Potti Sri Ramulu
-
ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంగా ప్రజలకు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణార్పణ చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు. ఆయన అంకితభావం రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది’ అని పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. On Andhra Pradesh Formation Day, my warm greetings to the resilient and talented people of this remarkable state. Remembering the immense sacrifice of ‘Amarajeevi’ Potti Sriramulu Garu, whose dedication paved the way for the state’s formation. May Andhra Pradesh continue to…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 1, 2024 -
హరిజనాభ్యుదయానికి నిరాహార దీక్ష
ఇక్కడ కనబడే ఫోటో గమనించారా? ఆంధ్ర రాష్ట్రం సాధించడానికి మొదలు పెట్టిన దీక్ష ముందు రోజు అంటే 1952 అక్టోబరు 18న మదరాసులో తీసిన ఫోటో ఇది! కుర్చీలో కూర్చున్న ఆ వ్యక్తి 52 ఏళ్ళ పొట్టి శ్రీరాములు. ఈ ఫొటో దాదాపు మనందరికీ పరిచయం కానిదే! ఇదే విధంగా ఆ మహానుభావుడి గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయనిపిస్తుంది. ఉత్తర భారత దేశంలో హిందూ–ముస్లిం మతపరమైన విభేదాలే అతి పెద్ద సమస్య అని ఆ తరం మహానాయకులంతా భావించారు. అయితే దక్షిణ భారతదేశంలో అంటరానితనంతో దాపురించిన అట్టడుగు వర్గాల అధ్వాన్న స్థితి చాలా పెద్ద అవరోధమనీ, ఆ సమస్య గురించి ఆలోచించాలనీ నాలుగుసార్లు నిరాహారదీక్షలు చేసినవారు అమరజీవి పొట్టి శ్రీరాములు! బ్రిటిష్ పాలనలో 1946 మార్చి 7వ తేదీన పది రోజులపాటు నెల్లూరు మూలాపేట వేణు గోపాల స్వామి గుడిలో నిరాహారదీక్ష చేసి హరిజన ప్రవే శాన్ని సాధించారు. అటు సింహాచలం నుంచి ఇటు తిరు మల దాకా తెలుగు ప్రాంతాలలోనే కాక; మదరాసు ప్రెసి డెన్సీలోని తమిళ, కన్నడ ప్రాంతపు దేవాలయాలన్నింటిలోనూ హరిజనులకు ప్రవేశం కల్గించే బిల్లును ఆమో దింపచేయడానికి అదే 1946 నవంబర్ 25 నుంచి 19 రోజులపాటు నిరాహారదీక్ష చేసి విజయం సాధించారు. నిజానికి 1944 అక్టోబరు 2 గాంధీజీ 75వ జన్మ దినోత్సవ సందర్భంగా అస్పృశ్యతకు వ్యతిరేకంగా కావ లిలో వివిధ కార్యక్రమాలు ప్రారంభించారు. దానికి ముందు శ్రీరాములు సబర్మతీ ఆశ్రమంలో మూడు సంవత్స రాలుండి నూరుపాళ్ళు గాంధేయవాదిగా మారారు. మేన మామ, తన భార్య సీతమ్మ తండ్రి అయిన గునుపాటి నర్సయ్య తీవ్ర అనారోగ్యానికి లోను కావడంతో, 1937 నుంచి నెల్లూరు జిల్లాతోపాటు ఇతర తెలుగు ప్రాంతాలు పొట్టి శ్రీరాములుకు కార్యక్షేత్రాల య్యాయి. హరిజనులకు దేవా లయ ప్రవేశంతో అన్ని సమ స్యలు తీరవని ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధం. జైళ్ళ సంస్కరణలు, వివాహ సంప్ర దాయాలలో మార్పులు వంటి వాటికి సంబంధించి కృషి చేస్తూ వచ్చారు. తన స్ఫూర్తిదాత గాంధీజీ మరణించడంతో కలత చెందిన శ్రీరాములు, ఆయన స్మృతి కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఆ ప్రతిపాదనలను ఉమ్మడి మదరాసు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దానితో ఏడు న్నర దశాబ్దాల క్రితం అంటే 1948 సెప్టెంబర్ 10న మద రాసులో అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట శ్రీరాములు నిరాహారదీక్ష ప్రారంభించారు. మన సమాజానికి చాలా కీలకమైన తేదీగా సెప్టెంబర్ 10ని గుర్తు పెట్టుకోవాలి. స్వాతంత్య్రం సంపాదించుకున్న భారతదేశంలో పొట్టి శ్రీరాములు చేసిన తొలి దీక్ష కూడా ఇది. హరిజనుల అభ్యున్నతి కోసం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మొదలైన ఈ దీక్ష ఫలితంగా న్యూసెన్స్ యాక్ట్ కింద మదరాసులోనే శ్రీరాములు నెలరోజుల శిక్ష మీద జైలు పాలయ్యారు. జైల్లో కూడా అలాగే దీక్ష కొనసాగించారు. జైలులో రక్తాన్ని కక్కుకునే పరిస్థితి కూడా దాపురించింది. అలాంటి స్థితిలో విడుదలైతే మరల దీక్షకు పూనుకోకుండా తనను వికలాంగుణ్ణి చేయాలని ప్రభుత్వం యత్ని స్తున్నట్టు పొట్టి శ్రీరాములు (1948 సెప్టెంబర్ 29 ఆయనే రాసిన ఉత్తరంలో) భావించారు. దాంతో ఆయన అర్ధంతరంగా దీక్షను ఆపివేసినపుడు జైలు నుంచి విడుదల చేశారు. తన లక్ష్య సాధన కోసం దీక్షా రంగస్థలాన్ని వార్ధా ఆశ్రమానికి మార్పు చేసి, 1949 జనవరి 12 నుంచి మళ్ళీ ప్రారంభించారు. ఈ నాలుగో సత్యాగ్రహ దీక్ష 28 రోజుల పాటు చేసి ఉమ్మడి మద రాసు ప్రభుత్వంతో ప్రతి నెల 30వ తేదీ (ఫిబ్రవరి నెల అయితే 28 లేదా 29) ‘హరిజన సేవా దినోత్సవం’గా జరిపేలా చట్టం చేయించి, అట్టడుగు వర్గాల అభ్యున్నతిని వాంఛించారు. ఆ చట్టమయితే వచ్చింది కానీ ఫలితం మాత్రం హుళక్కి! డా‘‘ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి మొబైల్: 94407 32392 -
వేముల ప్రభాకర్‌కు కీర్తి పురస్కారం
జగిత్యాల: పట్టణానికి చెందిన ప్రముఖ కవి రచయిత వేముల ప్రభాకర్‌కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. వేముల ప్రభాకర్ శ్రీవరకవి భూమాగౌడుశ్రీ నవల రచనకు గాను కీర్తి పురస్కారం ప్రకటించగా ఈనెల 28న అందుకోనున్నారు. ఇప్పటివరకు మూడు నవలలు, ఒక కథ సంపుటి, ఆరు కవిత సంపుటిలు, స్వీయరచనతో పాటు రెండు సాహితీ గ్రంథాలు, ఒక మాసపత్రిక వారి సంపాదకత్వంలో వెలువడ్డాయి. ఈ సందర్భంగా వేముల ప్రభాకర్‌ను సాహితీవేత్తలు, విద్యావేత్తలు, రచయితలు అభినందించారు. -
పొట్టి శ్రీరాములు జయంతి.. నివాళులు అర్పించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి పాల్గొన్నారు. -
చిన్నవాణ్ణని వదిలేశారు
జాతీయోద్యమంలో గాంధీ శకం మొదలయ్యాక ఉద్యమ కార్యాచరణకు కేంద్రస్థానం సబర్మతి ఆశ్రమం అయింది. తెలుగు జాతీయోద్యమకారుడు, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని నిరాహారదీక్ష చేసి అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములు సబర్మతి ఆశ్రమంలో చాలాకాలం ఉన్నారు. అలా ఉన్న కొంతమంది ఉద్ధండులను వారి వారి ప్రదేశాలకు వెళ్లి సామాన్యుల్లో సైతం చైతన్యవంతం చేయవలసిందిగా సూచించారు గాంధీజీ. ఆయన సూచనలను చిత్తశుద్ధితో అనుసరించేవారిలో పొట్టి శ్రీరాములు కూడా ఉన్నారు. అంతటి శ్రీరాములును దగ్గరగా చూడడం, ఆయనతో కలిసి నడవటం వల్ల జాతీయస్ఫూర్తిని పెంపొందించుకుని ఉద్యమాల్లో పాల్గొన్న ఓ కుర్రాడు కోన వెంకట చలమయ్య! ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆ ‘కుర్రాడు’ సాక్షి తో పంచుకున్న కొన్ని జ్ఞాపకాలివి. మా ఇంట్లో ఉండేవారు ‘‘మాది తిరుపతి (ఉమ్మడి చిత్తూరు) జిల్లా వాయల్పాడు. నెల్లూరులో మా మేనమామ దేవత చెంచు రాఘవయ్య దగ్గర పెరిగాను. మా మామ లాయరు. ఆయనకు పొట్టి శ్రీరాములు గారికి మంచి స్నేహం ఉండేది. అలా శ్రీరాములు గారు నెల్లూరులో మా ఇంట్లో ఉండేవారు. గాంధీజీ ఆదేశంపై జాతీయోద్యమాన్ని వాడవాడలా విస్తరింపచేయడానికి శ్రీరాములు గారు సబర్మతి నుంచి వచ్చిన సందర్భం అది. నాకు వారితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వారితో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఆ స్ఫూర్తితో విదేశీ వస్త్ర బహిష్కరణలో.. నెల్లూరు పట్టణంలో జొన్నలగడ్డ వారి వీథి, అత్తి తోట అగ్రహారంలో ఇళ్లకు వెళ్లి విదేశీ వస్త్రాలను సేకరించి మంటల్లో వేశాను. ‘‘బ్రిటిష్ వారి పరిపాలనను మనం అంగీకరించడం లేదనే విషయాన్ని వాళ్లకు తెలిసేలా చేయాలంటే ఇదే మంచి మార్గం’’ అని మహిళలకు చెప్పేవాళ్లం. వాళ్లు వెంటనే లోపలికి వెళ్లి.. ఇంట్లో ఉన్న ఫారిన్ చీరలు, చొక్కాలు, పంచెలు అన్నింటినీ బయటవేసే వాళ్లు. అప్పట్లో మద్రాసులో పొత్తూరి అయ్యన్న శెట్టి అనే వ్యాపారి విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ ఉద్యమంలో పాల్గొనలేదు. విదేశీ వ్యాపారంతోపాటు, ఆ దుస్తులు చాలా ఖరీదైనవి ధరించేవారు. సాటి వైశ్యులు ఆయనను కుల బహిష్కరణ చేశారు. జాతీయత భావన అంత తీవ్రంగా ఉండేది. అప్పుడు అలా మొదలైన ఖాదీ వస్త్రధారణను నేను వదల్లేదు. మాకు ఖాదీ మీద ఎంత ఇష్టం ఉండేదంటే నేను ఒక దుకాణంలో నెలకు యాభై రూపాయలకు పని చేస్తూన్న రోజుల్లో పండుగకు నూట యాభై రూపాయలు పెట్టి పట్టు ఖాదీ దుస్తులు కొనుక్కుని అపురూపంగా దాచుకుని ముఖ్యమైన రోజుల్లో ధరించేవాడిని. అప్పట్లో చొక్కా గుండీలు కూడా ఖాదీవే. నూలుతో బఠాణీ గింజ సైజులో అల్లేవారు. ఎడ్ల బాధ చూడలేక నేను గాంధీజీని దగ్గరగా చూసిన సందర్భాలు రెండు మూడు ఉన్నాయి. ఒకసారి నెల్లూరులో రైలు దిగి పల్లిపాడులోని గాంధీ ఆశ్రమానికి ఎడ్ల బండి మీద వస్తున్నారు. పెన్నా నదిలో నీళ్లు లేవు, ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు నది మధ్య ఇసుకలో బండిని లాగడానికి ఎడ్లు ఇబ్బంది పడుతున్నాయి. గాంధీజీ ఆ సంగతి గమనించిన వెంటనే ఇక బండిలో ఉండలేకపోయారు. వెంటనే బండి దిగి నడక మొదలు పెట్టారు. మరో సందర్భంలో నాయుడు పేటలో ఒక సభలో ఆయన ప్రసంగం విన్నాను. మెరీనా బీచ్ సంఘటన చాలా ముఖ్యమైనది. గాంధీజీ ప్రసంగం వినడానికి జనం పోటెత్తారు. ఆ జనంలో దూరంగా ‘హరిజనులకు ఆలయ ప్రవేశం’ అని రాసి ఉన్న ఒక ప్లకార్డు కనిపించింది. ఆ ప్లకార్డు పట్టుకున్నవారు పొట్టి శ్రీరాములు. ఆయన్ని వేదిక మీదకు పిలిచి సభకు పరిచయం చేస్తూ ‘శ్రీరాములు వంటి ఏడుగురు సైనికుల్లాంటి దేశభక్తులు నా దగ్గర ఉంటే, మనదేశానికి ఎప్పుడో స్వాతంత్య్రం వచ్చి ఉండేది’ అన్నారు గాంధీజీ. ఆయన అన్న ఆ మాట ఆ తర్వాత చాలా ప్రభావాన్ని చూపించింది. అప్పట్లో ఉద్యమ సమాచారం అంతా ఉత్తరాల ద్వారానే జరిగేది. శ్రీరాములు గారికి గాంధీజీ స్వహస్తాలతో రాసిన ఉత్తరం నా దగ్గర ఇప్పటికీ ఉంది. లాఠీ దెబ్బలే దెబ్బలు మా సమావేశాలు ఎక్కువగా తిప్పరాజు వారి సత్రంలో జరిగేవి. పెద్ద నాయకుల నుంచి ఉత్తరాల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక నాయకులు ఒక్కో ఉద్యమాన్ని ఎలా నిర్వహించాలనే వివరాలను ఆ సమావేశాల్లో చెప్పేవారు. వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో నేను పోలీసులకు దొరకలేదు, కానీ సహాయ నిరాకరణోద్యమంలో లాఠీ దెబ్బలు బాగా తిన్నాను. ఆందోళనలు ఒకరోజుతో పూర్తయ్యేవి కాదు, పట్టణంలో ఒక్కోరోజు ఒక్కోచోట. నగరంలో ఎక్కడ జరుగుతున్నా సరే.. వెళ్లి నినాదాలివ్వడం, దెబ్బలు తినడమే. మాలో కొంతమందిని జైల్లో పెట్టారు. అప్పుడు నన్ను చూసి ‘చిన్నవాడు’ అని వదిలేశారు. అనేకానేక ఉద్యమాల తర్వాత పోరాటం ఇంకా తీవ్రమయ్యేదే తప్ప శాంతించే పరిస్థితి లేదనే నిర్ధారణకు వచ్చేశారు బ్రిటిష్ వాళ్లు. మనకు స్వాతంత్య్రం వచ్చేస్తోందని మా పెద్దవాళ్లు చెప్పారు. నెల్లూరు పట్టణ వీథుల్లో లైట్లు, రంగురంగులుగా కాగితాలతో కోలాహ లంగా ఉంది వాతావరణం. మేమంతా ఆనం దంతో గంతులు వేశాం. స్వాతంత్య్రం ప్రకటిం చారనే వార్త వినడం కోసం నిద్రను ఆపుకుంటూ ఎదురు చూశాం’’ అని చెప్పారు స్వాతంత్య్ర సమర యోధులు కె.వి. చలమయ్య. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు (1901 మార్చి 16 – 1952 డిసెంబరు 15). మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు. గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేదని అంటారు. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవారని అంటారు. 1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రావిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాతంత్య్రం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టి ఆ స్వాతంత్య్రోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా ఆయన వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశారు. అయితే 1952లో శ్రీరాములు దీక్ష మాన్పించడానికి గాంధీజీ జీవించి లేరు. జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, శ్రీరాములు హరిజనోద్ధరణకు పాటు పడ్డారు. దీని గురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను చూసి పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణ త్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యారు. -
పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. బుధవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్.. పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదే విధంగా భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఓటీఎస్‌తో పేదలకు రూ.16 వేల కోట్ల లబ్ధి -
15న పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం
సాక్షి, అమరావతి: ఈ నెల 15న రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని వేడుకలను రాష్ట్రమంతటా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం ఆదేశాలు జారీచేసింది. డిసెంబరు 15 ఆదివారం సెలవురోజు కావడంతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ముందస్తుగా ఆదేశాలు జారీ చేసింది. -
రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, టీడీపీలదే
మార్కాపురం టౌన్, న్యూస్‌లైన్ : అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగఫలంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలదేనని వైఎస్ఆర్ సీపీ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ దామసాని క్రాంతికుమార్ విమర్శించారు. స్థానిక బొగ్గరపు శేషయ్య నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పొట్టిశ్రీరాములు ఆశయాలకు తూట్లు పొడుస్తూ కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించారని మండిపడ్డారు. చంద్రబాబు, కిరణ్ పాలనలో ఆర్యవైశ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. పన్నులు పెరిగి నష్టపోయారని తెలిపారు. వైఎస్ఆర్ హయాంలో వైశ్యుల సంక్షేమానికి పెద్దపీట వేశారని వివరించారు. ప్రస్తుతం అధికారం కోసం అమలు సాధ్యంకాని హామీలిస్తూ చంద్రబాబునాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ పథకాల అమలుకు, ఆశయాల సాధనకు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ వాణిజ్య విభాగం మార్కాపురం పట్టణ అధ్యక్షునిగా బొగ్గరపు శేషయ్య, ప్రధాన కార్యదర్శిగా రెంటచింతల మధులను నియమించారు. ముందుగా స్థానిక ఆర్యవైశ్యులంతా కలిసి క్రాంతికుమార్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మార్కాపురం మున్సిపాలిటీలోని 17, 20, 23 వార్డుల వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు బుశ్శెట్టి నాగేశ్వరరావు, ఇమ్మడిశెట్టి సుబ్రహ్మణ్యం, చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, పార్టీ మండల కన్వీనర్ గాయం కొండారెడ్డి, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. -
ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం
న్యూస్‌లైన్ నెట్వర్క్ : సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమ కెరటం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ప్రదర్శనలు పదునెక్కుతున్నాయి. నిరసనలు మిన్నంటుతున్నాయి. ఎక్కడ చూసినా రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు, వినూత్న రీతిలో వేషధారణలు దర్శనమిస్తున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఏకైక నినాదంతో తొమ్మిదో రోజున కూడా పోరు కొనసాగించారు. ఈ ఆందోళనలు అన్ని వర్గాలనూ కదిలిస్తున్నాయి. జేఏసీలుగా ఏర్పాటయ్యేందుకు ఒకొక్కరుగా ముందుకు వస్తూ ఉద్యమంలో క్రియాశీలురవుతున్నారు. సమైక్య పోరులో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న నేతలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. సీమాంధ్ర జిల్లాల్లో గురువారం నాటి ఉద్యమ ఘట్టాలివి.. విశాఖలో మహిళా ఉద్యోగులకు పసుపు, కుంకుమ, జాకెట్ అందించి, వాటిని మంత్రులకు పంపించాలని సమైక్యాంధ్ర విద్యార్ధి జేఏసీ ఆందోళన నిర్వహించింది. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకుంటే వాళ్ల ఇళ్లలోనే వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. అగనంపూడిలో వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన 48గంటల దీక్ష రెండోరోజూ కొనసాగింది. గురువారం వైఎస్సార్సీపీ నేతలు కొణ తాల రామకృష్ణ, గండి బాబ్జీ, తిప్పల నాగిరెడ్డి ఉద్యమకారులకు సంఘీభావం ప్రకటించారు. సుప్రీంలో పిల్ వేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 12న జరగాల్సిన సింహగర్జన 14కు వాయిదా పడింది. కేంద్రమంత్రి పళ్లంరాజు ఇల్లు ముట్టడి తూర్పుగోదావరి జిల్లాలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 13 జిల్లాల ఉపాధధి హామీ అసిస్టెంట్ల సంఘాలు రాజమండ్రిలో సమావేశమై ఉద్యమ కార్యాచరణను రూపొందించుకున్నాయి. చెవిటి, మూగ పాఠశాల విద్యార్థులు పొట్టి శ్రీరాములు చిత్రంతోపాటు, తెలుగుతల్లి కన్నీరు పెడుతున్నట్టు, రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దనే అర్థం వచ్చే చిత్రాలతో ర్యాలీ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి పళ్లంరాజు ఇంటిని కాకినాడలో ముట్టడించారు. అమలాపురంలో 400 మీటర్ల జాతీయ జెండాను సమైక్యవాదులు ఊరేగించారు. ఎంపీ కనుమూరి, మంత్రి పితాని ఇళ్ల ముట్టడి పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ.భీమవరంలో ఎంపీ కనుమూరి బాపిరాజు ఇంటిని, పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో మంత్రి పితాని ఇంటిని ఉద్యమకారులు ముట్టడించారు. జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ జోరు వానలో రోడ్డుపై క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. కూరగాయల వర్తకులూ భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఏలూరు నగర శాఖ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ నేతలు ఉద్యమంలో ముందుండి నడవాలని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరంలో డిమాండ్ చేశారు. పాలకొల్లులో డ్వాక్రా మహిళల ర్యాలీలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జిల్లా కేంద్రంలో రెవెన్యూ ఉద్యోగి ఒకరు శిరోముండనం చేయించుకున్నారు. మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కనిపించడంలేదని.. ఆచూకీ తెలపాలని కోరుతూ పాతపట్నం పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్సీపీ నేత కలమట వెంకటరమణ ఫిర్యాదు చేశారు. విజయనగరంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా హిజ్రాలుభజనలు చేస్తూ శవయాత్ర నిర్వహించారు. భోగాపురం, రామభద్రాపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వంట వార్పు చేశారు. చీపురుపల్లిలో కుక్కలకు కేసీఆర్ మాస్క్‌లు అమర్చారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు వద్దనున్న బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడి కుమారుడికి చెందిన హర్షా టయోటా షోరూమ్‌ను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జరిగిన వంటా వార్పు కార్యక్రమంలో నెల్లూరు రూరల్, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు పాల్గొన్నారు. సోనియాగాంధీపై గూడూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్, మండల కన్వీనర్ మల్లు విజయకుమార్‌రెడ్డి పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు రాజీనామా డ్రామాలతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కావాలని బాపట్లలో జరిగిన సభలో ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి అన్నారు. సింహాసనంపై కుక్కతో నిరసన అనర్హులను అందలం ఎక్కిస్తే.. అంటూ సింహాసనంపై కుక్కను కూర్చొపెట్టి పశుసంవర్ధక శాఖ అధికారులు విజయవాడ బెంజిసర్కిల్ నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకూ నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. మేం కూడా వ్యతిరేకం అంటూ గంగిరెద్దులుతో తలలూపించారు. తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ విజయవాడలో, పార్టీ జిల్లా కన్వీనర్ జగ్గయ్యపేటలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో పొదుపు సంఘాల మహిళలు, పాల వ్యాన్లతో డెయిరీ మిల్క్ కార్మికులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, డాక్టర్లు ఉద్యమంలో పాల్గొన్నారు. కమిటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ డ్రామాలు ఆడుతోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. పుత్తూరులో వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు రోజా ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో అన్ని వర్గాల వారూ భారీ ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఉద్యమకారులకు మద్దతు తెలిపారు. రోడ్లపైనైనా చదువుకుంటాం.. రాష్ట్ర విభజనకు ఒప్పుకోం.. అని విద్యార్థులు రోడ్లపైనే కూర్చుని చదువుకుంటూ తెలిపిన నిరసన ఆకట్టుకుంది. కర్నూలులో అర్చక, పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హోమం జరిపారు. వైఎస్సార్ జిల్లా కడపలో ఆర్టీసీ కార్మికులు రిలే దీక్షలు చేపట్టగా రెవెన్యూ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నిర్మానుష్యంగా మారింది. న్యాయవాదులు మృదంగం వాయిస్తూ, కర్రసాము చేస్తూ నిరసన తెలిపారు. దీక్షా శిబిరాలను రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ బస్సులు తొమ్మిదో రోజూ రోడ్డెక్కలేదు. రాజంపేటలో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. బద్వేలులో గురువారం బంద్ జరిగింది. సమైక్య పావురం కొరుక్కుపేట(చెన్నై), న్యూస్‌లైన్: అందరూ సమైక్యంగా ఉండాలని కోరుతూ గురువారం చెన్నైకి చెందిన ఎవర్గ్రీన్ విద్యాశ్రమం విద్యార్థులు వినూత్న రీతిలో తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 3 నుంచి 8వ తరగతికి చెందిన 12 వేల మంది విద్యార్థులు 15 వేల చదరపు అడుగుల వైశాల్యంలో శాంతి పావురం ఆకృతిలో కూర్చుని సమైక్య సందేశాన్ని చాటారు. ‘కలిసి జీవిస్తే కోటి లాభాలు’, ‘దేశం ముక్కలైతే ముప్పు’ అంటూ నినాదాలు చేశారు. హిరోషిమా, నాగసాకి దాడులకు గుర్తుగాను, దేశంలో వినిపిస్తున్న విభజన నినాదాలకు వ్యతిరేకంగా శాంతి కపోతం సందేశాన్ని ఇచ్చినట్లు విద్యాశ్రమం ప్రిన్సిపాల్ కలైఅరసి పేర్కొన్నారు. ఆగని మరణాలు.. సాక్షి, ఏలూరు/ఉయ్యూరు, న్యూస్‌లైన్: సీమాంధ్రంలో మృత్యుఘోష ఆగడం లేదు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని తట్టుకోలేక వేర్వేరు ప్రాంతాల్లో గురువారం తొమ్మిది మంది గుండెపోటుతో మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం కె.గోకవరం గ్రామానికి చెందిన సత్యనారాయణ(55) బుధవారం రాత్రి టీవీలో ఢిల్లీ పెద్దల ప్రకటనలను చూస్తూ భావోద్వేగంతో గుండెపోటుకు గురయ్యూడు. హైదరాబాద్‌లో వడ్రంగి పని చేసుకుని జీవిస్తున్న మొగల్తూరులో సవర నాగరాజు(29) విభజన ప్రకటన నేపథ్యంలో వారం రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. రాష్ట్రం విడిపోతే బతుకుదెరువు కష్టమవుతుందన్న ఆందోళనతో గుండెపోటుకుగురై తనువు చాలించాడు. చింతలపూడిలో గుంజి చుక్కమ్మ (45), ఉండి గ్రామానికి చెందిన కిలారి విష్ణు (32), కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన పండ్రాజు వెంకటేశ్వరరావు(58)లు భావోద్వేగానికి గురై గుండెపోటుతో మరణించారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం కల్లూరుకు చెందిన బడిగ హనుమంతప్ప (52), రొద్దం మండలం పెద్దపల్లికి చెందిన ఈడిగ లక్ష్మినారాయణ (40), కంబదూరుకు చెందిన సురేంద్ర శర్మ (50), కూడేరు మండలం పీ.నారాయణపురానికి చెందిన కురుబ ఎర్రిస్వామి(55) విభజన వార్తలు టీవీలో చూస్త్తూ గుండెపోటుతో మృతి చెందారు.