లోకమాన్య బాలగంగాధర్ తిలక్, గోపాల కృష్ణ గోఖలేలను గాంధీజీ గురుతుల్యులుగా భావించేవారు. అంతటి గురుతుల్యులకే గురుపాదుడుగా సంభావించిన మేధావి దాదాభాయ్ నౌరోజీ! ఏమిటి ఆయనలోని ప్రత్యేకత? విజ్ఞతా, మరేదైనా విలక్షణతా?
‘‘పిల్లలు తమ తండ్రి వైపు ఆశగా చూసినట్లుగా భారతీయులు మీ వంక చూస్తున్నారు; అదీ ఇక్కడ నెలకొని వున్న మనోభావ’’మన్నారట గాంధీజీ, దాదాభాయ్ నౌరోజీకి ఓ లేఖ రాస్తూ. లోకమాన్య బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలేలను గాంధీజీ గురుతుల్యులుగా భావించేవారని మనకు తెలుసు. వారిద్దరూ గురుపాదుడుగా సంభావించిన మేధావి దాదాభాయ్ నౌరోజీ! ‘‘ఘనమైన భారతీయ వృద్ధుడు’’గానూ, ‘‘అనధికార భారతీయ రాయబారి’’గానూ ఖండఖండాంతరాల్లో ప్రసిద్ధుడయ్యాడు నౌరోజీ. అల్పసంఖ్యాక వర్గమయిన పార్సీ (జొరాస్ట్రియన్) మతానికి చెందిన నౌరోజీ, విశాల విస్తృత జాతీయ ప్రయోజనాలను తీర్చగల రాజకీయ వేదిక రూపుదిద్దుకోవడానికీ, అనేక అంతర్జాతీయ వేదికలపై భారత జాతీయ ప్రయోజనాలను ధ్వనింపచెయ్యడానికీ కారకులు కావడం ఓ విశేషం. ప్రపంచం గుర్తించిన గొప్ప వక్తల్లో నౌరోజీ ఒకరు.
అరుదైన వ్యక్తిత్వం!
చారిత్రక నేపథ్యంలో భారతదేశ స్థితిగతులను విశ్లేషిస్తూ బ్రిటిష్ పార్లమెంటుతో సహా ఎన్నో వేదికలపై ప్రసంగించినవాడు. ఆర్థిక రాజకీయ సిద్ధాంతాలను సవిమర్శకంగా వివరించి, స్వతంత్రంగా కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదించినవాడు. ఐరిష్ హోంరూల్ ఉద్యమం లాంటి అంతర్జాతీయ స్వభావం కలిగిన ప్రాంతీయ ఉద్యమాలను గుర్తించి వాటికి మద్దతు ప్రకటించినవాడు. ఫ్రీమ్యాసన్ తత్వం మొదలుకుని పత్రికా నిర్వహణలో విలువల వరకూ ప్రతి ఒక్క ప్రమాణాన్నీ నిష్టగా పాటించినవాడు. చదువుకున్నది గణితం–తత్వశాస్త్రం అయినప్పటికీ, బ్రిటిష్ విద్యార్థులకు గుజరాతీ భాషాసాహిత్యాలను బోధించేందుకు వెనకాడనివాడు. కేవలం మూడు సంవత్సరాలే బ్రిటిష్ పార్లమెంట్‌లో సభ్యుడిగా వున్నప్పటికీ, ఉత్తమ పార్లమెంటరీ సంప్రదాయాలు పాటించిన ‘పెద్దమనిషి’ దాదాభాయ్ నౌరోజీ. ఇవి ఆయన వ్యక్తిత్వంలో ప్ర«ధానమైన లక్షణాలు మాత్రమే!
ఆర్థిక జాతీయవాది!
ఆర్థిక జాతీయవాదాన్నీ, రాజకీయ జాతీయవాదాన్నీ పొందికగా మేళవించినవాడిగా దాదాభాయ్ నౌరోజీని లోకం ప్రశంసించింది. స్వయంగా పత్తి వర్తకుడయిన నౌరోజీ, వర్తకవాణిజ్య వర్గాల ప్రయోజనాల గురించి ప్రముఖంగా ప్రస్తావించడం సహజం. పందొమ్మిదో శతాబ్దిలోనే షేర్ మార్కెట్ మర్మాలు తెలుసుకుని అందుకు తగిన రీతిలో తమ వాణిజ్య నైపుణ్యాన్ని దిద్దితీర్చుకున్న పార్సీ వర్తకులు కొందరున్నారు. కామాలూ, టాటాలూ, మెహ్తాలూ, గోద్రెజ్‌లూ, వాడియాలూ అప్పుడూ ఇప్పుడూ కూడా పెద్ద ఎత్తున జాతీయ–అంతర్జాతీయ మార్కెట్లలో ప్రముఖ పాత్ర వహించారు.
పత్తి – ఇనుము – ఉక్కు మొదలుకుని ఐటీ వరకూ వాళ్ళు ప్రభావితం చెయ్యని వర్తక వాణిజ్య పరిశ్రమలు లేవంటే అతిశయోక్తి కాదు. అయితే వాళ్ళకీ, నౌరోజీకీ ఓ ప్రధానమయిన తేడా వుంది! జాతీయ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో ఏయే శక్తు్తలు ఏ పాత్ర వహిస్తున్నాయో వాళ్ళలో ఎవ్వరూ విశ్లేషించి సిద్ధాంతీకరించలేదు! దాదాభాయ్ నౌరోజీ ఒక్కరే ఆ పని చేశారు! అలా చెయ్యడంలో ఇమిడివున్న ప్రమాదాన్ని మనం నౌరోజీకి వివరించాల్సిన అవసరం లేదు. పార్సీలకు వాణిజ్య ప్రయోజనాలను ఇతరులు నేర్పాల్సిన పని లేదు కదా! ఇక్కడే, నౌరోజీ వ్యక్తిత్వంలోని విశేషాంశ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. భారతీయ పెట్టుబడిదారుల వర్గ ప్రయోజనంతో పాటు, పరాధీనమయివున్న భారత జాతి ప్రయోజనాల గురించి కూడా పట్టించుకోవడమే నౌరోజీ వ్యక్తిత్వంలోని విశేషాంశ.
నౌరోజీ, ఓ చరిత్రాత్మ!
తన సొంత వాణిజ్య ప్రయోజనాన్ని మించిన వర్గ ప్రయోజనాన్ని, జాతీయ ప్రయోజనాన్ని గుర్తించి, అందుకు తగిన రీతిలో స్పందించడంతో దాదాభాయ్ నౌరోజీ ఆగిపోలేదు! బ్రిటిష్ వలసవాదం నిజస్వరూపాన్ని బట్టబయలు చేశారాయన. భారతీయులు బ్రిటిష్ సర్కారుకు కట్టే పన్నులను నౌరోజీ ‘కప్పం’గా అభివర్ణించేవారు. నిరుపేద భారతీయులు నిష్కారణంగా బ్రిటిష్ సర్కారుకు ‘కప్పం’ కడుతున్నారనీ, పాలితుల ప్రయోజనాల పట్ల బ్రిటిష్ సర్కారుకు కనీసమైన లక్ష్యం కూడా లేదనీ రాజకీయ విమర్శలు గుప్పించి ఊరుకోలేదు నౌరోజీ. తన ఆరోపణలు రుజువు చేసే క్రమంలో లోతయిన విశ్లేషణతో కూడిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించేంత వరకూ నౌరోజీ విశ్రమించలేదు.
– మందలపర్తి కిషోర్
(చదవండి: లక్ష్యం ఒక్కటే దారులు వేరు)
Comments
Please login to add a commentAdd a comment