లో పనిచేస్తున్న మా అబ్బాయి సూర్యం నా మీద ఇంగ్లీషులో డాక్యుమెంటరీ తీస్తానంటున్నాడు. నిశ్శబ్దంగా సేకరణ పనిలో ఉన్నాడు. మూర్తిపై మీకున్నది ప్రేమా, అభిమానమా, గౌరవమా? గద్దర్: అతనిపై ప్రేమ కాదు. అతని కమిట్మెంట్ మీద అభిమానం, గౌరవం. తనేది అడిగినా, చేయమన్నా చేస్తా. మూర్తిగారూ! మీకు గద్దర్ అన్నా, మిత్రుడా, గురువా? నారాయణమూర్తి: వాటి కన్నా ఎక్కువ! మహాకవి, ప్రజల్ని చైతన్యపరిచిన కళాకారుడు. ఆయనకు శాల్యూట్! శాల్యూటా? రెడ్ శాల్యూటా? గద్దర్: (అందుకొని..) మనోడు రెడ్ శాల్యూట్ అంటే- కొన్ని పేపర్లే వేస్తాయి (నవ్వులు)! నేనూ మూర్తి గురించి ఒక్కమాట చెప్పాలి... ప్రజాచైతన్యం కోసం సాగిన జననాట్యమండలి గజ్జెల మోతకు కొనసాగింపే మా మూర్తి సిన్మాలు. ఇవాళ తెలంగాణలో మేమిద్దరం కలసి ఎక్కడికైనా పోతే, నా కన్నా అతణ్ణే ఎక్కువ ఆదరిస్తారు. వాళ్ళకు ఆయనే గద్దరన్న (నవ్వులు)! - డాక్టర్ రెంటాల జయదేవ. -
దండకారణ్యం ఆడియో ఆవిష్కరణ నేడు
పాత శ్రీకాకుళం: ‘దండకారణ్యం’ తెలుగు చలన చిత్రం ఆడియో ఆవిష్కరణ శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్టు మానవ హక్కుల వేదిక ఉపాధ్యక్షుడు కేవీ జగన్నాథరావు తెలిపారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమానికి దండకారణ్యం చిత్ర హీరో, దర్శకత్వం వహించిన ఆర్. నారాయణమూర్తి హాజరవుతారని తెలిపారు. ఆదివాసుల సమస్యలు, వారి జీవన విధానం, నిర్వాసితుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపించారని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రజా గాయకుడు గద్దర్, గోరేటి వెంకన్న పాటలు రాశారని, కార్యక్రమానికి అన్ని వర్గాలకు చెందిన వారు హాజరు కావాలని కోరారు.