బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా 1905 ఆగస్ట్ 7న కలకత్తా టౌన్ హాలులో పెద్ద సభ జరిగింది. 20,000 మంది హాజరయ్యారు. ఈ సభలోనే ఇంగ్లండ్ నుంచి భారతదేశానికి వచ్చే మాంచెస్టర్ గుడ్డను, లివర్‌పూల్ నుంచి వచ్చే ఉప్పును బహిష్కరించాలని తీర్మానించారు. వందేమాతర గీతం ఉద్యమ నినాదమైంది (తన ‘ఆనందమఠం’ నవల కోసం 1870లో బంకించంద్ర చటర్జీ రాసుకున్న ఈ గీతానికి 1896లో రవీంద్రనాథ్ టాగూర్ బాణీ కట్టి కాంగ్రెస్ సభలలో ఆలపించడంతో ప్రాచుర్యం వచ్చింది). విభజన వ్యతిరేకోద్యమానికి చోదకశక్తిగా అవతరించింది. ఉద్యమం దేశవ్యాప్తమైంది.
పూనా, బొంబాయి ప్రాంతాలలో బాలగంగాధర తిలక్, పంజాబ్‌లో అయిత్ సంతోష్, లాలా లజపతిరాయ్, ఢిల్లీలో సయద్ హైదర్ రజా, మద్రాసులో వలియప్పన్ ఉల్గనాథన్ చిదంబరం పిళై్ల స్వదేశీ ఉద్యమానికి మార్గదర్శకులయ్యారు. అక్టోబర్ 16, 1905 న విభజన అమలులోకి వచ్చింది. ముందే నిర్ణయించినట్టు ఆ రోజు బెంగాలీలు, జాతీయవాదులు గంగలో స్నానం చేసి, విభజనకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు.
హర్తాళ్ నిర్వహించారు. ఆ నిరసన నుంచి వచ్చిన ‘స్వదేశీ’ మొత్తంగా భారతీయ సామాజిక, గృహ జీవిత చిత్రాలనే మార్చివేసింది అన్నారు సురేంద్రనాథ్ బెనర్జీ. ఆ సంవత్సరం రక్షాబంధ ఉత్సవాన్ని కూడా విభజనకు వ్యతిరేకోద్యమంలో ఒకరికి ఒకరు రక్షగా ఉంటామని చెబుతూ నిర్వహించారు. ఎదురుపడితే వందేమాతరం అనే పదమే పలకరింపు అయింది.
మన దేశం.. మన విద్య
తొలి స్వదేశీ ఉద్యమంగా పిలిచే బెంగాలీ ఉద్యమంలో విద్యలో కూడా జాతీయతను ప్రవేశపెట్టే కృషి జరిగింది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. అందులో ఒకటి బెంగాల్ నేషనల్ కాలేజీ. దీనికి అరవింద్ ఘోష్ ప్రిన్సిపాల్. 1906 ఆగస్ట్‌లో జాతీయ విద్యా సమితి ఏర్పడింది. స్వదేశీ పరిశ్రమల స్థాపనకు ఆ స్ఫూర్తి ఎంతో తోడ్పాటునిచ్చింది. చాలాచోట్ల బెంగాల్‌లలో జౌళి మిల్లులు వెలిశాయి. సబ్బులు, అగ్గిపెట్టెల తయారీ, బ్యాంకులు, బీమా కంపెనీల ఏర్పాటు వంటివి కూడా జరిగాయి. బెంగాల్ కెమికల్ స్వదేశీ స్టోర్‌ను అప్పుడే ప్రఫుల్ల చంద్ర రే ఆరంభించారు. విభజనను వ్యతిరేకిస్తూ రవీంద్రనాథ్ టాగూర్ రాసిన ‘అమర్ సోనార్ బంగ్లా’ గీతం సాంస్కృతిక రంగంలో స్వదేశీ పతాకగా ఎగిరింది. మొదటసారి రాజకీయ ఉద్యమంలో మహిళలు పాల్గొన్నారు.
బెంగాల్‌కు ఆంధ్రా.. ఆంధ్రాకు చంద్ర
ఆంధ్ర ప్రజలు బెంగాల్ విభజనను పూర్తిగా వ్యతిరేకించారు. 1906 నాటి కలకత్తా వార్షిక సమావేశాలకు అయ్యదేవర కాళేశ్వరరావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పి. ఆనందాచార్యులు, మునగాల రాజా, కొమర్రాజు లక్ష్మణరావు తదితరులు హాజరయ్యారు. అలా 1906 నాటి స్వదేశీ ఉద్యమ స్ఫూర్తి ఆంధ్ర ప్రాంతంలో బలపడింది. ఇందులో ముట్నూరి కృష్ణారావు కృషి ఉంది. ఒక ప్రముఖ నేత ఈ ప్రాంతంలో పర్యటించాలని ఆయన కోరి బిపిన్ చంద్ర పాల్‌ను తీసుకువచ్చారు.
విజయనగరం, విశాఖపట్నం పర్యటన తరువాత పాల్ ఏప్రిల్ 17న కాకినాడ వచ్చారు. ఏప్రిల్ 19, 20, 23 తేదీలలో రాజమండ్రిలో ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ ఉపన్యాసాలనే చిలకమర్తి లక్ష్మీనరసింహం తెనిగించారు. ‘భరతఖండంబు చక్కని పాడియావు’ అన్న పద్యం ఆ సమయంలోనే ఆయన నోటి నుంచి వచ్చింది. బెజవాడ, మచిలీపట్నాలలో కూడా పర్యటించి మే 1కి పాల్ మద్రాస్ చేరారు. పర్యటన తరువాత రాజమండ్రి, కాకినాడలలో చరిత్ర మరువలేని ఘట్టాలు చోటు చేసుకున్నాయి.
కోటప్పలో కాల్పులు.. తెనాలిలో పేలుడు
బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో ఫిబ్రవరి 18, 1909 న ఆంధ్రాలో కోటప్పకొండ దుర్ఘటన జరిగింది. ఆనాటి శివరాత్రి ఉత్సవాలకు జనం విపరీతంగా రావడంతో పోలీసులకూ, భక్తులకూ మధ్య ఘర్షణ జరిగింది. కాల్పులు జరిగి ఐదారుగురు మరణించారు. చిన్నపరెడ్డి అనే రైతు ఎద్దులు బెదిరాయి. వాటిని కూడా పోలీసులు కాల్చేశారు. చిన్నపరెడ్డి ఘర్షణకు దిగి పోలీసులను గెంటేశాడు. దీనితో అతడిని అరెస్టు చేసి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తాటాకుల పోలీసు ఠాణాలో బంధించారు.
దాని మీద ప్రజలు దాడి చేశారు. విచారణ తరువాత చిన్నపరెడ్డిని ఉరి తీశారు. ఏప్రిల్ 6, 1909 న తెనాలి బాంబు ఘటన జరిగింది. హౌరా ఎక్స్‌ప్రెస్‌ను కూల్చే ఉద్దేశంతో చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య కంచరపాలెం స్టేషన్‌లో బాంబు పెట్టారు. కానీ దురదృష్టవశాత్తూ చెన్నుగాడు అనే గిరిజనుడు ఆ పేలుడుతో చనిపోయాడు. ఇవన్నీ క్రమంగా పెరుగుతున్న ఉగ్ర జాతీయవాద చిహ్నాలే.
తిలక్ విడుదల.. బ్రిటిష్ దడదడ
1907 సూరత్ సమావేశాలలో కాంగ్రెస్ మొదటిసారి చీలింది. ఇదే అదనుగా బ్రిటిష్ పాలకులు తిలక్‌ను మాండలే జైలుకు పంపారు. అరవిందో ఘోష్ ఆధ్యాత్మిక చింతనకు మరలాడు. బిపి¯Œ పాల్ రాజకీయాలకు దూరమైనాడు. ఉద్యమం చల్లారింది. 1910 ఆఖరులో హార్డింజ్ వైస్రాయ్‌గా వచ్చాడు. బెంగాల్ విభజనను రద్దు చేశాడు. చక్రవర్తి ఐదో జార్జి తన పట్టాభిషేకం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన దర్బారుకు వచ్చి డిసెంబర్ 12, 1911న విభజన రద్దును అధికారికంగా ప్రకటించాడు.
ఫలితంగా రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి వచ్చింది. తిలక్‌ను మాండలే జైలుకు పంపించిన తరువాత స్వాతంత్య్రోద్యమంలో ఒక శూన్యం ఏర్పడింది. 1914 వరకు ఈ అనిశ్చిత స్థితి కొనసాగింది. ఆపై మొదటి ప్రపంచ యుద్ధానికి భారత సైన్యాన్ని పంపాలా వద్దా అనే అంశం మీద భారత నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తిలక్ జైలు నుంచి విడుదలైన తరువాత జరిగిన పరిణామాలు మళ్లీ కదలికను తెచ్చాయి.
– గోపరాజు నారాయణరావు
(చదవండి: పోరు బాట.. అగ్గిబరాటా)
Comments
Please login to add a commentAdd a comment