అంజయ్యకు కన్నీటి వీడ్కోలు
♦ గద్దర్, ఆర్.నారాయణమూర్తి తదితరుల నివాళి
♦ అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం బాధాకరం: మందకృష్ణ
దండేపల్లి: ప్రజా కవి, గాయకుడు, రచయిత గూడ అంజయ్య (62)కు అభిమానులు బుధవారం అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో మంగళవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన ఆయన పార్థివ దేహాన్ని బుధవారం తెల్లవారుజామున స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్ కు తీసుకొచ్చారు. ప్రజలు, కుటుంబీకులు, బంధువులు, అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు ఉంచారు.
ప్రజాకవి గద్దర్, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటి కొండ రాజయ్య, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, సీపీఎం నేతలు రాములు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే ఎస్.రామలింగారెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, పలు దళిత సంఘాల నాయకులు, తెలంగాణ సాంస్కృతి సారథి కళాకారులు మృతదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. అనంతరం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంతక్రియలు నిర్వహించారు. కవిగా, గాయకునిగా దేశవ్యాప్త గుర్తింపు, ప్రజాదరణ పొందిన అంజయ్య అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం చాలా బాధాకరమని మంద కృష్ణమాదిగ ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచ్చారు. ఆయన ఇతర సామాజికవర్గానికి చెంది ఉంటే అంత్యక్రియలను ఎలా నిర్వహించి ఉండేవారో చెప్పనవసరం లేదన్నారు.
తీరని లోటు: నారాయణమూర్తి
కవి, గాయకుడు దళిత జాతి ముద్దుబిడ్డ గూడ అంజయ్య మరణం దేశానికే తీరని లోటని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఆయన రాసిన పాటలతో తన సినిమాలు విజయం సాధించాయన్నారు. అంజయ్యతో తనది విడదీయరాని అనుబంధమని గుర్తు చేసుకున్నారు.
‘దండేపల్లి’కి అంజయ్య పేరు: గద్దర్
అభిమానుల కోరిక మేరకు దండేపల్లి మండలానికి అంజన్న పేరు పెట్టాలని గద్దర్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని బాల్క సుమన్ చెప్పారు. అంజయ్య కొన ఊపిరి దాకా సమాజం గురించే ఆలోచించిన మహోన్నతుడని సీపీఎం నేత రాములు పేర్కొన్నారు.