జాతీయోద్యమంలో గాంధీ శకం మొదలయ్యాక ఉద్యమ కార్యాచరణకు కేంద్రస్థానం సబర్మతి ఆశ్రమం అయింది. తెలుగు జాతీయోద్యమకారుడు, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని నిరాహారదీక్ష చేసి అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములు సబర్మతి ఆశ్రమంలో చాలాకాలం ఉన్నారు. అలా ఉన్న కొంతమంది ఉద్ధండులను వారి వారి ప్రదేశాలకు వెళ్లి సామాన్యుల్లో సైతం చైతన్యవంతం చేయవలసిందిగా సూచించారు గాంధీజీ. ఆయన సూచనలను చిత్తశుద్ధితో అనుసరించేవారిలో పొట్టి శ్రీరాములు కూడా ఉన్నారు. అంతటి శ్రీరాములును దగ్గరగా చూడడం, ఆయనతో కలిసి నడవటం వల్ల జాతీయస్ఫూర్తిని పెంపొందించుకుని ఉద్యమాల్లో పాల్గొన్న ఓ కుర్రాడు కోన వెంకట చలమయ్య! ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆ ‘కుర్రాడు’ సాక్షి తో పంచుకున్న కొన్ని జ్ఞాపకాలివి.
మా ఇంట్లో ఉండేవారు
‘‘మాది తిరుపతి (ఉమ్మడి చిత్తూరు) జిల్లా వాయల్పాడు. నెల్లూరులో మా మేనమామ దేవత చెంచు రాఘవయ్య దగ్గర పెరిగాను. మా మామ లాయరు. ఆయనకు పొట్టి శ్రీరాములు గారికి మంచి స్నేహం ఉండేది. అలా శ్రీరాములు గారు నెల్లూరులో మా ఇంట్లో ఉండేవారు. గాంధీజీ ఆదేశంపై జాతీయోద్యమాన్ని వాడవాడలా విస్తరింపచేయడానికి శ్రీరాములు గారు సబర్మతి నుంచి వచ్చిన సందర్భం అది. నాకు వారితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.
వారితో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఆ స్ఫూర్తితో విదేశీ వస్త్ర బహిష్కరణలో.. నెల్లూరు పట్టణంలో జొన్నలగడ్డ వారి వీథి, అత్తి తోట అగ్రహారంలో ఇళ్లకు వెళ్లి విదేశీ వస్త్రాలను సేకరించి మంటల్లో వేశాను. ‘‘బ్రిటిష్ వారి పరిపాలనను మనం అంగీకరించడం లేదనే విషయాన్ని వాళ్లకు తెలిసేలా చేయాలంటే ఇదే మంచి మార్గం’’ అని మహిళలకు చెప్పేవాళ్లం. వాళ్లు వెంటనే లోపలికి వెళ్లి.. ఇంట్లో ఉన్న ఫారిన్ చీరలు, చొక్కాలు, పంచెలు అన్నింటినీ బయటవేసే వాళ్లు. అప్పట్లో మద్రాసులో పొత్తూరి అయ్యన్న శెట్టి అనే వ్యాపారి విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ ఉద్యమంలో పాల్గొనలేదు. విదేశీ వ్యాపారంతోపాటు, ఆ దుస్తులు చాలా ఖరీదైనవి ధరించేవారు.
సాటి వైశ్యులు ఆయనను కుల బహిష్కరణ చేశారు. జాతీయత భావన అంత తీవ్రంగా ఉండేది. అప్పుడు అలా మొదలైన ఖాదీ వస్త్రధారణను నేను వదల్లేదు. మాకు ఖాదీ మీద ఎంత ఇష్టం ఉండేదంటే నేను ఒక దుకాణంలో నెలకు యాభై రూపాయలకు పని చేస్తూన్న రోజుల్లో పండుగకు నూట యాభై రూపాయలు పెట్టి పట్టు ఖాదీ దుస్తులు కొనుక్కుని అపురూపంగా దాచుకుని ముఖ్యమైన రోజుల్లో ధరించేవాడిని. అప్పట్లో చొక్కా గుండీలు కూడా ఖాదీవే. నూలుతో బఠాణీ గింజ సైజులో అల్లేవారు.
ఎడ్ల బాధ చూడలేక
నేను గాంధీజీని దగ్గరగా చూసిన సందర్భాలు రెండు మూడు ఉన్నాయి. ఒకసారి నెల్లూరులో రైలు దిగి పల్లిపాడులోని గాంధీ ఆశ్రమానికి ఎడ్ల బండి మీద వస్తున్నారు. పెన్నా నదిలో నీళ్లు లేవు, ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు నది మధ్య ఇసుకలో బండిని లాగడానికి ఎడ్లు ఇబ్బంది పడుతున్నాయి. గాంధీజీ ఆ సంగతి గమనించిన వెంటనే ఇక బండిలో ఉండలేకపోయారు. వెంటనే బండి దిగి నడక మొదలు పెట్టారు. మరో సందర్భంలో నాయుడు పేటలో ఒక సభలో ఆయన ప్రసంగం విన్నాను. మెరీనా బీచ్ సంఘటన చాలా ముఖ్యమైనది.
గాంధీజీ ప్రసంగం వినడానికి జనం పోటెత్తారు. ఆ జనంలో దూరంగా ‘హరిజనులకు ఆలయ ప్రవేశం’ అని రాసి ఉన్న ఒక ప్లకార్డు కనిపించింది. ఆ ప్లకార్డు పట్టుకున్నవారు పొట్టి శ్రీరాములు. ఆయన్ని వేదిక మీదకు పిలిచి సభకు పరిచయం చేస్తూ ‘శ్రీరాములు వంటి ఏడుగురు సైనికుల్లాంటి దేశభక్తులు నా దగ్గర ఉంటే, మనదేశానికి ఎప్పుడో స్వాతంత్య్రం వచ్చి ఉండేది’ అన్నారు గాంధీజీ. ఆయన అన్న ఆ మాట ఆ తర్వాత చాలా ప్రభావాన్ని చూపించింది. అప్పట్లో ఉద్యమ సమాచారం అంతా ఉత్తరాల ద్వారానే జరిగేది. శ్రీరాములు గారికి గాంధీజీ స్వహస్తాలతో రాసిన ఉత్తరం నా దగ్గర ఇప్పటికీ ఉంది.
లాఠీ దెబ్బలే దెబ్బలు
మా సమావేశాలు ఎక్కువగా తిప్పరాజు వారి సత్రంలో జరిగేవి. పెద్ద నాయకుల నుంచి ఉత్తరాల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక నాయకులు ఒక్కో ఉద్యమాన్ని ఎలా నిర్వహించాలనే వివరాలను ఆ సమావేశాల్లో చెప్పేవారు. వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో నేను పోలీసులకు దొరకలేదు, కానీ సహాయ నిరాకరణోద్యమంలో లాఠీ దెబ్బలు బాగా తిన్నాను. ఆందోళనలు ఒకరోజుతో పూర్తయ్యేవి కాదు, పట్టణంలో ఒక్కోరోజు ఒక్కోచోట. నగరంలో ఎక్కడ జరుగుతున్నా సరే.. వెళ్లి నినాదాలివ్వడం, దెబ్బలు తినడమే.
మాలో కొంతమందిని జైల్లో పెట్టారు. అప్పుడు నన్ను చూసి ‘చిన్నవాడు’ అని వదిలేశారు. అనేకానేక ఉద్యమాల తర్వాత పోరాటం ఇంకా తీవ్రమయ్యేదే తప్ప శాంతించే పరిస్థితి లేదనే నిర్ధారణకు వచ్చేశారు బ్రిటిష్ వాళ్లు. మనకు స్వాతంత్య్రం వచ్చేస్తోందని మా పెద్దవాళ్లు చెప్పారు.
నెల్లూరు పట్టణ వీథుల్లో లైట్లు, రంగురంగులుగా కాగితాలతో కోలాహ లంగా ఉంది వాతావరణం. మేమంతా ఆనం దంతో గంతులు వేశాం. స్వాతంత్య్రం ప్రకటిం చారనే వార్త వినడం కోసం నిద్రను ఆపుకుంటూ ఎదురు చూశాం’’ అని చెప్పారు స్వాతంత్య్ర సమర యోధులు కె.వి. చలమయ్య.
– ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment