Guda Anjaiah
-
ఖండాలు దాటిన ఖ్యాతి
తెలంగాణ తొలిదశ పోరాటం నుంచి మలిదశ ఉద్యమం వరకు తన కలం, గళంతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన ప్రజాకవి గూడ అంజయ్య. ప్రజలను ఆలోచింపజేసే ఎన్నో పాటలు రాశారాయన. ప్రస్తుతం భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన రాసిన పాటల్లో నిత్యం చిరంజీవిలా వెలుగొందుతూనే ఉంటారు. నేడు గూడ అంజయ్య 65వ జయంతి. దండేపల్లి (మంచిర్యాల) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన గూడ అంజయ్య 1954 నవంబర్ 1న గూడ లస్మయ్య– లస్మమ్మ దంపతులకు ఐదో సంతానంగా జన్మించారు. ఫార్మసిస్టుగా ఆ దిలాబాద్ జిల్లాలోని ఊట్నూర్లో ప్రభుత్వ ఉద్యోగంలో చే రారు. అనంతరం కొద్ది రోజులు ఆదిలాబాద్‌లోనూ పని చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన ఆయన సినిమా పాటల రచనలో భాగంగా హైదరాబాద్‌కు వెళ్లారు. అనంతరం అనారోగ్యానికి గురికావడంతో సాహిత్యానికి దూరమయ్యారు. ఖండాలు దాటిన ఖ్యాతి అంజయ్య రాసిన పాటల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. 1970లో అంజయ్య రచించి, స్వయంగా పాడిన ‘ఊరు మనదిరా.. ఈ వాడమనదిరా..’ పాట మన దేశంతో పాటు విదేశాల్లోనూ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. 20 దేశాల్లో ఈ పాటను వివిధ భాషల్లోకి అనువదించారు. ఎమర్జెన్సీ సమయంలో 1975లో విద్యార్థులు ఢిల్లీ వెళ్లే సమయంలో రాసిన పాట ‘భద్రం కొడుకో.. నా కొడుకో కొమురన్న.. జర పైలం కొడుకో..’ అన్న పాటతో తెలంగాణ పాటకు అంజయ్య మరింత పదునెక్కించారు. పాటల్లో సామాజిక సందేశం అంజయ్య రాసిన పాటల్లో సామాజిక సందేశాలు నిండి ఉన్నాయి. ఒక్కో పాటకు ఒక్కో ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రాసిన అనేక పాటలు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని ప్రేరేపించాయి. ‘రాజిగ ఒరె రాజిగా.. ఒరి ఐలపురం రాజిగా’, ‘అయ్యోనివా నువ్వు అవ్వోనివా.. తెలంగాణకు తోటి పాలోనివా..’ అనే పాటలు ఉద్యమకారుల్లో స్ఫూర్తిని రగిల్చాయి. అంతేకాకుండా అంజయ్య తన పాటలతో సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. రచనలు.. కళ్లెదుటే జరిగిన అన్యాయాలతో చలించిపోయిన అంజయ్య 1970లో రచయితగా మారారు. 1970 నుంచి 1978 వరకు అంజయ్య రచించిన, పాడిన పాటలను కవితా సంకలనం పేరిటా పుస్తకం విడుదల చేశారు. 1999లో ఆయన స్వీయరచనలో రూపొందించిన ‘ఊరు మనదిరా’ పుస్తకాన్ని విడుదల చేశారు. ‘ది వాయిస్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో ఆయన పాటల సీడీ రూపొందించారు. పాటలతో పాటు అనేక రకాల నవలలు, నాటకాలు కూడా రచించారు. కవిగా, గాయకునిగా కాకుండా సినిమా నటునిగా కూడా రాణించారు. అంజయ్య రాసిన పాటలను ఆర్. నారాయణమూర్తి ఎక్కువగా తన సినిమాల్లో వాడుకున్నారు. అంజయ్య ఎర్రసైన్యం, మా భూమి, దండోరా, చీకటి సూర్యులు వంటి పలు చిత్రాల్లో కూడా నటించారు. అనారోగ్యంతో.. అంటరానితనం, బానిసత్వాన్ని పారదోలేలా పాటలతో తూటాలు పేల్చిన విప్లవ కవి, గాయకుడు గూడ అంజయ్య. ఆయన కలం, గళం ఆగిపోయి నాలుగేళ్లు గడిచింది. విప్లవ గేయాల రచయితగా ముద్రపడిన అంజయ్య మూత్రపిండాలు, కామెర్ల వ్యాధితో అనారోగ్యానికి గురై 2016 జూన్ 21న హైదరాబాద్‌లో కన్నుమూశారు. -
మలిసంధ్యలో మాడే కడుపుతో..!
