తెలంగాణ తొలిదశ పోరాటం నుంచి మలిదశ ఉద్యమం వరకు తన కలం, గళంతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన ప్రజాకవి గూడ అంజయ్య. ప్రజలను ఆలోచింపజేసే ఎన్నో పాటలు రాశారాయన. ప్రస్తుతం భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన రాసిన పాటల్లో నిత్యం చిరంజీవిలా వెలుగొందుతూనే ఉంటారు. నేడు గూడ అంజయ్య 65వ జయంతి.
దండేపల్లి (మంచిర్యాల) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన గూడ అంజయ్య 1954 నవంబర్ 1న గూడ లస్మయ్య– లస్మమ్మ దంపతులకు ఐదో సంతానంగా జన్మించారు. ఫార్మసిస్టుగా ఆ దిలాబాద్ జిల్లాలోని ఊట్నూర్‌లో ప్రభుత్వ ఉద్యోగంలో చే రారు. అనంతరం కొద్ది రోజులు ఆదిలాబాద్‌లోనూ పని చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన ఆయన సినిమా పాటల రచనలో భాగంగా హైదరాబాద్‌కు వెళ్లారు. అనంతరం అనారోగ్యానికి గురికావడంతో సాహిత్యానికి దూరమయ్యారు.
ఖండాలు దాటిన ఖ్యాతి
అంజయ్య రాసిన పాటల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. 1970లో అంజయ్య రచించి, స్వయంగా పాడిన ‘ఊరు మనదిరా.. ఈ వాడమనదిరా..’ పాట మన దేశంతో పాటు విదేశాల్లోనూ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. 20 దేశాల్లో ఈ పాటను వివిధ భాషల్లోకి అనువదించారు. ఎమర్జెన్సీ సమయంలో 1975లో విద్యార్థులు ఢిల్లీ వెళ్లే సమయంలో రాసిన పాట ‘భద్రం కొడుకో.. నా కొడుకో కొమురన్న.. జర పైలం కొడుకో..’ అన్న పాటతో తెలంగాణ పాటకు అంజయ్య మరింత పదునెక్కించారు.
పాటల్లో సామాజిక సందేశం
అంజయ్య రాసిన పాటల్లో సామాజిక సందేశాలు నిండి ఉన్నాయి. ఒక్కో పాటకు ఒక్కో ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రాసిన అనేక పాటలు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని ప్రేరేపించాయి. ‘రాజిగ ఒరె రాజిగా.. ఒరి ఐలపురం రాజిగా’, ‘అయ్యోనివా నువ్వు అవ్వోనివా.. తెలంగాణకు తోటి పాలోనివా..’ అనే పాటలు ఉద్యమకారుల్లో స్ఫూర్తిని రగిల్చాయి. అంతేకాకుండా అంజయ్య తన పాటలతో సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు.
రచనలు..
కళ్లెదుటే జరిగిన అన్యాయాలతో చలించిపోయిన అంజయ్య 1970లో రచయితగా మారారు. 1970 నుంచి 1978 వరకు అంజయ్య రచించిన, పాడిన పాటలను కవితా సంకలనం పేరిటా పుస్తకం విడుదల చేశారు. 1999లో ఆయన స్వీయరచనలో రూపొందించిన ‘ఊరు మనదిరా’ పుస్తకాన్ని విడుదల చేశారు. ‘ది వాయిస్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో ఆయన పాటల సీడీ రూపొందించారు. పాటలతో పాటు అనేక రకాల నవలలు, నాటకాలు కూడా రచించారు. కవిగా, గాయకునిగా కాకుండా సినిమా నటునిగా కూడా రాణించారు. అంజయ్య రాసిన పాటలను ఆర్. నారాయణమూర్తి ఎక్కువగా తన సినిమాల్లో వాడుకున్నారు. అంజయ్య ఎర్రసైన్యం, మా భూమి, దండోరా, చీకటి సూర్యులు వంటి పలు చిత్రాల్లో కూడా నటించారు.
అనారోగ్యంతో..
అంటరానితనం, బానిసత్వాన్ని పారదోలేలా పాటలతో తూటాలు పేల్చిన విప్లవ కవి, గాయకుడు గూడ అంజయ్య. ఆయన కలం, గళం ఆగిపోయి నాలుగేళ్లు గడిచింది. విప్లవ గేయాల రచయితగా ముద్రపడిన అంజయ్య మూత్రపిండాలు, కామెర్ల వ్యాధితో అనారోగ్యానికి గురై 2016 జూన్ 21న హైదరాబాద్‌లో కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment