Lala Lajpat Rai
-
Punjab Kesari Lala Lajpat Rai స్వతంత్ర సంగ్రామ సింహం
లాలా లజపతిరాయ్ స్వతంత్ర సంగ్రామంలో తన ప్రాణాలను వదిలిన అమర జీవి. మొదట్లో దయానంద సరస్వతి ఏర్పాటుచేసిన ఆర్య సమాజ్ భావాల పట్ల ఆకర్షితులై అందులో చేరి సమాజ సేవ చేశారు. ఆయన మీద ఇటాలియన్ విప్లవకారుడైన జోసెఫ్ మ్యాజినీ ప్రభావం కూడా ఉంది. న్యాయవాద వృత్తిని విడిచి స్వాతంత్య్ర పోరాటంపై దృష్టి సారించారు. ఒకపక్క స్వాతంత్య్రోద్యమంలో పనిచేస్తూనే సామాజిక ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం మహాత్మా గాంధీ ‘హరిజన సేవక్ సంఘ్’ బ్యానర్ కింద పని ప్రారంభించారు. ప్రపంచంలోని ఇతర ముఖ్యమైన ఉద్యమాల మాదిరిగానే ఈ సామాజిక సంస్కరణ కూడా జాతీయ ఆమోదం కోసం గొప్ప పోరాటం చేయాల్సి ఉందని ఆయన ప్రకటించారు. లాలాజీ సేకరించిన కరువు నిధిలో కొంత భాగాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఉపయోగించారు. కొన్ని ప్రాథమిక పాఠశాలలు కూడా ఈ ఫండ్ నుండి నిధులు అందు కున్నాయి. అనాథ పిల్లల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేసి వారికి నూతన జీవితాన్ని ప్రసాదించారు.భారత దేశంలో రాజ్యాంగ సంస్కరణలను అధ్యయనం చేయడానికి 1928లో బ్రిటన్ నుంచి వచ్చిన సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పంజాబ్‌లోని లాహోర్‌లో జరిగిన ఆందోళనకు లజపతిరాయ్ నాయకత్వం వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మార డంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఈ ‘పంజాబ్ కేసరి’కి తీవ్రమైన దెబ్బలు తగిలాయి. ఆ సందర్భంగా ‘ఈ రోజు నా మీద పడిన దెబ్బలు, బ్రిటిష్ సామ్రాజ్య వాదం శవపేటికకు వేసిన చివరి మేకులు’ అని బ్రిటిష్ పోలీసులను హెచ్చరించారు. ఆ దెబ్బలతోనే చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతి స్వాతంత్య్రోద్యమం తీవ్రమవ్వడానికి దారితీసింది.– డా. ఎ. శంకర్, రాజనీతిశాస్త్ర ఉపన్యాసకులు, హైదరాబాద్(నేడు లాలా లజపతిరాయ్ జయంతి) -
‘లాలా’ కోసం భగత్‌సింగ్ ఏం చేశారు? విప్లవకారుల పొరపాటు ఏమిటి?
బ్రిటీషర్ల బానిసత్వ సంకెళ్ల నుండి దేశానికి విముక్తి కల్పించడంలో స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్ విశేష కృషి చేశారు. ఆయన నిష్ణాతుడైన రాజకీయవేత్త, చరిత్రకారుడు, న్యాయవాది, రచయితగా పేరుగాంచారు. లాలా లజపతిరాయ్ కాంగ్రెస్‌లో అతివాద గ్రూపు నేతగా, పంజాబ్ కేసరిగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర వీరుడు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ సహా విప్లవకారులకు లాలా లజపతిరాయ్ అంటే ఎంతో గౌరవం. యువతను దేశ స్వాతంత్య్రం కోసం పోరాడేలా లాలా లజపతిరాయ్ పురిగొల్పారు. నేడు లాలా లజపతిరాయ్ జయంతి. పంజాబ్‌లోని మోగా జిల్లాలోని అగర్వాల్ కుటుంబంలో 1865, జనవరి 28న లాలా లజపతిరాయ్ జన్మించారు. 1928, అక్టోబర్ 30న సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాహోర్‌లో భారీ ప్రదర్శన జరిగింది. దీనిలో లాలా లజపతిరాయ్ పాల్గొన్నారు. ఈ సమయంలో బ్రిటీష్ సైనికులు అతనిపై లాఠీచార్జ్ చేశారు. ఫలితంగా అతను తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమయంలో, లాలా మాట్లాడుతూ ‘నా శరీరంపై పడే ప్రతీ లాఠీ దెబ్బ.. బ్రిటిష్ ప్రభుత్వ శవపేటికపై దిగబడే మేకులా పనిచేస్తుంది’ అని పేర్కొన్నారు. 1927, నవంబరు 8న భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలను అధ్యయనం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దానికి సైమన్ కమిషన్ అనే పేరు పెట్టింది. దీనిలో ఏడుగురు బ్రిటిష్ ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. భారతీయులకు దానిలో స్థానం దక్కలేదు. మాంటేగ్ చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణల పరిశీలనకు ఈ కమిషన్ ఏర్పాటయ్యింది. సైమన్ కమిషన్ 1928, ఫిబ్రవరి 3న భారతదేశానికి వచ్చింది. దీనిని భారత జాతీయ కాంగ్రెస్‌తో సహా దేశమంతా వ్యతిరేకించింది. ఈ సందర్భంగా ‘సైమన్ కమిషన్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పంజాబ్‌లో జరిగిన ఈ నిరసనకు లాలా లజపతిరాయ్ నాయకత్వం వహించారు. లాహోర్ పోలీస్ ఎస్పీ జేమ్స్ ఎ స్కాట్ నేతృత్వంలో లాఠీ ఛార్జ్ జరిగింది. లాలా తీవ్రంగా గాయపడి 18 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. చివరకు 1928 నవంబర్ 17న కన్నుమూశారు. లాలా లజపతి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో భగత్ సింగ్‌తో సహా పలువురు విప్లవకారులు బ్రిటిష్ అధికారి జేమ్స్ ఎ. స్కాట్ హత్యకు ప్లాన్ చేశారు. అయితే అతనిని గుర్తించడంలో పొరపాటు జరిగి, 1928, డిసెంబరు 17న భగత్ సింగ్, రాజ్గురులు బ్రిటీష్ పోలీసు అధికారి జాన్ పి. సాండర్స్‌ను కాల్చిచంపారు. ఆ సమయంలో సాండర్స్ లాహోర్ ఎస్పీగా ఉన్నారు. లాలా లజపతిరాయ్ మృతి విషయంలో దేశం మౌనంగా ఉండదని, బ్రిటిష్ వారికి తగిన సమాధానం చెప్పాలని భావించిన విప్లవకారులు బ్రిటిష్ వారికి ఇటువంటి సందేశం ఇచ్చారు. -
కంఠెవరం బాంబు కేసు: రామయ్య, బసవయ్య, బ్రహ్మయ్య
1905లో బెంగాల్ విభజన సందర్భంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ దేశవ్యాప్తంగా పర్యటించి బ్రిటిష్‌వారి చర్యలకు వ్యతిరేకంగా ప్రజల్లో రాజకీయ స్పృహను కలిగించారు. 1911లో బెంగాల్ విభజనను రద్దు చేసినా ఆ విప్లవ జ్వాల దేశమంతా పాకింది. సర్కారు జిల్లాల నుంచి ఎందరో స్వాతంత్య్ర పోరాటం దిశగా ఆలోచన ఆరంభించారు. అందులో తెనాలి ప్రాంతం కూడా ఒకటి. ఇక్కడ జాతీయోద్యమం ఊపందుకోకముందే గ్రామీణుల్లో రగులుతున్న విప్లవాగ్నిని సూచించే కొన్ని సంఘటనలు జరిగాయి. 1909లో సంచలనం కలిగించిన కఠెవరం బాంబు కేసు అందులో ఒకటి. విజృంభణకు ప్రేరణ ఉత్తర భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాద ఉద్యమం విజృంభించిన రోజులవి. కొన్ని దేశాల్లో ప్రభుత్వ నేతలు, రాజకీయ నాయకుల హత్యలు సర్వసాధారణమయ్యాయి. రష్యా, ఇటలీ చక్రవర్తుల్ని హతమార్చారు. ఆస్ట్రియా మహారాణి దారుణహత్యకు గురైంది. అలాగే స్పెయిన్ ప్రధాని, ఫిన్లాండ్ గవర్నర్ జనరల్ కూడా హంతకుల చేతుల్లో బలయ్యారు. ఉత్తరాదిన ఉగ్రవాదం విజృంభణకు ఇదే ప్రేరణ. స్థానిక యువకులు అప్పట్లో తెనాలికి సమీపంలోని కంచర్లపాలెం, కఠెవరం గ్రామాలకు చెందిన సాహస యువకులు చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, గోళ్లమూడి బ్రహ్మయ్య తమ మిత్రులను కొందరిని కలుపుకుని బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఉగ్రవాదుల ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఉగ్రవాద నాయకులు అత్యంత రహస్యంగా కొందరు అనుచరులను ఇక్కడకు పంపి ఈ ముగ్గురికి బాంబుల తయారీలో శిక్షణ ఇప్పించారు. శిక్షణ పూర్తయ్యాక చెన్నై– న్యూఢిల్లీ రైలు మార్గాన్ని కఠెవరం వద్ద పేల్చివేసేందుకు వీరు పథకం పన్నారు. కొబ్బరికాయ (టెంకాయ)లో పేలుడు పదార్థాలు కూర్చి 1909 ఏప్రిల్ 2న బాంబుల్ని సిద్ధం చేశారు. చెన్నైకు వెళుతున్న వైస్రాయ్ రైలును పేల్చివేయాలని, రైలు మార్గం ధ్వంసం చేయాలని నిర్ణయించారు. దీనికి ముందుగా బాంబులు పనిచేస్తున్నాయో? లేదో? పరీక్షించాలని భావించారు. ఏప్రిల్ 3న కఠెవరం–కంచర్లపాలెం మధ్యగల కట్టపై ఒక కొబ్బరికాయ బాంబును వుంచి వెళ్లారు. అనూహ్యంగా అక్కడ వున్న కొబ్బరికాయ(బాంబు) ను చెన్ను అనే పశువుల కాపరి చూశాడు. దానిని పగులగొట్టేందుకు ప్రయత్నించడంతో బాంబుపేలింది. చెన్ను ఖండఖండాలు 70గజాల దూరంలో పడ్డాయి. ద్వీపాంతరవాస జీవిత ఖైదు తీవ్ర సంచలనం కలిగించిన ఈ కేసును బ్రిటిష్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి లక్కరాజు బసవయ్య, గోళ్లమూడి బ్రహ్మయ్య, చుక్కపల్లి రామయ్యలను కుట్రదార్లుగా నిర్ధారించింది. ఏప్రిల్ 6న ముగ్గురిని అరెస్ట్ చేశారు. కోర్టులో నిందితులు బసవయ్య, బ్రహ్మయ్య తరపున టంగుటూరి ప్రకాశం పంతులు, పి.వి.శ్రీనివాస రావు, ఎ.లక్ష్మీ నరసింహం కేసు వాదించారు. చుక్కపల్లి రామయ్య న్యాయవాదిని తిరస్కరించారు. న్యాయస్థానం రామయ్యకు ద్వీపాంతరవాస జీవితఖైదు విధించింది. బసవయ్య, బ్రహ్మయ్యలకు పదేళ్ల వంతున శిక్ష విధించారు. ఈ ముగ్గురినీ అండమాన్ జైలులో వుంచారు. వీరు అక్కడే జైలుశిక్ష అనుభవించి, విడుదలయ్యారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి (చదవండి: సైన్స్ ఫిక్షన్ ఫ్రీడమ్ యాక్షన్) -
బెంగాల్ ధ్యానం గంగలో స్నానం
బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా 1905 ఆగస్ట్ 7న కలకత్తా టౌన్ హాలులో పెద్ద సభ జరిగింది. 20,000 మంది హాజరయ్యారు. ఈ సభలోనే ఇంగ్లండ్ నుంచి భారతదేశానికి వచ్చే మాంచెస్టర్ గుడ్డను, లివర్‌పూల్ నుంచి వచ్చే ఉప్పును బహిష్కరించాలని తీర్మానించారు. వందేమాతర గీతం ఉద్యమ నినాదమైంది (తన ‘ఆనందమఠం’ నవల కోసం 1870లో బంకించంద్ర చటర్జీ రాసుకున్న ఈ గీతానికి 1896లో రవీంద్రనాథ్ టాగూర్ బాణీ కట్టి కాంగ్రెస్ సభలలో ఆలపించడంతో ప్రాచుర్యం వచ్చింది). విభజన వ్యతిరేకోద్యమానికి చోదకశక్తిగా అవతరించింది. ఉద్యమం దేశవ్యాప్తమైంది. పూనా, బొంబాయి ప్రాంతాలలో బాలగంగాధర తిలక్, పంజాబ్‌లో అయిత్ సంతోష్, లాలా లజపతిరాయ్, ఢిల్లీలో సయద్ హైదర్ రజా, మద్రాసులో వలియప్పన్ ఉల్గనాథన్ చిదంబరం పిళై్ల స్వదేశీ ఉద్యమానికి మార్గదర్శకులయ్యారు. అక్టోబర్ 16, 1905 న విభజన అమలులోకి వచ్చింది. ముందే నిర్ణయించినట్టు ఆ రోజు బెంగాలీలు, జాతీయవాదులు గంగలో స్నానం చేసి, విభజనకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. హర్తాళ్ నిర్వహించారు. ఆ నిరసన నుంచి వచ్చిన ‘స్వదేశీ’ మొత్తంగా భారతీయ సామాజిక, గృహ జీవిత చిత్రాలనే మార్చివేసింది అన్నారు సురేంద్రనాథ్ బెనర్జీ. ఆ సంవత్సరం రక్షాబంధ ఉత్సవాన్ని కూడా విభజనకు వ్యతిరేకోద్యమంలో ఒకరికి ఒకరు రక్షగా ఉంటామని చెబుతూ నిర్వహించారు. ఎదురుపడితే వందేమాతరం అనే పదమే పలకరింపు అయింది. మన దేశం.. మన విద్య తొలి స్వదేశీ ఉద్యమంగా పిలిచే బెంగాలీ ఉద్యమంలో విద్యలో కూడా జాతీయతను ప్రవేశపెట్టే కృషి జరిగింది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. అందులో ఒకటి బెంగాల్ నేషనల్ కాలేజీ. దీనికి అరవింద్ ఘోష్ ప్రిన్సిపాల్. 1906 ఆగస్ట్‌లో జాతీయ విద్యా సమితి ఏర్పడింది. స్వదేశీ పరిశ్రమల స్థాపనకు ఆ స్ఫూర్తి ఎంతో తోడ్పాటునిచ్చింది. చాలాచోట్ల బెంగాల్‌లలో జౌళి మిల్లులు వెలిశాయి. సబ్బులు, అగ్గిపెట్టెల తయారీ, బ్యాంకులు, బీమా కంపెనీల ఏర్పాటు వంటివి కూడా జరిగాయి. బెంగాల్ కెమికల్ స్వదేశీ స్టోర్‌ను అప్పుడే ప్రఫుల్ల చంద్ర రే ఆరంభించారు. విభజనను వ్యతిరేకిస్తూ రవీంద్రనాథ్ టాగూర్ రాసిన ‘అమర్ సోనార్ బంగ్లా’ గీతం సాంస్కృతిక రంగంలో స్వదేశీ పతాకగా ఎగిరింది. మొదటసారి రాజకీయ ఉద్యమంలో మహిళలు పాల్గొన్నారు. బెంగాల్‌కు ఆంధ్రా.. ఆంధ్రాకు చంద్ర ఆంధ్ర ప్రజలు బెంగాల్ విభజనను పూర్తిగా వ్యతిరేకించారు. 1906 నాటి కలకత్తా వార్షిక సమావేశాలకు అయ్యదేవర కాళేశ్వరరావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పి. ఆనందాచార్యులు, మునగాల రాజా, కొమర్రాజు లక్ష్మణరావు తదితరులు హాజరయ్యారు. అలా 1906 నాటి స్వదేశీ ఉద్యమ స్ఫూర్తి ఆంధ్ర ప్రాంతంలో బలపడింది. ఇందులో ముట్నూరి కృష్ణారావు కృషి ఉంది. ఒక ప్రముఖ నేత ఈ ప్రాంతంలో పర్యటించాలని ఆయన కోరి బిపిన్ చంద్ర పాల్‌ను తీసుకువచ్చారు. విజయనగరం, విశాఖపట్నం పర్యటన తరువాత పాల్ ఏప్రిల్ 17న కాకినాడ వచ్చారు. ఏప్రిల్ 19, 20, 23 తేదీలలో రాజమండ్రిలో ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ ఉపన్యాసాలనే చిలకమర్తి లక్ష్మీనరసింహం తెనిగించారు. ‘భరతఖండంబు చక్కని పాడియావు’ అన్న పద్యం ఆ సమయంలోనే ఆయన నోటి నుంచి వచ్చింది. బెజవాడ, మచిలీపట్నాలలో కూడా పర్యటించి మే 1కి పాల్ మద్రాస్ చేరారు. పర్యటన తరువాత రాజమండ్రి, కాకినాడలలో చరిత్ర మరువలేని ఘట్టాలు చోటు చేసుకున్నాయి. కోటప్పలో కాల్పులు.. తెనాలిలో పేలుడు బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో ఫిబ్రవరి 18, 1909 న ఆంధ్రాలో కోటప్పకొండ దుర్ఘటన జరిగింది. ఆనాటి శివరాత్రి ఉత్సవాలకు జనం విపరీతంగా రావడంతో పోలీసులకూ, భక్తులకూ మధ్య ఘర్షణ జరిగింది. కాల్పులు జరిగి ఐదారుగురు మరణించారు. చిన్నపరెడ్డి అనే రైతు ఎద్దులు బెదిరాయి. వాటిని కూడా పోలీసులు కాల్చేశారు. చిన్నపరెడ్డి ఘర్షణకు దిగి పోలీసులను గెంటేశాడు. దీనితో అతడిని అరెస్టు చేసి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తాటాకుల పోలీసు ఠాణాలో బంధించారు. దాని మీద ప్రజలు దాడి చేశారు. విచారణ తరువాత చిన్నపరెడ్డిని ఉరి తీశారు. ఏప్రిల్ 6, 1909 న తెనాలి బాంబు ఘటన జరిగింది. హౌరా ఎక్స్‌ప్రెస్‌ను కూల్చే ఉద్దేశంతో చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య కంచరపాలెం స్టేషన్లో బాంబు పెట్టారు. కానీ దురదృష్టవశాత్తూ చెన్నుగాడు అనే గిరిజనుడు ఆ పేలుడుతో చనిపోయాడు. ఇవన్నీ క్రమంగా పెరుగుతున్న ఉగ్ర జాతీయవాద చిహ్నాలే. తిలక్ విడుదల.. బ్రిటిష్ దడదడ 1907 సూరత్ సమావేశాలలో కాంగ్రెస్ మొదటిసారి చీలింది. ఇదే అదనుగా బ్రిటిష్ పాలకులు తిలక్‌ను మాండలే జైలుకు పంపారు. అరవిందో ఘోష్ ఆధ్యాత్మిక చింతనకు మరలాడు. బిపి¯Œ పాల్ రాజకీయాలకు దూరమైనాడు. ఉద్యమం చల్లారింది. 1910 ఆఖరులో హార్డింజ్ వైస్రాయ్గా వచ్చాడు. బెంగాల్ విభజనను రద్దు చేశాడు. చక్రవర్తి ఐదో జార్జి తన పట్టాభిషేకం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన దర్బారుకు వచ్చి డిసెంబర్ 12, 1911న విభజన రద్దును అధికారికంగా ప్రకటించాడు. ఫలితంగా రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి వచ్చింది. తిలక్‌ను మాండలే జైలుకు పంపించిన తరువాత స్వాతంత్య్రోద్యమంలో ఒక శూన్యం ఏర్పడింది. 1914 వరకు ఈ అనిశ్చిత స్థితి కొనసాగింది. ఆపై మొదటి ప్రపంచ యుద్ధానికి భారత సైన్యాన్ని పంపాలా వద్దా అనే అంశం మీద భారత నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తిలక్ జైలు నుంచి విడుదలైన తరువాత జరిగిన పరిణామాలు మళ్లీ కదలికను తెచ్చాయి. – గోపరాజు నారాయణరావు (చదవండి: పోరు బాట.. అగ్గిబరాటా) -
స్వాతంత్య్రోద్యమ కేసరి
‘అమాయక పౌరుల మీద దాడులకు దిగే ప్రభుత్వానికి నాగరిక ప్రభుత్వమని చెప్పుకునే హక్కు లేదు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు కూడా!’. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో పంజాబ్ సింహమంటూ కీర్తి పొందిన లాలా లజపతిరాయ్ ఒక సందర్భంలో అన్నమాటలివి. ఆ మాటలు ఆయన కన్నుమూసిన రెండు దశాబ్దాలకు నిజమయ్యాయి. 1928లో జేమ్స్ ఏ స్కాట్ అనే బ్రిటిష్ పోలీసు ఉన్నతాధికారి విచక్షణ రహితంగా కొట్టిన లాఠీ దెబ్బలతో కన్నుమూసిన లాలా లజపతిరాయ్ ఆ క్షణంలో మరొక శాపం కూడా ఇచ్చారు. ‘ఇవాళ నా గుండెల మీద పడిన లాఠీ దెబ్బలు బ్రిటిష్ సామ్రాజ్య శవపేటికకి చివరిగా కొట్టిన మేకులవుతాయి.’ లాల్ పాల్ బాల్ త్రయంలో ఒకరిగా భారతదేశ చరిత్రలో లజపతిరాయ్‌కి ఖ్యాతి ఉంది. లాల్ అంటే లజపతిరాయ్. బెంగాల్ విభజన సమయంలో ఆ మహానుభావులు ముగ్గురూ జాతిని కదిలించిన తీరును బట్టి అలా పిలవడం పరిపాటి. కానీ లజపతిరాయ్‌కి అంతకు మించిన ఘనత ఎంతో ఉంది. ఆయన బహుముఖ ప్రజ్ఞశాలి. లజపతిరాయ్ ఉద్యమకారుడు. అతివాదుల వైపు మొగ్గినవారాయన. గొప్ప మేధావి, రచయిత, సంస్కర్త. కార్మికోద్యమ నిర్మాత. ముస్లింల పట్ల ఆయన వ్యక్తం చేసిన భావాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. భారతదేశ విభజన అనే చారిత్రక అంశాన్ని పరిశీలించిన వారు ఆయనది సంకుచిత దృష్టి కాదనీ, దూరదృష్టి అనీ ఓ ముగింపునకు రాక తప్పదు. 1946, 1947 రక్తపాతం, ఇతర రాజకీయ పరిణామాల సమయంలో చాలామంది నాటి నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలకి లజపతిరాయ్ అప్పుడు చెప్పిన మాటలు ఆసరా అయ్యాయనిపిస్తాయి కూడా. లజపతిరాయ్ (జనవరి 28, 1865– నవంబర్ 17, 1928) పంజాబ్‌లోని దుఢికె అనే చోట పుట్టారు. తండ్రి రాధాకిషన్, తల్లి గులాబ్‌దేవి. రాధాకిషన్ ఉర్దూ, పర్షియన్ బోధించే పాఠశాల ఉపాధ్యాయుడు. చాలామంది బిడ్డల మీద తండ్రి ప్రభావం ఉన్నట్టే, చిన్నారి లజపతిరాయ్ మీద రాధాకిషన్ ప్రభావమే ఉండేది. అంటే ఇస్లాం ప్రభావమే. రాధాకిషన్ సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్‌కు వీరాభిమాని. అహమ్మద్ ఖాన్ భారతీయ ముస్లిం సమాజ సంస్కరణకి తోడ్పడిన వారు. అయితే ఆ సంస్కరణ ఇస్లాం పరిధిని దాటని సంస్కరణ. ముస్లింలు జాతీయ కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.ఇంగ్లిష్ జాతి భారత్‌ను వీడిపోయిందంటే భారతీయ ముస్లింలు హిందువుల పాలన కిందకి రావలసి వస్తుందంటూ ప్రచారం ఆరంభించినవారిలో ఆయన కూడా ఒకరు. ఆయన అభిప్రాయాలను, రచనలను రాధాకిషన్ అభిమానించేవారు. అందుకే మతం మారకపోయినా ఇస్లాంను ఆరాధిస్తూ ఉండేవారు. తండ్రి ప్రభావమే బాల లజపతిరాయ్ మీద ఉంది. తల్లి గులాబ్‌దేవి మీద సిక్కు మత ప్రభావం ఉండేది. ఇలా రెండు వేర్వేరు మతాల ప్రభావాల మధ్యన హిందువుగానే ఎదిగినవారు లజపతి. తండ్రి ఎక్కడికి బదలీ అయితే అక్కడే లజపతిరాయ్ ప్రాథమిక విద్య సాగింది. ఇదంతా పంజాబ్, లాహోర్, నేటి హరియాణా ప్రాంతాలలో సాగింది. 1880లో ఆయన లాహోర్‌లోని ప్రభుత్వం న్యాయ కళాశాలలో చేరారు. ఇక్కడే లాలా హన్స్‌రాజ్, పండిత్ గురుదత్‌లతో పరిచయం ఏర్పడింది. వీరంతా అప్పటికే ఆర్య సమాజ్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. అప్పుడప్పుడే లజపతిరాయ్‌కి ఆర్య సమాజ్ మీద ఆసక్తి ఏర్పడుతోంది. కానీ ఆయన 1881లో బ్రహ్మ సమాజ్‌లో చేరారు. అందుకు కారణం తన తండ్రి ఆప్తమిత్రుడు పండిత్ శివనారాయణ్ అగ్నిహోత్రి. అటు మిత్రుల ద్వారా ఆర్య సమాజ్ ప్రభావం, ఇటు అగ్నిహోత్రి ద్వారా బ్రహ్మ సమాజ్ ప్రభావం కలసి లజపతిరాయ్ మీద ఉన్న ఇస్లాం ప్రభావాన్ని పలచబారేలా చేశాయి. బ్రహ్మ సమాజ్‌లో ఉన్న మూడు వర్గాలు, వాటి వివాదాలు లజపతిని పూర్తిగా ఆర్యసమాజ్ వైపు తిరిగిపోయేటట్టు చేశాయి. కానీ తండ్రి దయానంద బోధనలను ఇష్టపడేవారు కాదు. అయినప్పటికీ ఆర్య సమాజ్ను లజపతిరాయ్ ఎన్నుకున్నారు. నిజానికి తాను ఆర్య సమాజ్ను అభిమానించినది అందులో కనిపించే మత సంస్కరణ, మత కోణాల నుంచి కాదనీ, అది ప్రబోధించిన జాతీయ దృక్పథంతోనే అనీ ఒక సందర్భలో చెప్పుకున్నారు కూడా. 1886లో ఆయన ప్లీడర్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆ సంవత్సరమే ఎంతో ప్రతిష్టాత్మకమైన దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాలను కూడా స్థాపించారు. లాహోర్‌లో ఆరంభమైన ఈ పాఠశాల ఉద్దేశం సంప్రదాయక భారతీయ విద్యా వ్యాప్తి. ఆ సమయంలోనే హిస్సార్, లాహోర్లలో లజపతిరాయ్ మంచి న్యాయవాదిగా కూడా పేర్గాంచారు. బాగా ఆర్జించారు. సామాజిక సేవ కోసం లాహోర్‌లోనే 20వ శతాబ్దం ఆరంభంలో భారతజాతి పునర్నిర్మాణ ఉద్దేశంతో ఆయనే సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీని నెలకొల్పారు. ఆర్య సమాజ్, దయానంద బోధనలు లపజతిరాయ్‌లో అంత త్వరగా, అంత పెద్ద మార్పును తెచ్చాయి. లజపతిరాయ్ రాజకీయ చింతన పూర్తిగా దయానంద, ఆర్య సమాజ్ ఆశయాలకు అనుగుణంగా ఎదిగినట్టు కనిపిస్తుంది. మొదట ఆయన ఇటలీ ఏకీకరణ ఉద్యమకారులు మేజినీ, గారిబాల్డీలను ఆరాధించారు. మితవాదుల నాయకత్వంలో సాగుతున్న జాతీయ కాంగ్రెస్ పోరాటంలో జాతీయ ప్రయోజనాలు పక్కకి జరిగిపోతున్నాయని ఆనాడు అభిప్రాయపడిన వారిలో లజపతిరాయ్ ఒకరు. మొదట హిందువులు ఐక్యమై, తరువాత బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నది కూడా ఆయన అభిప్రాయంగా ఉండేది. తరువాతి కాలాలలో హిందూమహాసభకు, మదన్మోహన మాలవీయకు దగ్గర కావడానికి దోహదం చేసినవి కూడా ఈ అభిప్రాయాలే. 1897లో ఆయన ఆరంభించిన హిందూ రిలీఫ్ మూవ్‌మెంట్‌ను చూసినా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. కరువు కాటకాలకు బాధితులైన భారతీయులను ఆదుకోవడంతో పాటు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నిస్సహాయిలుగా ఉండిపోతున్న భారతీయులు క్రైస్తవ మిషనరీల అదుపులోకి పోకుండా చూడడమే ఈ ఉద్యమం ఆశయం. మత సంస్కరణలు, వాటి లోతుపాతుల గురించి లజపతి ముందు నుంచి బాగా ఆలోచించారు. అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం కోణం నుంచి ఆయన భారతదేశాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. అయినాగానీ, భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం, అందుకు సంబంధించిన ఆర్భాటాలేవీ కూడా లజపతిరాయ్‌కి పెద్దగా తెలియవు. ఆయన ప్లీడర్ చదువు పూర్తి చేయడానికి ఒక సంవత్సరం ముందు జాతీయ కాంగ్రెస్ బొంబాయిలో ఆవిర్భవించింది. అప్పుడు లజపతిరాయ్ తండ్రి రోహ్తక్లో పని చేస్తున్నారు. తండ్రి దగ్గరే లజపతి రాయ్ ఉండేవారు. న్యాయవాద వృత్తిని ప్రారంభించిన రెండేళ్ల తరువాత 1888, 89 సంవత్సరాలలో ఆయన మొదటిసారి అలహాబాద్, బొంబాయిలలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలకు హాజరయ్యారు. హిస్సార్ నుంచి వెళ్లిన నలుగురు ప్రతినిధుల బృందంలో ఆయన కూడా ఒకరు. అందుకు లజపతిరాయ్ చాలా గర్వించారు కూడా. కానీ ఆయనకు కాంగ్రెస్ పోరాట పంథా గొప్పగా అనిపించలేదు. బొంబాయి సభలు ఆయనను నిరాశ పరిచనట్టు కూడా అనిపిస్తుంది. ‘కాంగ్రెస్ నాయకులు దేశ ప్రయోజనాల కంటే తమ కీర్తిప్రతిష్టలకే ఎM ్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అలా అని ఆయన కాంగ్రెస్‌కూ, ఆ సంస్ధ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉద్యమానికీ దూరం కాలేదు. బెంగాల్ విభజనోద్యమానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన నిర్వహించిన పాత్రే ఇందుకు నిదర్శనం. బెంగాల్ విభజనోద్యమం అంటే, గాంధీజీ రాక మునుపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగిన పెద్ద ప్రజా ఉద్యమం. ఇందులో బెంగాల్ నుంచి అరవింద్ ఘోష్, బిపిన్‌చంద్ర పాల్, మహరాష్ట్ర నుంచి బాలగంగాధర్ తిలక్, పంజాబ్ నుంచి లాలాజీ కీలక నేతలుగా అవతరించారు. ఇంకా రవీంద్రనాథ్ టాగోర్, చిత్తరంజన్‌దాస్, సోదరి నివేదిత వంటివారు ఎందరో ఈ ఉద్యమంలో పనిచేశారు. ఈ ఉద్యమంలో స్వదేశీ ఉద్యమం చాలా కీలకమైనది. ఇందులో ఎక్కువ పాత్ర లజపతిరాయ్‌దే. స్వదేశీ ఉద్యమంలో భాగమే జాతీయ విద్య. జాతీయ కళాశాలల ఏర్పాటు కూడా అందులో భాగమే. అలా లజపతిరాయ్ లాహోర్‌లో జాతీయ కళాశాలను ఏర్పాటు చేశారు. అందులోనే భగత్‌సింగ్ చదువుకున్నారు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం లేదా వందేమాతరం ఉద్యమం సాగుతూ ఉండగానే పంజాబ్‌లో భూశాసన చట్టం అమలులోకి వచ్చింది. 1907లో ప్రభుత్వం రుద్దిన ఈ చట్టం ప్రకారం పంట పొలాలకు ఉపయోగించుకునే నీటికి చేయవలసిన చెల్లింపులు పెరిగాయి. ల్యాండ్ రెవెన్యూ పెంపు పేరుతో రైతులను వేధించడం మొదలైంది. ఈ భూశాసనానికి వ్యతిరేకంగా ఇండియన్ పేట్రియాట్స్ అసోసియేషన్ ఉద్యమాన్ని నిర్వహించింది. ఈ సంస్థ నాయకుడు అజిత్ సింగ్. ఈయన భగత్‌సింగ్ పినతండ్రి. ఈ ఉద్యమనేతగా అజిత్‌సింగ్ పేరు వినపడినప్పటికీ వెన్నెముక లజపతిరాయేనని అంటారు. ఆ సంస్థ సభ ఎక్కడ జరిగినా వక్త లజపతిరాయే. దీనితో లజపతిరాయ్‌నీ, అజిత్‌సింగ్‌నీ ప్రభుత్వం ప్రవాస శిక్ష విధించి మాండలేకు పంపింది. బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి విచారణ జరపకుండానే ఇంతటి కఠిన శిక్ష విధించింది. దీనితో ఇంగ్లండ్ పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభలో గందరగోళం జరిగింది. విధిలేక భారత్‌లోని బ్రిటిష్ ప్రభువులు ఆ ఇద్దరినీ విడుదల చేశారు. 1913లో కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలు భారతీయుల దుస్థితిని విదేశాలలో ప్రచారం చేయడానికి ఇద్దరు ప్రతినిధులను ఎన్నుకున్నది. ఆ ఇద్దరు లజపతిరాయ్, మహమ్మదలీ జిన్నా. 1914లో లజపతిరాయ్ న్యాయవాద వృత్తికి స్వస్తి పలికి పూర్తిగా స్వాతంత్య్రోద్యమంలోకి దూకారు. ఆ సంవత్సరమే ఇంగ్లండ్ వెళ్లి అక్కడ అనేక సభలలో ప్రసంగించారు. అక్కడ నుంచి అమెరికా వెళ్లారు. అక్కడ ఉండగానే మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. ఆరేళ్ల వరకు భారత్ తిరిగి రావడానికి అనుమతి దొరకలేదు. అమెరికాలో ఉండగానే ఆయన కొన్ని రచనలు చేశారు. రచయితగా కూడా లజపతిరాయ్ కృషి చెప్పుకోదగినది. ఆర్యసమాజ్, యంగ్ ఇండియా, నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, అన్‌హ్యాపీ ఇండియా, ది స్టోరీ ఆఫ్ మై డిపోర్టేషన్, భారత్‌కు ఇంగ్లండ్ రుణం వంటి పుస్తకాలు రాశారాయన. తన అభిమాన హీరోలు జోసెఫ్ మ్యాజినీ, గారిబాల్డి, దయానంద సరస్వతిల జీవిత చరిత్రలు కూడా లజపతిరాయ్ రాశారు. 1919లో మొత్తానికి లాల్జీ భారతదేశానికి తిరిగి రావడానికి అనుమతి దొరికింది. ఆ మరుసటి సంవత్సరమే వచ్చారు. అప్పటికి భారత రాజకీయ వాతావరణం మొత్తం మారిపోయింది. గాంధీ యుగం ఆరంభమైంది. అయితే గాంధీజీ ఉద్యమాలన్నింటినీ లజపతిరాయ్ సమర్థించలేదు.ఉదాహరణకి శాసనోల్లంఘన. అప్పుడే జరిగిన జలియన్‌వాలా దురంతానికి నిరసనగా లజపతిరాయ్ పంజాబ్ అంతటా భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ గాంధీకీ, మహమ్మదలీ జిన్నాకీ మధ్య పోటీ పెరిగిపోయింది. అంటే హిందువులు, ముస్లింలు, భారత స్వాతంత్య్రోద్యమం అనే అంశం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్న కాలమంది. నిజానికి భారతీయ ముస్లింలు, స్వాతంత్య్రం సమరం అనే అంశం మీద లజపతిరాయ్‌కి స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన వాటిని దాచుకోలేదు కూడా. డిసెంబర్ 14, 1923న ‘ది ట్రిబ్యూన్’ పత్రికకు ఆయన రాసిన వ్యాసం ఇందుకు నిదర్శనం. అందులో లజపతిరాయ్, ‘హిందువులు, ముస్లింలు కలసి బ్రిటిష్ వారి మీద పోరాడడంలో అనేక సమస్యలున్నాయనీ, ముస్లిం ఇండియా, హిందూ స్టేట్ ఇండియాగా విభజించాల’ని ప్రతిపాదించారు. 1927లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. అందులో ఒక్క భారతీయుడైనా లేనందుకు నిరసనగా ఉద్యమం ఆరంభమైంది. ఇందులోనూ లాల్జీ కీలక పాత్ర వహించారు. సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలంటూ పంజాబ్ అసెంబ్లీలో ఆయన పెట్టిన తీర్మానం కూడా కొద్ది తేడాతోనే అయినా గెలిచింది. ఇది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అక్టోబర్ 30, 1928న ఆ కమిషన్ లాహోర్ వచ్చింది. గాంధీజీ ఆశయం మేరకే అయినా లాల్జీ కూడా అహింసతో, మౌనంగా సైమన్ వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలా మౌనంగా ఉద్యమిస్తున్న వారిపైన కూడా లాఠీ చార్జికి ఆదేశించాడు పోలీసు సూపరింటెండెంట్ జేమ్స్ ఏ స్కాట్. తను స్వయంగా లాల్జీ మీద దాడి చేశాడు. లాల్జీ ఛాతీ మీద స్కాట్ కొట్టిన లాఠీ దెబ్బలు చాలా తీవ్రమైనవి. ఆ దెబ్బలతోనే లాల్జీ నవంబర్ 17న చనిపోయారు. ఇందుకు చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్ తదితరులు ప్రతీకారం తీసుకోవాలని కోరుకున్నారు. కానీ స్కాట్‌ని చంపాలని అనుకుని జాన్ పి. సాండర్స్ అనే మరొక అధికారిని కాల్చి చంపారు. లజపతిరాయ్ ఆలోచనా విధానంలో మార్పులు ఎలా ఉన్నా ఆయన ప్రధానంగా మానవతావాది. అందుకు ఈ ఉల్లేఖనే సాక్ష్యం. ‘భారతీయ పత్రికలని శాసించే అధికారమే నాకు ఉంటే, ఈ మూడు శీర్షికలు మొదటి పేజీలో ఉండాలని చెబుతాను. పసివాళ్లకి పాలు, తినడానికి పెద్దలకు తిండి, అందరికీ విద్య..’ - ∙డా. గోపరాజు నారాయణరావు -
భగత్‌సింగ్ బాంబులు చేసిన గది ఎక్కడుంది?
-
లజపతిరాయ్‌కు మోదీ ఘన నివాళి
న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ భారత మాత ముద్దు బిడ్డ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం లాలా లజపతిరాయ్ 149వ జయంతి సందర్భంగా మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు మోదీ ట్విట్ చేశారు. 1865లో లాలా లజపతిరాయ్ జన్మించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో లజపతిరాయ్ కీలక పాత్ర పోషించారు. ఆయన 1928, అక్టోబర్ 30న మరణించారు.