Freedom Fighters History
-
చిన్నవాణ్ణని వదిలేశారు
జాతీయోద్యమంలో గాంధీ శకం మొదలయ్యాక ఉద్యమ కార్యాచరణకు కేంద్రస్థానం సబర్మతి ఆశ్రమం అయింది. తెలుగు జాతీయోద్యమకారుడు, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని నిరాహారదీక్ష చేసి అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములు సబర్మతి ఆశ్రమంలో చాలాకాలం ఉన్నారు. అలా ఉన్న కొంతమంది ఉద్ధండులను వారి వారి ప్రదేశాలకు వెళ్లి సామాన్యుల్లో సైతం చైతన్యవంతం చేయవలసిందిగా సూచించారు గాంధీజీ. ఆయన సూచనలను చిత్తశుద్ధితో అనుసరించేవారిలో పొట్టి శ్రీరాములు కూడా ఉన్నారు. అంతటి శ్రీరాములును దగ్గరగా చూడడం, ఆయనతో కలిసి నడవటం వల్ల జాతీయస్ఫూర్తిని పెంపొందించుకుని ఉద్యమాల్లో పాల్గొన్న ఓ కుర్రాడు కోన వెంకట చలమయ్య! ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆ ‘కుర్రాడు’ సాక్షి తో పంచుకున్న కొన్ని జ్ఞాపకాలివి. మా ఇంట్లో ఉండేవారు ‘‘మాది తిరుపతి (ఉమ్మడి చిత్తూరు) జిల్లా వాయల్పాడు. నెల్లూరులో మా మేనమామ దేవత చెంచు రాఘవయ్య దగ్గర పెరిగాను. మా మామ లాయరు. ఆయనకు పొట్టి శ్రీరాములు గారికి మంచి స్నేహం ఉండేది. అలా శ్రీరాములు గారు నెల్లూరులో మా ఇంట్లో ఉండేవారు. గాంధీజీ ఆదేశంపై జాతీయోద్యమాన్ని వాడవాడలా విస్తరింపచేయడానికి శ్రీరాములు గారు సబర్మతి నుంచి వచ్చిన సందర్భం అది. నాకు వారితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వారితో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఆ స్ఫూర్తితో విదేశీ వస్త్ర బహిష్కరణలో.. నెల్లూరు పట్టణంలో జొన్నలగడ్డ వారి వీథి, అత్తి తోట అగ్రహారంలో ఇళ్లకు వెళ్లి విదేశీ వస్త్రాలను సేకరించి మంటల్లో వేశాను. ‘‘బ్రిటిష్ వారి పరిపాలనను మనం అంగీకరించడం లేదనే విషయాన్ని వాళ్లకు తెలిసేలా చేయాలంటే ఇదే మంచి మార్గం’’ అని మహిళలకు చెప్పేవాళ్లం. వాళ్లు వెంటనే లోపలికి వెళ్లి.. ఇంట్లో ఉన్న ఫారిన్ చీరలు, చొక్కాలు, పంచెలు అన్నింటినీ బయటవేసే వాళ్లు. అప్పట్లో మద్రాసులో పొత్తూరి అయ్యన్న శెట్టి అనే వ్యాపారి విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ ఉద్యమంలో పాల్గొనలేదు. విదేశీ వ్యాపారంతోపాటు, ఆ దుస్తులు చాలా ఖరీదైనవి ధరించేవారు. సాటి వైశ్యులు ఆయనను కుల బహిష్కరణ చేశారు. జాతీయత భావన అంత తీవ్రంగా ఉండేది. అప్పుడు అలా మొదలైన ఖాదీ వస్త్రధారణను నేను వదల్లేదు. మాకు ఖాదీ మీద ఎంత ఇష్టం ఉండేదంటే నేను ఒక దుకాణంలో నెలకు యాభై రూపాయలకు పని చేస్తూన్న రోజుల్లో పండుగకు నూట యాభై రూపాయలు పెట్టి పట్టు ఖాదీ దుస్తులు కొనుక్కుని అపురూపంగా దాచుకుని ముఖ్యమైన రోజుల్లో ధరించేవాడిని. అప్పట్లో చొక్కా గుండీలు కూడా ఖాదీవే. నూలుతో బఠాణీ గింజ సైజులో అల్లేవారు. ఎడ్ల బాధ చూడలేక నేను గాంధీజీని దగ్గరగా చూసిన సందర్భాలు రెండు మూడు ఉన్నాయి. ఒకసారి నెల్లూరులో రైలు దిగి పల్లిపాడులోని గాంధీ ఆశ్రమానికి ఎడ్ల బండి మీద వస్తున్నారు. పెన్నా నదిలో నీళ్లు లేవు, ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు నది మధ్య ఇసుకలో బండిని లాగడానికి ఎడ్లు ఇబ్బంది పడుతున్నాయి. గాంధీజీ ఆ సంగతి గమనించిన వెంటనే ఇక బండిలో ఉండలేకపోయారు. వెంటనే బండి దిగి నడక మొదలు పెట్టారు. మరో సందర్భంలో నాయుడు పేటలో ఒక సభలో ఆయన ప్రసంగం విన్నాను. మెరీనా బీచ్ సంఘటన చాలా ముఖ్యమైనది. గాంధీజీ ప్రసంగం వినడానికి జనం పోటెత్తారు. ఆ జనంలో దూరంగా ‘హరిజనులకు ఆలయ ప్రవేశం’ అని రాసి ఉన్న ఒక ప్లకార్డు కనిపించింది. ఆ ప్లకార్డు పట్టుకున్నవారు పొట్టి శ్రీరాములు. ఆయన్ని వేదిక మీదకు పిలిచి సభకు పరిచయం చేస్తూ ‘శ్రీరాములు వంటి ఏడుగురు సైనికుల్లాంటి దేశభక్తులు నా దగ్గర ఉంటే, మనదేశానికి ఎప్పుడో స్వాతంత్య్రం వచ్చి ఉండేది’ అన్నారు గాంధీజీ. ఆయన అన్న ఆ మాట ఆ తర్వాత చాలా ప్రభావాన్ని చూపించింది. అప్పట్లో ఉద్యమ సమాచారం అంతా ఉత్తరాల ద్వారానే జరిగేది. శ్రీరాములు గారికి గాంధీజీ స్వహస్తాలతో రాసిన ఉత్తరం నా దగ్గర ఇప్పటికీ ఉంది. లాఠీ దెబ్బలే దెబ్బలు మా సమావేశాలు ఎక్కువగా తిప్పరాజు వారి సత్రంలో జరిగేవి. పెద్ద నాయకుల నుంచి ఉత్తరాల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక నాయకులు ఒక్కో ఉద్యమాన్ని ఎలా నిర్వహించాలనే వివరాలను ఆ సమావేశాల్లో చెప్పేవారు. వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో నేను పోలీసులకు దొరకలేదు, కానీ సహాయ నిరాకరణోద్యమంలో లాఠీ దెబ్బలు బాగా తిన్నాను. ఆందోళనలు ఒకరోజుతో పూర్తయ్యేవి కాదు, పట్టణంలో ఒక్కోరోజు ఒక్కోచోట. నగరంలో ఎక్కడ జరుగుతున్నా సరే.. వెళ్లి నినాదాలివ్వడం, దెబ్బలు తినడమే. మాలో కొంతమందిని జైల్లో పెట్టారు. అప్పుడు నన్ను చూసి ‘చిన్నవాడు’ అని వదిలేశారు. అనేకానేక ఉద్యమాల తర్వాత పోరాటం ఇంకా తీవ్రమయ్యేదే తప్ప శాంతించే పరిస్థితి లేదనే నిర్ధారణకు వచ్చేశారు బ్రిటిష్ వాళ్లు. మనకు స్వాతంత్య్రం వచ్చేస్తోందని మా పెద్దవాళ్లు చెప్పారు. నెల్లూరు పట్టణ వీథుల్లో లైట్లు, రంగురంగులుగా కాగితాలతో కోలాహ లంగా ఉంది వాతావరణం. మేమంతా ఆనం దంతో గంతులు వేశాం. స్వాతంత్య్రం ప్రకటిం చారనే వార్త వినడం కోసం నిద్రను ఆపుకుంటూ ఎదురు చూశాం’’ అని చెప్పారు స్వాతంత్య్ర సమర యోధులు కె.వి. చలమయ్య. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
Azadi Ka Amrit Mahotsav 2022: వెండితెరపై వందేమాతరం
సినీ ప్రేక్షకులకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు మరో ఏడాది పాటు కొనసాగనున్నాయి. ఎలాగంటే రానున్న రోజుల్లో పలు దేశభక్తి చిత్రాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. ఓవైపు సినిమాలు.. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వేదికగా దేశభక్తి ఉప్పొంగనుంది. పలువురు స్వాతంత్య్రోద్యమ వీరుల చరిత్రలు, కాల్పనిక కథలతో దేశభక్తి చిత్రాలు రూపొందుతున్నాయి. వెండితెరపై వందేమాతరం అంటూ రానున్న ఆ ప్రాజెక్ట్స్ విశేషాలు తెలుసుకుందాం. బయోపిక్‌ల వెల్లువ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న పలువురు స్వాతంత్య్ర సమర యోధుల జీవితాల ఆధారంగా పలు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన ఖుదీరామ్ బోస్ జీవితం వెండితెరపైకి రానుంది. ‘ఖుదీరామ్ బోస్’ టైటిల్‌తో జాగర్లమూడి పార్వతి సమర్పణలో విజయ్ జాగర్లమూడి నిర్మించారు. ఖుదీరామ్ పాత్రను రాకేష్ జాగర్లమూడి పోషించారు. ఇతర పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ కనిపిస్తారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆదివారం ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను, ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. అటు హిందీలో స్వాతంత్య్ర సమర యోధుడు వినాయక దామోదర వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా ‘స్వతంత్య్ర్ వీర్ సావర్కర్’ టైటిల్‌తో సినిమా రూపొందుతోంది. వీర్ సావర్కర్ పాత్రను రణ్‌దీప్ హుడా చేస్తున్నారు. నటుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే 1971లో భారత్–పాక్ యుద్ధంలో పోరాడిన ఆర్మీ చీఫ్ సామ్ మానెక్ షా జీవితం ఆధారంగా సినిమా రానుంది. ‘సామ్ బహదూర్’ టైటిల్‌తో విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. 1971 భారత్ – పాక్ యుద్ధంలో పోరాడిన మరో వీర జవాను బ్రిగేడియర్ బల్‌రామ్‌సింగ్ మెహతా జీవిత కథతో రూపొందుతున్న చిత్రం ‘పిప్పా’. బల్రామ్ సింగ్ మెహతా పాత్రను ఇషాన్ కట్టర్ చేస్తున్నారు. బల్రామ్ సింగ్ మెహతా స్వయంగా రాసిన ‘ది బర్నింగ్ చఫీస్’ పుస్తకం ఆధారంగా రాజా కృష్ణమీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. డిసెంబర్ 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలను కుంటున్నారు. 1971 యుద్ధంలోనే వీర మరణం పొందిన యువ సైనికుడు అరుణ్ ఖేతర్పాల్ జీవితంతో రూపొందుతున్న చిత్రం ‘ఇక్కీస్’. ఖేతర్పాల్ పాత్రను వరుణ్ ధావన్ పోషిస్తుండగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది. జీవిత కథలు కాదు కానీ.. ఒకవైపు జీవితకథలతో సినిమాలు రూపొందుతుంటే మరోవైపు కాల్పనిక దేశభక్తి చిత్రాలు కూడా రానున్నాయి. వీటిలో ‘భారతీయుడు 2’ ఒకటి. దేశం కోసం ప్రాణాలర్పించడానికి సైతం వెనకాడని స్వాతంత్య్ర సమరయోధుడు సేనాధిపతి దేశానికి పట్టిన చీడపురుగులాంటి కన్న కొడుకుని మట్టుబెట్టే కథతో రూపొందిన చిత్రం ‘ఇండియన్’ (భారతీయుడు). కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రా నికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రానుంది. కమల్‌హాసన్–శంకర్ కాంబినేషన్లోనే సీక్వెల్ రూపొందు తోంది. అటు హిందీలో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ‘కెప్టెన్ ఇండియా’ యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం. అయితే ఇది జీవిత కథ కాదు. దేశ చరిత్రలో ఓ కీలక రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీక్ పైలెట్ పాత్ర చేస్తున్నారు. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాల్లో దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘తేజస్’. కంగనా రనౌత్ లీడ్ రోల్లో సర్వేశ్ మేవారి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కంగన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలెట్‌గా నటిస్తున్నారు. ‘ఆకాశాన్ని ఏలాలనుకున్న ఓ మహిళ స్ఫూర్తిదాయకమైన కథ ఇది’ అన్నారు కంగనా రనౌత్. అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఓటీటీకి గాంధీ బయోపిక్ జాతి పిత మహాత్మా గాంధీ జీవితంతో వెండితెరపై పలు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు వెబ్ సిరీస్‌గా గాంధీ జీవితం రానుంది. గాంధీ దక్షణాఫ్రికాలో గడిపిన రోజులను, భారత స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాన్ని, గాంధీ జీవితంలో తెలియని కోణాలతో పలు సీజన్లుగా ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించనున్నారు. ఈ సిరీస్‌లో గాంధీ పాత్రను ప్రతీక్ గాంధీ పోషించనున్నారు. ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ రచించిన ‘గాంధీ బిఫోర్ ఇండియా’, ‘గాంధీ: ద ఇయర్స్ దట్ ఛేంజ్డ్ ద వరల్డ్’ పుస్తకాల ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఇంకా పలు దేశభక్తి చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రానున్నాయి. -
మహోజ్వల భారతి: భారత విప్లవోద్యమ మాత
భారతదేశంలో రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే అనుమతిస్తామని ఆంగ్లేయుల నుంచి సమాచారం అందింది. అందుకు మేడమ్ కామా నిరాకరించి లండన్, పారిస్ నగరాలలోనే ఉండిపోయారు. పరాయి పాలనలోని దైన్యం భారతీయుల గుండెను తడుతున్న కాలమది. అలాంటి సమయంలో మేడమ్ కామా జన్మించారు. తండ్రి సొరాబ్జీ ఫ్రాంజీ పటేల్. బొంబాయిలోనే కోటీశ్వరులనదగ్గ పార్శీల కుటుంబం వారిది. నాటి చాలామంది పార్శీల మాదిరిగానే కామా కూడా ఇంగ్లిష్ విద్యను అభ్యసించారు. పలు భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. చిన్నతనం నుంచి ఆమెలో ఒక తిరుగుబాటు తత్వం ప్రస్ఫుటంగా ఉండేది. ఆమె జాతీయ వాదం ఎంత గాఢమైనదంటే అందుకోసం ఆమె వైవాహిక జీవితాన్ని త్యాగం చేశారు. 1885లో ఆమె రుస్తోంజీ కేఆర్ కామాను వివాహం చేసుకున్నారు. రుస్తోంజీ కామా పూర్తిగా ఆంగ్లేయ పక్షపాతి. భారత దేశానికి ఆంగ్లేయులు చేసిన మేలు అసాధారణమైనదని రుస్తోంజీ వాదన. భికాజీ కామా ఇందుకు పూర్తి విరుద్ధం. అణచివేత, దోపిడీ ఆంగ్ల జాతి మౌలిక లక్షణమని ఆమె ప్రగాఢ విశ్వాసం. ఫలితంగా ఆ దంపతులు విడిపోయారు. అప్పటికే భికాజీ కామా సమాజ సేవకురాలిగా మారిపోయారు. కానీ తన పేరులో నుంచి భర్త పేరును ఆమె తొలగించలేదు. 1890లో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో బ్యుబోనిక్ ప్లేగు వ్యాధి ప్రబలింది. అదొక భయంకరమైన అంటువ్యాధి. ఆ వ్యాధి ఆమెకు కూడా సోకింది. కానీ అతికష్టం మీద బతికారు. అప్పుడే పూర్తిగా కోలుకోవడానికి యూరప్ వెళ్లవలసిందని వైద్యులు సూచించారు. అలా ఆమె 1902లో ఇంగ్లండ్ చేరుకున్నారు. అనుకున్నట్టే అక్కడ భికాజీ కామా కోలుకున్నారు. ఆమె అక్కడ కాలు పెట్టే సమయానికి బ్రిటిష్ వ్యతిరేక తీవ్ర జాతీయవాదులకు లండన్ కేంద్రంగా ఉంది. లాలా హరదయాళ్, శ్యాంజీ కృష్ణ వర్మ, వినాయక్ దామోదర్ సావర్కర్ అక్కడే పనిచేసేవారు. వారితో ఆమెకు పరిచయం కలిగింది. తరువాత ఆమె స్వదేశానికి రావాలని ప్రయత్నించారు. భారతదేశంలో రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే అనుమతిస్తామని ఆంగ్లేయుల నుంచి సమాచారం అందింది. అందుకు ఆమె నిరాకరించి లండన్, పారిస్ నగరాలలోనే ఉండిపోయారు. ఇంగ్లిష్ పాలనలో భారతీయులు పడుతున్న ఇక్కట్లు, దేశంలో నశించిన హక్కులు వంటి వాటి గురించి భికాజీ కామా ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ప్రచారం చేశారు. సింగ్ రేవాభాయ్ రాణా, మంచేర్షా బుర్జోర్జీ గోద్రెజ్, మేడమ్ కామా కలసి పారిస్ ఇండియన్ సొసైటీ స్థాపించారు. వందేమాతరం’, ‘తల్వార్’ అనే పత్రికలను నడిపారు. ఏది చేసినా దేశ స్వాతంత్య్రమే ఆమె లక్ష్యం. ఇవన్నీ ఒక ఎత్తయితే, భారత జాతికి తొలిసారిగా ఒక ఐక్య పతాకాన్ని తయారు చేసిన ఘనత మేడమ్ కామాకే దక్కుతుంది. ఆ పతాకాన్ని ఆమె 1907 ఆగస్టు 22 న జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో ఎగురవేశారు. అనంతర కాలంలో.. నిరంతర ఉద్యమంతో భికాజీ ఆరోగ్యం దెబ్బ తింది. 1935లో ఆమెకు పక్షవాతం వచ్చింది. ఒకసారి గుండెపోటు వచ్చిది. అప్పుడు మళ్లీ భారతదేశం వెళ్లిపోవాలన్న కోరికను వ్యక్తం చేశారామె. ఇక ఆమెతో ఎలాంటి ప్రమాదం ఉండబోదన్న నమ్మకంతో ఆంగ్ల ప్రభుత్వం అనుమతించింది. స్వదేశానికి చేరుకున్న తొమ్మిది మాసాలకే ఆ విప్లవ మహిళ తుది శ్వాస విడిచారు. కొందరు పేర్కొన్నట్టు ఆమె ‘భారత విప్లవోద్యమ మాత’. నేడు కామా వర్ధంతి. 74 ఏళ్ల వయసులో 1936 ఆగస్టు 13న ఆమె కన్ను మూశారు. (చదవండి: జైహింద్ స్పెషల్: మీ డబ్బొద్దు.. మీరు కావాలి) -
చైతన్య భారతి: ఈశాన్య భారత పోరాట వీరుడు టోగన్ సంగ్మా
‘బ్రిటిషర్లు మా భూమిని పరిపాలించేందుకు మేము అనుమతించం! మమ్మల్ని వారి బానిసలుగా మార్చే కుట్రలను సహించం!’’ అంటూ తన ప్రజలనుద్దేశించి ఒక ఆదివాసీ వీరుడు ఆవేశంతో ప్రసంగిస్తున్నాడు. ఆయన మాటలకు తెగ మొత్తం మంత్రముగ్దులవుతోంది. తెల్లవాళ్లను తమ గడ్డ నుంచి తరిమికొట్టేందుకు ఎంతకైనా సిద్ధమని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు. నాగరికత పేరిట మారణాయుధాలతో దాడికి వచ్చిన బ్రిటిష్ ముష్కరులను కేవలం తమ విల్లంబులతో ఒక ఆదివాసీ తెగ ఎదిరించడానికి ఆ నాయకుడు కలిగించిన ప్రేరణే కారణం! ఈశాన్య భారతంలో వలసపాలనకు వ్యతిరేకంగా శంఖం పూరించిన అతడు..పా టోగన్ సంగ్మా! ఈశాన్య భారతావనిలో నేటి మేఘాలయ ప్రాంతంలో గారోహిల్స్ ప్రాంతం కీలకమైనది. ఈ కొండలను నెలవుగా చేసుకొని పలు ఆదివాసీ తెగలు జీవనం కొనసాగిస్తుంటాయి. వీటిలో ముఖ్యమైనది అచిక్ తెగ. ఈ గిరి పుత్రులు సాహసానికి పెట్టింది పేరు. వీరి నాయకుడు పా టోగన్ సంగ్మా అలియాస్ పా టోగన్ నెంగ్మింజా సంగ్మా. తూర్పు గారోహిల్స్ లోని విలియం నగర్ సమీపంలోని సమందా గ్రామంలో ఆయన జన్మించారు. బైబిల్‌ల్లో పేర్కొనే గోలియత్‌తో ఆయన్ను ఆచిక్ తెగ ప్రజలు పోలుస్తుంటారు. 1872వ సంవత్సరంలో ఈశాన్య భారతాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో బ్రిటిషర్లు గారోహిల్స్‌పై కన్నేశారు. కొండల్లోని మట్చా రోంగెర్క్ గ్రామం వద్ద బ్రిటిష్ సేనలు విడిది చేశాయి. దేశభక్తుడైన సంగ్మాకు విదేశీయుల ఆక్రమణ నచ్చలేదు. దీంతో ఆయన బ్రిటిషర్లపై పోరాటానికి యువ సైన్యాన్ని కూడగట్టారు. మాతృభూమి రక్షణ కోసం యువత త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారంలో భాగంగా గ్రామాల్లో పర్యటించి ప్రజలను చైతన్యవంతులను చేశారు. బలిదానం బ్రిటిష్ సేనలు విడిది చేసిన శిబిరంపై దాడి చేసి తరిమి కొట్టాలని సంగ్మా నిర్ణయించుకున్నారు. అయితే వారి వద్ద ఉండే ఆధునిక ఆయుధాల గురించి అమాయక ఆదివాసీలకు తెలియదు. కేవలం సాహసంతో, స్వాతంత్ర కాంక్షతో ఆచిక్ వీరులు సంగ్మా నేతృత్వంతో బ్రిటిషర్లపై దాడి చేశారు. సంగ్మా, ఆయన సహచరులు బ్రిటిష్ శిబిరానికి నిప్పంటించారు. ఇలాంటి దాడిని ఊహించని బ్రిటిష్ వారు నిత్తరపోయారు. అయితే ఆయుధాలు, ఆధునిక పోరాట పద్ధతులతో మెరుగైన బ్రిటిష్ సైన్యం ముందు ఆచిక్ వీరులు నిలవలేకపోయారు. దాడిలో సాహసంగా పోరాడిన సంగ్మా చివరకు అసువులు బాశారు. అరటి బోదెలతో ఏర్పాటు చేసిన డాళ్లను వాడితే బుల్లెట్ల నుంచి తప్పించుకోవచ్చని సంగ్మా భావించారు. అయితే బుల్లెట్ల దెబ్బకు అరటి షీల్డులు ఛిన్నాభిన్నమవడంతో అచికు వీరులకు మరణం తప్పలేదు. సంగ్మా, తదితర వీరులు మరణించినా ఈశాన్య భారత ప్రజల్లో దేశభక్తిని రగల్చడంలో సఫలమయ్యారు. తర్వాత కాలంలో ఈశాన్య భారత ప్రజలు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేలా చేయడంలో సంగ్మా వీర మరణం ఎంతగానో దోహదం చేసింది. ఇప్పటికీ అక్కడి ప్రజలు డిసెంబర్ 12 న సంగ్మా వర్ధంతిని ఘనంగా జరుపుకుంటారు. – దుర్గరాజు శాయి ప్రమోద్ -
