1981లో నైరోబీ నగ రంలో ప్రపంచ శక్తి సదస్సు జరుగుతోంది. పైజామా– కుర్తా వేసుకొన్న వ్యక్తి కట్టెల మోపు భుజాన వేసు కుని సమావేశ మందిరం లోకి ప్రవేశించడం ఎంద రినో ఆకర్షించింది. అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న వారిని పేదరికం, వెనుకబాటుతనం ఎలా దెబ్బ తీస్తున్నాయో పాశ్చాత్య దేశాల ప్రతినిధులకు చెప్పాలని సుందర్‌లాల్ బహుగుణ ప్రయత్నం! మే 21న రిషీకేశ్‌లోని ఎయిమ్స్‌లో కనుమూసిన సుందర్‌లాల్ బహుగుణ చరిత్ర విలువైంది.
1927 జనవరి 9న టెహ్రీ (ఇప్పుడు ఉత్తరా ఖండ్ రాష్ట్ర జిల్లా) ప్రాంతం మరోడ గ్రామంలో బహుగుణ జన్మించారు. వారి పూర్వీకులు బెంగాలీ బందోపాధ్యాయ తెగవారు. పొట్టకోసం ఉత్తర ప్రదేశ్ ప్రాంతానికి (గఢ్వాల్) వచ్చినపుడు, తమ ఆయుర్వేద పరిజ్ఞానంతో రాజుగారి అనారోగ్యాన్ని నయం చేశారట. రాజు సంతోషపడి ‘బహుగుణ’ ప్రాంతాన్ని వారికి దానంగా ఇచ్చారు. క్రమంగా ఇంటిపేరు మారిపోయేంతగా అక్కడ కలసి పోయారు. చెట్లు, ఆకులు, మూలికల విలువ తెలి సిన కుటుంబం నుంచి వచ్చినవాడు సుందర్‌లాల్.
లాభం కోసం అడవులను నరికిన చరిత్ర టెహ్రీ సంస్థానాధీశులది. 1930ల్లో ఇలాంటి ఘటనల్లో 17మంది చంపబడ్డారు, 80 మంది జైలు పాల య్యారు. ఈ నేపథ్యంలో 13 ఏళ్ల వయసునుంచే సుందర్‌లాల్ రాజకీయపరంగా చురుకుగా ఉన్నారు. గాంధీజీ శిష్యుడు శ్రీదేవ్ సుమన్ ఇతనికి మార్గదర్శి. స్వాతంత్య్రోద్యమం, సర్వోదయో ద్యమం మాత్రమే కాక మీరాబెన్ పర్యావరణ కార్యక్రమాలు సుందర్‌లాల్‌కు స్ఫూర్తి. భార్య విమలాబెన్.. సరళాబెన్ శిష్యురాలు. మీరాబెన్, సరళాబెన్ ఇద్దరూ గాంధీ స్ఫూర్తితో మనదేశం వచ్చి ఉద్యమంలో పాల్గొన్న మహిళా మణులు. పర్యావ రణ విషయమే కాదు, దళితులు ముఖ్యంగా దళిత స్త్రీలకోసం పోరాడి 1950 దశకంలో బుదకేదార్ దేవాలయంలో తొలిసారి హరిజన ప్రవేశం సాధిం చిన ఘనత సుందర్‌లాల్‌ది. పర్వత ప్రాంతాల మద్యపాన సమస్య గురించి, మూఢనమ్మకాల నిర్మూలన గురించి కూడా పని చేశారు.
