దండకారణ్యం సినిమా రివ్యూ
చిత్రం: ‘దండకారణ్యం’,
తారాగణం: ఆర్.నారాయణమూర్తి, త్రినాథ్, ప్రసాద్‌రెడ్డి, విక్రమ్,
కెమేరా: శివకుమార్, మాటలు-
ఫొటోగ్రఫీ- సంగీతం-నిర్మాత-దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి
దేశంలో అభివృద్ధి ఎక్కడ జరిగినా చివరికి సమిధలుగా మారేది ఆది వాసీలు, అమాయక గిరిజనులు. అభివృద్ధి పేరుతో బహుళజాతి కంపెనీలతో కలిసి ప్రభుత్వం చేపడుతున్న బాక్సైట్, ఇనుము లాంటి సహజ వనరుల తవ్వకాలను అక్కడున్న ఆదివాసీలు, గిరిజనులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తూ పోరాడుతున్నారు. ఈ పోరాటంలో ఎంతోమంది బలయ్యారు. అడవులు తుపాకుల మోతతో రక్తచరిత్రను లిఖిస్తున్నాయి. ఆ పరిస్థితి ఉండకూడదనే కథాంశంతో స్వీయ దర్శకత్వంలో ఆర్.నారాయణమూర్తి నిర్మించిన చిత్రం ‘దండకారణ్యం’. ప్రముఖ మావోయిస్ట్ నేత అయిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ జీవితం ఆధారంగా ఈ చిత్రకథను ఆయన అల్లుకున్నారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆర్.నారాయణమూర్తి స్నేహా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై రూపొందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.
మావోయిస్టు నాయకుడు కోటన్న (ఆర్.నారాయణమూర్తి) ఓ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో అతని స్వస్థలమైన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి గ్రామస్థులు శోక సముద్రంలో మునిగిపోతారు. జగిత్యాల జైత్ర యాత్రతో మొదలుపెట్టి పశ్చిమ బెంగాల్‌లోని జంగల్‌మహల్ దాకా ప్రజల కోసం అలుపెరుగని పోరాటం సాగించిన కోటన్న గతంలోకి కథ వెళుతుంది. కట్ చేస్తే... యుక్తవయసు నుంచి అన్యాయాలను ఎదిరించే మనస్తత్వం ఉన్న కోటన్న కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తాడు. సొంత ఊరిలో జరుగు తున్న అన్యాయాలను ఎదిరించడంతో ప్రభుత్వం అతనిమీద నక్సలైట్ ముద్ర వేస్తుంది. కనిపిస్తే కాల్చివేయమని ఆదే శాలు జారీ చేస్తుంది. ఉన్న ఊరినీ, కన్నతల్లినీ విడిచి అడవిలో పోరాటానికి సిద్ధమవుతాడు కోటన్న. అక్కడ అతనికి మరో సమస్య... అడవిలో అపారసంపద మీద ప్రభుత్వంతోపాటు కొన్ని ‘కార్పొరేట్ సంస్థలు కన్నేస్తాయి.
ఎలాగైనా ఆదివాసీల భూములను కొల్లగొట్టి, ఇళ్లను పడగొట్టి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని వాళ్ల ప్లాన్. దీనివెనుక కోటానుకోట్ల రూపాయల ఒప్పందాలున్నాయి. కానీ దీన్ని పసిగట్టిన కోటన్న ఆ గ్రామాలల్లో జరుగుతున్న అన్యాయం గురించి చైతన్యం తీసుకొస్తాడు. గ్రామస్థులు కూడా అక్కడికి వచ్చిన ప్రభుత్వాధికారులను, అక్కడ ఖనిజాలను తరలించడానికి చేపట్టిన రోడ్డు, రైల్వేపనుల్ని అడ్డుకుంటారు. దీంతో అక్కడి వాతావరణం హింసాత్మకంగా మారుతుంది. గ్రామస్థుల్లో కొంత మంది మావోయిస్ట్ ఉద్యమంలో చేరిపోతారు. ఇదే సమయంలో భూమి పూజ చేయడానికి వచ్చిన సీఎం నానాజీని చంపడానికి మందుపాతర పెడతారు మావోయిస్టులు. సీఎం గాయాలతో బయటపడ తాడు. కోటన్న గ్రూప్‌లోనే పనిచేస్తూ ఇన్‌ఫార్మర్‌గా మారిన వ్యక్తి సమా చారంతో పోలీసులు అతని మీద ఎటాక్ చేస్తారు. కానీ కోటన్న వెంట్రుకవాసిలో తప్పించుకుంటాడు.
ప్లాన్ బెడిసి కొట్టడంతో మరో వ్యక్తిని పంపిస్తారు పోలీసులు. కోటన్న మంచితనం తెలిసిన అతను తనెందుకు వచ్చాడో కోటన్న ముందు నిజాయతీగా ఒప్పుకుంటాడు. పరిస్థితి విషమించడంతో ప్రభుత్వం అక్కడ పోలీసులు, మిలటరీని రంగంలోకి దించడంతోపాటు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఆయుధాలిస్తుంది. ఈ క్రమంలోనే సీఎం కొడుకును మావోలు కాల్చిచంపడంతో కథ మలుపు తిరుగుతుంది. కానీ ఈ నింద మావోయిస్టు సానుభూతిపరుడైన క ళాకారుడు జితిన్ మరాండీ మీద పడుతుంది. జితిన్‌ను విడిపించడానికి కోటన్న ఏం చేశాడు? చివరికి పోలీసులు మోసంతో కోటన్న ప్రాణాలు ఎలా తీశారన్నది మిగతా కథ.
మావోయిస్ట్ నాయకుడు కిషన్‌జీ మరణించినా ప్రభుత్వ సారథ్యంలో ‘ఆపరేషన్ గ్రీన్‌హంట్’ ఆగలేదు. ఇంకా దండకారణ్యం రగులుతూనే ఉంది. ఈ సమయంలోనే ప్రభుత్వం, మావోయిస్ట్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి శాంతి నెలకొనాలనే ఉద్దేశంతో నారాయణమూర్తి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తొలిసారిగా ఓ నిజజీవిత పాత్ర పోషించిన ఆయన కోటన్నకూ, అతని తల్లికీ మధ్య అనుబంధాన్ని ఓ పాట ద్వారా చూపించిన తీరు హృద్యం. ప్రజా గాయకుడు గద్దర్ ఈ సినిమాలో 3 పాటలు రాసి, పాడి, నటించారు. దండకారణ్యంలో సాగుతున్న పోరాటాలకు వెండితెర సాక్ష్యమైన ఈ చిత్రం అక్కడి పరిస్థితుల పట్ల ప్రేక్షకుల్లో ఆలోచన రేపుతుంది.