మంచిర్యాల సిటీ: ప్రముఖ కవి, దివంగత గూడ అంజయ్య మాతృమూర్తి పరిస్థితి దయనీయంగా మారింది. మలిసంధ్యలో ఉన్న ఆమె అర్ధాకలితో అలమటిస్తోంది. పదెకరాల భూమి ఉన్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె భిక్షాటన చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఇది గమనించిన మాలమహానాడు నాయకులు సోమవారం జాయింట్ కలెక్టర్ వై. సురేందర్‌రావు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయం వెలుగుచూసింది. పదెకరాల భూమికి సంబంధించిన వివరాలు ఇస్తే న్యాయం చేస్తానని జేసీ ఆమెకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన లస్మవ్వ విలేకరులతో మాట్లాడుతూ తన గోడును వెళ్లబోసుకున్నది. ‘నాకు పదెకరాల భూమి ఉండేది. దాంతోనే ఆరుగురు కొడుకులను, ఒక బిడ్డను పెంచి పెద్ద చేసిన. వాళ్లకు అన్నీ దగ్గరుండి చూసుకున్న. కొడుకులు చచ్చిపోయిండ్రు. ఒక్క బిడ్డ మాత్రమే ఉన్నది. కొడుకుల పిల్లలు ఉన్నరు. ఆరుగురిలో ఒకడు పదెకరాలను వాని పేరునే చేయించుకున్నడు. అంజయ్య రెండేళ్ల కిందటనే చచ్చిపాయే. అంజయ్య బతికి ఉన్నప్పుడే ఎవరు పట్టించుకోకపాయే. నేను కట్టుకున్న ఇంటిని కూడా వాళ్లే ఉంచుకున్నరు. అక్కడిక్కడ అడుక్కొని యాన్నో ఓ కాడ ఉంటున్న. ఎవలన్న పాపమని బుక్కెడు పెడితే తింటున్న. లేదంటే కడుపు మాడ్చుకొని ఉంటున్న. ఈ వయసులో ఎసంటోళ్లకు కూడా ఇసొంటి తిప్పలు రావద్దు. ఎవరైనా ఎన్ని రోజులు పెడుతరు బిడ్డ. ఎందుకు బతుకుతున్నా అని బాధపడుతున్న. దేవుడు జెప్పన తీసుకపోతే మంచిగుండు..’అంటూ లస్మవ్వ ఆవేదన వ్యక్తం చేసింది. -
గాంధేయవాదానికి వారసుడు ‘బోవెరా’
టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి గూడ అంజయ్యకు ‘బోవెరా’ స్మారక అవార్డు ప్రదానం కరీంనగర్ కల్చరల్: దివంగత బోయినపల్లి వెంకటరామారావు గాంధేయవాదానికి వారసుడని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. బోయినపల్లి వెంకటరామరావు 97వ జయంతి, సారస్వత జ్యోతి మిత్రమండలి స్థాపన దినం, బోవెరా కవితా పురస్కార ప్రదానోత్సవం శుక్రవారం కరీంనగర్‌లోని ‘బోవెరా’ భవన్లో నిర్వహించారు. కార్యక్రమంలో ఘంటా చక్రపాణి స్మారకోపన్యాసం చేశారు. బోవెరాతో 35 ఏళ్ల పరిచయం ఉందని తెలిపారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కరీంనగర్లో బోవెరా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బొవేరా కవితా పురస్కారాన్ని ప్రజాకవి, గాయకుడు గూడ అంజయ్యకు మరణానంతరం ప్రదానం చేయగా ఆయన సతీమణి గూడ హేమనళిని స్వీకరించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ప్రముఖ వాగ్గేయ కారులు గోరటి వెంకన్న, తెలంగాణ అమరవీరుల స్తూపం రూపకర్త ఎక్కా యాదగిరిరావు, సాహితీవేత్తలు ఎంవీ.నర్సింహ రెడ్డి, దాస్యం సేనాధిపతి, గండ్ర లక్ష్మణ్‌రావు, సుంకె వెంకటాద్రి, మాడిశెట్టి గోపాల్, కాళ్ల నారాయణ, తోట లక్ష్మణ్‌రావు, వాల భద్రరావు, సజ్జన కమలాకర్, బోవెరా సంస్థల అధ్యక్షుడు బోయినపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాకవి గూడ అంజన్న ఆశయాలను కొనసాగిద్దాం
