‘ఆజాదీ’ టెలికాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ
ఈ రోజుకో ప్రత్యేక ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దయిన రోజు. 421 ఏళ్ల క్రితం డిసెంబర్ 31 న ఇంగ్లిష్ జాయింట్–స్టాక్ బిజినెస్ కంపెనీగా అవతరించి, తర్వాత బ్రిటిష్ కంపెనీగా రూపాంతరం చెంది, ప్రపంచంలోని అనేక దేశాలతో పాటు భారతదేశానికి కూడా విస్తరించి.. సరిగ్గా నేటికి 148 ఏళ్ల క్రితం 1874లో ఈస్ట్ ఇండియా కంపెనీ బిచాణా ఎత్తేసిన రోజు ఇది. అసలు ఆ కంపెనీ మనవైపు రాకుంటే రెండొందలేళ్లకు పైగా మనం దాస్యంలో, దారిద్య్రంలో ఉండిపోయేవాళ్లం కాదు.
ఈస్ట్ ఇండియా కంపెనీ మన దగ్గర దోచుకున్నంతా దోచుకుని వెళ్లిపోవడానికి 16 ఏళ్ల ముందరే.. పొయ్యిలోంచి పెనంలోకి అన్న చందంగా.. దేశం బ్రిటన్ హస్తగతమైంది. అప్పటి వరకు ఈస్టిండియా కింద ఉన్న ఇండియా ‘బ్రిటిష్ ఇండియా’ అయిపోయింది. అది జరిగిన ఏడాది 1858. ఆ ముందటి ఏడాదే స్వాతంత్య్రం కోసం మన దేశంలో తొలిసారి తిరుగుబాటు జరిగింది.
తిరుగుబాటు యోధుడు మంగళ్‌పాండేను ఈస్టిండియా కంపెనీ అదే యేడాది ఉరితీసింది. తిరుగుబాటులో అతడితో పాటు శిక్షకు గురై మరణించిన వారి ఊపిర్లు.. భారతదేశంలో సమరస్ఫూర్తిని నింపాయి. స్వేచ్ఛా కాంక్షను రగిల్చాయి. నాటి నుంచి దాదాపు తొంభై ఏళ్ల పాటు బ్రిటిష్ వారిపై పోరాడి 1947లో స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నాం.
ఆ స్వాతంత్య్రానికి ఇది 75వ ఏడాది. అమృతోత్సవం. ఈ ఏడాది ఆగస్టు 15 కు మన సమరఫలానికి డెబ్బై ఐదేళ్లు పూర్తవుతాయి. డెబ్బై ఐదేళ్లను ఒక సంకేతంగా డెబ్బై ఐదు వారాల ప్రణాళికతో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం దండి యాత్ర ప్రారంభమైన మార్చి 12న నిరుడు ఉత్సవాలను ప్రారంభించింది. ఈ బృహత్‌జ్వాలా స్ఫూర్తి దీపానికి జత దీపంలా సాక్షి మీడియా గ్రూపు.. ఇవాళ్టి నుంచి వరుసగా 75 రోజుల పాటు ‘జైహింద్’ పేరుతో రోజుకో డిజిటల్ పేజీని ఇలా మీకు అందిస్తోంది.
స్వాతంత్య్ర మహోద్యమంలో జీవితాలను అంకితం చేసిన మహనీయుల ధైర్య, శౌర్య, పరాక్రమ స్మృతులను; అపురూప ఘట్టాలను, ఘటనలను జ్ఞాపకం చేసుకోవడం, నివాళులు అర్పించడం, నవతరానికి స్ఫూర్తిని కలిగించడం ఈ పేజీ ముఖ్యోద్దేశం. 1947 ముందు వరకు జరిగిందేమిటి, మరో 25 ఏళ్లలో 2047 వరకు దేశంలో జరగబోతున్న అభివృద్ధి ఏమిటి అనే ఏకసూత్రత ఆధారంగా ఒక మహోత్సవంగా ఇస్తున్న ఈ స్పెషల్ పేజీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. జైహింద్.
– ఎడిటర్
Comments
Please login to add a commentAdd a comment