![Azadi Ka Amrit Mahotsav Samrajya Bharati 1858 To 1947 - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/2/Azadi-Ka-Amrit-Mahotsav4.jpg.webp?itok=XKcZWJi8)
సామ్రాజ్య భారతి 1858/1947
బ్రిటిష్ వారితో ఝాన్సీకి సమీపంలోని గ్వాలియర్‌లో జరిగిన యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీర మరణం పొందారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ అనే రాజ్యానికి ఆమె రాణి. 1857లో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు.
జననాలు : బిపిన్ చంద్రపాల్, జగదీశ్ చంద్రబోస్, బేగమ్ కైఖుస్రో జహాన్, బాబా సావన్‌సింగ్ జన్మించారు. బిపిన్ స్వాతంత్య్ర సమరయోధులు. జగదీశ్ చంద్రబోస్ ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త. కైఖుస్రో భోపాల్‌కి నవాబ్ బేగమ్. ఆమె 1901 నుంచి 1926 వరకు భోపాల్‌ను పాలించారు. బాబా సావన్‌సింగ్ ఆధ్యాత్మిక సాధువు. ‘ది గ్రేట్ మాస్టర్’గా, ‘బడే మహరాజ్‌జీ’ గా ప్రసిద్ధి. బిపిన్, జగదీశ్ బంగ్లాదేశ్‌లో, బాబా సావన్ పంజాబ్‌లో జన్మించారు.
ఇండియాలో ఈస్టిండియా కంపెనీ పాలన అంతమైనట్లు నవంబర్ 1న బ్రిటిష్ పార్లమెంటు ప్రకటించింది. అప్పటికి మూడు నెలల క్రితమే ‘భారత ప్రభుత్వ చట్టం 1858’ ని అమల్లోకి తెచ్చింది. భారతదేశంలో 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు పర్యవసానంగా బ్రిటన్ ఈ చట్టాన్ని చేసి, ఈస్టిండియా కంపెనీ పాలన స్థానంలో బ్రిటన్ రాణి విక్టోరియా ప్రత్యక్ష పాలనను ప్రవేశపెట్టింది. భారత్‌లో బ్రిటన్ రాణి పాలన మొదలైంది కూడా ఆ ఏడాది నవంబర్ 1వ తేదీనే.
స్వతంత్ర భారతి 1948/2022
జనవరి 30 వ తేదీ సాయంత్రం 5.03 గంటలకు గాంధీజీ దారుణ హత్యకు గురయ్యారు. ఆ రోజు సాయంత్రం ఢిల్లీ లోని బిర్లా హౌస్ నుంచి బయల్దేరి ప్రార్థన సమావేశాన్ని నిర్వహించడానికి ఉద్యానవనం వైపు కదులుతున్నారు. అక్కడ ఆయనకు స్వాగతం చెప్పిన 200 మంది ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల్లో నాథూరామ్ గాడ్సే కూడా ఉన్నాడు. ఆటోమేటిక్ 9 ఎం.ఎం. బెరెట్టా పిస్టల్‌తో దగ్గరి నుంచి మహాత్ముని ఛాతీ మీదకు మూడుసార్లు తూటాలు పేల్చాడు. అంతిమ క్షణంలో గాంధీజీ ‘హే రామ్’ అని ఉచ్చరిస్తూ ఊపిరి వదిలారు. పరాయి పాలనను పారదోలే విషయంలో అత్యంత ఆచరణాత్మకమైన మార్గం కోసం మహాత్ముడు పడిన తపన, ఆయన చేపట్టిన వివిధ ఉద్యమాల స్వరూప స్వభావాలలోనూ ప్రతిఫలించడం విశేషం.
గాంధీజీ హత్య
గాంధీజీ మరణం జాతిని దిగ్భ్రాంతికి గురిచేసింది. మహాత్ముడికి మరణం అనేది ఉంటుందా? మానవాళి గాంధీమార్గంలో నడుస్తున్నంత కాలం ఏ తరంలోనైనా మహాత్ముడు జీవించి ఉన్నట్లే.
Comments
Please login to add a commentAdd a comment