
లాలా లజపతిరాయ్ స్వతంత్ర సంగ్రామంలో తన ప్రాణాలను వదిలిన అమర జీవి. మొదట్లో దయానంద సరస్వతి ఏర్పాటుచేసిన ఆర్య సమాజ్ భావాల పట్ల ఆకర్షితులై అందులో చేరి సమాజ సేవ చేశారు. ఆయన మీద ఇటాలియన్ విప్లవకారుడైన జోసెఫ్ మ్యాజినీ ప్రభావం కూడా ఉంది. న్యాయవాద వృత్తిని విడిచి స్వాతంత్య్ర పోరాటంపై దృష్టి సారించారు.
ఒకపక్క స్వాతంత్య్రోద్యమంలో పనిచేస్తూనే సామాజిక ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం మహాత్మా గాంధీ ‘హరిజన సేవక్ సంఘ్’ బ్యానర్ కింద పని ప్రారంభించారు. ప్రపంచంలోని ఇతర ముఖ్యమైన ఉద్యమాల మాదిరిగానే ఈ సామాజిక సంస్కరణ కూడా జాతీయ ఆమోదం కోసం గొప్ప పోరాటం చేయాల్సి ఉందని ఆయన ప్రకటించారు. లాలాజీ సేకరించిన కరువు నిధిలో కొంత భాగాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఉపయోగించారు. కొన్ని ప్రాథమిక పాఠశాలలు కూడా ఈ ఫండ్ నుండి నిధులు అందు కున్నాయి. అనాథ పిల్లల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేసి వారికి నూతన జీవితాన్ని ప్రసాదించారు.
భారత దేశంలో రాజ్యాంగ సంస్కరణలను అధ్యయనం చేయడానికి 1928లో బ్రిటన్ నుంచి వచ్చిన సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పంజాబ్‌లోని లాహోర్‌లో జరిగిన ఆందోళనకు లజపతిరాయ్ నాయకత్వం వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మార డంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఈ ‘పంజాబ్ కేసరి’కి తీవ్రమైన దెబ్బలు తగిలాయి. ఆ సందర్భంగా ‘ఈ రోజు నా మీద పడిన దెబ్బలు, బ్రిటిష్ సామ్రాజ్య వాదం శవపేటికకు వేసిన చివరి మేకులు’ అని బ్రిటిష్ పోలీసులను హెచ్చరించారు. ఆ దెబ్బలతోనే చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతి స్వాతంత్య్రోద్యమం తీవ్రమవ్వడానికి దారితీసింది.
– డా. ఎ. శంకర్, రాజనీతిశాస్త్ర ఉపన్యాసకులు, హైదరాబాద్
(నేడు లాలా లజపతిరాయ్ జయంతి)
Comments
Please login to add a commentAdd a comment