‘బ్రిటిషర్లు మా భూమిని పరిపాలించేందుకు మేము అనుమతించం! మమ్మల్ని వారి బానిసలుగా మార్చే కుట్రలను సహించం!’’ అంటూ తన ప్రజలనుద్దేశించి ఒక ఆదివాసీ వీరుడు ఆవేశంతో ప్రసంగిస్తున్నాడు. ఆయన మాటలకు తెగ మొత్తం మంత్రముగ్దులవుతోంది. తెల్లవాళ్లను తమ గడ్డ నుంచి తరిమికొట్టేందుకు ఎంతకైనా సిద్ధమని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు. నాగరికత పేరిట మారణాయుధాలతో దాడికి వచ్చిన బ్రిటిష్ ముష్కరులను కేవలం తమ విల్లంబులతో ఒక ఆదివాసీ తెగ ఎదిరించడానికి ఆ నాయకుడు కలిగించిన ప్రేరణే కారణం! ఈశాన్య భారతంలో వలసపాలనకు వ్యతిరేకంగా శంఖం పూరించిన అతడు..పా టోగన్ సంగ్మా!
ఈశాన్య భారతావనిలో నేటి మేఘాలయ ప్రాంతంలో గారోహిల్స్ ప్రాంతం కీలకమైనది. ఈ కొండలను నెలవుగా చేసుకొని పలు ఆదివాసీ తెగలు జీవనం కొనసాగిస్తుంటాయి. వీటిలో ముఖ్యమైనది అచిక్ తెగ. ఈ గిరి పుత్రులు సాహసానికి పెట్టింది పేరు. వీరి నాయకుడు పా టోగన్ సంగ్మా అలియాస్ పా టోగన్ నెంగ్మింజా సంగ్మా. తూర్పు గారోహిల్స్ లోని విలియం నగర్ సమీపంలోని సమందా గ్రామంలో ఆయన జన్మించారు.
బైబిల్‌ల్లో పేర్కొనే గోలియత్‌తో ఆయన్ను ఆచిక్ తెగ ప్రజలు పోలుస్తుంటారు. 1872వ సంవత్సరంలో ఈశాన్య భారతాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో బ్రిటిషర్‌లు గారోహిల్స్‌పై కన్నేశారు. కొండల్లోని మట్చా రోంగెర్క్ గ్రామం వద్ద బ్రిటిష్ సేనలు విడిది చేశాయి. దేశభక్తుడైన సంగ్మాకు విదేశీయుల ఆక్రమణ నచ్చలేదు. దీంతో ఆయన బ్రిటిషర్‌లపై పోరాటానికి యువ సైన్యాన్ని కూడగట్టారు. మాతృభూమి రక్షణ కోసం యువత త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారంలో భాగంగా గ్రామాల్లో పర్యటించి ప్రజలను చైతన్యవంతులను చేశారు.
బలిదానం
బ్రిటిష్ సేనలు విడిది చేసిన శిబిరంపై దాడి చేసి తరిమి కొట్టాలని సంగ్మా నిర్ణయించుకున్నారు. అయితే వారి వద్ద ఉండే ఆధునిక ఆయుధాల గురించి అమాయక ఆదివాసీలకు తెలియదు. కేవలం సాహసంతో, స్వాతంత్ర కాంక్షతో ఆచిక్ వీరులు సంగ్మా నేతృత్వంతో బ్రిటిషర్లపై దాడి చేశారు. సంగ్మా, ఆయన సహచరులు బ్రిటిష్ శిబిరానికి నిప్పంటించారు. ఇలాంటి దాడిని ఊహించని బ్రిటిష్ వారు నిత్తరపోయారు.
అయితే ఆయుధాలు, ఆధునిక పోరాట పద్ధతులతో మెరుగైన బ్రిటిష్ సైన్యం ముందు ఆచిక్ వీరులు నిలవలేకపోయారు. దాడిలో సాహసంగా పోరాడిన సంగ్మా చివరకు అసువులు బాశారు. అరటి బోదెలతో ఏర్పాటు చేసిన డాళ్లను వాడితే బుల్లెట్ల నుంచి తప్పించుకోవచ్చని సంగ్మా భావించారు. అయితే బుల్లెట్ల దెబ్బకు అరటి షీల్డులు ఛిన్నాభిన్నమవడంతో అచికు వీరులకు మరణం తప్పలేదు.
సంగ్మా, తదితర వీరులు మరణించినా ఈశాన్య భారత ప్రజల్లో దేశభక్తిని రగల్చడంలో సఫలమయ్యారు. తర్వాత కాలంలో ఈశాన్య భారత ప్రజలు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేలా చేయడంలో సంగ్మా వీర మరణం ఎంతగానో దోహదం చేసింది. ఇప్పటికీ అక్కడి ప్రజలు డిసెంబర్ 12 న సంగ్మా వర్ధంతిని ఘనంగా జరుపుకుంటారు.
– దుర్గరాజు శాయి ప్రమోద్
Comments
Please login to add a commentAdd a comment