చైతన్య భారతి: విభజన విషాదానికి ప్రత్యక్ష సాక్షి.. మార్గరెట్ బూర్కి వైట్
1947లో జరిగిన భారత విభజన మానవాళి చరిత్రలో ఒక మహా విషాదం. కోటీ యాభయ్ లక్షల నుంచి రెండు కోట్ల మంది పాకిస్థాన్ నుంచి భారత్ కూ, భారత్ నుంచి పాకిస్థాన్‌కూ తరలిపోయారు. ఇరవైరెండు లక్షల మంది ఆచూకీ దొరకలేదు. ఈ రక్తకన్నీటి ధారలను తన కెమెరాతో బంధించిన వారిలో ముఖ్యులు మార్గరెట్ బూర్కి–వైట్. ‘గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్’ పేరుతో ప్రసిద్ధమైన హత్యాకాండ మిగిల్చిన విషాదాన్ని మార్గరెట్ భావి తరాలు మరచిపోలేని విధంగా చిత్రీకరించారు. మార్గరెట్ అమెరికా పౌరసత్వం తీసుకున్న పోలెండ్ జాతీయురాలు. తండ్రి జోసెఫ్ వైట్ యూదు జాతీయుడు. తల్లి మిన్నీ బూర్కి ఐరిష్ జాతీయురాలు. మార్గరెట్ చిన్నతనం న్యూజెర్సీలో గడిచింది. కెమెరాలంటే ఆసక్తి చూపించే తండ్రి నుంచి ప్రోత్సాహం రావడంతో చిన్ననాడే ఆమె ఫొటోలు తీయడం ఆరంభించారు. ప్రఖ్యాత ‘టైమ్’ మ్యాగజైన్ యజమాని హెన్రీ లూస్ ‘లైఫ్’ పేరుతో ఒక పత్రికను వెలువరించాలని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడే మార్గరెట్‌ను ఆ పత్రికకు ఎంపిక చేశారు. ఆమె లైఫ్‌లో పనిచేసిన తొలి మహిళా ఫొటోగ్రాఫర్. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రణభూమి దగ్గర ఉండి ఫొటోలు తీసే అవకాశం వచ్చిన మొదటి మహిళ మార్గరెట్. అప్పుడే క్రెమ్లిన్ (రషా) మీద నాజీ సేనలు దాడుల (1941) దృశ్యాలను తన కెమెరాలో బంధించే అవకాశం కూడా ఆమెకు దక్కింది. ఇలాంటి సంక్షుభిత పరిణామాలను చిత్రించేందుకు అనుమతి పొందిన ఏకైక విదేశీయురాలు మార్గరెట్. తన ఫొటో తీయడానికి స్టాలిన్ కూడా ఆమెను అనుమతించాడు. సోవియెట్ పరిశ్రమలను ఫొటోలు తీయడానికి అనుమతి పొందిన తొలి పాశ్చాత్య మహిళ కూడా ఆమే. హిట్లర్ పతనం తరువాత జర్మనీ దుస్థితిని కూడా ఆమె తన ఫ్రేములలో బంధించారు. ఇక మనదేశానికైతే కేవలం మహాత్మా గాంధీ ఫొటోలు తీయడానికే మార్గరెట్ వచ్చారు. చరఖా ముందు కూర్చుని ఉన్న గాంధీజీ ఫొటో మార్గరెట్ తీశారు. ఇంకా చాలా పోజులలో ఫొటోలు ఉన్నాయి. ఆమె భారతదేశంలో తీసిన ఫొటోలు 66. అందులో గాంధీ, జిన్నా, అంబేడ్కర్ వంటి చరిత్ర పురుషుల పోర్టెయ్రిట్లు, విభజన విషాదాల ఫొటోలు ప్రధానంగా ఉన్నాయి. అసలు భారత విభజన విషాదాన్ని కెమెరాలో బంధించడానికే ఆమె ఇక్కడికి వచ్చారని అనిపిస్తుంది. మార్గరెట్ తన కెమెరాతోను, లీ ఐటింగన్ డైరీ కలంతోను ఆ దారుణ దృశ్యాలకు శాశ్వతత్వం కల్పించారు. మార్గరెట్ విభజన విషాద చిత్రాలను మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఆమె మాత్రం పార్కిన్సన్ పెయిన్ వ్యాధితో 1971లో తుదిశ్వాస విడిచారు. గాంధీజీ వంటి అహింసామూర్తిని ఫొటోలు తీయడానికి వచ్చిన మార్గరెట్ హింసాత్మక భారతావనిని చూడటం ఒక వైచిత్రే. -
చైతన్య భారతి: చరిత్రకు సమకాలీనుడు! మామిడిపూడి వెంకటరంగయ్య
మామిడిపూడి వెంకటరంగయ్య ఉన్నత శ్రేణి చరిత్రకారుడు. చారిత్రక ఘటనలతో ప్రేరణ పొంది, ప్రత్యక్ష సాక్షిగా ఉండి ఆ క్రమంలో చరిత్రకారునిగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. వెంకటరంగయ్య నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిణి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్య పురిణిలోనే సాగింది. 1907 నాటికి పచ్చయప్ప కళాశాలలోనే బీఏ చదువుతున్నారు. సరిగ్గా అప్పుడే వెంకటరంగయ్య జీవితం మలుపు తిరిగింది. బెంగాల్ విభజన (1905) వ్యతిరేకోద్యమంలో భాగంగా బిపిన్ చంద్ర పాల్ దక్షిణ భారతదేశంలో పర్యటిస్తూ మద్రాస్‌లో దిగారు. వందేమాతరం నినాదం దేశమంతటా ప్రతిధ్వనించిన కాలమది. పాల్ మేరీనా బీచ్‌లో ఐదు రోజుల పాటు ప్రసంగాలు చేశారు. ఈ ఐదు రోజులు కూడా ఆయన ప్రసంగాలు విన్నవారిలో వెంకటరంగయ్య కూడా ఉన్నారు. అదే ఆయనలో కొత్త చింతనకు శ్రీకారం చుట్టింది. తర్వాత వెంకటరంగయ్య పచ్చయప్ప కళాశాలలోనే చరిత్ర ట్యూటర్‌గా చేరారు. ఈ ఉద్యోగంలో ఉంటూనే ఆయన ఎంఏ విడిగా చదివి ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాతి మలుపు కాకినాడకు తిప్పింది. బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడిగారి ఆహ్వానం మేరకు వెంకటరంగయ్య పీఆర్ విద్యా సంస్థలో 1910లో చరిత్రోపన్యాసకులుగా చేరారు. ఆ తరువాత విజయనగరం మహారాజా కళాశాలలో బీఏ తరగతులు ప్రారంభించారు. 1928తో ఆయనకు విజయనగరం బంధం తెగిపోయింది. విజయనగరం సంస్థానం నుంచి వెంకటగిరి సంస్థానం చేరారు. అక్కడ వెంకటగిరి మహారాజా కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. అక్కడ నుంచే వెంకటరంగయ్యగారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పిలుపు వచ్చింది. వైస్‌చాన్స్‌లర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వెంకట రంగయ్యను చరిత్ర, రాజనీతి శాఖలో రీడర్‌గా నియమించారు. ఆ తరువాత అక్కడే ఆయన ప్రొఫెసర్ కూడా అయ్యారు. మధ్యలో... అంటే 1949లో బొంబాయి విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర విభాగం అధిపతిగా పనిచేశారు. ఆంధ్రలో స్వాతంత్య్రోద్యమం పేరుతో వెలువరించిన నాలుగు సంపుటాలు చరిత్రకారునిగా వెంకటరంగయ్య ప్రతిభను వెల్లడిస్తాయి. భారత స్వాతంత్య్రం సమరగాథను మూడు సంపుటాలలో ఆయన రచించారు. ఆంగ్లంలో కూడా ది వెల్ఫేర్ స్టేట్ అండ్ సోషలిస్ట్ స్టేట్, సమ్ థియరీస్ ఆఫ్ ఫెడరలిజమ్ వంటి వైవిధ్య భరితమైన రచనలు కనిపిస్తాయి. జీవితంలో ఎక్కువ భాగం విద్యా బోధనకీ, చరిత్ర రచనకీ అంకితం చేసిన వెంకటరంగయ్య 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు. -
చైతన్య భారతి: అణకువ కలిగినవాడు.. ఇనాయతుల్లా అల్ మష్రికి
భారత స్వాతంత్య్ర సమరంలో జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్, గదర్ పార్టీ, హిందూ మహాసభ, స్వరాజ్య పార్టీ హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ వంటివెన్నో కనిపిస్తాయి. అలాంటిదే ఖక్సర్ తెహ్రీక్. ఖక్సర్ అంటే అర్థం అణకువ కలిగినవాడు. నలభై లక్షల సభ్యత్వంతో (1942 నాటికి), దేశంలోను, విదేశాలలో కూడా శాఖలు నెలకొల్పింది. దీని మీద గట్టి నిర్బంధం ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం అణచివేతే కాదు, మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలోని అఖిల భారతీయ ముస్లిం లీగ్ కూడా ఖక్సర్‌ను పరమ శత్రువులాగే చూసింది. లాహోర్ కేంద్రంగా ఉద్యమించిన ఈ ఖక్సర్ తెహ్రీక్‌ను 1931లో అల్లామా ఇనాయతుల్లా అల్ మష్రికి స్థాపించారు. సంస్థ నిబంధనలకు కచ్చితంగా లోబడి ఉండడమే కాదు, సభ్యులు ఉద్యమానికి సమయం ఇవ్వడంతో పాటు, దేశం కోసం ఎవరి వ్యయం వారే భరించాలి. అచ్చంగా బ్రిటిష్ పోలీసుల యూనిఫామ్‌ను పోలి ఉన్న దుస్తులు ధరించేవారు. దాని మీద సోదరత్వం అన్న నినాదం (ఉఖూవ్వాత్) ఉండేది. నాయకుడు సహా అంతా ఇదే ధరించేవారు. మష్రికి అనేకసార్లు కారాగారవాసం అనుభవించాడు. 1942 జనవరి 19 న వెల్లూరు జైలు నుంచి విడుదలచేసి మద్రాస్ ప్రెసిడెన్సీ దాటకూడదని ఆయనపై ఆంక్షలు విధించారు. సంస్కరణ, వ్యక్తి నిర్మాణం, దేశం కోసం త్యాగం ఖక్సర్ ఆశయాలు. ఇరుగు పొరుగులకు సేవ... కార్యక్రమంలో అంతర్భాగం. ఇక్కడ ముస్లింలు, ముస్లిమేతరులు అన్న భేదం లేదు. పరిసరాలను శుభ్రం చేస్తూ, పేదలు, వృద్ధులు, రోగులకు సేవలు అందించాలి. మష్రికి ఇస్లామిక్ పండితులు, మేధావిగా గుర్తింపు పొందారు. అమృత్‌సర్‌కు చెందిన ముస్లిం రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించిన మష్రికి కేంబ్రిడ్జ్ నుంచి గణితశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 1912లో స్వదేశం వచ్చి 25 ఏళ్లకే కళాశాల ప్రిన్సిపాల్ అయ్యారు. 29 ఏళ్లకి విద్యాశాఖ అండర్ సెక్రటరీ అయ్యారు. మష్రికి 1939లో బ్రిటిష్ ప్రభుత్వానికి తుది హెచ్చరికలు చేయడం ఆరంభించాడు. దాంతో ఖక్సర్ ప్రమాదకరంగా తయారైందని పంజాబ్ గవర్నర్ హెన్రీ డఫీల్డ్ వైస్రాయ్ లిన్ లిత్‌గోకు నివేదిక పంపించాడు. ఇలాంటి నివేదికే మధ్య పరగణాల నుంచి కూడా వెళ్లింది. ఓసారి ఢిల్లీలో ప్రసంగిస్తూ మష్రికి మీద జిన్నా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మష్రికి ఒక ఉన్మాది అని వ్యాఖ్యానించారు. ఇదే బ్రిటిష్ ప్రభుత్వానికి ఉపకరించింది. మష్రికితో మరింత కర్కశంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. అయినప్పటికీ ఆయన జీవితాంతం తన సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నారు. 75 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో మర ణించారు. -
చైతన్య భారతి: ఇరోమ్ చాను షర్మిల, పౌర హక్కుల కార్యకర్త.. నిరశన ఉద్యమం!
దాదాపు 16 సంవత్సరాల పాటు నిరాహార దీక్షలో ఉన్న ‘మణిపూర్ ఉక్కు మహిళ’ ఇరోమ్ చాను షర్మిల. దీక్షలో ఉన్న అన్నేళ్లలోనూ ఆమె నోటి నుంచి మంచినీటి చుక్క కూడా తీసుకోలేదు! విసిరేసినట్టుండే ఈశాన్య భారతంలో, మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులోనే ఆ పదహారేళ్లూ ఆమె ఉన్నారు. నిజానికి ఆమె కోసం జైలుగా మారిన వార్డు అది. ప్రతి మూడు వారాలకు ఒకసారి కోర్టు బోనులో నిలబడి రావడం, మళ్లీ ఆస్పత్రి వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉండడం.. ఇదే కథ. భారత ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమె ఈ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రపంచంలోనే సుదీర్ఘ నిరశన అది: మణిపూర్ ప్రభుత్వమే ఆమెను బతికిస్తూ వచ్చింది. అయితే నిమ్మరసం ఇచ్చి కాదు, నాసోగాస్ట్రిక్ ఇన్‌ట్యూబేషన్ పద్ధతిలో.. అంటే ముక్కులో నుంచి గొట్టం అమర్చి ఆహారం, ఇతర ఔషధాలు నిర్బంధంగా పంపించడం! ‘అఫ్స్పా’ సాయుధ బలగాలు తన కంటి ఎదురుగా జరిపిన ఒక రక్తపాతానికి నిరసనగానే షర్మిల ఆ నిరాహార దీక్ష ఆరంభించారు. అది 2000 నవంబర్ 2. షర్మిల ఆ రోజు హక్కుల కార్యకర్తగా ఒక ఊరేగింపులో పాల్గొనడం కోసం మాలోం అనే చిన్న పట్టణంలోని ఒక బస్టాప్ దగ్గర నిలబడి ఉన్నారు. అక్కడే పెద్ద శబ్దం వినిపించింది. అది వేర్పాటువాదులు విసిరిన బాంబు పేలుడు. అంతే.. అస్సాం రైఫిల్స్ (పారా మిలటరీ) రంగంలోకి దిగి కాల్పులు జరిపింది. అక్కడికక్కడ పదిమంది చనిపోయారు. తరువాత సాయుధులు ఊరి మీద పడి బాంబు విసిరిన ఉగ్రవాదులు ఎవరో చెప్పమంటూ కనిపించిన ప్రతివారి మీద జులుం ప్రదర్శించారు. దీనినే మాలోం ఊచకోత అంటారు. ఇది జరిగిన రెండు రోజుల తరువాత 2000 నవంబర్ 5న షర్మిల నిరాహార దీక్ష ఆరంభించారు. దీక్ష ప్రారంభించే సమయానికి షర్మిల వయసు 28 సంవత్సరాలు. అప్పటికి వివాహం కాలేదు. దీక్ష వల్ల ప్రయోజనం లేదనీ, ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో పోరాడాలనీ తలచి 2016 ఆగస్టు 9 న దీక్షను విరమించారు. ఆ తర్వాత ఎన్నికల్లో నిలుచున్నప్పటికీ ఆమె గెలవలేదు. అఫ్స్పా చట్టం నేటికీ పూర్తిగా రద్దవలేదు. షర్మిల 1972 మార్చి 2 ఇంఫాల్‌లోని కోంగ్పాల్ గ్రామంలో జన్మించారు. పౌరహక్కుల కార్యకర్త అయిన ఇరోమ్ తన ఉద్యమ భాగస్వామి అయిన బ్రిటిష్ పౌరుడు డెస్మండ్ ఆంథోనీని వివాహం చేసుకున్నారు. ఇద్దరు కవల కుమార్తెలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం సామాజిక అంశాలపై వ్యాస రచనలు చేస్తున్నారు. -
జైహింద్ స్పెషల్: ది గ్రేట్ ఎస్కేప్
జర్మనీ నుంచి బోస్ జపాన్ బయల్దేరాడు. జర్మనీ సబ్‌మెరైన్ యు–180 లో ప్రయాణించి మధ్యలో జపాన్ సబ్‌మెరైన్ ఐ–29లోకి మారి వెళ్లాడు. ఆర్మీకి గానీ, పోలీసు విభాగానికి గానీ చెందని ఒక సాధారణ పౌరుడు రెండు దేశాల సబ్మెరైన్లలో మారి ప్రయాణించడం అదే మొదటిసారి! బోస్ మేనేజ్ చేశాడు. జపాన్‌లో దిగాక, బోస్ అక్కడి నుంచి సింగపూర్ వెళ్లాడు. జర్మనీలో ఎలాగైతే భారతీయులతో సైన్యాన్ని కూడగట్టుకున్నాడో అక్కడా అలాగే ఒక లీజన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అదే.. ఇండియన్ నేషనల్ ఆర్మీ. అదే అజాద్ హింద్ ఫౌజ్ బోస్ తప్పించు కున్నాడు! ‘‘బ్రిటన్ తరఫున జర్మనీపై ఇండియా యుద్ధం చేస్తుందని ప్రకటించడానికి మీరెవరు?’’ అని వైశ్రాయ్ని నిలదీసినందుకు జైలుపాలై.. వారం రోజులు అన్నం నీళ్లూ ముట్టకుండా జైల్లోనే హంగర్ స్ట్రైక్ చేసి విడుదలైనవాడు.. దేశం నుంచే తప్పించుకున్నాడు! బోస్ దేశం దాటకుండా బ్రిటిష్ ప్రభుత్వం కలకత్తాలో అతడు ఉంటున్న ఇంట్లోనే అతడిని బంధించి, చుట్టూ నిఘా పెట్టినప్పటికీ అతడు తప్పించుకున్నాడు.! ‘జర్మనీతో ‘టై–అప్’ అయితే బ్రిటన్‌ని ఇంటికి పంపడం తేలిక. ఓం శాంతి అంటే లాభం లేదు. మిలట్రీ ట్రక్కుల నుంచి ఇండియాలోకి జర్మన్ సైన్యాన్ని దింపాలి..’ అనే ప్లాన్‌తో తప్పించుకున్నాడు! ఎలా తప్పించుకున్నాడు?! పోలికలు తెలియకుండా పఠాన్‌లా వేషం వేసుకున్నాడు. గుండ్రటి ముఖం కనిపించకుండా గడ్డం పెంచాడు. భాష విని గుర్తుపట్టకుండా మూగ, చెవిటి అయ్యాడు. ముందు పెషావర్ వెళ్లాడు. అక్కడి నుంచి కాబూల్. అక్కడి నుంచి రష్యా. అక్కడ బుక్కయ్యాడు! రష్యాకు, బ్రిటన్‌కు పడదు కాబట్టి తనను చేరదీస్తారు అనుకున్నాడు కానీ, రష్యన్ అధికారులు అనుమానిస్తారని అనుకోలేదు. వాళ్లతడిని మాస్కో తరలించారు. అక్కడ కొద్దిగా నయం. రెండు మూడు ఆరాలు తీసి బోస్‌ని మాస్కోలోని జర్మనీ రాయబారి షూలెన్బర్గ్ దగ్గరికి పంపారు. షూలెన్బర్గ్కి బోస్ మీద నమ్మకం కుదిరింది. అతడిని ఇటలీ మీదుగా జర్మనీ పంపే ఏర్పాటు చేశారు! బ్రిటన్‌కు మండిపోయింది. తప్పించుకున్న వాడు తప్పించుకున్నట్లు ఉండకుండా దేశాలన్నీ తిరగడం ఏమిటి? కనిపిస్తే కాల్చిపారెయ్యమని సీక్రెట్ ఏజెంట్లని పంపింది. జర్మనీలో అడుగు పెట్టకముందే అతడిని చంపేయాలి. అదీ టార్గెట్. కానీ బోసే మొదట తన టార్గెట్‌ని రీచ్ అయ్యాడు. జర్మనీలో అతడు క్షణం ఖాళీగా లేడు. హిట్లర్ని కలిశాడు. బ్రిటన్ గురించి, ఇండియా గురించి చెప్పాడు. బెర్లిన్‌లో ఒక రేడియో స్టేషన్ స్టార్ట్ చేశాడు. దాన్నుంచి స్వతంత్ర భారత్ నినాదాలు ప్రసారం చేశాడు. జర్మనీకి బందీలుగా ఉన్న ఐదువేల మంది భారతీయ సైనికులతో కలిసి ‘ఇండియన్ లీజన్’ ఏర్పాటు చేసుకున్నాడు. ఉత్తర ఆఫ్రికాలోని బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి, యుద్ధంలో జర్మనీకి చిక్కిన సైనికులు వీళ్లు! హిట్లర్ హ్యాండిచ్చాడు! ‘లీజన్’ అంటే సైనిక సమూహం. ఇండియన్ లీజన్, జర్మనీ సైన్యం కలిసి ఇండియా వెళ్లి కాళ్లతో నేలను రెండు చరుపులు చరిస్తే చాలు... బ్రిటన్ ఎగిరిపడాలని బోస్ వ్యూహం. 1941 నుంచి 1943 వరకు ఇదే వ్యూహం మీద జర్మనీలోనే ఉండిపోయారు బోస్. అక్కడే ఎమిలీ షెంకెల్ని పెళ్లి చేసుకున్నారు. అక్కడే వారికి అనిత పుట్టింది. అక్కడే జర్మనీపై అతడి భ్రమలు తొలగిపోయాయి! హిట్లర్ హ్యాండిచ్చాడు! బోస్ అక్కడి నుంచి జపాన్ బయల్దేరాడు. మొదట జర్మనీ సబ్‌మెరైన్ యు–180 లో ప్రయాణించి మధ్యలో జపాన్ సబ్‌మెరైన్ ఐ–29లోకి మారి వెళ్లాడు. ఆర్మీకి గానీ, పోలీసు విభాగానికి గానీ చెందని ఒక సాధారణ పౌరుడు రెండు దేశాల సబ్మెరైన్లలో మారి ప్రయాణించడం అదే మొదటిసారి! బోస్ మేనేజ్ చేశాడు. జపాన్‌లో దిగాక, బోస్ అక్కడి నుంచి సింగపూర్ వెళ్లాడు.జర్మనీలో ఎలాగైతే భారతీయులతో సైన్యాన్ని కూడగట్టుకున్నాడో అక్కడా అలాగే ఒక లీజన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అదే... ఇండియన్ నేషనల్ ఆర్మీ. అదే అజాద్ హింద్ ఫౌజ్. ‘‘మీ రక్తాన్ని ధారపొయ్యండి. మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’’ అన్నాడు బోస్. అంతేనా! ఢిల్లీ చలో అన్నాడు. జైహింద్ అన్నాడు. సొంత సైన్యం, సొంత కరెన్సీ, సొంత పోస్టల్ స్టాంప్స్, సొంత న్యాయం, సొంత నియమం. అన్నీ సొంతం! బ్రిటన్‌ని వ్యతిరేకించే దేశాలన్నీ వీటన్నిటినీ ఆమోదించాయి. ఆఖరికి రష్యా, అమెరికా కూడా! అంటే పారలల్ మిలట్రీ. పారలల్ గవర్నమెంట్. బోస్ సమాంతర ప్రభుత్వాన్ని, సమాంతర సైన్యాన్ని నడుపుతున్నాడు. సింగపూర్‌లో ఏర్పాటు చేసుకున్న అజాద్ హింద్ రేడియోలోంచి 1944 జూలై 6న మాట్లాడుతూ మొదటిసారిగా బోస్ గాంధీజీ పేరెత్తారు! ‘‘జాతిపితా... నన్ను దీవించండి. ఈ పోరాటంలో నేను గెలవాలని నన్ను దీవించండి’’ అని కోరారు. మరణం రాసిపెట్టలేదు! తర్వాత ఏమయింది? మూడేళ్ల తర్వాత భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. బోస్ ఏమయ్యారు? ఇన్నేళ్ల తర్వాత ఇప్పటికీ తెలీదు! సింగపూర్ నుంచి టోక్యో వెళ్లడానికి నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఎక్కిన జపాన్ యుద్ధ విమానం 1945 ఆగస్టు 18న నేలకూలి అందులో ఉన్న వారితో పాటు ఆయనా మరణించారని ఒక ‘అధికారిక’ కథనం! కాదు, ఆ ప్రమాదంలో ఆయన తప్పించుకున్నారని, అక్కడి నుంచి ఇండియా వచ్చి అజ్ఞాతంగా సాధువురూపంలో గడిపారని; కాదు కాదు ఏ శత్రుదేశమో నేతాజీని బందీగా ఉంచుకుందనీ, అలాంటిదేం లేదు... రష్యాలో ఆయన తలదాచుకున్నారనీ... ఇలా ఏవేవో అనధికారిక కథనాలు. ఒకటి మాత్రం వాస్తవం. నేతాజీ... అమరుడు! ఆయనకు జననమే కానీ, మరణం లేదు. కావాలంటే ఏ హిస్టరీ బుక్ అయినా తెరిచి చూడండి. జననం ఒక్కటే కనిపిస్తుంది. చదవండి: వైద్య ప్రతిభామూర్తి : యల్లాప్రగడ సుబ్బారావు / 1895–1948 -
మహోజ్వల భారతి: వాటర్‌మ్యాన్
డాక్టర్ రాజేంద్రసింగ్ రాజస్థాన్, అల్వార్ జిల్లాకు చెందిన జల పరిరక్షకులు, సంఘసేవకులు. ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా గుర్తింపు పొందారు. స్టాక్‌హోం వాటర్ ప్రైజ్ ను గెలుచుకున్నారు. ప్రభుత్వేతర సంస్థ ‘తరుణ్ భారత్ సంఘ్’ ఆయన స్థాపించినదే. నేడు రాజేంద్ర సింగ్ జన్మదినం. 1959 ఆగస్టు 6న ఉత్తరప్రదేశ్‌లో జన్మించారు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో మంచినీటి నిర్వహణకు విశేషకృషి చేసినందుకు గాను 2001 లో రామన్ మెగసెసే పురస్కారాన్ని అందుకున్నారు. రాజేంద్రసింగ్ కృషి వల్ల రాజస్థాన్‌లో అర్వారి, రూపారెల్, సర్సా, భగా ఆని, జగజ్వాలి అనే ఐదు నదులు పునరుజ్జీవనం పొంది 1000 గ్రామాలకు నీటిని అందించాయి! 2009లో భారత ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ చట్టానికి (1986) అనుగుణంగా గంగా నది కోసం ఏర్పడిన అధికార ప్రణాళిక, ఫైనాన్సింగ్, పర్యవేక్షణ, సమన్వయ అధికారం గల సంస్థ ‘నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ’ సభ్యులలో రాజేంద్ర సింగ్ ఒకరు. ‘గ్రహాన్ని రక్షిస్తున్న 50 మంది వ్యక్తులు’ జాబితాలో ప్రఖ్యాత ‘గార్డియన్’ పత్రిక రాజేంద్రసింగ్‌కి స్థానం కల్పించింది. చదవండి: జైహింద్ స్పెషల్: యుద్ధతంత్రం.. శాంతిమంత్రం -
మహోజ్వల భారతి: ఈస్టిండియా ఉరికి వేలాడిన తొలి భారతీయుడు!
ప్లాసీ యుద్ధంలో (1757) బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా ఓడిపోయాక, తదనంతర పరిణామాల్లో బెంగాల్‌లోని ముర్షీదాబాద్ నవాబు దగ్గర పనిచేసే నందకుమార్‌ను బ్రిటిషర్లు తమ పాలనా యంత్రాంగం సిబ్బంది విభాగంలోకి తీసుకున్నారు. తర్వాత ఈస్టిండియా కంపెనీ తరఫున బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలలో పన్నులు వసూలు చేసేందుకు 1764లో ఆయన్ని దివాన్‌గా నియమించారు. నందకుమార్‌కు అప్పటికే ‘మహారాజా’ అనే బిరుదు ఉంది. 17వ మొఘల్ చక్రవర్తి షా ఆలమ్ ఆయనకు ఆ బిరుదు ఇచ్చారు. చివరికి ఆ మహారాజు దివాన్ అయ్యారు. అంటే ముఖ్య కోశాధికారి. అప్పటి వరకు ఆ పదవిలో ఉన్న వారెన్ హేస్టింగ్స్‌ని తొలగించి, నందకుమార్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అప్పుడు మౌనంగా వెళ్లిపోయిన హేస్టింగ్ తిరిగి 1773లో బెంగాల్ గవర్నర్‌గా వచ్చారు! మునుపటి కోపం నందకుమార్‌పై అతడికి అలాగే ఉంది. అది చాలదన్నట్లు నందకుమార్ అతడిపై అవినీతి ఆరోపణలు చేసి మరింత కోపానికి గురయ్యాడు. అప్పట్లోనే అది పది లక్షల రూపాయల అవినీతి. ఆ ఆరోపణల నుంచి హేస్టింగ్స్ తేలిగ్గానే తప్పించుకున్నాడు కానీ, నందకుమార్‌ని అతడు తేలిగ్గా తీసుకోలేదు. 1775లో నందకుమార్‌పై దస్తావేజుల ఫోర్జరీ కేసు పెట్టించి విచారణ జరిపించాడు. ఆ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఎలిజా ఇంపే నందకుమార్‌కు ఉరిశిక్ష విధించాడు. పది లక్షల అవినీతికి సాక్ష్యాలున్నా హేస్టింగ్ దోషి కాలేదు కానీ, ఫోర్జరీ అని హేస్టింగ్ చేసిన చిన్న ఆరోపణతో నందకుమార్‌కు ఉరిశిక్ష పడింది. 1775 ఆగస్టు 5న ఆయన్ని ఉరి తీశారు. ఈస్టిండియా కంపెనీ ఉరిశిక్ష వేయించి చంపిన మొదటి భారతీయుడు నందకుమారే! ఉరి రోజున నందకుమార్‌ను జైలు నుంచి ఉరికొయ్యల దగ్గరకు తీసుకొస్తుంటే ఆయన చిరునవ్వుతో ఉన్నారని ఉరి శిక్ష అమలును పర్యవేక్షించిన కలకత్తా షరీఫ్ అలెగ్జాండర్ మక్రబీ రాశారు. చదవండి: శతమానం భారతి: లక్ష్యం 2047 ముందడుగు -
చైతన్య భారతి: వైద్య ఉద్యమకారిణి కాదంబిని గంగూలీ
కాదంబిని వైద్యురాలిగా అవతరించిన కాలాన్ని చూస్తే ఆమె విజయం ఎంత చరిత్రాత్మకమో అర్థం అవుతుంది. ఆమె పుట్టిన సంవత్సరం 1861. ఆ సంవత్సరమే భారతదేశంలో సతీ దురాచారాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ విక్టోరియా రాణి ప్రకటన జారీ చేశారు! 1803లో ఒక్క కలకత్తాలోనే కేవలం 30 మైళ్ల పరిధిలో 438 సతీసహగమనాలు జరిగాయి. ఇలాంటి నేపథ్యం ఉన్న నేల మీద పుట్టిన కాందబిని గైనకాలజిస్ట్ అయ్యారు. కానీ ఆ రోజుల్లో వైద్య విద్య చదివిన మహిళా డాక్టరు అన్నా మంత్రసాని కంటే ఎక్కువ విలువ ఇచ్చేది కాదు సమాజం. కాదంబిని గంగూలీ అసలు పేరు కాదంబిని బసు. భారతదేశం నుంచి పట్టభద్రులైన తొలి ఇద్దరు మహిళల్లో ఒకరు. ఆ రెండో మహిళ డెహ్రాడూన్ కు చెందిన చంద్రముఖి బసు. కాదంబిని వైద్యురాలిగా ఎంతో ప్రతిభను కనపరచడమే కాకుండా, భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమంలో, మహిళల హక్కుల సాధన ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. కాదంబిని బిహార్‌లోని భాగల్పూరులో పుట్టారు. ఆమె కుటుంబం బ్రహ్మ సమాజ దీక్షను స్వీకరించింది. ఇండియాలో విద్యాభ్యాసం అయ్యాక 1892లో కాదంబిని లండన్ వెళ్లారు. విదేశాలలో వైద్య పట్టాపుచ్చుకుని వచ్చి, ఆ వృత్తి నిర్వహించిన తొలి ఆసియా మహిళగా కాదంబిని చరిత్ర ప్రసిద్ధురాలయ్యారు. నేపాల్ రాజమాతను దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యను పరిష్కరించడంతో ఉన్నత వర్గాలలో ఆమె పేరు మారుమోగిపోయింది. కాదంబిని ద్వారకానాథ్ గంగూలీని వివాహం చేసుకున్నారు. ఆయన కూడా బ్రహ్మ సమాజీకుడే. ఆయన ప్రోత్సాహంతోనే కాదంబిని విదేశాలకు వెళ్లి చదువు పూర్తి చేశారు. కాదంబిని గొప్ప వైద్యురాలు. గొప్ప సామాజిక కార్యకర్త. మేధావి. వీటితో పాటు గొప్ప తల్లి. ఆమె తన భర్త ముందు భార్యకు జన్మించిన ముగ్గురు పిల్లలతో పాటు, తామిద్దరికీ జన్మించిన మరో ఐదుగురు పిల్లలను కూడా పెంచారు. భర్తకు, ఆమెకు పదిహేడు సంవత్సరాల తేడా ఉంది.ఆమె పలు సామాజిక ఉద్యమాలతో పాటు కాంగ్రెస్ జాతీయోద్యమంలో కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ సభలలో వేదిక మీద కనిపించిన తొలి మహిళ కూడా కాదంబినియే. ఆమె బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో కూడా పాల్గొన్నారు. 1908లో కలకత్తాలోనే మహిళా సమావేశం నిర్వహించారు. తూర్పు భారతంలో గనులలో పనిచేసే మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు. దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం గాంధీజీ స్థాపించిన ట్రాన్స్‌వాల్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 1923లో మరణించే వరకు ఆమె వైద్య వృత్తిని వీడలేదు. -
బ్రిటన్ మెచ్చిన బలాఢ్యుడు: కోడి రామమూర్తి
‘కండగలవాడే మనిషోయ్’ అన్న గురజాడవారి భావనకి నిలువెత్తు రూపం కోడి రామమూర్తి నాయుడు. ఈ బలాఢ్యుడిని చూసి బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ కూడా సంబరపడింది. రామమూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండెల మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్‌లో ఆయన విన్యాసాలు మరింత కఠినమైనవి. రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను వేగంగా నడిపించేవారు. అయినప్పటికీ అవి కదిలేవి కావు. ఏనుగును ఛాతి మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. లోకమాన్య బాలగంగాధర తిలక్ ఆహ్వానం మేరకు రామమూర్తి పుణె వెళ్లి సర్కస్ ప్రదర్శన నిర్వహించారు. రామమూర్తి ప్రతిభను చూసి విస్తుపోయిన తిలక్ ఆయనకు ‘మల్ల మార్తాండ’ అనే బిరుదును ఇచ్చి సత్కరించారు. వైస్రాయ్ లార్డ్ మింటో కారణంగా రామమూర్తి ఖ్యాతి దేశవ్యాప్తమైందని చెబుతారు. అంటే 1919–1920 ప్రాంతమన్నమాట. కారును ముందుకు వెళ్లకుండా గొలుసులతో పట్టి ఆపుతూ రామమూర్తినాయుడు చేసే ప్రదర్శనను మింటో చూశాడు. వైస్రాయ్ స్వయంగా కితాబిస్తే ఇంకేముంది? కొన్ని వందల మంది సభ్యులు ఉన్న తన సర్కస్ బృందం రామమూర్తి యూరప్ ఖండానికి వెళ్లారు. ఇంగ్లండ్ రాణి, అప్పటి రాజు ఐదో జార్జ్ చక్రవర్తి బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ ప్రాంగణంలోనే ఈ భారతీయుడి చేత ప్రదర్శన ఏర్పాటు చేయించారు. ప్యాలెస్‌లో విందు చేసి, సత్కరించి ‘ఇండియన్ హెర్క్యులిస్’ అన్న బిరుదు ఇచ్చారు. తరువాత ఆసియాలో జపాన్, చైనా, బర్మా దేశాలలో కూడా ఆయన సర్కస్ ప్రదర్శించారు. బర్మాలో ఆయన మీద హత్యాయత్నం జరగడంతో వెంటనే భారతదేశానికి వచ్చేశారు. బహుశా ఈర‡్ష్య వల్ల ఆయనను చంపాలని అక్కడి వాళ్లు అనుకుని ఉండవచ్చు. సర్కస్ ద్వారా ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు గడించారాయన. అందులో చాలా వరకు విరాళాలు ఇచ్చారు. ముఖ్యంగా భారత స్వాతంత్యోద్య్రమానికి తన వంతు ఆర్థిక సాయం చేశారు. ఒంటి నిండా శక్తి. దేశ విదేశాలలో కీర్తి. అయినా రామమూర్తినాయుడు అనే ఆ మల్లయోధుడు జీవిత చరమాంకంలో అనారోగ్యమనే సమస్యతో పోరాడాడు. బహుశా అందులో మాత్రం ఆయన అపజయం పాలయ్యారేమో! ఆయన ఒరిస్సాలోని కలహండి సంస్థానాధీశుని పోషణలో ఉన్నప్పుడు దాదాపు 1942 జనవరి 16 న అనామకంగా కన్నుమూశారు. రామమూర్తిగారు పూర్తి శాకాహారి. గురజాడ వారు తిరగాడిన ఉత్తరాంధ్రలోనే కోడి రామమూర్తి 1882 ఏప్రిల్‌లో జన్మించారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం. ఊరి పేరే కాదు, ఆయన ఇంటి పేరుకు కూడా ఒక ఘనత ఉంది. కోడి వంశం మల్లయోధులకు ప్రసిద్ధి. -
చైతన్య భారతి: పతాక యోధుడు.. పింగళి వెంకయ్య
రెండో బోయర్ యుద్ధంలో పింగళి వెంకయ్యకీ, గాంధీజీకీ స్నేహం కుదిరింది. ఐదు దశాబ్దాల పాటు కొనసాగింది. ఆ పరిచయంతో, స్వాతంత్యోద్య్రమకారుడిగా తన అనుభవంతో వెంకయ్య జెండాకు రూపకల్పన చేశారు. దక్షిణాఫ్రికాలోని విట్వాటర్సాండ్ బంగారు గనుల మీద ఆధిపత్యం గురించి ఆఫ్రికన్లు (బోయర్లు) చేసిన తిరుగుబాటుకే బోయర్ యుద్ధమని పేరు. దక్షిణాఫ్రికా రిపబ్లిక్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్లు బ్రిటిష్ జాతితో చేసిన యుద్ధమిది. ఆ యుద్ధంలో క్షతగాత్రులకు సేవ చేయడానికి గాంధీజీ నెటాల్ ఇండియన్ అంబులెన్స్ దళాన్ని ఏర్పాటు చేశారు. 19 ఏళ్ల వయసులో పింగళి వెంకయ్య బ్రిటిష్ సైనికునిగా అదే యుద్ధంలో పాల్గొన్నారు. తరువాత ఇద్దరూ స్వదేశం చేరుకుని స్వరాజ్యం కోసం పోరాడారు. శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో, అంటే 1921లో గాంధీజీ భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమానికి ఒక పతాకం అవసరమని భావించారు. ఆ పని పింగళి వెంకయ్యకు తనకు తానై స్వీకరించారు. 1921లో గాంధీజీ బెజవాడ వచ్చినప్పుడు వెంకయ్య కలుసుకున్నారు. జెండా గురించి ప్రస్తావన వచ్చింది. తన పరిశోధనను, ప్రచురణను వెంకయ్య గాంధీజీకి చూపించారు. గాంధీజీ కూడా సంతోషించారు. ఉద్యమానికి అవసరమైన పతాకం గురించి ఆయన వెంకయ్యగారికి సూచించారు. స్థలకాలాలతో సంబంధం లేకుండా అందరినీ ఉత్తేజితులను చేయగలిగిన జెండా కావాలని గాంధీ ఆకాంక్ష. మువ్వన్నెలలో గాంధీజీ తెల్లరంగును, వెంకయ్య కాషాయం ఆకుపచ్చ రంగులను సూచించారు. దీనికి ఆర్యసమాజ్ ఉద్యమకారుడు లాలా హన్స్‌రాజ్ ధర్మచక్రాన్ని సూచించారు. ‘‘ఒక జాతికి పతాకం అవసరం. పతాకాన్ని రక్షించుకునే పోరాటంలో లక్షలాది మంది కన్నుమూస్తారు. జెండా విగ్రహారాధన వంటిదే అయినా, చెడును విధ్వంసం చేసే శక్తి ఉన్నది. బ్రిటిష్ వాళ్లు వారి జెండా యూనియన్ జాక్‌ను ఎగురవేస్తే అది వారికి ఇచ్చే ప్రేరణ గురించి చెప్పడానికి మాటలు చాలవు.’’ అన్నారు గాంధీజీ. ఆఖరికి ధర్మచక్రంతో కూడిన త్రివర్ణ పతాకాన్ని 22 జూలై, 1948న జాతీయ పతాకంగా భారత జాతి స్వీకరించింది. వెంకయ్య 1876 ఆగస్టు 2న కృష్ణాతీరంలోని భట్లపెనుమర్రులో జన్మించారు. 1963 జూలై 4న బెజవాడలో పేదరికంతో ఒక తాటాకు ఇంట్లో కన్నుమూశారు. -
జైహింద్ స్పెషల్: అరెరె.. క్రూర వ్యాఘ్రమా ఓ భయభ్రాంతుడా
వి.ఓ. చిదంబరం పిళ్లైకి యావజ్జీవ కారాగార శిక్ష పడడంతో, దానికి నిరసనగా ప్రజలంతా గుమిగూడారు. దీన్ని చూసి బ్రిటిష్ అధికారికి చిర్రెక్కింది. అతని తుపాకీకి పిచ్చెక్కడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. అంతే. గాడిచర్లకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘‘అరెరె ఫిరంగీ! క్రూర వ్యాఘ్రమా! ఓ భయభ్రాంతుడా! పొగరుబోతు’’ అంటూ ‘విపరీత బుద్ధి’ శీర్షికన సంపాదకీయం రాశారు. ‘రాజద్రోహాన్ని’ లెక్కచేయలేదు, కటకటాలనూ లెక్క చేయలేదు, హింసనూ లెక్క చేయలేదు. స్వాతంత్య్రోద్యమం కోసం ఎంతో మంది పాత్రికేయులు అక్షరాయుధాలుగా తయారయ్యారు. తిలక్ (కేసరి, మరాఠా), సుబ్రమణ్య అయ్యర్ (ద హిందూ), శిశిర్ కుమార్ ఘోష్, మోతీలాల్ ఘోష్ (స్వదేశీయాభిమాని), మోతీలాల్ నెహ్రూ, మదన్మోహన్ మాలవ్య(ద లీడర్), గాంధీ (దక్షిణాఫ్రికాలో ‘వాయిస్ ఆఫ్ ఇండియా’కు కరస్పాండెంట్) వంటి జాతీయోద్యమ నాయకుల జీవితాలు పత్రికలతో పెనవేసుకునే మొదలయ్యాయి. దేశంలో తొలిసారిగా జైలుకెళ్లిన పాత్రికేయుడు సురే్రందనాథ్ బెనర్జీ. తెలుగునాట సంపాదకీయం రాసి జైలు జీవితాన్ని గడిపిన తొలి పాత్రికేయుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. తొలి తెలుగు దినపత్రిక ‘ఆంధ్రపత్రిక’కు ఆయన తొలి సంపాదకుడు. ‘గాడి’ తప్పిన ఆగ్రహం గాడిచర్ల హరిసర్వోత్తమ రావు తండ్రి నేటి వైఎస్ ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురానికి చెందిన వారు. కర్నూలులో 1883లో జన్మించిన ఆయన, మద్రాసులో ఎం.ఏ., పూర్తి చేసి, రాజమండ్రిలో బీఈడీలో చేరారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ‘వందేమాతర’ ఉద్యమంలో అక్కడి విద్యార్థులంతా తరగతులను బహిష్కరించారు. విద్యార్థులకు జరిమానాతో సరిపెట్టిన ప్రిన్సిపాల్, వారికి నాయకత్వం వహించిన గాడిచర్లను కాలేజీ నుంచి బహిష్కరించి, ఎక్కడా ప్రభుత్వ ఉద్యోగంలో చేరకుండా ఆదేశాలు జారీ చేశారు. గాడిచర్ల ఏడాది తరువాత విజయవాడ వచ్చి ‘స్వరాజ్య’ పత్రికను స్థాపించారు. అదే సమయంలో తమిళనాడులో వి.ఓ. చిదంబరం పిళ్లైకి యావజ్జీవ కారాగార శిక్ష పడడంతో, దానికి నిరసనగా ప్రజలంతా గుమిగూడారు. దీన్ని చూసి బ్రిటిష్ అధికారికి చిర్రెక్కింది. అతని తుపాకీకి పిచ్చెక్కడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. అంతే. గాడిచర్లకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జడ్జికి ‘అభిమాన’ భంగం ‘‘అరెరె ఫిరంగీ! క్రూర వ్యాఘ్రమా! ఓ భయభ్రాంతుడా! పొగరుబోతు’’ అంటూ ‘విపరీత బుద్ధి’ శీర్షికన సంపాదకీయం రాసినందుకు ఆయనపైన రాజద్రోహ నేరం మోపారు. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం భోగరాజు పట్టాభిసీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావుల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు చేశారు. ఆ సమయంలోనే బాలగంగాధర్ తిలక్ పైన బొంబాయిలో రాజద్రోహ నేరం కేసు విచారణ జరుగుతోంది. ‘విపరీత బుద్ది’ తోపాటు ‘స్వరాజ్య’ లో వచ్చిన మిగతా వ్యాసాలు రోజద్రోహం కిందకు రావని, భారతీయుడైన కృష్ణా జిల్లా సెషన్స్ జడ్జి కెర్షాస్ప్ (పారశీ మతస్తుడు) కేవలం 6 నెలల సాధారణ శిక్షతో సరిపెట్టారు. గాడిచర్ల పైన అభిమానంతో శిక్షను తగ్గించి విధించారని భావించిన మద్రాసు హైకోర్టు జడ్జిలు కెర్షాస్ప్ పదవీ స్థాయిని తగ్గించేశారు. మరొక సారి పదవీ స్థాయిని తగ్గించడంతో ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. హైకోర్టులో గాడిచర్ల తరపున ప్రకాశం పంతులు వాదించినప్పటికీ, మూడేళ్ల కఠిన కారాగార శిక్ష తప్పలేదు. మొలకు గోచి.. తలకు టోపీ ఆ సమయంలో గాడిచర్ల వయసు పాతికేళ్లు. ఆయన సతీమణి రామాబాయి వయసు పదిహేనేళ్లు. ఆమె ఏడు నెలల గర్భవతి. జైల్లో ఉన్న భర్తను దూరం నుంచి చూసి చలించిపోయారు. మొలకు గోచీ, గుండు చేసిన తలకు మురికి టోపీ, కాళ్లకు, చేతులకు, మెడకు ఇనుప కడియాలు, మట్టి ముంతలో నీళ్లు, మట్టి చిప్పలో మట్టిపెళ్లలు, రాళ్లతో నిండిన రాగి సంగటి. పిండి విసరడం, రాళ్లు కొట్టడం ఆయన దినచర్య. మట్టితో పళ్లు తోముకోవడం, జైలరు చెప్పిన సమయానికి మలవిసర్జన, స్నానానికి 4 ముంతల నీళ్లు; ఇలా దేహబలాన్నే కాదు, మనో బలాన్ని కూడా దెబ్బతీయాలని చూసినా వారికి సాధ్యం కాలేదు. ఆ తరువాత గాడిచర్ల ‘నేషనలిస్టు’ అన్న ఇంగ్లీషు పత్రికను స్థాపించి, రౌలత్ చట్టం, చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు, ప్రెస్ యాక్ట్‌ను నిశితంగా విమర్శిస్తూ ‘కట్ ఆఫ్ ద బుల్లెట్’ అన్న సంపాదకీయం రాశారు. దీంతో ఆయనపై మళ్ళీ రాజద్రోహ నేరం మోపారు. ఈ తడవ జైలు శిక్షపడలేదు కానీ, పత్రికను మూసేశారు. ‘నేషనలిస్టు’లో కందుకూరి వీరేశలింగం, కట్టమంచి రామలింగా రెడ్డి వంటి వారు కూడా వ్యాసాలు రాసేవారు. జైలు నుంచి విడుదలైన గాడిచర్లతో మాట్లాడడానికి ఎవరూ సాహసించే వారు కాదు. ఆ స్థితిలో కాశీనాథుని నాగేశ్వరరావు 1914లో మద్రాసులో తెలుగు వారి తొలి దినప్రతికగా ఆంధ్రపత్రికను స్థాపించి గాడిచర్లను సంపాదకులుగా నియమించారు. – రాఘవ శర్మ గాడిచర్ల హరిసర్వోత్తమరావు చదవండి: ఫడ్కే.. ఇప్పుడు నీకేం కావాలి? నీతో యుద్ధం.. -
చైతన్య భారతి: గృహిణి, ఉద్యమకారిణి.. కమలా నెహ్రూ
కమలా నెహ్రూ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సతీమణి. ఇంటి పట్టునే ఉండే కమలా నెహ్రూ 1921లో సహాయ నిరాకరణోద్యమంలో మహిళల బందానికి నాయకత్వం వహించి విదేశీ వస్తువులు, దుస్తులు, మద్యం అమ్మకాలు తగవనే నినాదంతో ముందుకు సాగారు. రెండుసార్లు అరెస్ట్ అయ్యారు. కమల పాత ఢిల్లీ లోని కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో 1899 ఆగస్టు 1 రాజ్‌పతి, జవహర్‌మల్ కౌల్ దంపతులకు జన్మించారు. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు. చాంద్ బహదూర్ కౌల్ , కైలాష్ నాథ్ కౌల్; ఒక చెల్లెలు స్వరూప్ కఠ్జు. కమలకు 1916 ఫిబ్రవరి 8న జవహర్ లాల్ నెహ్రూ తో వివాహం జరిగింది. కమలా నెహ్రూ మామగారు మోతీలాల్ నెహ్రూ. అత్తగారు శ్రీమతి స్వరూప రాణి. ఉద్యమాలు తెలియకుండా పెరిగి వచ్చిన కోడలు సహాయ నిరాకరణకు నడుము బిగించడంతో అత్తమామలు సంతోషించారని అంటారు. ఆమె మామగారు మోతీలాల్ నెహ్రూ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తండ్రితో కలసి నెహ్రూ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటుండేవారు. దేశ స్వాతంత్ర్యం పోరాటం కోసం నెహ్రూ కుటుంబం ఆస్తినంతా ధారపోసింది. చివరకు తమ ఇంటిని సైతం కొంత భాగం హాస్పిటల్‌గా మార్చి స్వాతంత్య్ర పోరాటంలో గాయపడిన వారికి వైద్య చికిత్సలు అందించారు. 1917 నవంబరు 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూలకు ఏకైక సంతానంగా అలహాబాద్ లో ఇందిర జన్మించారు. 1924 లో కమలా నెహ్రూ ఒక బాబును కన్నారు. పూర్తిగా పరిణతి చెందక ముందే జన్మించడం వలన రెండు రోజులలో బాబు చనిపోయాడు. 1934లో జైలు నుండి విడుదలైన నెహ్రూ తిరిగి అరెస్టు అయి కలకత్తా, డెహ్రాడూన్ లలో జైలు జీవితాన్ని గడిపారు. ఈ సమయంలో నెహ్రూ ఆరోగ్యం దెబ్బతినింది. భర్త ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కమలా నెహ్రూ కూడా దిగులుతో అనారోగ్యానికి గురయ్యారు.. చికిత్స కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్లి 1936లో టి.బి. జబ్బు మూలాన 36 ఏళ్ల వయసుకే మరణించారు. కమలా నెహ్రూ చనిపోయిన తరువాత ఆమె పేరుతో కాలేజీలు, పార్కులు, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు వెలశాయి. కమలా నెహ్రూ తండ్రి జవహర్‌మల్ కౌల్ప్రసిద్ధ వ్యాపారి. జవహర్ లాల్ నెహ్రూకు సరైనజోడి కమలా నెహ్రూ అని భావించి, వారి వివాహం జరిపించాడు. వివాహం తరువాత కమలా కౌల్ కమలా నెహ్రూగా మారారు. -
మాల్గుడి మహాశయుడు: ఆర్.కె.నారాయణ్
మన దేశానికి గర్వ కారణంగా నిలిచిన భారతీయ ఆంగ్ల కథా సాహిత్యానికి పునాదులు వేసిన వైతాళికులు రాసిపురం కృష్ణస్వామి నారాయణ్! ఆయన 1906లో మద్రాసులోని ఒక సంప్రదాయ కుటుంబంలో ఎనిమిదవ సంతానంగా జన్మించారు. ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు ఆర్.కె.లక్ష్మణ్ ఆయన పెద్దన్నయ్య. ఆర్. కె. నారాయణ్ చిన్నతనం నుంచి కౌమార దశకు వచ్చేవరకు అమ్మమ్మ ఇంటి దగ్గరే పెరిగారు. మైసూరులో ఆయన తండ్రి మహారాజా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా నియమితులైనప్పుడు నారాయణ్ మళ్లీ తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నారు. చదువుకుంటున్నప్పుడు ఆయన ధ్యాస చదువు మీద ఉండేది కాదు. ఇంగ్లిష్ పాఠ్య పుస్తకం చదవడానికి చాలా విసుగనిపించడంతో చదవక, చదవలేక.. నారాయణ్ కళాశాల ప్రవేశ పరీక్షలో తప్పారు. తరువాత మళ్లీ ఎలాగో ప్రవేశ పరీక్ష రాసి మైసూరు విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. నారాయణ్ కథా రచయితగా తన జీవితాన్ని 1935లో ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ అనే కథతో మొదలుపెట్టారు. ‘మాల్గుడి’ అనే ఊహా పట్టణం ఆయన తలపుల్లో రూపుదిద్దుకుని ఆయన నవలలకు నేపథ్యమైంది. ది బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, ది ఇంగ్లిష్ టీచర్, మిస్టర్ సంపత్, ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ది వెండర్ ఆఫ్ స్వీట్స్, ది పెయింటర్ ఆఫ్ సైన్స్, ఎ టైగర్ ఫర్ మాల్గుడి పేరుతో వెలువడిన నారాయణ్ రచనలు భారతీయ ఆంగ్ల సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే కీర్తిని సంపాదించుకున్నాయి. స్వామి అండ్ ఫ్రెండ్స్‌ను అచ్చు వేయడానికి మొదట నారాయణ్‌కు ప్రచురణకర్తలు లభించలేదు. రాత ప్రతిని ఆయన గ్రాహమ్ గ్రీన్‌కు చూపించారు. ఆయన దానిని చదివి, హృదయపూర్వకంగా ప్రశంసించి, దానిని ప్రచురించడానికి ఏర్పాట్లు చేశారు. ఇ.ఎం.పార్స్టర్, సోమర్ సెట్ మామ్ల మాదిరిగా నారాయణ్‌కు కూడా గ్రీన్ ఆరాధకుడిగా మారిపోయారు. విషాదం, హాస్యం మేళవిస్తూ ఆయన రాసే కథలు సహజంగానే ఆబాలగోపాలన్ని ఆకట్టుకున్నాయి. ఆయన జీవితానుభవాలనే ఇతివృత్తాలుగా చేసుకుని కథల్ని సృష్టించారు. 1958లో ది గైడ్‌కు ఆయనకు సాహిత్య అకాడెమీ అవార్డు లభించగా, 1980లో రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ ఆయనను ఎ.సి.బెన్సన్ అవార్డుతో సత్కరించింది. ఒక్కమాటలో.. సులభమైన భాష, శైలితో ఆర్.కె.నారాయణ్ రాసిన విషాద, హాస్య రచనలు ఆంగ్ల సాహిత్యంలో భారతీయ కథలకు కని విని ఎరుగని విధంగా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయి. – అంజూ సెహ్గల్ గుప్తా, ‘ఇగ్నో’ ప్రొఫెసర్ -
మహోజ్వల భారతి: భారతజాతి మిత్రుడు బెంజిమన్
జలియన్ వాలా బాగ్ హత్యాకాండ వార్త అది జరిగిన ఐదారు వారాలకు గాని.. పంజాబ్ నుంచి మిగిలిన భారతదేశానికి చేరలేదు. నాడు అంత దారుణంగా పత్రికల నోరు నొక్కింది బ్రిటిష్ ప్రభుత్వం. అలాంటి పరిస్థితులలో హార్నిమన్ ఆ ఘోరాన్ని ఇంగ్లండ్‌లోని లేబర్‌పార్టీ పెద్దలకు రహస్యంగా చేరవేసి సంచలనం సృష్టించారు. అందుకే ఆయనను నాటి మహోన్నత స్వాతంత్య్రోద్యమ రథసారథులు మనసారా ‘భారత జాతి మిత్రుడు’ అని పిలుచుకున్నారు. బెంగాల్‌ను విభజిస్తున్నట్టు 1905 అక్టోబర్ 16న వైస్రాయ్ లార్డ్ కర్జన్ ప్రకటించగానే భారతీయులు భగ్గుమన్నారు. హిందువులు, ముస్లింలు ఒకరి చేతికి ఒకరు రాఖీలు కట్టుకుని, ఐక్యతను చాటారు. బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్, చిత్తరంజన్ దాస్ వంటివారితో పాటు కొన్నివేల మంది గంగానదిలో స్నానం చేసి, ప్రభుత్వం వంగదేశ విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఉద్యమం సాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆనాటి ఆ చరిత్రాత్మక ఘట్టంలో ఒక్క వ్యక్తి మాత్రం ప్రత్యేకంగా కనిపించారు. చిన్న గావంచా కట్టుకుని గంగలో స్నానమాచరించి, ఆయన కూడా బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడతానని ప్రతిన పూనారు. కానీ, ఆయన భారతీయుడు కాదు. తెల్ల జాతీయుడు! ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రిక ‘ది స్టేట్స్‌మన్ ’ సహాయ సంపాదకుడు. పేరు బెంజిమన్ గై హార్నిమన్. బాలగంగాధర తిలక్, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్‌షా మెహతా, మోతీలాల్, ఎంఏ జిన్నా, అనిబీసెంట్, సరోజినీ నాయుడు వంటి వారితో ఆయన భుజం భుజం కలిపి భారత స్వాతంత్య్రోద్యమంలో నడిచారు. నేడు బెంజిమన్ గై హార్నిమన్ జయంతి. 1873 జూలై 17న జన్మించారు. బ్రిటన్‌లో పుట్టి, ఇండియాలో స్థిరపడిన జర్నలిస్ట్ ఆయన. జలియన్ వాలా దురంతం మీద హార్నిమన్ ఒక పుస్తకమే రాశారు. దాని పేరు ‘బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ది అమృత్సర్ మేసకర్’. ఈ పుస్తకాన్ని 1984లో భారతదేశంలో పునర్ ముద్రించారు కూడా. ఎలాంటి దేశం మీద, ఎలాంటి దుస్థితిలో జీవనం సాగిస్తున్న ప్రజల మీద తెల్ల జాతీయులు దాష్టీకం చేస్తున్నారో, జలియన్ వాలా బాగ్ కాల్పుల వంటి రాక్షసకృత్యానికి పాల్పడ్డారో ఆయన అందులో ఎంతో అద్భుతంగా వర్ణించారు. రాజనీతి గురించి ప్రపంచానికి నీతులు చెప్పే ఇంగ్లండ్ భారతదేశంలో పత్రికల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నదో కూడా బహిర్గతం చేశారు. 1947లో భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం అధీనం నుంచి విముక్తమైన గొప్ప దృశ్యాన్ని హార్నిమన్ వీక్షించారు. ఆ మరుసటి సంవత్సరం కన్నుమూశారు. -
చరిత్రాత్మక సినీ రూపకర్త: బిమల్ రాయ్
బిమల్ రాయ్ ప్రముఖ బెంగాలీ, హిందీ సినిమా దర్శకులు. దో బిఘా జమీన్, పరిణీత, బిరాజ్ బహు, దేవ్‌దాస్, మధుమతి, సుజాత, పరఖ్, బందిని వంటి వాస్తవిక, సామాజికాంశాలతో కూడిన చిత్రాలను ఆయన తీశారు. రాయ్ ఢాకా లోని సువాపూర్లో జన్మించారు. అక్కడి నుంచి వారి కుటుంబం కలకత్తా వచ్చాక సినిమాల్లో కెమెరా అసిస్టెంట్‌గా ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ క్రమంలో గొప్ప సినిమా దర్శకునిగా అవతరించారు. అనేక అవార్డులను పొందారు. అంతర్జాతీయ పురస్కారాలు కూడా ఆయన్ని వరించాయి. దురదృష్టం ఏమిటంటే.. 56 ఏళ్లకే ఆయన క్యాన్సర్‌తో మరణించారు. ఆయన సతీమణి మనోబినా రాయ్. వారికి ముగ్గురు కూతుళ్లు.. రింకీ భట్టాచార్య, యశోధరా రాయ్, అపరంజితా సిన్హా; ఒక కుమారుడు జాయ్ రాయ్. తండ్రి గురించి జాయ్ రాయ్ మాటల్లో మరికొంత తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది : ‘‘గదులన్నీ పుస్తకాలు, చలన చిత్రాలతో నిండిపోయి ఉండటం నాకు చిన్నప్పట్నుంచీ గుర్తే! నా తోబుట్టువులు, నేను ఆ పుస్తకాలను, ప్రపంచంలోని బొమ్మలను ఆశ్చర్యంగా చూసేవాళ్లం. తరచు మా నాన్నగారు అతిథులను ఆహ్వానించేవారు.చిత్ర రూపకల్పనను ఎంతో ప్రేమించే మా నాన్నగారు మమ్మల్ని మాత్రం అందులోకి దిగడానికి ప్రోత్సహించేవారు కాదు. సినిమా వాతావరణం కన్నా మా ఇంట్లో ఓ ప్రత్యేకమైన సంస్కృతి విలసిల్లుతూ ఉండేది. జమీందారు కుటుంబం నుంచి వచ్చిన ఆయన తన కుటుంబం మోసానికి గురవడంతో ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నారు. సినిమాల రూపకల్పన ఒక్కటే ఆయనకు మిగిలిన ఏకైక వ్యామోహం. 1960లలో ఆయనకు చరిత్రాత్మక సినీ రూపకర్తగా పేరు వచ్చింది. నిజానికి 1932 నుంచే ఆ రంగంలో ఆయన పని చేయడం ప్రారంభించారు. అప్పట్లో ఆయన సినీ ఫొటోగ్రాఫర్‌గా పని చేశారు. ఆ తరువాత ఆయన తన భావోద్వేగాలను సెల్యులాయిడ్ పైకి తర్జుమా చేయడం ప్రారంభించారు. దో బిఘా జమీన్ చిత్రం ఆయన వ్యక్తిగత అనుభవానికి ప్రతిరూపమని నా భావన. ఆయన రూపొందించిన చిత్రాలన్నీ ఆయన ఆలోచనల్ని, అనుభవాలనే ప్రతిబింబించేందుకు నిజాయితీగా చేసిన ప్రయత్నాలు. ఆయన తన వనరులన్నిటినీ చిత్ర నిర్మాణానికే ఖర్చుపెట్టేవారు. ఏదైనా సరే నిర్దుష్టంగా ఉండాలనే తపన వల్ల ఆయన శక్తి, సమయం ఖర్చయ్యాయి. ప్రతి చిన్న దాని మీదా ఆయన చూపిన ఆ శ్రద్ధాసక్తుల వల్లే ఇవాళ్టికీ ఆయన చిత్రాలు నిలబడుతున్నాయి’’ అంటారు జాయ్ రాయ్. -
మహోజ్వల భారతి: నెహ్రూకు నో ఎంట్రీ చెప్పిన దుర్గాబాయ్!
దుర్గాబాయి దేశ్‌ముఖ్ భారత స్వాతంత్య్ర సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . చెన్నై, హైదరాబాద్‌లలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను దుర్గాబాయే స్థాపించారు. రాజ్యాంగ సభలో, ప్రణాళికా సంఘంలో సభ్యురాలిగా ఉన్నారు. నేడు దుర్గాబాయి దేశ్‌ముఖ్ జయంతి. 1909 జూలై 15న రాజమండ్రిలో జన్మించారు. దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్య్ర పోరాటంలో పాల్పంచుకున్నారు. పన్నెండేళ్ల వయసులోనే ఆంగ్ల విద్యకు వ్యతిరేకంగా ఆమె పోరాటం సాగించారు. ఆంధ్రప్రదేశ్‌కు మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని ఆ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేశారు. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను సైతం విరాళంగా అందించారు. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా విధి నిర్వహణలో ఉన్నప్పుడు.. టిక్కెట్ లేని కారణంగా నెహ్రూను ఆమె సభలోపలికి అనుమతించలేదు. కర్తవ్య నిర్వహణలో నిక్కచ్చిగా ఉన్నందుకు తిరిగి నెహ్రూ నుంచే ఆమె ప్రశంసలు అందుకున్నారు. చదవండి: మహోజ్వల భారతి: ‘నల్లదొరతనం’ పై రాయనన్న దేశభక్తుడు -
చైతన్య భారతి: స్త్రీవాద వర్ణాలు-అమృతా షేర్గిల్
అమృత తన వర్ణచిత్రాల ద్వారా , తన వ్యక్తిత్వం ద్వారా ఈ ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు. ఆమె చిత్రాలలో కనిపించే ఎడతెగని మార్పులకు అమృత పుట్టుపూర్వోత్తరాలే ప్రధాన కారణం. అయితే, ఈ విషయంలో కాలాన్ని కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. భారతదేశమే పరిణామక్రమంలో ఉన్న సమయంలో ఆమె జీవించారు. ఆమె మాతృమూర్తి హంగేరియన్. తండ్రి పదహారణాల భారతీయుడు. దాంతో తాను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనే స్పృహ అమృతలో గాఢంగా ఉండేది. ఆమెకు తన శారీరక సౌందర్యానికి సంబంధించిన స్పృహ కూడా ఎక్కువే. ఆమె తన అందచందాలను అనేక రకాలుగా ప్రదర్శించారు. అందులో చాలాభాగం ఫొటోలను ఆమె తండ్రి ఉమ్రావ్ సింగ్ స్వయంగా తీశారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కలిగి, భారతదేశానికి వచ్చి సంచలనం సృష్టించిన ‘విమోచన పొందిన మహిళ’గా ఆమె చాలామందికి గుర్తుండిపోయారు. చనిపోవడానికి సుమారు రెండేళ్ల ముందు ఆమె హంగేరీలో ఉండగా వేసిన ‘టు ఉమెన్’ అరుదైన చిత్రం. అందులోంచి స్త్రీవాదం తొంగి చూస్తుంటుంది. స్త్రీత్వానికి తాను చెప్పిన భాష్యాన్ని తానే ఎదుర్కొన్న చిత్రం అది. ఆధునిక భారతీయ మహిళ అనే పదం అరిగిపోయినదిగా కనిపించవచ్చు. కానీ అంతిమంగా, నాకు అమృత.. ఆ పదానికి తగిన నిర్వచనంలా కనిపిస్తారు. ఆమె వర్ణచిత్రాలే అందుకు తార్కాణాలు. 28 ఏళ్ల వయసుకే అనారోగ్యంతో మరణించిన అమృత తను జీవించిన కొద్ది కాలంలోనే అమూల్యమైన చిత్రకారిణిగా పేర్గాంచారు. అప్పట్లో భారతదేశంలో అత్యంత ఖరీదైన పెయింటింగ్‌లను చిత్రించిన మహిళ అమృతాయే. 1938లో గోరఖ్‌పూర్‌లోని తన ఎస్టేట్‌లో ఆమె గీసిన ‘ఇన్ ది లేడీస్ ఎన్‌క్లోజర్’ చిత్రం.. ఇటీవలే 2021 వేలంలో 37.8 కోట్లకు అమ్ముడయింది. చిత్రకారిణిగా ఆమె తన ఆర్ట్ వర్క్‌ను ప్రేమించినట్లే భారతదేశాన్నీ ప్రేమించారు. 1938లో అమృత తన తల్లి వైపు బంధువు అయిన వైద్యుడు విక్టర్ ఈగాన్ను వివాహమాడారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో స్థిరపడ్డారు. 1941లో లాహోర్‌లో అత్యంత భారీ కళా ప్రదర్శన ప్రారంభించడానికి కొద్ది రోజుల ముందు తీవ్రమైన ఆనారోగ్యం బారిన పడ్డారు. ఆ ఏడాది డిసెంబర్ 6 అర్ధరాత్రి తను గీస్తున్న బొమ్మలపైనే ఒరిగిపోయారు. – వివాన్ సుందరం, అమృతా షేర్గిల్ బంధువు -
Mulk Raj Anand: చైతన్య భారతి.. దేశమే రచన.. ముల్క్ రాజ్ ఆనంద్
తొమ్మిదేళ్ల వయసు కలిగిన తన చుట్టాలబ్బాయి ఎందుకు మరణించాడని దేవుణ్ని అడుగుతూ తన 11 ఏళ్ల వయసులో రాసిన లేఖ ఆయన మొట్టమొదటి రచన. సుప్రసిద్ధ నవలా రచయిత చార్ల్స్ డికెన్స్‌ను గుర్తుకు తెస్తున్నావంటూ ప్రశంసలు పొందిన భారతీయ ఆంగ్ల నవలా రచయిత కూడా ఆయనే. ఆయనే ముల్క్‌రాజ్ ఆనంద్. వార్ధాలో మహాత్మాగాంధీ ఆశ్రమంలో కూర్చొని తాను ప్రారంభించిన నవల ‘అన్‌టచబుల్’ ఆఖరి పుటలలో ఆనంద్.. భారతీయుల తత్వాన్ని ఒక కవి పాత్ర ద్వారా ఇలా రాశారు: మాకు జీవితం తెలుసు. దాని రహస్య ప్రవాహం తెలుసు. దాని లయలకు అనుగుణంగా మేం నర్తించాం. దాన్ని మేం ప్రేమించాం. వ్యక్తిగత అనుభూతుల ద్వారా భావావేశాలతో కాదు. హృదయాంతరాల నుంచి వెలుపలికి మా చేతులను చాస్తూ, విశ్వంలోకి వ్యాపిస్తూ ఇప్పటికీ, అవును, ఇప్పటికీ మాకొటే అనిపిస్తుంది. ఆ జీవితానికి హద్దులే లేవని, అపురూపమైన అద్భుతాలు సంభవమనీ’’. ఆనంద్ ఇలా రాయడానికి ఒక ప్రేరణ ఉంది. భారతీయులు తమని తాము పరిపాలించుకోలేని అసమర్థులనే వాదనను బ్రిటిష్ వారు ప్రచారం చేశారు. దానికి స్పందనగా ముల్క్ రాజ్ ఆనంద్ ఈ కవితను రాశారు. ఆయనను ప్రత్యేకంగా నిలిపింది స్వతంత్ర భారత నిర్మాణానికి ఆయన దీర్ఘకాలం పాటు నికరమైన ఆలంబనగా నిలవడం. 1905లో పెషావర్‌లో జన్మించిన ఆనంద్, అమృత్‌సర్‌లోని ఖల్సా కాలేజీలో విద్యనభ్యసించారు. జాతీయవాది అయిన ఆ కళాశాల ప్రధానోపాధ్యాయుడు 1920లలో ఒక ప్రసంగం ఇవ్వడానికి అనీబిసెంట్‌ను తమ కళాశాలకు ఆహ్వానించారు. దాంతో బ్రిటిష్ పాలకులు ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. పోలీసులు ఆయనను నెలపాటు జైల్లో ఉంచారు. 1935లో ఆయన రాసిన అన్‌టచబుల్, 1936లో ఆయన రాసిన కూలీ నవలలు ఆయన ప్రతిష్టను పెంచాయి. ఆయన రాసిన లెటర్స్ ఆఫ్ ఇండియా (1942), అపాలీజ ఫర్ హీరోయిజం (1946) అనే కరపత్రాలు బ్రిటిష్ వారిలో కలకలం కలిగించాయి. ముల్క్‌రాజ్ తన రచనల్లో ప్రధానంగా సాంప్రదాయిక భారతీయ సమాజంలోని పేద ప్రజల జీవిత ఇతవృత్తాలను చిత్రించారు. ఆయన పద్మభూషణ్ పురస్కార గ్రహీత కూడా. – స్నేహల్ షింగవి, టెక్సాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ -
India@75: శతమానం భారతి పచ్చదనం
జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో అడవులది కీలక పాత్ర. ‘చెట్లే మనిషికి గురువులు’ అన్నారు మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. మన దేశంలో ఒక చెట్టును నరికేముందు ఐదు మొక్కలు నాటడం ఆచారంగా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా అతడికి ఆధారం భూమే. గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాల్లో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుంది. ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనే లక్ష్యంతో రూపొందిన పారిస్ వాతావరణ ఒప్పందానికి కట్టుబడి ఉండేందుకు భారత్ కంకణం కట్టుకుంది. 2030 నాటికి వార్షిక ఉద్గారాలను 44 బిలియన్ టన్నులకు పరిమితం చేయగలిగితే ఉష్ణోగ్రత 2 డిగ్రీల కన్నా పెరగకుండా చూసుకోవచ్చు. మనదేశంలో అనేక పవిత్ర నదులు, త్రివేణి సంగమాలు ఉన్నాయి. అలాగే ప్రకృతిని పవిత్రంగా భావించి, ఆరాధించి, గౌరవించే ఈ సంప్రదాయాన్ని ఈనాటి నవీన సమాజంలో మరలా ప్రారంభించాల్సి ఉంది. అందుకే ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్ ’ ద్వారా పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే ‘గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ ద్వారా దేశ యువతకు సరికొత్త ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ప్రేమ, తపన ఉంటే చాలు. పర్యావరణంతో కలిసి జీవించడం మనందరి ప్రాథమిక బాధ్యత. మన జీవన విలువలలో పర్యావరణ పరిరక్షణను ఒక భాగంగా చేసుకుంటే భావితరాలు పచ్చగా ఉంటాయి. చదవండి: శతమానం భారతి: లక్ష్యం 2047 అమృతమూర్తి -
అభ్యుదయ నృత్యకారిణి రుక్మిణీదేవి అరండేల్
రుక్మిణీదేవి అరండేల్ జీవితం సమ్మోహనపరిచేదిగా ఉంటుంది. ఆమె దార్శనికురాలు. దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలు. నాట్యకారిణి. నృత్య దర్శకురాలు. జంతు ప్రేమికురాలు. సంప్రదాయ భారతీయ కళలు, హస్తకళల్ని ప్రోత్సహించిన వ్యక్తి, వక్త. అన్నిటినీ మించి మానవతావాది. మదురైలో సనాతన సంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రుక్మిణీదేవి 16 ఏళ్ల వయసులో తన కన్నా 20 ఏళ్లు పెద్దవాడైన బ్రిటిష్ దివ్యజ్ఞాన సమాజ వర్గీయుడు డాక్టర్ జార్జ్ ఎస్.అరండేల్‌ను పెళ్లి చేసుకుని తన వర్గంలో ప్రకంపనలు సృష్టించారు. ఆమె పై డాక్టర్అనీబిసెంట్, దివ్యజ్ఞాన సమాజ ఉద్యమం, స్వదేశీ ఉద్యమాల ప్రభావం ఉంది. రుక్ష్మిణీదేవి 29 ఏళ్ల వయసులో మైలాపూర్ గౌరి అమ్మ దగ్గర నృత్యం నేర్చుకున్నారు. అనంతరం పండనల్లూర్కు చెందిన గురు మీనాక్షీ సుందరం పిళ్లై వద్ద కూడా నృత్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆమె 31 ఏళ్ల వయసులో దివ్యజ్ఞాన సమాజంలో మొదటిసారి నృత్య ప్రదర్శన ఇచ్చారు. 1936 లో ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్‌ను ప్రారంభించారు. అదే కళాక్షేత్రగా మారింది. శాస్త్రీయ భారతీ నృత్య రూపమైన సాధిర్ను పునరుద్ధరించడంలో (అదే ఇప్పుడు భరతనాట్యం) అరండేల్ రుక్ష్మిణీదేవికి సహాయపడ్డారు. ఇ.కృష్ణయ్యర్ తరువాత సాధిర్కు గౌరవనీయతను తీసుకు వచ్చింది అరండేలే. నృత్య రూపకం విధానం ఆవిర్భావానికి అరండేల్ వైతాళికురాలిగా నిలిచారు. ఆమెలో స్త్రీవాద దృక్పథం లేదా విమోచన పార్శ్యం కూడా ఉండేది. భర్తలు చనిపోయినప్పుడు భార్యలు తల వెంట్రుకలు తీయించుకోవడం పూర్వం ఆచారంగా ఉండేది. రుక్మిణీదేవి తన తండ్రి చనిపోయినప్పుడు తన తల్లికి గుండు గీయించడాన్ని వ్యతిరేకించారు. తన భర్త చనిపోయిన తరువాత కూడా ఆమె తన నుదిటి మీద కుంకుమ పెట్టుకోవడాన్ని యథా ప్రకారం కొనసాగించారు. యువతరానికి, నృత్య చరిత్రకారులకు ఆమె ఒక పరిశీలనాంశం. నిజంగానే ఆమె పునరుజ్జీవనం తీసుకు వచ్చిన మహిళ. దేశాధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఎక్కువ మంది మహిళలకు రాలేదు. వచ్చిన అవకాశాన్ని తిరస్కరించిన వారూ ఎక్కువమంది లేరు. మొరార్జీ దేశాయ్ 1977లో వెండి పళ్లెంలో పెట్టి ఇచ్చినట్లుగా రాష్ట్రపతి పదవిని ఇవ్వజూపినప్పుడు రుక్మిణీదేవి అరండేల్ నిరాకరించారు. రాష్ట్రపతి భవన్లో ఉండటం కన్నా కళాక్షేత్రంలో ఉండడానికే ఆమె ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. – లీలా శామ్సన్, అరండేల్ శిష్యురాలు, కళాక్షేత్ర ఫౌండేషన్ డైరెక్టర్ -
కలం యోధుడు: మున్షీ ప్రేమ్‌చంద్ / 1880–1936
గ్రామీణ భారతావనిని పట్టి పీడిస్తున్న దారిద్య్రం, దళితులను దోపిడీ చేయడం, మూఢ నమ్మకాలు, ధార్మిక క్రతువులు, పితృస్వామ్యం, జమీందారీ విధానం, వలసవాదం, మతతత్వం లాంటి అంశాలను ప్రేమ్‌చంద్ నిర్దాక్షిణ్యంగా బట్టబయలు చేశారు. మున్షీ ప్రేమ్‌చంద్‌గా అందరికీ సుపరిచితులైన ధన్పత్రాయ్ను సామ్యవాద వాస్తవిక రచయితగా పేర్కొనవచ్చు. ప్రేమ్‌చంద్‌ను తరచూ గాంధేయవాది అని పొరపడుతూ ఉంటారు. రచనా జీవితం తొలి రోజుల్లో ఆయన గాంధేయవాద పోకడలు పోయారు. ఏదో మాయ జరిగినట్లుగా దోపిడీదారులందరూ తాము చేస్తున్న నేరాలను మానేసినట్లు ఆయన రాసేవారు. కానీ తరువాతి రచనల్లో ఆయన క్రమంగా సామ్యవాద సిద్ధాంతం వైపు మారారు. మరాఠీ రచయిత టి.టికేకర్తో సంభాషణ జరిపినప్పుడు ప్రేమ్‌చంద్ ఇలా అన్నారు. ‘‘నేను ఓ కమ్యూనిస్టుని. అయితే నా కమ్యూనిజమల్లా రైతులపై దౌర్జన్యం చేసే జమీందార్లను, సేనలనూ, ఇతరులను లేకుండా చేయడం వరకే పరిమితం’’ అని. అలాగే భారత జాతీయోద్యమం పట్ల ప్రేమ్‌చంద్ వైఖరి విమర్శనాత్మకంగా సాగింది. ఆయన దానిని గుడ్డిగా పొగిడేవారు కాదు. తవన్ (1931), ఆహుతి (1930) లాంటి కథానికల్లో జాతీయవాదాన్ని ఆయన ఆకర్షణీయంగా, ప్రేరణాత్మకంగా చిత్రించారు. ఆ తరువాత రంగ్‌భూమి (1925), కర్మభూమి (1932) లాంటి నవలల్లో ఈ సైద్ధాంతిక ‘ముఖతలం వెనుక ఉన్న మలిన’ వాస్తవాన్ని ఆయన బహిర్గతం చేశారు. ప్రముఖ విమర్శకులు సుధీర్ చంద్ర ఈ విషయాలు తెలిపారు. ఆధిపత్య వర్గం నుంచి తమ వర్గ ప్రయోజనాలను ప్రచారం చేసుకోవడం కోసం ఉద్యమాన్ని ఉపయోగించుకోవడాన్ని ప్రేమ్‌చంద్ మున్షీ విమర్శించారు. స్త్రీవాద దృక్కోణం నుంచి ప్రేమ్‌చంద్‌పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఇక వలసవాద భారతదేశంలోని లోబరుచుకొనే శక్తులపై ఆయన కథానికలు తీవ్రంగా దాడి చేస్తే, ఆయన రాసిన ‘గోదాన్’, ‘గబన్’, ‘నిర్మల’ వంటి నవలలు కుండ బద్దలు కొట్టినట్లు ఉంటాయి. సమాజంలోని అన్యాయాలపై ఆయన సూటిగా, నిర్మొహమాటంగా తన రచనల్లో విరుచుకుపడ్డారు. ఆయన రచనల్లో కొన్ని.. ఘాటైన విమర్శలకు గురైనప్పటికీ ఆయనను అనుకరించే రచయితలు పలువురు రంగ ప్రవేశం చేశారు. ఆయన రచనలు పాఠకులకే కాక, సాటి రచయితలకు కూడా ప్రేరణగా నిలిచాయంటే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. – మేఘా అన్వర్, ఢిల్లీ లేడీ శ్రీరామ్ కళాశాలలో బోధకులు