స్త్రీలోకం సాయంతో విజయాలు సాధించ వచ్చునని భావించడమే కాదు... ఫలితాలు సాధిం చిన సమన్వయవాది సుందర్‌లాల్. 1974 మార్చి 26న అనుకోకుండా గౌరదేవి తీసుకున్న నిర్ణయం ప్రపంచానికి దారి చూపింది. అలకానంద నది పైభాగాన ఉన్న 2,500 చెట్లను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసింది. ఆ చెట్లు కొట్టుకోవడానికి కాంట్రాక్టర్లు రైని గ్రామానికి వచ్చారు. దీనిని గౌర దేవి చూసి, మిగతా గ్రామస్థులకు చెప్పింది. అలా ముగ్గురు మహిళలు–గౌరదేవి, సుదేశదేవి, బిచ్ని దేవి ఒక రాత్రంతా చెట్లను కౌగలించు(చిప్కో)కొని రక్షించడంతో మిగతావారు మరుసటి రోజు నుంచి చెట్లను కావులించుకోవడం ప్రారంభించారు. అలా మొదలైంది చిప్కో ఉద్యమం. విమలాబెన్ భర్తకు చెప్పి, ఈ ఉద్యమంలోకి ప్రవేశించింది. అలా సుందర్‌లాల్ ఈ చిప్కో ఉద్యమం కొనసాగడానికి, ఇతర ప్రాంతాలకు వ్యాపించడానికి దోహద పడ్డారు. పాదయాత్రతో యువకులను, మహిళ లను ఉద్యమంలో భాగస్వాములను చేశారు.
ఎమర్జెన్సీ రావడంతో చిప్కో ఉద్యమం కూడా మందగించింది. అయితే 1978లో పోలీసులు చిప్కో ఉద్యమంలో పాల్గొన్న మహిళలపై చేసిన దురాగతాలు మళ్ళీ వార్తల్లోకెక్కాయి. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హెచ్.ఎన్. బహుగుణ దీనిపై కమిటీ వేశారు. ఈ సందర్భంలో 4,800 కిలోమీటర్ల పాదయాత్రను సుందర్‌లాల్ చేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలిశారు. ఒక 15 ఏళ్లు చెట్లు కొట్టకుండా నిషేధం విధించేలా చేశారు.
ప్రపంచ స్థాయి చిప్కో ఉద్యమంగా జర్మనీ, అమెరికా, ఇంగ్లాండు, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, స్వీడన్ వంటి దేశాలకు స్ఫూర్తిగా మారింది. రిచర్డ్ సెయింట్ బెర్బ్ బేకర్ రాసిన విషయాలు 108 దేశాలకు వెళ్ళాయని అంచనా. చిప్కో ఉద్యమం నేడు ప్రపంచవ్యాప్తంగా అధ్యయన అంశంగా మారింది. సుగతా కుమారి, బాబా ఆమ్టే, మేధా పాట్కర్ వంటి ఎంతోమందికి చిప్కో ఉద్యమం స్ఫూర్తి. టెహ్రీ డ్యామ్ నిర్మాణ విషయంలో కూడా సుందర్‌లాల్ బహుగుణ చేసిన పోరాటం పెద్దదే! 1978లో స్వాతంత్య్ర సమరయోధులు వి.డి. సక్లాని నాయకత్వాన మొదలైన ఈ ఉద్యమం 1989లో వారు అనారోగ్యం పాలు కావడంతో బహుగుణ నాయకత్వం అందుకున్నారు. ఈ సందర్భంగా 74 రోజులపాటు నిరాహారదీక్ష చేశారు.
పండు వయసులో కనుమూసిన సుందర్‌లాల్ బహుగుణ నిత్యపోరాటయోధుడు. కశ్మీరు నుంచి కోహిమా పాదయాత్ర చేసినపుడు దాదాపు 30 కిలోల బరువు మోసుకుని తిరగడం వారి శారీరక ఆరోగ్యాన్ని చెబుతుంది. ఏ ప్రాంతపు అడవులు, నదులు, పర్వతాలు ఆ ప్రాంతం వారివే. వాటిని మనం నాశనం కాకుండా చూసుకుంటే మన సంక్షే మాన్ని అవి చూసుకుంటాయి. అందుకే ఎకాలజీ ఈజ్ పర్మనెంట్ ఎకానమీ (నాశనం కాని జీవావ రణ వ్యవస్థల సముదాయమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థ) అని పదేపదే చెప్పేవారు. మరి మనకు వినేస్థాయి వివేకం ఉందా!
వ్యాసకర్త : డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి
మొబైల్ : 94407 32392
పర్యావరణ ఉద్యమాలకు ప్రాతఃస్మరణీయుడు
Published Sun, May 23 2021 1:02 AM | Last Updated on Sun, May 23 2021 4:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment