అడవి పూలు | gadhar and r.narayana murthy special chit chat with sakshi family | Sakshi
Sakshi News home page

అడవి పూలు

Published Sat, Mar 12 2016 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

అడవి పూలు

అడవి పూలు

చెట్టుకు మాటలు రావు... పుట్టకు పాటలు రావు... కానీ, మాటా, పాటా రెండూ అడవిలోనే పుట్టాయి. అరణ్య రోదనలు మనదాకా చేరాలంటే...  మన సహాయం అడవి కాచిన వెన్నెల కాకుండా ఉండాలంటే... అడవినీ, సమాజాన్నీ జతకలపాలంటే.. ఓ జత కావాలి!  ఆర్. నారాయణమూర్తి, గద్దర్ - 
‘దండకారణ్యాని’కి సూర్యచంద్రుల లాంటివారు!
వెలుగు, వెన్నెల లాంటివారు! కళామతల్లి కడుపున పుట్టిన ఈ కవలలు అడవితల్లి పాదం మీద పుట్టుమచ్చలు!  వీరి ఆట, పాట... మాట, బాట...  ‘సాక్షి’కి ఎక్స్‌క్లూజివ్!

నమస్తే గద్దర్ జీ! కొంత గ్యాప్ తర్వాత తెరపైకొచ్చారు...
గద్దర్: అవును. రెండేళ్ల నుంచి ఎక్కడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు! ‘దండకారణ్యం’సిన్మాకు మా మూర్తి అన్న డెరైక్టరు, నేను యాక్టరు. కాబట్టి ఆయన నుంచే స్టార్ట్ చేద్దాం.

నారాయణమూర్తిగారూ! 30 ఏళ్ళుగా ఉద్యమాలే ఊపిరిగా ఫిల్మ్స్ తీస్తున్నారు. తాజా ‘దండకారణ్యం’ ఏంటి?
నారాయణమూర్తి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ - ఇలా అనేక రాష్ట్రాలకు విస్తరించింది - దండకారణ్యం. అపార ప్రకృతి సంపదకు నెలవు. దోపిడీకి వ్యతిరేకంగా ఆదివాసీలు చేస్తున్న పోరు, వెన్నుదన్నుగా నిలిచిన ఉద్యమకారుడు కోటన్న జీవితమే ఈ ‘దండకారణ్యం’ ఫిల్మ్. నేను ఉద్యమకారుడు మల్లోజు కోటేశ్వరరావు అలియాస్ కోటన్న అలియాస్ కిషన్‌జీ వేషం వేస్తున్నా. నేనెన్నో సినిమాలు తీసినా, కిషన్‌జీ లాంటివారి జీవితంతో తీయడం తొలిసారి.

గద్దర్‌జీ! ‘జగిత్యాల టూ జంగల్‌మహల్’ సాగిన కిషన్‌జీతో మీకు సాన్నిహిత్యం ఉందిగా?
గద్దర్: అవును. కానీ, ఈ సినిమా కేవలం ఆయన జీవితమే కాదు. గిరిజనులు ఎదుర్కొంటున్న దోపిడీని సిన్మాలో చూపాం. అన్ని రంగాల్లో, చివరకు మీడియాలో వస్తున్న ‘ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల’ వల్ల జరిగే దోపిడీపై జన చైతన్యానికే ఈ ప్రయత్నం!

 నారాయణమూర్తి: (ఆవేశంగా) ఒకప్పుడు ఈస్టిండియా కంపెనీవాడు దోపిడీ చేస్తే, ఇప్పుడు మనవాళ్ళు చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే, ఈ దేశంలో మరో స్వతంత్రం కోసం మళ్ళీ పోరు చేయాల్సొస్తుంది.

కిషన్‌జీ మీద సినిమా తీయాలని ఎందుకనిపించింది?
నారాయణమూర్తి:
మావోయిస్ట్ టాప్‌లీడర్ కిషన్‌జీది పెద్దపల్లి. హి ఈజ్ లైక్ సుభాష్ చంద్రబోస్. నా దృష్టిలో ఇండియన్ చెగువేరా. నాలుగున్నరేళ్ళ క్రితం కిషన్‌జీని ఎన్‌కౌంటర్ చేశారు. అంత్యక్రియల్లో గద్దరన్న పాడిన పాట గుర్తుంది. అక్కడ నేను ‘కిషన్‌జీ మీద సినిమా తీస్తా’నన్నా. తీశా. గద్దరన్న 3 పాటలు రాసి, యాక్ట్ చేశారు.
గద్దర్: మిలటరీ రాజ్యంలో బలవుతున్న ఆదివాసీలకు అద్దం ‘దండకారణ్యం’. ఆర్మీ బయటివాళ్ళతో కొట్లాడడానికుంది కానీ, ఇంట్లోవాళ్ళపై తుపాకీ పేలిస్తే ఎలా? వాళ్ళ డుగుతున్నవి పెద్దవేం కాదు. కాసింత బువ్వ, గూడు! 

మరి ‘దండకారణ్యం’ బాగుండాలంటే ఏం చేయాలి?
నారాయణమూర్తి:
(ఆవేదనగా..) అమాయకులు బలైపోతున్న దండకారణ్యం గురించి పార్లమెంట్‌లో చర్చ జరగాలి. అడవిలో మళ్ళీ శాంతి నెలకొనాలి. అక్కడ ఆయుధాలు పట్టినవాళ్ళతో బేషరతుగా చర్చలు జరపాలని హోమ్‌మంత్రికీ, ప్రధానమంత్రికీ నా విన్నపం. అందుకు, ప్రజాప్రతినిధులు, పెద్దలతో పాటు మేమూ వస్తాం.

 గద్దర్: మూర్తి ప్రతిపాదించినట్లు, శాంతి చర్చల కోసం అవసరమైతే నేను, మూర్తి దండకారణ్యంలోకి అడుగుపెడతాం. ఇవాళ ఎస్.టి. రిజర్వేషన్ కింద ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్లమెంట్‌లో ఈ విషయమై గొంతు విప్పాలి? తాము ఎవరివైపున్నామో స్పష్టం చేయాలి!

అసలు మీ ఇద్దరి స్నేహం ఎక్కడ మొదలైంది?
నారాయణమూర్తి:
ప్రజల కోసం ఉద్యమాలు చేసే వాళ్లంటే చదువుకొనే రోజుల నుంచీ గౌరవం. కొండపల్లి సీతారామయ్య, చండ్ర రాజేశ్వరరావు, బాలగోపాల్, వరవరరావు, వంగపండు ప్రసాదరావు వంటి మహానుభావుల్ని చూడాలి. గద్దరన్న ప్రోగ్రాం చూడాలనుకునేవాణ్ణి. ఫస్ట్ ‘అర్ధరాత్రి స్వతంత్రం’(1986) సిన్మా తీశా. వంగపండు పాట పెట్టా. సిన్మా బిగ్ హిట్. మద్రాస్ వాణీమహల్‌లో ‘జననాట్య మండలి’ ప్రోగావ్‌ుకి వచ్చిన గద్దరన్నకు, సిన్మా చూపిస్తే, మెచ్చుకున్నారు. అలా మా స్నేహం మొదలైంది.

నంది అవార్డొచ్చిన ‘నీ పాదం మీద...’ పాట కథేంటి?
నారాయణమూర్తి:
‘ఒరేయ్ రిక్షా’ (95) నాతో తీస్తూ గురువు దాసరి గారు నాతో, ‘గద్దరన్నను అడగరా! ‘నా రక్తంతో నడుపుతాను రిక్షాను’ అనే పాట పెట్టుకుంటానని’ అన్నారు. అన్ననడిగితే, ‘నీ కోసం ఇస్తున్నా, తీసుకో’ అన్నారు. అలాగే ‘నీ పాదం మీద’ పాట రాసిచ్చారు. నా దృష్టిలో గద్దరన్న బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్. దేశం గర్వించదగ్గ మనిషి.

ఒకరు సిన్మాలతో, మరొకరు పాటలతోకమ్యూనికేషన్..!
గద్దర్: ‘ఒరేయ్ రిక్షా’ కన్నా ముందు బి. నరసింగరావు ‘రంగులకల’ (’84)లో ‘మదనా సుందరి’ లాంటి పాటలు రాశా, పాడా. ఇక్కడ మేము చేసేది ఒక జీవితాన్ని ఇంకో జీవితానికి కమ్యూనికేట్ చేయడం! మూర్తేమో తెర మీద కనిపించే ఆర్టిస్ట్ కమ్యూనికేటర్. నేనేమో స్టేజ్‌పైన ప్రత్యక్షంగా కనిపించే కమ్యూనికేటర్. మేము కమ్యూనికేట్ చేసే వస్తువుల్లో తేడా లేదు. తేడా రూపంలోనే! ‘పేదోనికింత బువ్వ దొరకాలి’, ‘ఎవడి కష్టం వాడికే దక్కాలే, లేకుంటే పోరాడాలి’ అని ఆయనా అంటాడు, నేనూ అంటా!

ఇది నిజమైన దేశభక్తుడి కథ. ‘దండకారణ్యం’లో నేనెక్కడా లాల్ సలామ్ అనలేదు. ఇన్నేళ్ళ జీవితంలో తొలిసారిగా సిన్మాలో ‘భారత్‌మాతాకీ జై’ అని పాడా.

నేను దేశమంతా తిరిగా. కోరాపుట్ - గంజాం సరిహద్దులో ఒంటి మీద తువ్వాలుతో గడుపుతున్న ప్రజల దైన్యం చూశా. కడుపులో బిడ్డని వందకి అమ్ముకొంటున్న తల్లుల దీనస్థితిని చూశా.

సామాన్యుడి జీవితాన్ని మార్చడమెట్లా అన్నది ప్రధానం! అందుకే, ‘సున్‌రే బాబూ పేట్‌కీ సవాల్ హై... కుచ్ బాత్ కీ నై’ అంటా. అంటే, హైటెక్ సిటీ మీరే ఉంచుకోండి. మాకు బువ్వ, గుడిసె ఉండనివ్వండంటున్నాం.

నేను పాటతో ఎంత ఇన్‌స్పిరేషనో మూర్తి ఆటతో అంతే ఇన్‌స్పిరేషన్! ఆయనలా నమ్మిన సిద్ధాంతాలతో పనిచేసేవారు దేశంలో తక్కువ. ఆ కమిట్మెంట్ మాకు పెద్ద నైతిక స్థైర్యం. సపోర్ట్ చేసేందుకు మాకూ ఒకడుఉన్నాడనిపిస్తుంది! 

ఎన్టీయార్, ఏయన్నార్, సావిత్రమ్మంటే ఆనందపడిపోతాం. వేరే కమ్యూనికేటర్లతో, యాక్టర్లతో మాకేం డిఫరెన్సెస్ లేవు! పరస్పరం గౌరవమే!
రాబోయే కాలం మాదే! ప్రజాకవుల్ని ఒక తాటి మీదకు తెస్తాం. వారి మాట, పాట, ఆటతో ప్రజా వాగ్గేయకారుల యుగం వస్తుంది. పాటలతోనే సినిమాలు తీసే దర్శకులూ వస్తారు!

 

మొదటిసారి మూర్తిని చూసినప్పుడు ఏమనిపించింది?
గద్దర్: ‘నన్ను మించినోడు ఒకడు దొరికిండు’ అనుకున్నా. 62 ఏళ్ళ మూర్తికిప్పటికీ నో వైఫ్, నో ప్రాపర్టీ. లాభాపేక్ష లేకుండా 30ఏళ్లలో ఒక్కడే 29 సిన్మాలు తీశాడు. హి లివ్స్ ఫర్ ది పీపుల్. అతని ప్లెయిన్‌నెస్ నాకిష్టం!

మూర్తి గారూ! ఈ 30 ఏళ్ల ప్రయాణం ఎలా సాగింది?
నారాయణమూర్తి: 20 ఏళ్ళు నా సిన్మాలు బాగా ఆడాయి. తర్వాత ఇండస్ట్రీలో చాలామంది విప్లవం నేపథ్య సిన్మాలు తీశారు. ఎక్కువగా అవే చిత్రాలు వచ్చేటప్పటికి ప్రజలకు మొహం మొత్తేసింది. ఎవరూ తీయకపోయినా, నేను అవే పట్టుకుని సముద్రం ఈదుతున్నా. సిన్మాలా డినా, నన్ను ‘పీపుల్స్‌స్టార్’ అన్నా అది ఉద్యమం, ఈ ప్రజాకవులు, వాళ్ల బాణీలు, పాటల గొప్పదనం!  

సిన్మాలకు తగ్గట్లు రాయడం స్వేచ్ఛాకవులకు ఇబ్బందే?
గద్దర్: నిజమే. కానీ, చాలాసార్లు అప్పటికే పాపులరైన ప్రజాగీతాలనే సినిమాలో వాడుతుంటారు. ప్రత్యేక సన్నివేశం చెబితే పాట ఆశువుగా కట్టేస్తా. ‘దండకారణ్యం’లోని ‘పొద్దుతిరుగుడు పువ్వా’ పాట బయట పాపులర్. అలా సిన్మాలోకొచ్చింది. చివరి చరణం కోటన్న గురించి ‘వీరయోధుని ముద్దాడే’ అని కొత్తగా రాసి, పాడా! దేశంలోని దోపిడీని ఆపమన్నవాడి కన్నా దేశభక్తుడు ఎవడు?

ఉద్యమాన్ని పాటల కన్నా సినిమాతో ఎఫెక్టివ్‌గా చెప్పగలమా? లేక మీ పాటతో సినిమా పదునెక్కుతుందా?
గద్దర్: పాట అనేది ఒక తక్షణ రూపం. కానీ, సిన్మా- ఫొటోగ్రఫీ సహా చాలా కలసి సమగ్ర రూపం. డెరైక్టర్ క్రియేటివిటీ. ఎన్నో చోట్ల పాడినా ‘పొడుస్తున్న పొద్దు మీద’, ‘బండెనక బండి కట్టి’ లాంటివి సిన్మా వల్ల ప్రజల్లోకి వేగంగా వెళ్లిపోతాయి. దటీజ్ ద పవర్ ఆఫ్ సినిమా. 

మీ పాపులార్టీని కూడా ఈ సిన్మాకు వాడుతున్నారా?
గద్దర్: నేను తమ సినిమాల్లో నటిస్తే, కనిపిస్తే బాగుంటుందని అమితాబ్, రజనీకాంత్, చిరంజీవి దాకా ఎంతోమంది అనుకున్నారు. అడిగారు. కానీ, ‘గద్దర్ పాపులారిటీని నేను వాడుకున్నట్లు ఎందుకు?’ అని మూర్తి తన సినిమాల్లో చేయమంటూ ఎప్పుడూ అడగలేదు. ఈ సిన్మాలో నటించాలని నేనే అనుకున్నా. ‘కిషన్‌జీ లైఫ్‌పై సిన్మాలో 5 నిమిషాల పాత్ర ఇవ్వు చాలు’ అని అడిగా. చేశా. 

పాటల రికార్డింగ్‌లో ఎదురైన అనుభవాలేమైనా?
గద్దర్: సిన్మాకోసం అప్పటికప్పుడు సీన్ చెప్పి రాయించిన క్రెడిట్ మూర్తిదే. సన్నివేశం చెప్పి వెళ్లిపోతాడు. నేను నాకిష్టం వచ్చినట్లు రాస్తా. రికార్డు చేసేవాడు, మ్యూజిక్ కొట్టేవాడు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చేస్తారు. ఇది చాలా మందికి తెలీదు(నవ్వు). ‘దండకారణ్యం’లో ఒకటే డైలాగ్ నాది. ‘మహా దేశభక్తుడు కోటన్నకు జోహార్’ అనాలి. అది ఎన్నిసార్లు చెప్పినా కలుస్తలేదు. అప్పుడు మూర్తి ‘నీ ఇష్టం వచ్చినట్టు అను అన్నా, నా ఇష్టం వచ్చినట్టు కలుపుకుంటా’ అన్నాడు (నవ్వులు). పాటల రికార్డింగ్ గమ్మత్తుగా చేశాడు మూర్తి! మ్యూజిక్ డెరైక్టర్ లేడు.. లిరిక్ రాసింది లేదు.. స్టూడియో లేదు. డబ్బింగోడు ఆడ కూకున్నాడు. ‘అన్నా అడవి మీద పాడేయ్’ అన్నాడు. అప్పుడు ‘అడవి తల్లీ నీకు వందనం’ అని పాడి వచ్చేశా. ఈయన ఏం కలిపిండో ఏమో... తీరా పాట క్యాసెట్‌లో వింటే, నేనెప్పుడు రాస్తిరా ఇవన్నీ అనుకున్నా. పాటలు రాయడం, మాకు ప్రొఫెషన్ కాదు. అది మాకు జీవితం. నేనే కాదు ఈ సిన్మాలో తమ్ముడు గోరటి వెంకన్న ‘గిచ్చన్న గిరి మల్లెలో’ అనే వండర్‌ఫుల్ పొలిటికల్ సాంగ్ రాశాడు. ఉద్యమానిదే విజయమని నా కన్నా గొప్పగా రాశాడు.

కానీ, ‘దండకారణ్యం’ అంటే ఇబ్బందులుంటాయిగా!
గద్దర్: చాలానే. మిలటరీ వాళ్ళు మూర్తిని పట్టుకొని...
నారాయణమూర్తి: (అందుకొని...) ఖమ్మంలో గద్దరన్న పాట అయిపోయింది. బయల్దెల్లా గనుల వద్దకెళ్లి కొన్ని షాట్స్ తీయాలని నేను, కెమేరామన్ బయల్దేరాం. ఛత్తీస్‌గఢ్‌లో కుంట నుంచి సుకుమ 85 కి.మీ. ప్రతి 4 కి.మీకొక మిలటరీ క్యాంప్. కీకారణ్యం. రోడ్డు మీద నుంచే మిలటరీ క్యాంప్ షూట్ తీసుకుంటూ వెళ్లిపోతున్నాం. వెనక ఏదో విజిల్ వచ్చింది. మరో 4 కిలోమీటర్లు వెళ్లగానే మిలటరీ సిబ్బంది రోడ్డుపై ఉండి కారు ఆపారు. నేను నా క్యారెక్టర్ నక్సల్ డ్రెస్ వేసుకుని ఉన్నా. వాళ్లు నేను నక్సలైట్ అనుకున్నారు. ‘నన్ను ఏమైనా చేయండి. కెమేరామన్, డ్రైవర్‌ని వదిలేయండి’ అన్నా. ఫైనల్‌గా వాళ్ల హెడ్డాఫీ సర్‌కి ఫోన్ చేశారు. ఆ మిలటరీ హెడ్ ఫోన్‌లో ‘ఏవండీ నారాయణమూర్తిగారూ.. మీరింకా విప్లవ సిన్మాలు చేస్తున్నారా. నేను మీ ఫ్యాన్‌ని’ అన్నారు. ఆ తెలుగాయన వల్ల బయటపడ్డాం. లేదంటే ఏమైపోయేవాళ్ళమో. (నవ్వు). 

గద్దర్‌జీ! జీవితాన్నే అర్పించిన మూర్తిని స్థిరపడమనరా?
గద్దర్: వాళ్ల అవ్వ, అయ్య చెబితేనే వినలా! నేను చెబితే వింటాడా? (నవ్వులు) మూర్తికి ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. ఆస్తీ లేదు. అంతెందుకు! హైదరాబాద్‌లో సినీకార్మికులకు ఇళ్లిచ్చిన ‘చిత్రపురి’లో అతనికిల్లు లేదు. నా చేత బలవంతాన పైసలు కట్టించి, నాకొచ్చేలా చూశాడు.

మీరిద్దరూ కలిస్తే ఏవేం చర్చ చేస్తారు?
గద్దర్: సమాజాన్నెట్లా మార్చాలనే! మా లాంటి వాళ్లు లక్ష మంది తయారైతే హ్యాపీ. కానీ 70 ఏళ్లకొచ్చా. ఇన్నేళ్లు జనంతో గడపడం జోక్ కాదు.

దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న వారే నిజమైన దేశభక్తులు. దే శాన్ని ఎవరు దోచుకుంటున్నారో వాడే దేశద్రోహి.

విప్లవం నా సొత్తేమీ కాదండి... అది ప్రజల సొత్తు! ఎవరైనా సినిమాలు తీసుకోవచ్చు. ఇప్పుడు లవ్ సినిమాలు ఎలాగో, అప్పుడు విప్లవం చిత్రాలు అలాగన్నమాట. ఇలాంటి సినిమాలకు నాతో స్టార్ట్ కాలేదు... నాతో ఫినిష్ కావు. 

♦ ఈ ‘దండకారణ్యం’ సిన్మాలో క్లైమాక్స్‌లో 8 నిమిషాల ఎమోషనల్ పాట వస్తుంది. నా మీదొచ్చే ఆ పాటను కొద్దిగా శ్రుతి పెంచి పాడమన్నా. అంతే! 70 ఏళ్లకు దగ్గరవుతున్న గద్దరన్న నా కోసం శ్రుతి పెంచి, ఏక్‌దమ్ పాటంతా, కోరస్‌తో సహా పాడేశాడు. ఒకప్పుడు ఎవరి పాట విని ఆరాధించానో, ఇప్పుడు ఆయన పాడిన పాటకి నేను నటించడం పెద్ద థ్రిల్.

ఏ సిన్మాకైనా కథ, కథనం, దర్శకత్వం ముఖ్యం. అవి బాగుంటేనే ఆడుతుంది. మ్యూజిక్ కూడా బాగుంటే, ఎక్కడికో వెళుతుంది! సిన్మా- దృశ్యం, పాట- శ్రవణం. రెండూ కలిస్తే - దృశ్యశ్రవణ కావ్యం.

నాకూ, గద్దరన్నకూ పోలికే లేదు. ఆయన ఉద్యమంలో నడిచి, దానికోసమే బతికిన మనిషి. నేను ఉద్యమంపై అభిమానంతో, సిన్మాలు తీస్తున్న చిన్న కళాకారుణ్ణి.

మరి మీ జీవితంపై మూర్తి సిన్మా తీస్తానంటే...?
నారాయణమూర్తి: (అందుకొంటూ) నేనేమో ‘అన్నా! నువ్వు రైటర్‌వి, సింగర్‌వి, యాక్టర్‌వి. నువ్వే రాయి, డెరైక్ట్ చేయి. బాగుంటుంది’ అని చాలా కాలంగా చెబుతున్నా.
గద్దర్: ‘ఊండెడ్ సోల్జర్’గా మూర్తితో చర్చించి, మిగతా జీవితమంతా సామాజిక ఉద్యమాల కోసం పనిచేసేవాళ్ళతో, ఇలాంటి ప్రత్యేక తరహా సిన్మాలు తీసేవారితో కలసి నడుస్తా. వాళ్ళ పనులకు తోడుగా ఉంటా.

గద్దర్‌జీ... మీరు సినిమాలు చూస్తుంటారా?
గద్దర్: (నవ్వేస్తూ...) తక్కువే! అప్పట్లో ‘టెన్ కమాండ్‌మెంట్స్’, ‘ఉమర్ ముఖ్తార్’ లాంటి సినిమాలు బాగా చూసేవాణ్ణి. అలాగే, నేనో ప్రేమ పిచ్చోణ్ణి. ‘దేవదాసు’, ‘అనార్కలీ’ లాంటి లవ్‌స్టోరీస్ తెగ చూసేవాణ్ణి. ఈ మధ్య ఎక్కువ చూసింది మన మూర్తి సినిమాలే! అతను మొట్టమొదట తీసిన ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నాకు చాలా ఇష్టం. నారాయణమూర్తి: అన్నకు... ‘కుడి ఎడమైతే...’ లాంటి తాత్త్విక విషాద గీతాలంటే చాలా ఇష్టం బ్రదర్!

అలాగా... గద్దర్‌జీ! మీరెలాంటి పాటలు వింటుంటారు?
గద్దర్: శోక, వీర రసాలు కలసిన పాటలంటే నాకు ఇష్టం. గమనిస్తే, నా పాటలన్నీ అంతే! క్లాసికల్ సాంగ్స్ వింటా, సూఫీ సాంగ్సూ వింటాను. ఇక, భక్తిపాటలు, అన్నమయ్య పదాలు, తుకారామ్ గీతాలు, వేమన, సుమతీ శతకాలకు చెవి కోసుకుంటా. ఇక జానపద గీతాలంటారా... నా జీవితమే అవి! చాలామంది ‘నీ గొంతే నీ ప్లస్ పాయింట్’ అని చెబుతూ ఉంటారు. అది ఆమె నుంచే నాకొచ్చింది. మా అమ్మ లచ్చుమమ్మ లేకపోతే, నేను లేను. నా మొదటి పాట ‘సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ’ అమ్మ మీద రాసిందే!

అమ్మకిది చేయలేదన్న లోటు మీకు ఏదైనా?
నారాయణమూర్తి: ఏ తల్లైనా, బిడ్డ క్షేమమే తప్ప ఏమీకోరదు. అమ్మ రెడ్డి చిట్టెమ్మా అంతే! 
గద్దర్: ‘వానికి వాడేం చేసుకోలేద’నే అమ్మ బాధపడుతుండేది!  వ్యవసాయ కూలీ అయినా, మా అమ్మకి సామాజిక చైతన్యం చాలా ఎక్కువ. ఒక్క మాటలో, నా తాత్త్విక గురువు కూడా మా అమ్మే!

గద్దర్‌జీ! మీ ప్రస్థానంపై ఆత్మకథ ఏమైనా రాస్తారా?
గద్దర్: ఆత్మకథ కాదు కానీ, ‘నిఫ్ట్’లో పనిచేస్తున్న మా అబ్బాయి సూర్యం నా మీద ఇంగ్లీషులో డాక్యుమెంటరీ తీస్తానంటున్నాడు. నిశ్శబ్దంగా సేకరణ పనిలో ఉన్నాడు.

మూర్తిపై మీకున్నది ప్రేమా, అభిమానమా, గౌరవమా?
గద్దర్: అతనిపై ప్రేమ కాదు. అతని కమిట్మెంట్ మీద అభిమానం, గౌరవం. తనేది అడిగినా, చేయమన్నా చేస్తా.

మూర్తిగారూ! మీకు గద్దర్ అన్నా, మిత్రుడా, గురువా?
నారాయణమూర్తి:  వాటి కన్నా ఎక్కువ! మహాకవి, ప్రజల్ని చైతన్యపరిచిన కళాకారుడు. ఆయనకు శాల్యూట్!

శాల్యూటా? రెడ్ శాల్యూటా?
గద్దర్: (అందుకొని..) మనోడు రెడ్ శాల్యూట్ అంటే- కొన్ని పేపర్లే వేస్తాయి (నవ్వులు)! నేనూ మూర్తి గురించి ఒక్కమాట చెప్పాలి... ప్రజాచైతన్యం కోసం సాగిన జననాట్యమండలి గజ్జెల మోతకు కొనసాగింపే మా మూర్తి సిన్మాలు. ఇవాళ తెలంగాణలో మేమిద్దరం కలసి ఎక్కడికైనా పోతే, నా కన్నా అతణ్ణే ఎక్కువ ఆదరిస్తారు. వాళ్ళకు ఆయనే గద్దరన్న (నవ్వులు)!  - డాక్టర్ రెంటాల జయదేవ.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement