హరిజనాభ్యున్నతికి చట్టపరమైన చర్యలు కోరుతూ పొట్టి శ్రీరాములు దీక్ష చేసిన రోజు నేడు
ఇక్కడ కనబడే ఫోటో గమనించారా? ఆంధ్ర రాష్ట్రం సాధించడానికి మొదలు పెట్టిన దీక్ష ముందు రోజు అంటే 1952 అక్టోబరు 18న మదరాసులో తీసిన ఫోటో ఇది! కుర్చీలో కూర్చున్న ఆ వ్యక్తి 52 ఏళ్ళ పొట్టి శ్రీరాములు. ఈ ఫొటో దాదాపు మనందరికీ పరిచయం కానిదే!
ఇదే విధంగా ఆ మహానుభావుడి గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయనిపిస్తుంది. ఉత్తర భారత దేశంలో హిందూ–ముస్లిం మతపరమైన విభేదాలే అతి పెద్ద సమస్య అని ఆ తరం మహానాయకులంతా భావించారు.
అయితే దక్షిణ భారతదేశంలో అంటరానితనంతో దాపురించిన అట్టడుగు వర్గాల అధ్వాన్న స్థితి చాలా పెద్ద అవరోధమనీ, ఆ సమస్య గురించి ఆలోచించాలనీ నాలుగుసార్లు నిరాహారదీక్షలు చేసినవారు అమరజీవి పొట్టి శ్రీరాములు! బ్రిటిష్ పాలనలో 1946 మార్చి 7వ తేదీన పది రోజులపాటు నెల్లూరు మూలాపేట వేణు గోపాల స్వామి గుడిలో నిరాహారదీక్ష చేసి హరిజన ప్రవే శాన్ని సాధించారు.
అటు సింహాచలం నుంచి ఇటు తిరు మల దాకా తెలుగు ప్రాంతాలలోనే కాక; మదరాసు ప్రెసి డెన్సీలోని తమిళ, కన్నడ ప్రాంతపు దేవాలయాలన్నింటిలోనూ హరిజనులకు ప్రవేశం కల్గించే బిల్లును ఆమో దింపచేయడానికి అదే 1946 నవంబర్ 25 నుంచి 19 రోజులపాటు నిరాహారదీక్ష చేసి విజయం సాధించారు.
నిజానికి 1944 అక్టోబరు 2 గాంధీజీ 75వ జన్మ దినోత్సవ సందర్భంగా అస్పృశ్యతకు వ్యతిరేకంగా కావ లిలో వివిధ కార్యక్రమాలు ప్రారంభించారు. దానికి ముందు శ్రీరాములు సబర్మతీ ఆశ్రమంలో మూడు సంవత్స రాలుండి నూరుపాళ్ళు గాంధేయవాదిగా మారారు. మేన మామ, తన భార్య సీతమ్మ తండ్రి అయిన గునుపాటి నర్సయ్య తీవ్ర అనారోగ్యానికి లోను కావడంతో, 1937 నుంచి నెల్లూరు జిల్లాతోపాటు ఇతర తెలుగు ప్రాంతాలు పొట్టి శ్రీరాములుకు కార్యక్షేత్రాల య్యాయి.
హరిజనులకు దేవా లయ ప్రవేశంతో అన్ని సమ స్యలు తీరవని ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధం. జైళ్ళ సంస్కరణలు, వివాహ సంప్ర దాయాలలో మార్పులు వంటి వాటికి సంబంధించి కృషి చేస్తూ వచ్చారు.
తన స్ఫూర్తిదాత గాంధీజీ మరణించడంతో కలత చెందిన శ్రీరాములు, ఆయన స్మృతి కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఆ ప్రతిపాదనలను ఉమ్మడి మదరాసు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దానితో ఏడు న్నర దశాబ్దాల క్రితం అంటే 1948 సెప్టెంబర్ 10న మద రాసులో అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట శ్రీరాములు నిరాహారదీక్ష ప్రారంభించారు.
మన సమాజానికి చాలా కీలకమైన తేదీగా సెప్టెంబర్ 10ని గుర్తు పెట్టుకోవాలి. స్వాతంత్య్రం సంపాదించుకున్న భారతదేశంలో పొట్టి శ్రీరాములు చేసిన తొలి దీక్ష కూడా ఇది. హరిజనుల అభ్యున్నతి కోసం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మొదలైన ఈ దీక్ష ఫలితంగా న్యూసెన్స్ యాక్ట్ కింద మదరాసులోనే శ్రీరాములు నెలరోజుల శిక్ష మీద జైలు పాలయ్యారు.
జైల్లో కూడా అలాగే దీక్ష కొనసాగించారు. జైలులో రక్తాన్ని కక్కుకునే పరిస్థితి కూడా దాపురించింది. అలాంటి స్థితిలో విడుదలైతే మరల దీక్షకు పూనుకోకుండా తనను వికలాంగుణ్ణి చేయాలని ప్రభుత్వం యత్ని స్తున్నట్టు పొట్టి శ్రీరాములు (1948 సెప్టెంబర్ 29 ఆయనే రాసిన ఉత్తరంలో) భావించారు. దాంతో ఆయన అర్ధంతరంగా దీక్షను ఆపివేసినపుడు జైలు నుంచి విడుదల చేశారు.
తన లక్ష్య సాధన కోసం దీక్షా రంగస్థలాన్ని వార్ధా ఆశ్రమానికి మార్పు చేసి, 1949 జనవరి 12 నుంచి మళ్ళీ ప్రారంభించారు. ఈ నాలుగో సత్యాగ్రహ దీక్ష 28 రోజుల పాటు చేసి ఉమ్మడి మద రాసు ప్రభుత్వంతో ప్రతి నెల 30వ తేదీ (ఫిబ్రవరి నెల అయితే 28 లేదా 29) ‘హరిజన సేవా దినోత్సవం’గా జరిపేలా చట్టం చేయించి, అట్టడుగు వర్గాల అభ్యున్నతిని వాంఛించారు. ఆ చట్టమయితే వచ్చింది కానీ ఫలితం మాత్రం హుళక్కి!
డా‘‘ నాగసూరి వేణుగోపాల్
వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి
మొబైల్: 94407 32392
Comments
Please login to add a commentAdd a comment