హన్మకొండ కల్చరల్ : ప్రజాకవి గూడ అంజన్న ఆశయాలను కొనసాగించాల్సి బాధ్యత నేటి తరంపై ఉందని వరసం జిల్లా కన్వీనర్ నల్లెల్ల రాజయ్య అన్నారు. బహుజన సాంస్కృతిక సమాఖ్య అధ్వర్యంలో హన్మకొండలోని శ్రీరాజరాజనరేంద్ర బాషా నిలయంలో ఆదివారం మధ్యాహ్నం సమాఖ్య వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సుధమల్ల అశోక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు యువకవులు మాట్లాడుతూ అంజన్నకు రావల్సిన గుర్తింపు రాలేదని అన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు రమాదేవి, బందెల సదానందం, బొడ్డు కుమారస్వామి, పోలాటి రాజు, ముత్యం రాజు, సామల శ్రీధర్, గురిమిల్ల రాజు, బూజుగుండ్ల శ్రీనివాస్, కుడికాల శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువకులు పాడిన పాటలు అలరించాయి. -
అంజయ్యకు కన్నీటి వీడ్కోలు
♦ గద్దర్, ఆర్.నారాయణమూర్తి తదితరుల నివాళి ♦ అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం బాధాకరం: మందకృష్ణ దండేపల్లి: ప్రజా కవి, గాయకుడు, రచయిత గూడ అంజయ్య (62)కు అభిమానులు బుధవారం అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో మంగళవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన ఆయన పార్థివ దేహాన్ని బుధవారం తెల్లవారుజామున స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్ కు తీసుకొచ్చారు. ప్రజలు, కుటుంబీకులు, బంధువులు, అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు ఉంచారు. ప్రజాకవి గద్దర్, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటి కొండ రాజయ్య, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, సీపీఎం నేతలు రాములు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే ఎస్.రామలింగారెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, పలు దళిత సంఘాల నాయకులు, తెలంగాణ సాంస్కృతి సారథి కళాకారులు మృతదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. అనంతరం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంతక్రియలు నిర్వహించారు. కవిగా, గాయకునిగా దేశవ్యాప్త గుర్తింపు, ప్రజాదరణ పొందిన అంజయ్య అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం చాలా బాధాకరమని మంద కృష్ణమాదిగ ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచ్చారు. ఆయన ఇతర సామాజికవర్గానికి చెంది ఉంటే అంత్యక్రియలను ఎలా నిర్వహించి ఉండేవారో చెప్పనవసరం లేదన్నారు. తీరని లోటు: నారాయణమూర్తి కవి, గాయకుడు దళిత జాతి ముద్దుబిడ్డ గూడ అంజయ్య మరణం దేశానికే తీరని లోటని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఆయన రాసిన పాటలతో తన సినిమాలు విజయం సాధించాయన్నారు. అంజయ్యతో తనది విడదీయరాని అనుబంధమని గుర్తు చేసుకున్నారు. ‘దండేపల్లి’కి అంజయ్య పేరు: గద్దర్ అభిమానుల కోరిక మేరకు దండేపల్లి మండలానికి అంజన్న పేరు పెట్టాలని గద్దర్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని బాల్క సుమన్ చెప్పారు. అంజయ్య కొన ఊపిరి దాకా సమాజం గురించే ఆలోచించిన మహోన్నతుడని సీపీఎం నేత రాములు పేర్కొన్నారు. -
మూగబోయిన తెలంగాణ పోరాట గళం
► ప్రజాకవి అంజయ్య కన్నుమూత ► అనారోగ్యం, పక్షవాతంతో తుదిశ్వాస విడిచిన పాటల కెరటం ► తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన అంజన్న పాటలు ► ‘ఊరు మనదిరా..’ పాటతో ఉప్పెనలై లేచిన ఊళ్లు ► ఏకంగా 16 భాషల్లోకి అనువాదమైన పాట ► నేడు ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్‌లో అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్/దండేపల్లి ‘‘ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా.. పల్లె మనదిరా.. ప్రతి పనికి మనంరా.. దొర ఏందిరో.. వాడి పీకుడేందిరో.. జాలీమ్ కౌన్ రే.. ఉస్కా జులుం క్యా రే..’’ అంటూ ఆ గళం గడీల రాజ్యంపై దండెత్తింది! ‘‘కత్తి మనది.. సుత్తి మనది.. పలుగు మనది..’’ అంటూ సమస్త వృత్తులను ఏకం చేసింది!! ‘‘అసలేటి వానల్లో ముసలెడ్లు కట్టుకొని మోకాటి బురదల్లో మడిగట్లు దున్నితె గరిసెలెవ్వలివి నిండెరా.. గుమ్ములెవ్వలివి నిండెరా..’’ అంటూ భూస్వామ్య దోపిడీని చీల్చి చెండాడింది!! ‘‘అయ్యోనివా నువు అవ్వోనివా.. తెలంగాణోనికే తోటి పాలోనివా..’’ అంటూ తెలంగాణ ధిక్కారాన్ని దిక్కులు పిక్కటిల్లేలా చేసింది!! ‘‘పుడితె ఒక్కటి.. సస్తె రెండు.. రాజిగ ఒరి రాజిగో ఇగ ఎత్తుర తెలంగాణ జెండా.. రాజిగ ఒరి రాజిగ..’’ అంటూ తెలంగాణ ఉద్యమాగ్నిని రగిలించింది!!! తెలంగాణ తొలిదశ పోరాట కాలం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు సాగిన ఆ పాటల పోరాట కెరటం ఆలసిపోయింది. పాటల్ని తూటాల్లా మలచి పల్లెల్లో విప్లవాగ్నిని రగిల్చిన ఆ గళం మూగబోయింది. జనం బాధలు, కష్టాలు, కన్నీళ్లకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ కలం ఇక సెలవంటూ వెళ్లిపోయింది. ప్రజాకవి, గాయకుడు గూడ అంజయ్య(62) కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం హయత్‌నగర్ సమీపంలోని రాగన్నగూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నెల రోజుల క్రితం అనారోగ్యానికి గురవడం, పక్షవాతం రావడంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన అంజయ్య వారం కిందటే డిశ్చార్జి అయ్యారు. మంగళవారం డీహైడ్రేషన్‌తో నీరసించడంతో కుటుంబసభ్యులు డాక్టర్‌ను పిలిపించి ఇంట్లోనే వైద్యం అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో సాయంత్రం అంజయ్య కన్నుమూశారు. కుటుంబ నేపథ్యమిదీ.. అదిలాబాద్ జిల్లా దండపల్లి మండలం లింగాపూర్‌లో లస్మయ్య, లస్మమ్మ దంపతులకు నాలుగో సంతానంగా 1954, నవంబర్ 1న అంజయ్య జన్మించారు. అంజయ్యకు హేమానళినితో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు శ్రీలత, కవిత, మమత. వారిలో ఇద్దరికి పెళ్లి అయింది. అంజయ్య ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ లక్సెట్టిపేటలో చదివారు. హైదరాబాద్‌లో బీ ఫార్మసీ చేశారు. ఫార్మాసిస్టుగా ఉట్నూర్‌లో మొదటగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులు ఆదిలాబాద్‌లో కూడా పనిచేశారు. తర్వాత సినిమా పాటల రచనలో భాగంగా హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. అంజయ్య తల్లి లస్మమ్మ లింగాపూర్లోనే ఉంటోంది. అంజయ్యకు ఐదుగురు సోదరులు, ఒక సోదరి. ప్రస్తుతం ఒక సోదరుడు, సోదరి మిగిలారు. మిగతా వారు చనిపోయారు. అనారోగ్యానికి గురైనప్పట్నుంచీ అంజయ్య సాహిత్యానికి దూరంగా ఉంటున్నారు. ఆ పాట విప్లవోద్యమ బావుటా.. అంజయ్య రాసిన పాటలు కోట్లాది మంది అణగారిన జనం గుండె చప్పుడుగా, సమాజంలోని ఆధిపత్య ధోరణిపై ఉక్కు పిడికిలిగా, దిక్కుమొక్కులేని జనానికి ఆలంబనగా నిలిచాయి. ఆయన రాసిన ‘ఊరు మనదిరా..’ పాట ఏకంగా 16 భాషల్లోకి అనువాదమైంది. తెలంగాణ పాటలకు బొడ్రాయిగా నిలిచిన ఆ పాట ఓ కొర్రాయిలా మండి దొరల గుండెల్లో గుబులు పుట్టించింది. ఆ పాట స్ఫూర్తితో ఎందరో యువకులు విప్లవోద్యమంలోకి దూకారు. ఇదే పాటను ఆఫ్రికా విముక్తి ఉద్యమంలో అక్కడ ఉద్యమకారులు తమ భాషలోకి మార్చుకొని పాడుకున్నారు. ‘అయ్యోనివా నువు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా...’ అంటూ అంజయ్య రాసిన పాట తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. ‘ఊరు విడిచి నే పోదునా... ఉరి వేసుకొని సద్దునా...’ పాటలో తెలంగాణ కష్టాలను, బాధలను అంజయ్య ఏకరువు పెట్టాడు. ఆకలి చావులు, వలసవాదంపై ఆయన రాసిన ఎన్నో పాటలు మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని ఉరుకులు పెట్టించాయి. తెలంగాణ సాంస్కృతిక కళాకారులు అంజన్న పాటలను చంటిబిడ్డలా ఎత్తుకొని పల్లెపల్లెన ఆడారు, పాడారు. ఉద్యమ పాటలే కాకుండా సామాజిక సృ్పహతో అంజయ్య అనేక పాటలు రాశారు. ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థులు ఢిల్లీ వె ళ్లే సమయంలో ‘భద్రం కొడుకో.. నా కొడుకో కొమురన్న.. జర పైలం కొడుకో..’ పాట రాశారు. ఆయన రాసిన పాటలు ఎర్రసైన్యం, స్వర్ణక్క, చీమలదండు, ఒసేయ్ రాములమ్మ, చీకటి సూర్యుడు, రైతురాజ్యం వంటి ఎన్నో సినిమాలకు ప్రాచూర్యం తెచ్చాయి. తొలినాళ్లలో విప్లవోద్యమంలో పాల్గొన్న అంజయ్య ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దగ్గరయ్యారు. దళిత, మహిళా పోరాటాల్లో కలిసి పనిచేశారు. అన్ని ప్రజాస్వామిక ఉద్యమాల్లో తన అస్తిత్వాన్ని చాటుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక సంఘం నాయకుడిగా పనిచేశారు. చివరిదాకా పాటే శ్వాసగా.. 1969 నాటి తెలంగాణ తిరుగుబాటు రోజులను అంజన్న ప్రత్యక్షంగా చూశారు. 16వ ఏట నుంచే విప్లవ సాహిత్యాన్ని చదివిన ఆయన.. దళిత కథలు కూడా రాశారు. ఎమర్జెన్సీలో జైలు జీవితాన్ని ఆ చీకటి రోజులను చూసి అనేక పాటలు రాశారు. ఆరోగ్యం సహకరించకపోయినా చివరి వరకూ తన జీవిత సహచరి సహకారంతో పాటలను రాస్తూనే ఉన్నారు. 1970 నుంచి 1978 వరకు అంజయ్య రచించిన, పాడిన పాటలను కవితా సంకలనం పేరిట పుస్తకం విడుదల చేశారు. 1999లో ఆయన స్వీయరచనలో రూపొందించిన ‘ఊరు మనదిరా..’ పుస్తకం విడుదలైంది. పాటలతోపాటు నవలలు, నాటకాలు కూడా రచించాడు. నటుడిగా కూడా ప్రతిభ చాటుకున్నారు. ఎర్రసైన్యం, మాభూమి, దండోరా, చీకటి సూర్యులు వంటి సినిమాల్లో పలు పాత్రల్లో నటించారు. కేసీఆర్‌ను చూడాలన్న కోరిక తీరకుండానే.. పక్షవాతంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూడాలనే కోరికను అంజయ్య తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మొదట అంజయ్యను పరామర్శించేందుకు వస్తానని సీఎం కార్యాలయం సిబ్బంది చెప్పినా తర్వాత రాలేదని భార్య హేమానళిని తెలిపారు. స్వగ్రామానికి భౌతికకాయం అంజయ్య భౌతికకాయాన్ని మంగళవారం రాత్రి నాంపల్లిలోని గన్‌పార్క్ వద్దకు తీసుకొచ్చారు. కవులు, కళాకారులు, రచయితలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల కోసం భౌతికకాయాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని స్వగ్రామానికి తరలించారు. అంజన్న పొందిన అవార్డులు.. ► 1988లో రజనీ తెలుగు సాహితీ సమితి నుంచి అవార్డు ►1988లో సాహిత్య రత్న బిరుదు ► 2000లో గండెపెండేరా బిరుదు ► 2004లో నవ్య సాహిత్య పరిషత్ నుంచి డాక్టర్ మలయశ్రీ సాహితీ అవార్డు ► 2015లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ సాహిత్య పురస్కారం -
మూగవోయిన అంజన్న గళం
నివాళి కడు పేదరికంలో ఉన్నా గూడ అంజయ్య తన కలాన్ని, గళాన్ని మాత్రం ఆపలేదు. ‘దొర ఏందిరో, దొర దోపిడేందిరో’ అని గర్జించిన గళం మూగవోయింది. అంజన్న పాట చిరంజీవి, అంజన్న చిరంజీవి. అది తీవ్రమైన ఎండల కాలం. నల్లగొండ జిల్లా కోదాడ పట్టణంలో ప్రగతిశీల ప్రజాతంత్ర విద్యార్థి సంఘం (పీడీ ఎస్‌యూ) మొదటి మహాసభ తర్వాత అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మునుగోడ తాలుకా పల్లివెల గ్రామానికి నడచి వెళుతున్నాము. కాలినడ కన తిరగడం వల్ల అప్పటికే చాలామంది కళాకా రుల ఆరోగ్యం దెబ్బతింది. అయినా మొదటి అరు ణోదయ నాయకుడు పి. చలపతి రావు ఆధ్వ ర్యంలో, పట్టుదలతో కార్యక్రమాలు ఇస్తూ వెళు తున్నాం. ఇంతలో అల్లంత దూరాన మోరం కొడుతున్న ఒక రైతు, ‘‘ఊరు మనదిరా, వాడ మన దిరా, పల్లె మనదిరా ప్రతి పనికి మనం రా..’’ ఇలా పాడుతు న్నంతట్లో గూడ అంజయ్య మమ్మల్నందరినీ ఆపి మకుటం ఉన్నదున్నట్లుగా తీసుకుని ‘‘దొర ఏందిరో, వాని జులుం ఏందిరో, నడుమ జాలిం కౌన్‌రే, ఇస్క్ జులుం క్యాహైరే’’ అని రాసి మిగతా భాగం పూర్తి చేసి ఆ రోజు రాత్రి పల్లివెల గ్రామంలో పాడితే వేలాది జనం ఆ పాటను వింటూ ఉర్రూతలూగారు. విప్లవ సాంస్కతికోద్యమంలో వచ్చిన మొదటి పాట అది. ఆ పాట ఇప్పటికీ, ఎప్పటికీ జనం గుండెల్లో మారుమోగుతూనే ఉంది. అనేక మంది ప్రజా కళాకారులకు జవం జీవం ఆ పాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వందలాది గ్రామాల్లో వేలాది సందర్భాల్లో ఆ పాట ప్రజా హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. తెలంగాణలో అయితే ఆ పాట వినని, స్పందించని, ఆవేశం ప్రదర్శించని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. మా సాంస్కృతిక ప్రస్థానంలో భాగంగా జూన్ 24, 1975న తూర్పుగోదావరి జిల్లా సామర్ల కోటలో కార్యక్రమం ఇచ్చాము. ఆ కార్యక్రమానికి హాజరైన వారిలో పీడీఎస్‌యూ నాయకుడు జంపాల ప్రసాద్, కె. లలిత, అనూరాధ, అంబిక, స్వర్ణలత, రామసత్తయ్య, ప్రసాదు, బీఏవీ శాండిల్య తదితరులు ఉన్నారు. జూన్ 25వ తేదీ కాకినాడ పట్టణంలో సినిమావీధిలో కార్యక్రమం. దోమాచారి, జనార్ధనరావు, కాశీపతి ఆ సభలో ఉపన్యాసకులు. అదే సమయంలో జోరున వర్షం కురుస్తోంది. తడుస్తున్న జనం ఒక్కరొక్కరుగా లేస్తున్నారు. ఆ సందర్భంలో గూడ అంజయ్య ఊరు మనదిరా అనే పాటను, నేను ఓ అమర కళా వేత్తలారా.. అనే పాటను గళమెత్తిపాడితే జనం అంత వర్షంలో కూడా కిక్కురుమనకుండా నిలబడి పాటలు విన్నారు. ఆనాటి విప్లవ పరిస్థితి, దానికి అనుగుణంగా పుట్టిన పాటలు జనాన్ని ఎంతగా చైతన్యం చేసి కదిలించాయో ఈ ఘటన తెలుపు తుంది. ఆ రోజు శివసాగర్ రాసిన ‘చెల్లీ చెంద్రమ్మా’ నృత్య రూపకాన్ని కూడా ప్రదర్శిం చాము. సీనియర్ కళాకారుడు, కవి గాయకులు కానూరి వెంకటేశ్వరరావు రాసిన ‘ప్రగతి’ కూచి పూడి యక్ష గానం తదితర కళా రూపాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. కాకినాడలో ప్రదర్శన 25 రాత్రి ముగిసింది. కళాకారులందరం ఒక విద్యార్థి నాయకుని రూంలో పడుకోబోతున్నాం. సరిగ్గా 12 గంటలకు జంపాల ప్రసాద్ వచ్చి ‘‘కామ్రేడ్స్! దేశంలో ఇప్పుడే ఎమర్జెన్సీ విధించింది ఇందిరా గాంధీ. ప్రతిపక్షాలను, విప్లవకారులను, ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేస్తున్నారు. కామ్రేడ్ సోమచారిగారిని ఇప్పుడే అరెస్టు చేశారు. ఇక అరుణోదయ కార్యక్రమాలన్నీ వాయిదా పడినట్లే. కాబట్టి మిమ్మల్ని అరెస్టు చేస్తారు. జాగ్రత్తగా వెళ్లండి, తర్వాత కలుద్దాం’’ అని చెప్పి వెళ్లిపోయాడు. దాంతో కాశీపతి, గూడ అంజయ్య, నేను తదితరులం రైల్లో హైదరాబాద్ బయల్దేరాం. దారిలోనే గూడ అంజయ్యను అరెస్టు చేసింది ప్రభుత్వం. కాశీపతి అనంతపూర్ వెళుతూ అరెస్ట య్యాడు. మిగతావాళ్లం తప్పించు కున్నాం. కామ్రేడ్ గూడ అంజయ్య జైల్లో ఉంటూనే అనేక పాటలు రాశాడు. ఉదాహరణకు ‘‘ఇగ ఎగబడుదామురో ఎములడ రాజన్న’’, ‘‘చుక్కలాంటి చుక్కా లో లక్షలాది చుక్కల్లో, ఏ చుక్క లున్నా వయ్యా శ్రీపాద శ్రీహరి’’, ‘‘నల్లగొండ జిల్ల ఇది విప్లవాల ఖిల్లా, ఎర్రై జండా, ఎగరాలి మల్లి మల్లి’’ లాంటి అనేక పాటలు రాశాడు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత అరుణోదయ, పీడీఎస్‌యూలో కొనసా గాడు. తర్వాత కొంతకాలానికి ప్రభుత్వ ఉద్యో గిగా మారాడు. అయినా తన కలానికి రాపిడి పెడుతూ నిన్నటి తెలంగాణ ఉద్యమంలో అంజన్న నిర్వహించిన పాత్ర మరువలేనిది. ‘‘అవ్వోనివా, నువ్వు అయ్యోనియా’’ లాంటి పాటలు రాసి, పాడి నూతన రాష్ట్ర ఆవిర్భావంలో తనవంతు బాధ్యత నిర్వర్తించాడు. ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతం లోని దళిత కుటుంబంలో పుట్టిన అంజన్న ప్రపంచం గుర్తింపు కలిగిన కవి, గాయకుడిగా ఎది గిన తీరు ఎంతో ఆదర్శవంతమైనది. ఊరు మన దిరా, ఈ వాడ మనదిరా వంటి గొప్ప పాటలతో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు విప్లవ సాహి త్యం అదించారు. పుడితే ఒక్కటి, చస్తే రెండు, రాజిగో ఓరి రాజిగా ఎత్తర తెలంగాణ జెండ రాజిగో ఓరి రాజిగా అంటూ తెలంగాణ ఉద్య మాన్ని ముందుకు నడిపించారు. కవిగా, రచ యితగా సాంస్కృతిక రంగ నాయకుడిగా జీవిత కాలం నిబద్ధతతో ప్రజాపక్షాన నిలిచిన అంజన్న జ్ఞాపకాలు చిరస్మరణీయంగా ఉంటాయి. కుటుంబం మొత్తం కడు పేదరికంలో ఉన్నా, గూడ అంజయ్య తన కలాన్ని, గళాన్ని మాత్రం ఆపలేదు. మంచాన పడేవరకు కళాకారుడిగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉన్నాడు. ‘దొర ఏందిరో, దొర దోపిడేందిరో’ అని గర్జించిన గళం మూగవోయింది. గళానికి నా వందనం. తెలంగాణ ప్రజాగాయకుడు అంజన్నకు ఒక ప్రియ మిత్రు డుగా, అరుణోదయ కళాకారునిగా అశ్రు నయనా లతో జోహార్లు అర్పిస్తూ, అంజన్న పాట చిరంజీవి, అంజన్న చిరంజీవి. అరుణోదయ రామారావు వ్యాసకర్త అరుణోదయ సాంస్కృతిక సంస్థ నాయకుడు మొబైల్ : 94907 58845 -
తెలంగాణా ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయింది
హైదరాబాద్: ప్రముఖ కవి, గేయ రచయిత గూడ అంజయ్య మృతి పట్ల ఏపీసీసీ ఛీఫ్ రఘువీరారెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కోట్లాది పేద ప్రజాలను తన పాటలతో చైతన్య పరిచిన గూడ అంజయ్య లేని లోటు తీరనిదన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గూడ అంజయ్య మృతిపట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలంగాణా ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ శాసనపక్ష ప్రతిపక్ష నేత శ్రీ కుందూరు జానారెడ్డి తమ సంతాపాన్ని ప్రకటించారు. అంజన్న మృతి తెలంగాణా సమాజానికి తీరని లోటని జానారెడ్డి అన్నారు. ఉద్యమ నేపథ్యంలో ఆయన రాసిన పాటలు, గేయాలు ఎంతో ఉత్తేజాన్ని కలిగించాయన్నారు. గూడ అంజన్న ఆత్మకు శాంతి చేకూరాలని..ఆయన కుటుంబ సభ్యులకు జానారెడ్డి సానుభూతి తెలిపారు. -
ప్రముఖ కవి, రచయిత గూడ అంజయ్య కన్నుమూత
హైదరాబాద్ : ప్రముఖ కవి, గేయ రచయిత గూడ అంజయ్య మంగళవారం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె జబ్బు, పక్షవాతంతో బాధపడుతున్నారు. గూడ అంజయ్య ఇవాళ సాయంత్రం రంగారెడ్డి జిల్లా హయాత్ నగర్ మండలం రాగన్నగూడెంలోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన 1955లో ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపురంలో జన్మించారు. నలభై ఏళ్లుగా కవిగా, రచయితగా అంజయ్య ఎన్నో కథలు, పాటలు రాశారు.'నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు' అనే పాట ప్రజాదరణ పొందింది. ఆయన వ్రాసిన 'ఊరు మనదిరా' పాట 16 భాషలలో అనువాదం అయింది. తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకునిగా పనిచేసారు. అంజన్నకు ముగ్గురు కుమార్తెలు. గత నెల 25న ఆయన అనారోగ్యంతో నిమ్స్ లో చేరారు. అనంతరం ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యులు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. గూడ అంజయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక సామాజిక అంశాలపై గేయాలు రాసిన అంజయ్య సేవలు చిరస్మరణీయమైనవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...గూడ అంజయ్య మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
గూడ అంజయ్యకు కొమురం భీం పురస్కారం
హైదరాబాద్: ప్రముఖ గేయ రచయిత గూడ అంజయ్యను ఈ ఏడాది కొమురం భీం జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారు. కొమురం భీం స్మారక ఉత్సవ పరిషత్, ఆదివాసీ సంస్కృతి, భారత్ కల్చరల్ అకాడమీ, ఓం సాయి తేజా ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ అవార్డును ఏటా ప్రదానం చేస్తున్నారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో అవార్డు కమిటీ చైర్మన్ నాగబాల సురేష్‌కుమార్ వివరాలను వెల్లడించారు. సినీ, టీవీ పరిశ్రమలోవిశేష సేవలందిస్తున్న వారికి తమ ఆధ్వర్యంలో గత ఐదేళ్లుగా పురస్కారాలను అందజేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు సినీ దర్శకుడు సుద్దాల అశోక్ తేజ, సినీ నటులు రాజేంద్రప్రసాద్, దర్శకుడు అల్లాణి శ్రీధర్, శిడాం అర్జున్‌లు ఈ అవార్డులను అందుకున్నారని తెలిపారు. అవార్డు కింద రూ.50,116, జ్ఞాపిక, శాలువా, సన్మానపత్రం అందించనున్నామన్నారు. కాగా, జనవరి చివరి వారంలో రవీంద్రభారతిలో ఈ అవార్డును అందించడానికి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.